ఆదిలాబాద్:పత్తిరైతుల దీనస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక విలవిల్లాడుతున్నాడు. పత్తిరైతు అననుకూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని సాగుచేసినా వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నాడు. జిల్లాలో పత్తి కొనుగోలు తొలిరోజే ఉత్కంఠ పరిస్థితులకు దారితీసింది. ఆదివారం పత్తి కొనుగోలుకు వచ్చిన సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులు ఆంక్షలు పెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తిలో 12 శాతం తేమ మించితే కొనుగోలు చేయలేమని సీసీఐ అధికారులు తేల్చిచెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
పత్తి కొనుగోలుకు ప్రయివేటు వ్యాపారులు కూడా ఆసక్తి చూపకపోవడంతో రైతలు తీవ్ర డైలామాలో పడ్డారు. ఇంకా పత్తికొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు సీసీఐ అధికారులను దిగ్భందించి నిరసన చేపట్టారు.