ఖర్చు తక్కువ రాబడి ఎక్కువ
- డ్రిప్ పద్ధతిలో బొప్పాయి సాగు
- ఎకరాకు రూ.లక్ష ఖర్చుతో రూ.2 లక్షల ఆదాయం
పూతలపట్టు: డ్రిప్ పద్ధతిలో బొప్పాయి సాగుచేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని నిరూపిస్తున్నాడు పూతలపట్టు మండలం నొచ్చుపల్లె గ్రామానికి చెందిన రవి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాగు మంచి ఫలితాలు ఇస్తుండడంతో పలువురు రైతులు ఆ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. సాగు విధా నం, దిగుబడి గురించి రవి(9492548265) మాటల్లోనే చూద్దాం..
నాకున్న ఎకరా పొలంలో చాలా ఏళ్లుగా చెరుకు సాగు చేసేవాడిని. మొదట్లో దిగుబడి బాగా వచ్చినా రానురాను తగ్గిపోయింది. పైగా నీటి ఖర్చు కూడా ఎక్కువ. వ్యవసాయాధికారులను సంప్రదిస్తే పంట మార్పిడి చేయమన్నారు. పైగా డ్రిప్‌తో సాగు చేస్తే మంచి ఫలి తాలు ఉంటాయని చెప్పారు. వారి సూచన మేరకు తైవాన్ రెడ్ లేడి 786 రకం బొప్పాయి సాగుకు ఉపక్రమించాను. చెరుకు సాగుచేస్తే సంవత్సరానికి ఫలితం వచ్చేది. అదే బొప్పా యిలో ఆరు నెలల నుంచే దిగుబడి వస్తోంది. పైగా అంతకంతకు ఆదాయం ఉండడంతో ఆర్థికంగా కొంతమేరకు ఉపశమనం లభించింది.
సాగు విధానం..
బొప్పాయి పంట సాగుకు మిట్టనేలలు మంచిది. ఎన్నుకున్న పొలాన్ని బాగా దున్నుకోవాలి. డ్రిప్ పైపులను అమర్చుకోవాలి. దీనికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ప్రతి ఆరు అడుగులకూ ఓ అడుగు లోతు గుంత తవ్వాలి. ఇందులో ముందుగా ఆవుల ఎరువును వేసి వారం, పది రోజులు మగ్గనివ్వాలి. తర్వాత అందులో మొక్కలు నాటాలి. నాటిన మూడు రోజులకు నీరు అందించాలి. తర్వాత నాలుగు రోజులకోసారి తడి ఇస్తే సరిపోతుంది. పూత, పిందె దశలో రోజు మార్చి రోజు నీరు అందిస్తే ఆరు నెలలకు దిగుబడి ప్రారంభవుతుంది. 25 రోజులకోసారి ఏడాది మొత్తం కాయలు కోతకు వస్తాయి. మొదటి నాలుగైదు కోతలకు కాయలు పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి మంచి ధర పలుకు తాయి. పోనుపోను కాయ సైజు తగ్గుతుంది కాబట్టి ధర కూడా అలాగే ఉంటుంది.
సస్యరక్షణ..
బొప్పాయిలో ప్రతి 15 రోజులకోసారి మందు లు పిచికారి చేయాలి. చెట్లు పూతకు వచ్చే వరకు క్రిమికీటకాలు బారి నుంచి కాపాడుకునేందుకు ఫాంటాక్, టాటామిడా, ఎఫ్-4, బోరాన్ మందులు పిచికారి చేయాలి. కాపునకు వచ్చిన తర్వాత పిండినల్లి రాకుండా మందులు పిచికారీ చేసుకోవాలి.
ఖర్చులు.. ఆదాయం
ఎకరా నేల దున్నకాలకు రూ.2 వేలు ఖర్చవుతుంది. పేడ ఎరువు 10 లోడ్లకు రూ.20 వేలు అవుతుంది. ఎకరాకు 1,300 మొక్కలు అవసరమవుతాయి. రూ.10 చొప్పున రూ.13 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. గుంతలు తవ్వడానికి, మొక్కలు నాటడానికి రూ.13 వేలు, రెండు నెలలకొకసారి ఎరువులకు రూ.20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కలుపుతీతకు రూ.10 వేలు, మందులకు రూ.15 వేలు ఖర్చు అవుతుంది. డ్రిప్‌తో కలిపి మొత్తంగా దాదాపుగా రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది. ఆరు నెలల నుంచి దిగుబడి ప్రారంభవుతుంది. ప్రతి 25 రోజులకొకసారి కోత ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏడాదికి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో వాటి ధర కేజీ రూ.10 నుంచి 17 వరకు ఉంటుంది. ధర కేజీ రూ.10 అనుకున్నా రూ.3 లక్షలు వస్తుంది. ఖర్చులు లక్ష పోను దాదాపు రూ.2 లక్షలు మిగులుతుంది.