Papaya crop
-
Papaya Farming: బొప్పాయి.. ఇలా పండిస్తే లక్షల్లో లాభాలు, ఫుల్ డిమాండ్
సంప్రదాయ పంటలతో విసిగిన రైతన్న ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో గిరాకీ ఉన్న బొప్పాయి పంటను సాగు చేసేందుకు బాపట్ల జిల్లాలో రైతులు మొగ్గుచూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి బొప్పాయి పంటను జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు బొప్పాయి రైతులు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి బొప్పాయిని సాగు చేసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చని తద్వారా రైతులకు లాభాలు వస్తాయని ఉద్యానశాఖ అధికారిణి దీప్తి పేర్కొన్నారు. 324 ఎకరాల్లో బొప్పాయి సాగు జిల్లాలోని కొల్లూరు మండలంలో 9.02, భట్టిప్రోలులో 18.23, సంతమాగులూరులో 155.74, బల్లికురవ 45.54, మార్టూరు 12.85, యద్దనపూడి 11.79, జే.పంగులూరు 21.93, అద్దంకి 32.18, కొ రిశపాడు 16.74 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. రెండు సంవత్సరాల పంటకాలంలో ఎకరాకు 90 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఖర్చుపోను నికరంగా రూ.2లక్షల వరకు ఆదాయం రావడంతో జిల్లా రైతులు బొప్పాయి సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో నామమాత్రంగా సాగు చేపట్టిన బొప్పాయి ఈ ఏడాది అత్యధికంగా 324 ఎకరాలకు పైగా సాగు చేపట్టారు. బొప్పాయి సాగులో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం వలన పండిన పంట ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కాయలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని రైతులు చెప్తున్నారు. అనుకూలమైన రకాలతో మంచి దిగుబడి జిల్లాలో సాగు చేపట్టాలనుకునే రైతులు రెడ్ లేడీ, వాషింగ్టన్, కో 1,2,3 రకాలు అనువైనవి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి. మొక్కలు నాటే సమయంలో గుంతల్లో ప్రతి గుంతకూ 20 కిలోల పశువుల ఎరువు, 20 గ్రాముల అజోప్పైరిల్లమ్, 20 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా, 40 గ్రా ముల మైకోరైజాను బాగా కలుపుకొని వేసుకోవాలి. నాటే సమయం జూన్, జులై, అక్టోబర్, నవంబర్ మాసాల్లో నాటుకోవచ్చు. 40 నుంచి 60 రోజుల వయస్సున్న 15 సెంటీమీటర్ల పొడవు గల మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకోవాలి. ఎరువుల యాజమాన్యం ప్రతి మొక్కకూ రెండు కిలోల నాడెప్ కంపోస్టు, ఒక కిలో వేపపిండి, అర కిలో ఘనజీవామృతం వేసుకొని మొక్కలను నాటుకోవాలి. తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని పారించుకోవాలి. మొక్కలపై ప్రతి 15 రోజుల కొకసారి పంచగవ్యను పిచికారీ చేసుకోవాలి. ప్రతి 25 రోజులకు ఒకసారి శొంఠి పాల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. బొప్పాయిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. ప్రకృతి సాగు చేయడం వలన కాయలు బరువుగా నాణ్యత కలిగి ఉంటాయి. వేసవిలో కూడా బెట్టకు రాకుండా అధిక దిగుబడులు వస్తాయి. అలాగే పండుగ సమయాల్లో టన్ను రూ.22 వేల వరకు పలుకుతుంది. మార్కెట్లో కిలో బొప్పాయి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ లేని సమయంలో కూడా టన్ను రూ.10 నుంచి 15 వేలు ధర పలుకుతుంది. – దీప్తి, ఉద్యానశాఖ అధికారిణి -
బొప్పాయిలో వైరస్ తెగుళ్లు.. నివారణ లేకపోతే నష్టమే
బొప్పాయి పంటను వైరస్ తెగుళ్లు ఆశించి రైతులు నష్టపోతున్నారు. ఆ తెగుళ్ల బారినపడి పంట దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్త శ్రీకృష్ణ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. వెర్రి తెగుళ్లు మొజాయిక్, రింగ్‌స్పాట్(ఉంగరాల) తెగులు, ఆకుముడత(క్రింకిల్) అనే మూడు రకాల వెర్రి తెగుళ్లు బొప్పాయి పంటను నాశనం చేసి దిగుబడులను గణనీయంగా తగ్గించడమే కాక పండు నాణ్యతను బాగా దెబ్బతీసి విపరీత నష్టాన్ని కలిగించడంతో పాటు కొన్ని సందర్భాల్లో చెట్లు కాపునకు రాకుండా గొడ్డు చెట్టుగా మారడం జరుగుతుంది. ఈ మహమ్మారి వెర్రి తెగుళ్లను తొలి దశ నుంచే యాజమాన్య పద్ధతులతో అరికట్టాలి. వెర్రి తెగులు తాలుకు వైరస్ కణాలు ఒకమారు మొక్కలో ప్రవేశిస్తే మొక్క క్షీణించే వరకు దాని జీవకణాలలోనే ఉండి రకరకాలుగా లక్షణాలు కలిగించి అనర్ధాలకు దారితీస్తుంది. మొజాయిక్ తెగులు మొజాయిక్ తెగులు ఆశిస్తే ఆకు సైజు తగ్గుతుంది. ఆకులపై అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఈనెలు లేకుండా ఏర్పడతాయి. దూరం నుంచి ఆకులు పసుపు రంగుకు మారినట్లు కన్పిస్తాయి. అందుకే దీనిని పల్లాకు తెగులని కూడా అంటారు. తెగులు సోకిన ఆకులు పెళుసుగా మారతాయి. చెట్ల పెరుగుదల తగ్గి ఎదుగుదల ఉండదు. పంట దిగుబడి నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. కాయలు గిడసబారి నాసిగా ఉంటాయి. విత్తనం మరియు పేనుబంక ద్వారా తెగులు వ్యాపిస్తుంది. ఉంగరాల(రింగ్‌స్పాట్) తెగులు ఈ తెగులు లక్షణాలు ఆకులు, కాడ, కాండం, పూత, పిందె, కాయ, పండ్లపై ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. లేత ఆకులు పచ్చదనం కోల్పోయి పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. దీంతో ఆకుల పరిమాణం తగ్గి సరైన మోతాదులో ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాండం పైభాగాన ఆకు తొడిమలపై ముదురాకు పచ్చని మచ్చలు, చారలు నూనె రాసినట్లు కన్పిస్తాయి. తెగులు తీవ్ర దశలో ఒక దానితో ఒకటి కలిసి మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పూత, పిందె, కాయ, పండుపై గోధుమ రంగుతో ఉంగరాల్లాంటి రింగులు ఏర్పడతాయి. వీటి మధ్యభాగం ఆకుపచ్చగా ఉంటుంది. ఒక్కో పండుపై వీటి సంఖ్య వందల్లో ఉంటాయి. తెగులు సోకిన చెట్టు పూలు అంతగా పిందె కట్టవు. పిందెలు ఎదగవు. రింగులున్న కాయలు తొందరగా పండి మెత్తబడి నీరుకారుతాయి. నాణ్యత లోపిస్తుంది. దూరప్రాంతాల రవాణాకు పనికిరావు. విత్తనం మరియు పేనుబంక ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుముడత(లీఫ్ క్రింకిల్ లేదా కర్ల్) తెగులు ఈ తెగులు సోకిన చెట్లలో ఎదుగుదల తగ్గుతుంది. ముడతలు పడి ఆకులు ముడుచుకుని బంతిలా మారతాయి. ఆకు తొడిమ వంకర టింకరగా తిరుగుతుంది. వికృతాకారంగా ఉంటుంది. చెట్టు తల ఆకారం మారుతుంది. పూత రాక గొడ్డు చెట్టుగా మారవచ్చు. తెల్లదోమ ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగుళ్ల నివారణకు.. ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలు వాడాలి. విత్తన శుద్ధి తప్పనిసరి. నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటేటప్పు డు వెర్రి తెగుళ్ల లక్షణాలుంటే తీసేయాలి. అంతర పంటగా మిరప, టమాటా, దోస పుచ్చ, గుమ్మడి లాంటివి సాగుచేయొద్దు. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే తీసి నాశనం చేయాలి. సమతుల సమగ్రమైన ఎరువులను సకాలంలో అందించాలి. సూక్షధాతు మిశ్రమాన్ని 3, 4 నెలల వయస్సులో ఒకమారు చెట్లపై పిచికారి చేయాలి. కలుపు మొక్కలు పొలంలోను, పొలం గట్లపైన లేకుండా పరిశుభ్రతను పాటించాలి. తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. అంతర సేద్యం చేసేటప్పుడు చెట్ల వేర్లకు గాయాలు తగలకుండా చూడాలి. రసం పీల్చే పురుగులతోనే వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. పేనుబంక, తెల్లదోమ పురుగులను సకాలంలో నివారించాలి. వాటి ఉధృతిని నివారించాలంటే థైయోమిథాక్సిన్ 0.3 గ్రా, లేదా డైఫెన్త్యూరియాన్ 1 గ్రా, లేదా స్పినోస్యాడ్ 0.3 మి.లీ లేదా ఎసిఫెట్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాటితో పాటు 5 మి.లీ వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 15 రోజుల వ్యవధిలో పై మందులను మార్చుతూ రెండు, మూడు సార్లు పిచికారి చేసుకుంటే పురుగు వృద్ధి తగ్గుతుంది. బొప్పాయిలో వైరస్ తెగుళ్ల లక్షణాలు కన్పించిన మొక్కలను మొదట్లోనే పీకేయాలి. సరైన నీరు, పోషకాల యాజమాన్యం ద్వారా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. నీటి పోషకాల యాజమాన్యం సక్రమంగా లేకపోవడంతోనే తెగుళ్లు అధికంగా వస్తాయి. -
ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!
బొప్పాయి సీజన్ మొదలైంది. ఒకట్రెండు కాదు సుమారు ఆరునెలల పాటు సాగే సీజన్ కావడంతో తోటల్లో సందడి మొదలైంది. ఇటు రైతుల్లో.. అటు వ్యాపారుల్లో బొప్పాయి మాటే.. రేటే వినిపిస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీకి తరలించే బొప్పాయి ప్యాకింగ్ మరింత స్పెషల్‌గా ఉంటుంది. మరి అన్నమయ్య బొప్పాయి గొప్పలేంటో చూద్దామా.. అదే అదే చదివేద్దామా! అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు,మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయికి మంచి రోజులొచ్చాయి. ఇక్కడి బొప్పాయికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. సీజన్లో వ్యాపారులే తోటల దగ్గరికొచ్చి కాయలను కొనుగోలు చేస్తుంటారు. ఫలితంగా ఇక్కడి రైతులు కూడా ఎక్కువ విస్తీర్ణంలో బొప్పాయి తోటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సుమారు 876 హెక్టార్లలో పంట సాగులో ఉన్నట్లు అంచనా. ఇక ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.26 వరకు పలుకుతోంది. దీంతో ఢీల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయిని తోటల వద్దే కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆరునెలల పాటు ఇక్కడే మకాం బొప్పాయి ఎగుమతులు చేయడం కోసం వ్యాపారులు, ఏజెంట్లు సుమారు ఆరునెలల పాటు ఈ ప్రాంతంలో మకాం వేస్తారు. ముంబై , రాజస్థాన్‌కు తరలించే బొప్పాయిల కంటే దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేసే కాయల కటింగ్ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. చెట్ల నుంచి కాయను జాగ్రత్తగా దించుతున్న కూలి, ఎగుమతి కాయల్ని పేపర్లో చూడుతున్న కూలీలు ఈ కాయల కటింగ్, ప్యాకింగ్ కోసం బీహార్,జార్ఖండ్ రాష్ట్రాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలంతా ఒక క్రమపద్ధతిలో ప్యాకింగ్ చేస్తారు. సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. అయితే ఢిల్లీ కటింగ్‌లో తేడా ఉంటుంది. కటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరిమరీ కోస్తుంటారు. పైగా ఒక్క కాయ కూడా కింద పడకుండా చెట్టు నుంచే జాగ్రత్తగా కిందికి దించుతారు. ఇక్కడి నుంచి ఢీల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరురోజుల సమయం పడుతుంది. అప్ప టి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయ డం కూలీల ప్రత్యేకత. ఈ సీజన్లో వందలాది మంది కూలీలు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతుండడం విశేషం. డిల్లీలో భలే డిమాండ్ ఢిల్లీలో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఉంటోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఏడాది వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.26వరకు ధరలు పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. అక్కడ బొప్పాయిని ఎక్కువగా బేకరీ ఐటం, హల్వా తయారీలో ఎక్కువగా వినియోగిస్తారని వ్యాపారులు తెలిపారు. లారీ లోపల నలువైపుల ఎండుగడ్డి నింపి బొప్పాయి లోడింగ్ చేస్తున్న దృశ్యం ఈ ఏడాదిలో ఇవే అత్యధిక ధరలు.. నిన్నామొన్నటి వరకు బొప్పాయికి సరైన ధరలు లేక రైతులు డీలా పడ్డారు. ప్రస్తుతం బొప్పాయి ధరలు మార్కెట్లో బాగా పుంజుకొన్నాయి. పదిరోజుల కిందట కిలో బొప్పాయి ధర రూ. 12 నుంచి 15 వరకు మాత్రమే పలికాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.26 వరకు పలుకుతుండడం విశేషం. ఈఏడాదిలో బొప్పాయి ఇవే అత్యధిక ధరలు అని రైతులు అంటున్నారు. మార్కెట్లో ధరలు ఇలాగే నిలకడగా ఉంటే లాభాల పంట పండినట్లేనని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తోటల వద్దే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యా పారులు ముందుగానే సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. చెట్టు నుంచి కాయల్ని కింద పడనీయకుండా కోసి తరలిస్తుంటారు. – సుధాకర్ రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె ఐదు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో నేను ఐదు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ.26 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీ ఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. ఇవే ధరలు నిలకడ ఉంటే లాభాలు చూడవచ్చు. – నరసింహారెడ్డి, బొప్పాయి రైతు, ఎగువతొట్టివారిపల్లి (చదవండి: ఆ ఐదు దేశాల్లో..ఎంత అర్బన్ అగ్రికల్చర్ ఉందో తెలుసా! ఏకంగా..) -
సూక్ష్మలోపం.. భారీ నష్టం!
సూక్ష్మధాతు లోపం వల్ల బొప్పాయి (పొప్పడి) పంట దిగుబడి తగ్గుతుంది. అవగాహన లోపం వల్ల దీన్ని సవరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో దిగుబడి తగ్గటంతో పాటు వివిధ రకాల తెగుళ్ల బారిన పడి పంట పూర్తిగా పాడవుతుంది. సమస్యను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపడితే ధాతులోపాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పంటకు ప్రధానంగా జింక్, మెగ్నీషియం, బోరాన్, ఐరన్ ధాతు లోపాలు వస్తుంటాయి. ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తే దీన్ని అధిగమించడం సులువే. జింక్ లోపం లక్షణాలు ఆకు కణజాలం పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఈనెల మధ్యభాగం పసుపు పచ్చరంగులోకి మారి వాడిపోయినట్లుగా ఉంటుంది. పిందె సైజు పెరగదు. దిగుబడి తగ్గుతుంది. నాణ్యత, రుచి లోపిస్తుంది. నివారణ... జింక్‌లోపం నివారణకు లీటరు నీటిలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా ద్రావణాన్ని కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. మెగ్నీషియం లోపిస్తే మెగ్నీషియం లోపం వల్ల ఆకు పూర్తిగా మూడతపడి తిరగబడుతుంది. దీంతో ఆకు మొత్తం పేలవంగా మారుతుంది. మొక్క ఎదుగుదల లోపిస్తుంది. నివారణ... లీటరు నీటికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి. ఐరన్ లోపంతో... ఆకులు బంగారు వర్ణంలోకి మారుతాయి. ఈనెల మధ్య భాగం తెల్లగా మారుతుంది. ఐరన్ లోపం ఎక్కువైతే ఈనెలు, ఈనెల మధ్యభాగం పూర్తిగా తెలుపు రంగులోకి మారుతుంది. నివారణ... లీటరు నీటికి 2 గ్రాముల ఫైసల్ఫేట్ మరియు 1గ్రాము నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని స్ప్రేచేయాలి. బోరాన్ లోపం... బొప్పాయి ఆకులు పూర్తిగా జీవం కోల్పోతాయి. పిందె తక్కువగా కడుతుంది. పిందె రాలిపోవడం ప్రారంభమవుతుంది. కాయలపై మచ్చలు ఏర్పడుతాయి. కాయ రూపం మారుతుంది. నివారణ... దీన్ని నివారించేందుకు లీటర్ నీటిలో 4గ్రాముల ఫార్ముల-4 అనే మందును పిచికారీ చేయాలి.