రుచికి గొప్పాయి | Eating Papaya Reduces Health Risks | Sakshi
Sakshi News home page

రుచికి గొప్పాయి

Published Sat, Sep 28 2019 3:27 AM | Last Updated on Sat, Oct 19 2019 6:27 PM

Eating Papaya Reduces Health Risks - Sakshi

బొప్పాయి న్యూస్‌లో ఉంది. డెంగీ జ్వరానికి దాని ఆకుల రసం విరుగుడనే ప్రచారం ఉంది. కాని వైద్యుల సలహా లేకుండా అలాంటి చిట్కాలు పాటించకూడదనే హెచ్చరిక కూడా ఉంది. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే కూరకు కూడా అది చాలా గొప్పాయిదని తెలుసుకోవాలి. పనీర్, పెరుగుపచ్చడి, మసాలా కూర.. ఇవన్నీ రొటీన్‌గా ఉండే మీ మెనూను మార్చేస్తాయి. కొత్తగా ఉందని అనిపిస్తాయి. గొప్పగా చెప్పండి.. ఇవాళ మీ ఇంట బొప్పాయి అని.

బొప్పాయి హల్వా
కావలసినవి: దోరగా పండిన బొప్పాయి తురుము – 4 కప్పులు; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు;
పంచదార – 5 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బాదం పొడి లేదా పాల పొడి
లేదా కొబ్బరి పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; జీడిపప్పు పలుకులు – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►బొప్పాయి పండును శుభ్రంగా కడిగి ముక్కలు చేసి గింజలు వేరు చేసి, తురమాలి
►బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొప్పాయి తురుము వేసి సన్నని మంట మీద సుమారు పావుగంట సేపు దోరగా వేయించాలి
►బాగా ఉడికిన తరవాత పంచదార వేసి బాగా కలిపి సుమారు పావు గంట సేపు ఉడికించాలి
►బాదం పప్పుల పొడి జత చే సి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి
►జీడి పప్పు పలుకులు జత చేసి రెండు నిమిషాల పాటు కలిపి దింపేయాలి
►కొద్దిగా వేడిగా లేదా చల్లగా తింటే రుచిగా ఉంటుంది.

బొప్పాయి మసాలా కూర
కావలసినవి: బొప్పాయి ముక్కలు – 2 కప్పులు; పచ్చి బఠాణీ – ఒక టేబుల్‌ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పల్లీలు – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 4; జీలకర్ర –  ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టేబుల్‌ స్పూను; ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్‌ స్పూను; నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఆవాలు – ఒక టీ స్పూను.

తయారీ:
►ఒక గిన్నెలో బొప్పాయి ముక్కలు, పచ్చి బఠాణీ, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించి దింపేయాలి
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక పల్లీలు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి
►జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి
►నువ్వులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►ఎండు కొబ్బరి పొడి జత చేసి మరోమారు వేయించాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
►పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి, ఉల్లి తరుగు వేసి వేయించాలి
►ఉప్పు జత చేసి బాగా కలిపి, బొప్పాయి ముక్కలు జత చేయాలి
►మెత్తగా పొడి చేసిన మసాలా పొడి వేసి మరోమారు కలపాలి
►కొద్దిసేపు కలిపిన తరవాత దింపేయాలి
►అన్నంలోకి రుచిగా ఉంటుంది.

బొప్పాయి పెరుగు పచ్చడి
కావలసినవి: పచ్చి బొప్పాయి తురుము – ఒక కప్పు; పెరుగు – 3 కప్పులు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; పసుపు – కొద్దిగా; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి
►ఒక గిన్నెలో బొప్పాయి తురుము, తగినన్ని నీళ్లు, ఉప్పు జత వేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి
►ఒక పెద్ద పాత్రలో పెరుగు, పసుపు వేసి గిలకొట్టాలి
►ఉడికించిన బొప్పాయి తురుము జత చేసి బాగా కలియబెట్టాలి
►వేయించి ఉంచుకున్న పోపు వేసి కలిపి, కొత్తిమీరతో అలంకరించాలి
►అన్నంలోకి రుచిగా ఉంటుంది.

బొప్పాయి పనీర్‌ కూర
కావలసినవి: సన్నగా తరిగిన పచ్చి బొప్పాయి ముక్కలు – 2 కప్పులు; ఉడికించిన బంగాళ దుంప – 1; సన్నగా తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; పనీర్‌ తురుము – ఒక టేబుల్‌ స్పూను; మెంతులు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత.

పేస్ట్‌ కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు – 10; అల్లం – చిన్న ముక్క; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 1.

తయారీ:
►ఒక పాత్రలో ఉప్పు వేసి, తరిగిన బొప్పాయి ముక్కలు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి, నీరు ఒంపేయాలి
►ఉడికించిన బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలు చేయాలి
►చిన్న గిన్నెలో మెంతులు, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాక, నీళ్లు ఒంపేసి మెంతులను బొప్పాయి ముక్కలకు జత చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి
►పేస్ట్‌ కోసం తీసుకున్న పదార్థాలను మెత్తగా ముద్దలా చేసి, జీలకర్ర వేగిన తరవాత జత చేయాలి
►ఉప్పు, అర కప్పు నీళ్లు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి
►బొప్పాయి ముక్కలు, బంగాళ దుంప ముక్కలు జత చేసి బాగా కలిపి, మూత ఉంచి, మంట బాగా తగ్గించి సుమారు ఐదు నిమిషాలపాటు ఉడికించాలి
►బొప్పాయి ముక్కలు బాగా మెత్తపడి, గ్రేవీ చిక్కగా అవ్వగానే దింపేసి, కొత్తిమీరతో అలంకరించాలి
►చపాతీ, పరాఠా, అన్నంలోకి రుచిగా ఉంటుంది.

పచ్చి బొప్పాయి కర్రీ (నార్త్‌ ఇండియన్‌ స్టయిల్‌)
కావలసినవి: పచ్చి బొప్పాయి – అర కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రేకలు – 4; సోంపు – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ:
►కుకర్‌లో నూనె వేసి వేడి చేయాలి ∙సోంపు వేసి చిటపటలాడించాలి
►అల్లం వెల్లుల్లి తురుము వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి
►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు జత చేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి
►మిగిలిన మసాలా వస్తువులన్నీ వేసి వేయించాలి
►చివరగా బొప్పాయి ముక్కలు వేసి బాగా కలిపి, ఒక కప్పు నీళ్లు జత చేసి మూత పెట్టాలి
►మూడు విజిల్స్‌ వచ్చాక దింపేసి, కొత్తిమీర తరుగుతో అలంకరించి వడ్డించాలి
►పుల్కా, రోటీ, అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.

బొప్పాయి
కొన్ని సంవత్సరాల క్రితం వరకు బొప్పాయి పండు దొడ్లో చెట్టుకి కాస్తే ఎవరికివారు తినడమో, ఇరుగుపొరుగు పంచిపెడితేనో మాత్రమే దొరికేది. కానీ, ఈ పండులోని పోషక విలువలు, ఆరోగ్య రక్షక గుణాలు ప్రాచుర్యం పొందాక, ఇది కూడా బజార్లో కొనుక్కోవలసిన పండు అయిపోయింది. ఇప్పటికీ మిగిలిన పళ్లతో పోల్చితే ఇది చవకగానే దొరుకుతోంది. కాని ప్రజలలో ఒక నిజం కాని నమ్మకం ఉంది. ఎక్కువ ఖరీదు పెట్టి కొంటే అందులో ఎక్కువ బలం ఉంటుందనీ, చవకగా దొరికే పళ్లల్లో పోషక విలువలు తక్కువనీ. ఇది కేవలం పరిజ్ఞాన లోపం వల్ల ప్రబలిన నమ్మకం. చవకగా దొరికే బొప్పాయి పండులో ఉన్నన్ని పోషక విలువలు, ఖరీదైన ఆపిల్‌లో లేవు. అందుకని పండు విలువని ఖరీదుతో వెలకట్టకూడదు. ఏ భాగాలు... పచ్చికాయని కూరగాను, పండుని ఆహారంగాను వాడతాం. గింజలలో కూడా వైద్యగుణాలు ఉన్నాయి.

పండు – ప్రయోజనాలు
►పచ్చికాయలోను, పండులోను కూడా జీర్ణశక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. ఎంతటి అరగని పదార్థాన్నయినా, బొప్పాయితో కలిపి తింటే తేలికగా జీర్ణం అయిపోతుంది. మాంసాహారంతో బొప్పాయి కలిపి వండితే త్వరగా, తేలికగా జీర్ణం అవుతుంది.
►మలబద్దకం, పైల్స్‌ వ్యాధి ఉన్నవారికి మలబద్దకం పోగొట్టి, పైల్స్‌ వ్యాధి తగ్గేందుకు సహాయపడుతుంది.
►క్రమంగా తింటూంటే క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌ శరీరంలో పేరుకోకుండా, బయటికి పంపేసి శరీరాన్ని రక్షిస్తుంది.
►ఇందులోని విటమిన్‌ సి కారణంగా, నెలరోజులు నిత్యం తింటూంటే పురుషులలోని వీర్యకణాలు అన్నిరకాలుగా వృద్ధి చెందుతాయి.
►గర్భిణీలకు నిషేధం.

పచ్చికాయ – గింజలు
►సిరోసిస్‌ ఆఫ్‌ లివర్‌ వ్యాధిగ్రస్తులు... బొప్పాయి గింజలను నూరి రసం తీసి, కొద్దిగా నిమ్మరసం కలిపి (1 చెంచా రసం + 10 చుక్కల నిమ్మ రసం) రోజూ రెండు పూటలా కొంతకాలం తీసుకుంటూంటే ఆరోగ్యం మెరుగవుతుంది.
►చర్మవ్యాధులలో... గడ్డలు, మొటిమలు, పాదాలలో వచ్చే కార్న్స్‌ వంటి సమస్యలలో పచ్చికాయ నుండి రసం తీసి, పైపూతగా వాడితే తగ్గుతాయి.
►నెలసరి క్రమంగా కానివారు పచ్చికాయ తింటూంటే స్రావం సక్రమంగా అవుతుంది.
►పచ్చి బొప్పాయి కాయ నుంచి కారే పాలు 1 చెంచాడు + 1 చెంచా తేనె కలిపి సేవిస్తూంటే కడుపులో పురుగులు పోతాయి. ఈ మిశ్రమం సేవించిన 1 – 2 గంటల తరవాత ఆముదం తీసుకోవాలి.
– నిర్వహణ:
డా. వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement