గజ్వేల్, న్యూస్‌లైన్: అధికారులు..పాలకులు అందరూ కలిసి అన్నదాతకు తీవ్ర అన్యాయం చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినట్టే ఇచ్చి ఇపుడు అడ్డగోలు ధర కట్టారు. ఫలితంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ విధిలేని పరిస్థితుల్లో అధికారులు చెప్పిన రేటుకు ప్రైవేటు వ్యాపారులకు పంటను అప్పగించేందుకు సిద్ధమయ్యారు.
రెండురోజూ కొనసాగిన ఆందోళన
గజ్వేల్ మార్కెట్ యార్డులో మక్కల రైతుల ఆందోళన శనివారం కూడా కొనసాగింది. 45 రోజుల కిందట రైతుల నుంచి మక్కల కొనుగోలు చేసి తక్‌పట్టీ(రసీదు)లు ఇచ్చిన తర్వాత అధికారులు తరలింపును సాకుగా చూపి చెక్కులివ్వలేమని మాట మార్చిన నేపథ్యంలో రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టిన సంగతి తెల్సిందే. సమస్య పరిష్కారం కోసం శనివారం కూడా యార్డుకు తాళం వేసి రైతులు ఆందోళనకు దిగారు. దీంతో యార్డు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. యార్డుగేటు ఎదుట మక్కల రైతుల ఆందోళన నేపథ్యంలో శనివారం యార్డుకు పత్తిని తీసుకువచ్చిన రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది.
దీంతో వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టిన మార్కెట్ కమిటీ కార్యదర్శి డేవిడ్, మార్కెట్ కమిటీ సూపర్‌వైజర్ వీర్‌శెట్టిలు ఈ సమస్యను సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్డీఓ ముత్యంరెడ్డి పత్తిరైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శనివారం ఒక్కరోజు పత్తికోనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ అధికారులు ఈ విషయాన్నే మక్క రైతలకు వివరించారు. మక్క రైతుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ యార్డులో కొనుగోళ్లు నిలిపివేస్తామనీ, అయితే పత్తిరైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఒక్కరోజు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత యార్డులోని 14 వేల క్వింటాళ్ల మక్కల వ్యవహారంపై సాయంత్రం వరకు స్థానిక తహశీల్దార్ బాల్‌రెడ్డి, సీఐ అమృతరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి డేవిడ్‌లు రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపారు.
నిల్వలను వ్యాపారులు కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు సూచించగా వారు అందుకు అంగీకరించారు. అయితే రైతులకు ఐకేపీ కేంద్ర నిర్వాహకులు తక్‌పట్టీల్లో క్వింటాలుకు రూ.1,310 రాసివ్వగా, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏ గ్రేడ్ రకం మక్కలకు రూ.1,130, సాధారణ రకానికి రూ.975 ధర చెల్లించి కొనుగోలు చేయడానికి వ్యాపారులు అంగీకరించారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు కూడా ఒప్పుకోవడంతో వ్యాపారులు తరలింపును ప్రారంభించారు. మారిన ధరతో రైతులు రూ.50 లక్షలకుపైగానే నష్టపోవాల్సి వస్తోంది. ఇదిలావుంటే మక్కల తరలింపు పూర్తయ్యేవరకు యార్డులో లావాదేవీలను నిలిపివేయాలని నిర్ణయించారు. పత్తి రైతులు ఈ విషయాన్ని గమనించాలని మార్కెట్ కమిటీ కార్యదర్శి డేవిడ్ సూచించారు.
అన్నదాతకు అన్యాయం
Published Sun, Feb 16 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM
Advertisement
Advertisement