గజ్వేల్: పత్తి రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సీసీఐ (కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లలో చొరవ చూపడం లేదు. ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావడం ఊపందుకున్నా, ఏదో కొన్నామంటే కొన్నామంటూ కేంద్రాలను నామమాత్రంగా నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీసీఐ ఇప్పటివరకు జిల్లాలో 1,327 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగింది.
ఇదే అదనుగా భావించిన వ్యాపారులు రైతుల వద్ద మద్దతు ధర కంటే తక్కువగా రూ.3,300 నుంచి రూ. 3,700 పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే వేలాది క్వింటాళ్ల పత్తిని పక్కరాష్ట్రానికి తరలించి దండుకుంటున్నారు. తాము దగా పడుతున్నామని తెలిసి కూడా రైతన్నలు విధిలేని పరిస్థితుల్లో దళారులు ఇచ్చింది తీసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అప్పగిస్తున్నారు.
‘మద్దతు’ ఇవ్వని సీసీఐ
జిల్లాలో ఈసారి 1.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. పరిస్థితులు కలిసి వస్తే సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముండేది. కానీ ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల అంతా తారుమారైంది. వర్షాభావం, కరెంటు కోతలతో సరిగా నీరందక దిగుబడిలో సగానికి సగం తగ్గింది. మరోవైపు చేతికందిన పంటకు కూడా మద్దతు ధర దక్కకపోవడం రైతులను కుంగదీస్తోంది.
పత్తి రైతుకు మద్దతు కల్పించేందుకు జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్, వట్‌పల్లి, సదాశివపేటల్లో సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటివరకు గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, జోగిపేట కేంద్రాలు మాత్రమే తెరిచారు. వీటిన్నంటిలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1,327 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు.
ఇందులోనూ అత్యల్పంగా సిద్దిపేట సెంటర్‌లో కేవలం 32 క్వింటాళ్లు మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. ఇక గజ్వేల్‌లో సెప్టెంబర్ 20న కేంద్రం ప్రారంభమైతే, వాతావరణ ప్రతికూల పరిస్థితులు, సెలవుల కారణంతో ఐదంటే ఐదు రోజులే కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఈ సెంటర్ నుంచి సీసీఐ 246 క్వింటాళ్ల పత్తిని రైతులనుంచి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించడం అనివార్యంగా మారింది.
దళారుల దందా
మార్కెట్‌లోకి వస్తున్న పత్తిని అంచనా వేస్తున్న దళారులు సీసీఐ కంటే రెట్టింపు స్థాయిలో కొనుగోళ్లు జరిపారు. అయితే రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రూ.3,300 నుంచి రూ.3,600 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన రూ. 3,750-రూ.4,050 మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదు.
గజ్వేల్‌లో ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు సుమారు 500 క్వింటాళ్లకుపైగా పత్తిని కొనుగోలు చేశారు. గుజరాత్, మహారాష్ట్రలలో తెల్లబంగారానికి అధిక ధర పలుకుతుండడంతో వ్యాపారులంతా ఇక్కడ రైతులవద్ద తక్కువ ధరకు కొన్న పత్తిని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ దండుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే ధర రూపేణా రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.
పేరుకే కేంద్రం.. కొనుగోళ్లు శూన్యం
Published Sun, Nov 2 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement