జలం.. పుష్కలం | water sanctioned for godavari districts | Sakshi
Sakshi News home page

జలం.. పుష్కలం

Published Sat, Nov 9 2013 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM

water sanctioned for godavari districts

సాక్షి, కాకినాడ :
 రబీ సీజన్‌లో ఉభయ గోదావరి జిల్లాల్లోని 8.96 లక్షల ఎకరాల గోదావరి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరివ్వాలని సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్ణయించింది. రాష్ర్ట స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి తోట నరసింహం అధ్యక్షతన కాకినాడ విధాన గౌతమి హాలులో శుక్రవారం జరిగిన ఐఏబీ సమావేశం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంటకు డిసెంబర్ ఒకటి నుంచి నీరు విడుదల చేయాలని, ఫిబ్రవరి 28న కాలువలు మూసివేయాలని నిర్ణయించారు. వచ్చే ఖరీఫ్‌కు జూన్ 15న నీరు విడుదల చేయాలని కూడా నిర్ణయించారు.
 
 ఇరిగేషన్ ఎస్‌ఈ కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ఉభయ గోదావరి జిల్లాల్లో రబీలో 8,96,533 ఎకరాలు సాగవుతుండగా ఒక్క మన జిల్లాలోనే 4.85 లక్షల ఎకరాలు సాగవుతోందని చెప్పారు. గోదావరితో పాటు ఇతర జలాశయాల్లో ప్రస్తుతం 73.75 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, దీనితో 7,90,590 ఎకరాలకు సమృద్ధిగా నీరందించవచ్చని వివరించారు. ఇటీవలి భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, వీటితోపాటు ఇతర యాజమాన్య పద్ధతుల ద్వారా మిగిలిన 1,05,943 ఎకరాలకు కూడా పూర్తి స్థాయిలో నీరందించవచ్చని చెప్పారు.
 
  ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి గత ఏడాది 2700 టీఎంసీల మిగులు జలాలు సముద్రంలోకి వదలగా, ఈ ఏడాది ఏకంగా 5700 టీఎంసీలు పైగా విడిచిపెట్టామన్నారు. గత ఏడాది 500 క్యూసెక్కుల నీటికోసం ఎంతో ఇబ్బంది పడ్డామని, ఈ ఏడాది ఏకంగా 22 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలైందని వివరించారు. గత నెలాఖరులో 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రస్తుతం 64 వేల క్యూసెక్కులు మాత్రమే ఉందని, రబీ సాగు పూర్తయ్యేనాటికి ఇది మరింత పడిపోయే అవకాశాలున్నాయని చెప్పారు. అయినప్పటికీ రబీకి ఢోకా లేకుండా నీరందిస్తామన్నారు. మొత్తం ఆయకట్టులో 10 శాతమైనా క్లోజర్‌కు ఇవ్వగలిగితే ఆధునికీకరణ పనులు చేపడతామని ఎస్‌ఈ చెప్పారు. ఏలేరు పశ్చిమ కాలువ, బిక్కవోలు కాలువల ఆధునికీకరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
 
 ఏలేరుపై వాడీవేడి చర్చ
 ఏలేరు ఆధునికీకరణ టెండర్ల ఖరారుపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. వైఎస్సార్ హయాంలో రూ.138 కోట్లు మంజూరు చేసినప్పటికీ గత ఆరేళ్లలో పనులు ఎందుకు చేపట్టలేకపోయామని మంత్రి తోట నరసింహం తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. రూ.38 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ ప్రతిపాదనలు.. 2008లో రూ.138 కోట్లకు చేరగా, ప్రస్తుతం అంచనా విలువ రూ.250 కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం ఫైనాన్షియల్ బిడ్ దశలో ఉండగా ఇప్పుడు డిజైన్ మార్చాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడమేమిటని ఎమ్మెల్యే వంగా గీత ప్రశ్నించారు. పనులు చేపట్టే దశకు చేరుకున్న ఈ తరుణంలో ైహైదరాబాద్‌లో నిర్ణయాలు ఎందుకు మారుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
 
 కలెక్టర్ నీతూప్రసాద్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రావు చిన్నారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ.బాబి కూడా పలు సమస్యలు ప్రస్తావించారు. చివరగా మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న దీర్ఘకాలిక ఇరిగేషన్ సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జేసీ ముత్యాలరాజు, ఏజేసీ కొండలరావు, డీఆర్‌ఓ బి.యాదగిరి, ట్రైనీ కలెక్టర్ కన్నన్, సబ్ కలెక్టర్ చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. కాగా కీలకమైన ఈ సమావేశానికి జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు సహా ఎంపీలు, మెజార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది.
 
 ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
  రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ఖరీఫ్ నష్టపోయినందున రబీలో క్లోజర్ అడగడం భావ్యం కాదన్నారు. క్లోజర్‌తో సంబంధం లేకుండా ఖరారైన ప్యాకేజీల పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
 
  సామర్లకోట కెనాల్‌కు పలుచోట్ల అనధికారికంగా ఏర్పాటు చేసిన తూరలను తొలగించాలని ప్రతి సమావేశంలో చెబుతున్నా తన గోడు అరణ్య రోదనగానే మిగిలిపోయిందని పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ చెప్పారు. ఐదు తూములు వద్ద గట్లు కొట్టేయకుండా రైతులు కాపలా కాసే దుస్థితి ఏర్పడిందని, అక్కడి లాకులను ఎందుకు తీయలేకపోతున్నారని ప్రశ్నించారు. వాటిని మూడు రోజుల్లో తొలగిస్తామని ఎస్‌ఈ హామీ ఇచ్చారు.
 
  ఏలేరు స్పిల్‌వే గేటు వద్ద క్వారీ బ్లాస్టింగ్‌లు జరుపుతున్నారని, దీనివల్ల రిజర్వాయర్‌కు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని పంతం అన్నారు. క్వారీ యజమానులు తమ పరిధికి మించి బ్లాస్టింగ్‌లు జరుపుతూ కాలువ గట్లకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.
 
  ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను మణిహంస పవర్ ప్లాంట్ యాజమాన్యం నియంత్రిస్తోందని, ఈ ప్లాంట్ ప్రభుత్వానికి భారీగా బకాయి పడినందున వెంటనే నీటి విడుదలను అడ్డుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
 
  పంపా ఆధునికీకరణకు రూ.23 కోట్లు మంజూరై మూడు నెలలైనా పనులు ఎందుకు చేపట్టడం లేదని తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు ప్రశ్నించారు. వచ్చే నెల 15కల్లా టెండర్లు పిలుస్తామని ఎస్‌ఈ చెప్పారు.
 
  డెల్టా ఆధునికీకరణ ఒక మిథ్యగా తయారైందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. మన జిల్లా సమస్యలంటే హైదరాబాద్‌లో చిన్నచూపు చూస్తున్నారని, అందువల్లనే ఎక్కడికక్కడ ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయని అన్నారు.
 
  రౌతులపూడి వద్ద గండిని పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement