గజ్వేల్, న్యూస్‌లైన్: హామీ ఇచ్చిన అధికారులు మాటతప్పారు. కడుపుమండిన రైతన్న ఆందోళన బాటపట్టాడు. దీంతో గజ్వేల్ మార్కెట్ యార్డులో మక్కల రైతుల ఆందోళనల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈనెల 6న చేపట్టిన ఆందోళన సందర్భంగా రైతులకు బకాయిగా ఉన్న మొత్తాన్ని అయిదు రోజుల్లో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన జిల్లా అధికారులు తీరా మాటమార్చారు. మక్కలు తరలించనందున చెక్కులు ఇవ్వలేమన్నారు. దీంతో కడుపు మండిన రైతులంతా శుక్రవారం మరోసారి ఆందోళన బాట పట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాస్తారోకోతో మొదలైన నిరసన.
యార్డు గేటుకు తాళం వేసే దారి తీసింది. ఫలితంగా గంటల తరబడి లావాదేవీలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజేశ్వర్‌రెడ్డిలు ఇక్కడికి చేరుకుని వ్యాపారులు, రైతులతో గంటల తరబడి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో రైతులు శుక్రవారం రాత్రి యార్డులోనే వంటావార్పు చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొనడంతో స్థానిక సీఐ అమృతరెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించారు.
పెండింగ్‌లో రూ.1.83 కోట్లకుపైగా చెల్లింపులు
గజ్వేల్ మార్కెట్‌యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని అక్టోబర్ నెలలో అధికారులు ప్రారంభించారు. జనవరి 15వ తేదీ వరకు మొత్తం 34 వేల క్వింటాళ్ల మక్కలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో 15 వేల కింటాళ్ల మక్కలను అధికారులు తరలించారు. మిగిలిన 14 వేల పైచిలుకు క్వింటాళ్ల స్టాకు ప్రస్తుతం మార్కెట్ యార్డు ఆవరణలో ఉంది. ఈ మక్కల తరలింపునకు నోచుకోకపోవడంతో రైతులకు చెల్లించాల్సిన రూ.3.5 కోట్లలో ఈనెల 5 వరకు రూ.1.50 కోట్లు మాత్రమే అధికారులు పంపిణీ చేశారు. సుమారు రూ.1.83 కోట్లకుపైగా చెల్లింపులు పెండింగ్‌లో పెట్టారు.
ఇక్కడ నిల్వ ఉంచిన మక్కలను మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలోని గోదాముల్లోకి తరలిస్తేనే చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. మరోపక్క గడువు ముగిసిందనే కారణంతో అధికారులు కొనుగోళ్లను నిలిపివేయడంతో వేలాది క్వింటాళ్ల మక్కలు యార్డులోనే ఉండిపోయాయి. దీంతో విసిగిపోయిన రైతులు ఈనెల 3నయార్డు గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో తిరిగి 6వ తేదీన యార్డు గేటుకు మరోసారి తాళం వేసి ధర్నా చేపట్టారు. దీంతో అధికారులు పెండింగ్‌లో ఉన్న చెక్కులను అయిదు రోజుల్లో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
మాటమార్చిన అధికారులు..ఆందోళనకు దిగిన రైతులు
కొనుగోలు చేసిన మక్కలను ఇక్కడి నుంచి తరలించలేని పరిస్థితి ఉన్నందున పెండింగ్‌లో ఉన్న రూ.1.83 కోట్ల చెక్కులను ఇవ్వలేమని శుక్రవారం ఐకేపీ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. తొలుత యార్డు సమీపంలోని గజ్వేల్-తూప్రాన్ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ ఆందోళనకు టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత రైతులు యార్డు గేటుకు తాళం వేసి లావాదేవీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి ఇక్కడికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేయగా రైతులు వారితో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలోనే డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజేశ్వర్‌రెడ్డి సైతం ఇక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. ఐకేపీ కేంద్రం ద్వారా కొనుగోలు చేసి వాసస్ చేసిన సరుకుకు ప్రైవేటు వ్యాపారులతో కొనుగోలు చేయించి రూ.975 నుంచి రూ.1,130 వరకు ధర దక్కేలా చూస్తామని చెప్పినా రైతులు వినిపించుకోలేదు. కొనుగోలు చేసి వాపస్ చేయడమే కాకుండా, అడ్డికి పావుసేరు కాడికి అమ్ముతారా? అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో వంటావార్పు చేపట్టారు. ఆందోళన కార్యక్రమం శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్థానిక సీఐ అమృతరెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించారు.
రోడ్డెక్కిన రైతన్న
Published Sat, Feb 15 2014 12:07 AM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM
Advertisement
Advertisement