మార్క్‌ఫెడ్‌లో బయటపడుతున్న అక్రమాల పరంపర
ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ సొమ్ము మాయం
పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోని యంత్రాంగం.. సేల్ పాయింట్లపై నిఘా కరువు
‘సాక్షి’ కథనంతో కరీంనగర్ జిల్లాలో అక్రమాలపై మాత్రం విచారణకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో అక్రమాలు రోజురోజుకు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన ‘మార్క్‌ఫెడ్‌లో రూ. 60 లక్షలు మాయం’ కథనంతో మరిన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో రూ. 60 లక్షలు మాయమైనట్లు తేలగా ఇప్పుడు ఆ జిల్లాతోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ ఇటువంటి అక్రమాలు జరిగినట్లు మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే చెబుతు న్నారు.
ఖమ్మం జిల్లాలో రూ. 70 లక్షలు, నల్లగొండ జిల్లాలో 50 లక్షలు, ఆదిలాబాద్ జిల్లాలో రూ. 40 లక్షల వరకు మార్క్‌ఫెడ్ ఎరువుల సొమ్మును కొందరు ఉద్యోగులు కాజేశారని అంటున్నారు. అంటే మొత్తంగా రూ. 2.20 కోట్లు కాజేసినట్లు అంచనా. అయితే కరీంనగర్ విషయం బయటపడటంతో అక్కడి అధికారులపై చర్యలు చేపట్టి అక్రమాలపై విచారణకు ఆదేశించారు. కానీ మిగిలిన జిల్లాల్లో జరిగిన వాటిపై మాత్రం నోరుమెదపడంలేదు. ఏళ్లుగా అక్రమాలు జరుగుతున్నా వాటిపై నిఘా ఎందుకు పెట్టలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి.
డీసీఎంఎస్ సేల్ పాయింట్ల ద్వారా అక్రమాలు...
మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా, డీఏపీ సహా వివి ధ రకాల ఎరువులను జిల్లాలకు పంపిస్తారు. వాటి లో కొంతభాగాన్ని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల ద్వారా రైతులకు సరఫరా చేస్తారు. అందుకోసం కొందరు ప్రైవేట్ ఎరువుల దుకాణదారులకు లేదా నిరుద్యోగుల కోసం డీసీ ఎంఎస్ ఆధ్వర్యంలో సేల్ పాయింట్లను ఇచ్చారు. వాటికి లైసెన్సులు కూడా మంజూరు చేసి ఎరువు లు సరఫరా చేస్తున్నారు. అందుకు అవసరమైన సొమ్మును సేల్‌పాయింట్ల నుంచి తీసుకోవాలి. అయితే కరీంనగర్ జిల్లా మార్క్‌ఫెడ్ అధి కారులు రికార్డులను సరిగ్గా నిర్వహించకపోవడం, డేటా తారుమారు చేయడం, రికార్డుల చోరీ, ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు మార్క్‌ఫెడ్ గుర్తించింది.
డీసీఎంఎస్ వేములవాడ సేల్ పాయింట్‌లో ఎరువుల బకాయిలు రూ. 76.77 లక్షలు దుర్వినియోగం అయినట్లు తేల్చింది. అందులో ఇప్పటివరకు రూ. 16 లక్షలు రికవరీ చేయగా ఇంకా రూ. 60.77 లక్షల మేర బకాయిలు అక్రమార్కుల వద్దే ఉన్నాయి. అలాగే ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లోనూ అక్రమాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆయా జిల్లాల మార్క్‌ఫెడ్ అధికారుల ప్రోత్సాహంతోనే అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. 1,100 డీసీఎంఎస్ సేల్ పాయింట్లలో ఎన్నింటిలో అక్రమాలు జరుగుతున్నాయో విచారణ చేపట్టాల్సిన అవసరముందన్న చర్చ జరుగుతోంది. వాటిపై నిఘా కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విచారణాధికారిణిగా సీఎఫ్‌ఎం
కరీంనగర్‌లో రూ. 60 లక్షలు దుర్వినియోగ మైనట్లు గుర్తించాం. ప్రాథమిక విచారణ నివే దిక ఆధారంగా మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌ను ఎరువుల బకాయిల వసూలుకు పూర్తి బాధ్యత వహించాల్సిందిగా ఆదేశించాం. ఈ ఉదంతంపై మార్క్‌ఫెడ్ చీఫ్ ఫెర్టిలైజర్ మేనేజర్ (సీఎఫ్‌ఎం)ను విచారణాధికారిగా నియమించాం. తదుపరి నివేదిక అందాక తగిన చర్యలు తీసుకుంటాం. – విష్ణువర్ధన్‌రావు, జనరల్ మేనేజర్, మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment