బొప్పాయి సీజన్ మొదలైంది. ఒకట్రెండు కాదు సుమారు ఆరునెలల పాటు సాగే సీజన్ కావడంతో తోటల్లో సందడి మొదలైంది. ఇటు రైతుల్లో.. అటు వ్యాపారుల్లో బొప్పాయి మాటే.. రేటే వినిపిస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీకి తరలించే బొప్పాయి ప్యాకింగ్ మరింత స్పెషల్‌గా ఉంటుంది. మరి అన్నమయ్య బొప్పాయి గొప్పలేంటో చూద్దామా.. అదే అదే చదివేద్దామా!
అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు,మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయికి మంచి రోజులొచ్చాయి. ఇక్కడి బొప్పాయికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. సీజన్‌లో వ్యాపారులే తోటల దగ్గరికొచ్చి కాయలను కొనుగోలు చేస్తుంటారు. ఫలితంగా ఇక్కడి రైతులు కూడా ఎక్కువ విస్తీర్ణంలో బొప్పాయి తోటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సుమారు 876 హెక్టార్లలో పంట సాగులో ఉన్నట్లు అంచనా.
ఇక ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.26 వరకు పలుకుతోంది. దీంతో ఢీల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయిని తోటల వద్దే కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆరునెలల పాటు ఇక్కడే మకాం బొప్పాయి ఎగుమతులు చేయడం కోసం వ్యాపారులు, ఏజెంట్లు సుమారు ఆరునెలల పాటు ఈ ప్రాంతంలో మకాం వేస్తారు. ముంబై , రాజస్థాన్‌కు తరలించే బొప్పాయిల కంటే దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేసే కాయల కటింగ్ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది.
చెట్ల నుంచి కాయను జాగ్రత్తగా దించుతున్న కూలి, ఎగుమతి కాయల్ని పేపర్లో చూడుతున్న కూలీలు
ఈ కాయల కటింగ్, ప్యాకింగ్ కోసం బీహార్,జార్ఖండ్ రాష్ట్రాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలంతా ఒక క్రమపద్ధతిలో ప్యాకింగ్ చేస్తారు. సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. అయితే ఢిల్లీ కటింగ్‌లో తేడా ఉంటుంది. కటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరిమరీ కోస్తుంటారు. పైగా ఒక్క కాయ కూడా కింద పడకుండా చెట్టు నుంచే జాగ్రత్తగా కిందికి దించుతారు. ఇక్కడి నుంచి ఢీల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరురోజుల సమయం పడుతుంది. అప్ప టి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయ డం కూలీల ప్రత్యేకత. ఈ సీజన్‌లో వందలాది మంది కూలీలు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతుండడం విశేషం.
డిల్లీలో భలే డిమాండ్ ఢిల్లీలో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఉంటోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఏడాది వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.26వరకు ధరలు పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. అక్కడ బొప్పాయిని ఎక్కువగా బేకరీ ఐటం, హల్వా తయారీలో ఎక్కువగా వినియోగిస్తారని వ్యాపారులు తెలిపారు.
లారీ లోపల నలువైపుల ఎండుగడ్డి నింపి బొప్పాయి లోడింగ్ చేస్తున్న దృశ్యం
ఈ ఏడాదిలో ఇవే అత్యధిక ధరలు..
నిన్నామొన్నటి వరకు బొప్పాయికి సరైన ధరలు లేక రైతులు డీలా పడ్డారు. ప్రస్తుతం బొప్పాయి ధరలు మార్కెట్లో బాగా పుంజుకొన్నాయి. పదిరోజుల కిందట కిలో బొప్పాయి ధర రూ. 12 నుంచి 15 వరకు మాత్రమే పలికాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.26 వరకు పలుకుతుండడం విశేషం. ఈఏడాదిలో బొప్పాయి ఇవే అత్యధిక ధరలు అని రైతులు అంటున్నారు. మార్కెట్లో ధరలు ఇలాగే నిలకడగా ఉంటే లాభాల పంట పండినట్లేనని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తోటల వద్దే కొనుగోలు చేస్తున్నారు
బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యా పారులు ముందుగానే సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. చెట్టు నుంచి కాయల్ని కింద పడనీయకుండా కోసి తరలిస్తుంటారు.
– సుధాకర్ రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె
ఐదు ఎకరాల్లొ సాగు చేశా
ఈసీజన్‌లో నేను ఐదు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ.26 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీ ఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. ఇవే ధరలు నిలకడ ఉంటే లాభాలు చూడవచ్చు.
– నరసింహారెడ్డి, బొప్పాయి రైతు, ఎగువతొట్టివారిపల్లి
(చదవండి: ఆ ఐదు దేశాల్లో..ఎంత అర్బన్ అగ్రికల్చర్ ఉందో తెలుసా! ఏకంగా..)
Comments
Please login to add a commentAdd a comment