బొప్పాయి పంటను వైరస్ తెగుళ్లు ఆశించి రైతులు నష్టపోతున్నారు. ఆ తెగుళ్ల బారినపడి పంట దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్త శ్రీకృష్ణ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు.
వెర్రి తెగుళ్లు మొజాయిక్, రింగ్‌స్పాట్(ఉంగరాల) తెగులు, ఆకుముడత(క్రింకిల్) అనే మూడు రకాల వెర్రి తెగుళ్లు బొప్పాయి పంటను నాశనం చేసి దిగుబడులను గణనీయంగా తగ్గించడమే కాక పండు నాణ్యతను బాగా దెబ్బతీసి విపరీత నష్టాన్ని కలిగించడంతో పాటు కొన్ని సందర్భాల్లో చెట్లు కాపునకు రాకుండా గొడ్డు చెట్టుగా మారడం జరుగుతుంది. ఈ మహమ్మారి వెర్రి తెగుళ్లను తొలి దశ నుంచే యాజమాన్య పద్ధతులతో అరికట్టాలి. వెర్రి తెగులు తాలుకు వైరస్ కణాలు ఒకమారు మొక్కలో ప్రవేశిస్తే మొక్క క్షీణించే వరకు దాని జీవకణాలలోనే ఉండి రకరకాలుగా లక్షణాలు కలిగించి అనర్ధాలకు దారితీస్తుంది.
మొజాయిక్ తెగులు
మొజాయిక్ తెగులు ఆశిస్తే ఆకు సైజు తగ్గుతుంది. ఆకులపై అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఈనెలు లేకుండా ఏర్పడతాయి. దూరం నుంచి ఆకులు పసుపు రంగుకు మారినట్లు కన్పిస్తాయి. అందుకే దీనిని పల్లాకు తెగులని కూడా అంటారు. తెగులు సోకిన ఆకులు పెళుసుగా మారతాయి. చెట్ల పెరుగుదల తగ్గి ఎదుగుదల ఉండదు. పంట దిగుబడి నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. కాయలు గిడసబారి నాసిగా ఉంటాయి. విత్తనం మరియు పేనుబంక ద్వారా తెగులు వ్యాపిస్తుంది.
ఉంగరాల(రింగ్‌స్పాట్) తెగులు
ఈ తెగులు లక్షణాలు ఆకులు, కాడ, కాండం, పూత, పిందె, కాయ, పండ్లపై ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. లేత ఆకులు పచ్చదనం కోల్పోయి పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. దీంతో ఆకుల పరిమాణం తగ్గి సరైన మోతాదులో ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాండం పైభాగాన ఆకు తొడిమలపై ముదురాకు పచ్చని మచ్చలు, చారలు నూనె రాసినట్లు కన్పిస్తాయి. తెగులు తీవ్ర దశలో ఒక దానితో ఒకటి కలిసి మొక్క ఎదుగుదల తగ్గుతుంది.
పూత, పిందె, కాయ, పండుపై గోధుమ రంగుతో ఉంగరాల్లాంటి రింగులు ఏర్పడతాయి. వీటి మధ్యభాగం ఆకుపచ్చగా ఉంటుంది. ఒక్కో పండుపై వీటి సంఖ్య వందల్లో ఉంటాయి. తెగులు సోకిన చెట్టు పూలు అంతగా పిందె కట్టవు. పిందెలు ఎదగవు. రింగులున్న కాయలు తొందరగా పండి మెత్తబడి నీరుకారుతాయి. నాణ్యత లోపిస్తుంది. దూరప్రాంతాల రవాణాకు పనికిరావు.
విత్తనం మరియు పేనుబంక ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుముడత(లీఫ్ క్రింకిల్ లేదా కర్ల్) తెగులు ఈ తెగులు సోకిన చెట్లలో ఎదుగుదల తగ్గుతుంది. ముడతలు పడి ఆకులు ముడుచుకుని బంతిలా మారతాయి. ఆకు తొడిమ వంకర టింకరగా తిరుగుతుంది. వికృతాకారంగా ఉంటుంది. చెట్టు తల ఆకారం మారుతుంది. పూత రాక గొడ్డు చెట్టుగా మారవచ్చు. తెల్లదోమ ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది.
తెగుళ్ల నివారణకు..
ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలు వాడాలి. విత్తన శుద్ధి తప్పనిసరి. నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటేటప్పు డు వెర్రి తెగుళ్ల లక్షణాలుంటే తీసేయాలి. అంతర పంటగా మిరప, టమాటా, దోస పుచ్చ, గుమ్మడి లాంటివి సాగుచేయొద్దు. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే తీసి నాశనం చేయాలి. సమతుల సమగ్రమైన ఎరువులను సకాలంలో అందించాలి. సూక్షధాతు మిశ్రమాన్ని 3, 4 నెలల వయస్సులో ఒకమారు చెట్లపై పిచికారి చేయాలి. కలుపు మొక్కలు పొలంలోను, పొలం గట్లపైన లేకుండా పరిశుభ్రతను పాటించాలి. తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి.
అంతర సేద్యం చేసేటప్పుడు చెట్ల వేర్లకు గాయాలు తగలకుండా చూడాలి. రసం పీల్చే పురుగులతోనే వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. పేనుబంక, తెల్లదోమ పురుగులను సకాలంలో నివారించాలి. వాటి ఉధృతిని నివారించాలంటే థైయోమిథాక్సిన్ 0.3 గ్రా, లేదా డైఫెన్‌త్యూరియాన్ 1 గ్రా, లేదా స్పినోస్యాడ్ 0.3 మి.లీ లేదా ఎసిఫెట్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాటితో పాటు 5 మి.లీ వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
15 రోజుల వ్యవధిలో పై మందులను మార్చుతూ రెండు, మూడు సార్లు పిచికారి చేసుకుంటే పురుగు వృద్ధి తగ్గుతుంది. బొప్పాయిలో వైరస్ తెగుళ్ల లక్షణాలు కన్పించిన మొక్కలను మొదట్లోనే పీకేయాలి. సరైన నీరు, పోషకాల యాజమాన్యం ద్వారా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. నీటి పోషకాల యాజమాన్యం సక్రమంగా లేకపోవడంతోనే తెగుళ్లు అధికంగా వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment