బొప్పాయి.. సేంద్రియ సిపాయి! | Organic production of papaya | Sakshi
Sakshi News home page

బొప్పాయి.. సేంద్రియ సిపాయి!

Published Tue, Oct 6 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

బొప్పాయి.. సేంద్రియ సిపాయి!

బొప్పాయి.. సేంద్రియ సిపాయి!

- సేంద్రియ, ప్రకృతి సేద్య పద్ధతుల మేళవింపు
- పకడ్బందీగా సేంద్రియ బొప్పాయి, మునగ సేద్యం..
- తొలి ఏడాదీ దిగుబడి తగ్గని వైనం..
- ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయమే లక్ష్యంగా సేంద్రియ సేద్యం
 
ఉద్యాన పంటల్లో సేంద్రియ సేద్యం ప్రారంభించిన తొలి ఏడాదిలోనే రసాయనిక వ్యవసాయానికి దీటుగా దిగుబడి పొందడం సాధ్యమేనా? ఇటు పోషకాల లోపం రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ.. అటు చీడపీడలను, వైరస్ తెగుళ్లను ద్రావణాలు, కషాయాలతో సమర్థవంతంగా ఎదుర్కొని మంచి దిగుబడులతో అధికాదాయం పొందడం సాధ్యమేనా??
 
 ఈ ప్రశ్నలకు ముమ్మాటికీ సాధ్యమేనని ఏకలవ్య ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ స్వానుభవంతో చెబుతోంది. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈ ఫౌండేషన్ బొప్పాయి, మునగ సేంద్రియ తోటలు పెంచుతూ.. తొలి ఏడాదే ఆశ్చర్యకర ఫలితాలను నమోదు చేస్తోంది. రైతులు సేంద్రియ సేద్యం గుట్టుమట్లు తెలుసుకొని గనక పంటల సాగు చేపడితే.. నిశ్చింతగా రసాయనిక వ్యవసాయంతో దీటుగా దిగుబడి తీయడం, ఎకరంలో ఏడాదికి రూ. లక్ష నికరాదాయం పొందడం సుసాధ్యమేనని చాటుతున్న ‘ఏకలవ్య’ అనుభవాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..
 
 రైతుకు, పంట భూములకు, ప్రజారోగ్యానికి, ప్రకృతి వనరులకు విచ్చలవిడి రసాయనిక వ్యవసాయం నష్టదాయకంగా పరిణమించింది. దీనికి ప్రత్యామ్నాయంగా అనేక రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ముందుకొస్తున్నాయి. సేంద్రియ, ప్రకృతి సేద్యంపై ఒక్కొక్కరు ఒక్కో విషయం చెప్తుండడం వల్ల రైతుల్లో కొంత గందరగోళం నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో.. సమగ్రమైన సేంద్రియ సేద్య పద్ధతులను స్థిరీకరించి, పంటల వారీగా సాగు పద్ధతులను నమోదు చేయడం ద్వారా సేంద్రియ సేద్యం వైపు ఆకర్షితులయ్యే రైతులకు మార్గదర్శంగా ఉండేందుకు ఏకలవ్య ఫౌండేషన్ కృషి చేస్తోంది.
 
 సులువుగా అనుసరణీయమైన, ఖర్చు తక్కువతో కూడిన సాగు మెలకువలను మేళవించి.. కచ్చితమైన ఫలితాలనిచ్చే సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతిని కళ్లకు కట్టి చూపితే అన్నదాతలకు మేలు కలుగుతుందన్నది తమ అభిమతమని సేంద్రియ సేద్య విభాగం సారధి బూర్ల రమాకాంత్ ‘సాక్షి’తో చెప్పారు. ఇదే ఆలోచనతో మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి సమీపంలో వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశామన్నారు. మిడ్జిల్ మండలం ఉరుకొండపేటలో ఐదెకరాల్లో బొప్పాయి తోటను, కల్వకుర్తి మండలం కుర్మిద్ద గ్రామంలో ఏడెకరాల్లో మునగ తోటను సాగు చేస్తున్నామన్నారు. మునగ (ఎకరానికి 900 మొక్కలు.. 6ఁ8) పూత దశలో ఉంది. జీవామృతం వడకట్టుకోవడానికి ఈ తోటలో అనుసరిస్తున్న మూడు జల్లెళ్ల పద్ధతి బాగుంది. సేంద్రియ బొప్పాయి సాగు పద్ధతులు, పోషకాల యాజమాన్యం, చీడపీడల నియంత్రణ తదితర అంశాలపై రమాకాంత్ అందించిన సమాచారం ఇలా ఉంది.
 
 ఘనజీవామృతం, వేపపిండి మిశ్రమం..
 ఉరుకొండపేటలో వెంకట రమణ గోశాల పక్కన గల ఐదెకరాల ఎర్ర చల్కా పొలంలో.. సరిగ్గా 8 నెలల క్రితం బొప్పాయి 4,150 మొక్కలు నాటారు. మొక్కల మధ్య 6 అడుగులు, సాళ్ల మధ్య 8 అడుగుల దూరం పెట్టారు. దుక్కి చేసిన పొలంలో.. 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పున గుంతలు తవ్వారు. వేపపిండి, ఘనజీవామృతం సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని (ఎకరానికి 2 క్వింటాళ్లు) గుంతల్లో వేసి.. నెల రోజుల హైబ్రిడ్ బొప్పాయి మొక్కలు నాటారు. డ్రిప్ వేసి, మల్చింగ్ షీట్‌ను అమర్చారు. కల్వకుర్తి ప్రాంతంలో సాధారణ వార్షిక వర్షపాతం 550 ఎం.ఎం. కాగా, ఈ ఏడాది 400 ఎం.ఎం.కు పైగా నమోదైంది. 300 అడుగుల్లోతు నుంచి బోర్ల ద్వారా తోడిన నీటితో పంటలు సాగవుతున్నాయి. సేంద్రియ సాగు కావడం వల్ల, మల్చింగ్ వల్ల సాగు నీటిని పొదుపుగా వాడగలుగుతున్నారు.
 
 ‘సేంద్రియ ఎన్.పి.కె.’ ద్రవరూప ఎరువులు!
 నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను సేంద్రియ పద్ధతుల్లో ప్రత్యేక ద్రావణాల ద్వారా బొప్పాయి, మునగ పంటలకు నేలకు ఇవ్వడంతోపాటు పిచికారీ చేస్తుండడం విశేషం.  వీటిని డ్రిప్ ద్వారా అయితే.. ఎకరం/200 లీటర్ల నీటికి 2 లీటర్ల చొప్పున, పిచికారీకి అయితే ఎకరం / 200 లీటర్ల నీటికి అర లీటరు నుంచి లీటరు వరకు కలుపుతున్నారు.
 
 నత్రజని కోసం: చేప + బెల్లం సమాన పాళ్లలో కలిపిన ద్రావణాన్ని 10 రోజులు మురగబెట్టి వారానికోసారి వాడుతున్నారు.   
 
 భాస్వరం కోసం: 10 లీటర్ల నీటికి పశువుల ఎముకల బూడిద కిలో చొప్పున కలిపి 10 రోజులు మురగబెట్టిన తర్వాత వాడుతున్నారు. మొక్కలు నాటిన రెండు నెలల వరకు వారానికోసారి, ప్రస్తుతం నెలకోసారి వాడుతున్నారు.
 
 పొటాష్ కోసం: కిలో నాటు పొగాకు (తంబాకు) చూర, కాడలు, కాయలు + 25 లీటర్ల నీరు లేదా ఆవు మూత్రం లేదా నీరు - ఆవు మూత్రం చెరి సగం కలిపి వాడుతున్నారు.  
 గోమూత్రంతో పిండినల్లి పరారీ: బొప్పాయి కాండంపై ఎప్పుడైనా పిండినల్లి కనిపిస్తే.. 10% గోమూత్రం (100 లీటర్ల నీటికి 10 లీటర్ల గోమూత్రం+ 150 గ్రా. సబ్బుపొడి కలిపి) పిచికారీ చేసి సమర్థవంతంగా అరికడుతున్నారు.
 
 వైరస్ వ్యాధుల నివారణకు: 200 లీ. నీటికి 20 గ్రాముల పీజీపీఆర్ బ్యాక్టీరియాను కలిపి నెలకోసారి పిచికారీ చేస్తున్నారు. వైరస్ సోకితే 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. ద్రావణాలు, కషాయాల పిచికారీకి షెడ్యూల్ తయారు చేసుకొని ప్రతి పిచికారీకి కనీసం వారం వ్యవధి ఉండేలా చూసుకుంటున్నామన్నారు. వీటి వల్ల మిత్రపురుగులకు ఎటువంటి నష్టమూ ఉండదన్నారు. కాండం కుళ్లు తెగులు నివారణ: పేడ పేస్ట్ బాగా పనిచేస్తున్నది. 5 కిలోల ఆవుపేడ + 5 లీటర్ల ఆవు మూత్రం + 250 గ్రా. సున్నం కలిపి పేస్ట్ తయారు చేసి.. బొప్పాయి చెట్టు కాండానికి రెండు నెలలకోసారి పూస్తున్నారు.  
 
 వేరుకుళ్లు నివారణకు: 200 లీటర్ల జీవామృతంలో 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి బ్యాక్టీరియాను కలిపి.. 3 రోజులు మురగబెట్టి డ్రిప్ ద్వారా రెండు దఫాలు ఇస్తే అద్భుత ఫలితం వచ్చింది. ఇంకా బొప్పాయి తోటలో ఫంగస్ నివారణకు, కాయ నాణ్యత పెంపుదలకు పుల్ల మజ్జిగ పిచికారీ చేస్తున్నారు. వైరస్ తెగుళ్ల నివారణకు ఆవు పాలు బాగా పనిచేస్తున్నాయంటున్నారు. చిన్న, పెద్ద పురుగులకు చేప కునపజలాన్ని సైతం పిచికారీ చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. మరో ఏడాదికల్లా బొప్పాయి తోటలో ఆద్యంతం ఎదురయ్యే సమస్యలు, చీడపీడలు - సేంద్రియ పద్ధతుల్లో నివారణోపాయాలను రైతులకు పూర్తిస్థాయిలో అందించగలమని రమాకాంత్ ధీమాగా తెలిపారు.
 
 సేంద్రియ సేద్యంలో వైరస్ బెడద తక్కువ!
 తమ సేంద్రియ బొప్పాయి తోట ఆరున్నర నెలలకే కోతకొచ్చిందని, మొదటి నెలలోనే ఎకరానికి 4 టన్నుల దిగుబడి వచ్చిందని రమాకాంత్ (83747 21751)  తెలిపారు. రానున్న 16 నెలల్లో ఎకరానికి 400 టన్నుల దిగుబడి సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. రసాయనిక వ్యవసాయంలో సాధారణంగా 7-8 నెలల బొప్పాయి తోటలో ఎల్లో మొజాయిక్ వైరస్ బారిన పడిన చెట్లు 60-80 శాతం వరకు కనిపిస్తుంటాయని, దిగుబడి తగ్గిపోవడానికి ఇదే ముఖ్య కారణమని ఆయన తెలిపారు. మొక్కలు నాటిన 8-9 నెలల తర్వాత వైరస్ పూర్తిగా కమ్మేయడం వల్ల పిందెలు ఏర్పడడం కష్టంగా మారి, ఏడాదిన్నరకే పంట ముగిసిపోతుంటుందన్నారు.
 
 అయితే, తమ తోటలో వైరస్‌ను 2 నెలల్లోనే నియంత్రించగలిగామని, వైరస్ సోకిన చెట్లు 20%కి మించి లేవన్నారు. వైరస్‌ను కంట్రోల్ చేయడం వల్ల  పంట కాలం 6-7 నెలల పాటు పెరుగుతుందని, తద్వారా దిగుబడి అదనంగా వస్తుందన్నారు. సేంద్రియ సేద్యంలో వైరస్ కంట్రోల్ అవుతుంది కాబట్టి దిగుబడి బాగుంటుందని, రైతుకు మంచి ఆదాయం వస్తుందన్నారు. డ్రిప్ ద్వారా నీరు, పోషకాల సరఫరా తోట అంతటా ఒకేలా జరగాలంటే వాటర్ డిశ్చార్జి ఒకేలా ఉండాలన్నారు. డ్రిప్ ఉన్నా.. నెలకోసారి సాళ్ల మధ్యలో నీటి తడి ఇచ్చి, జీవామృతం వడకట్టాక మిగిలే మడ్డిని వేస్తున్నందున పంట ఏపుగా పెరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ‘ఏకలవ్య’ సేంద్రియ క్షేత్రంలో తొలి ఏడాదే అధిక దిగుబడి సాధిస్తుండడం అభినందనీయం.
 - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 ఫొటోలు : పీ ఏ నాగరాజు
 
 ‘జీవామృత పంచగవ్య’తో సత్ఫలితాలు
 బొప్పాయి, మునగ తోటల్లో పోషకాల యాజమాన్యంలో జీవామృతంతో పంచగవ్య కలిపి (‘జీవామృత పంచగవ్య’) వాడటం వల్ల చక్కని ఫలితాలొస్తున్నాయని రమాకాంత్ తెలిపారు. గ్రాము జీవామృతంలో 6 కోట్ల సూక్ష్మజీవులుండగా, ఇందులో 2,70,000 కోట్లున్నాయి. 200 లీటర్ల జీవామృతంలో 2 లీటర్ల పంచగవ్యను కలిపి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు.

జీవామృతం తయారీ కోసం 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం, కిలో బెల్లం, కిలో పప్పుల పొడి, 180 లీటర్ల నీటిని కలిపి.. 24 గంటల తర్వాత.. 2 లీటర్ల పంచగవ్యను కూడా పోసి కలపాలి. అలా ఆరు రోజులు మురగబెడితే ‘జీవామృత పండగవ్య’ వాడకానికి సిద్ధమవుతుంది. దీన్ని పూత దశ (మూడున్నర నెలల) వరకు 15 రోజులకోసారి డ్రిప్ ద్వారా ఇచ్చారు. ఆ తర్వాత 10 రోజులకోసారి, కాపు దశ నుంచి వారానికోసారి ఇస్తున్నారు. డ్రిప్ ద్వారా నేలకు ఇవ్వడంతోపాటు పిచికారీ కూడా చేస్తున్నారు.
 
 నూనె పిచికారీతో ‘వైట్ పీచ్ స్కేల్’కు చెక్!
 బొప్పాయి తోటలో ‘వైట్ పీచ్ స్కేల్’ (కాయపై తెల్లని బూజు) సమస్య నివారణకు అనేక ప్రయోగాలు చేశామని చెబుతూ.. పత్తి గింజల నూనెను పిచికారీ చేసి సత్ఫలితాలు సాధించారు. లీటరు పత్తి గింజల నూనెలో 100 ఎం.ఎల్. ఎమల్సిఫైర్ వేసి.. వంద లీటర్ల నీటిలో కలిపి.. అవసరమైనప్పుడు పిచికారీ చేస్తున్నారు. హై కంప్రెసర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేసి బూజును చెదరగొడుతున్నారు.

15 లీటర్ల నీటికి 100 ఎం.ఎల్. కిరోసిన్ కలిపి లేదా 15 లీటర్ల నీటికి 6-7 ఎం.ఎల్. షాంపూ సాచెట్‌ను కలిపి పిచికారీ చేసినా మంచి ఫలితం వచ్చింది. అన్ని రకాల రసం పీల్చే పురుగులు, కొరికి తినే పురుగుల నుంచి పంటను కాపాడుకోవడానికి 5% పదాకుల (దశపత్ర) కషాయం (100 లీటర్ల నీటికి 5 లీటర్ల కషాయం)ను ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. మొక్కలు నాటిన 3 నెలల తర్వాత నుంచి.. ఒక వారం పదాకుల కషాయం (5%), మరో వారం వేప నూనె (10,000 పీపీఎం)ను వంద లీటర్ల నీటికి 250 ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement