కొత్త వంగడాల రూపకల్పనలో వైఎస్సార్‌ వర్సిటీ రికార్డు  | Dr YSR Horticultural University Developed New Varieties of Seeds | Sakshi
Sakshi News home page

కొత్త వంగడాల రూపకల్పనలో వైఎస్సార్‌ వర్సిటీ రికార్డు 

Published Mon, Jun 21 2021 9:25 AM | Last Updated on Mon, Jun 21 2021 9:27 AM

Dr YSR Horticultural University Developed New Varieties of Seeds - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం కొత్త రకాల వంగడాలను అభివృద్ధి చేయడంలో అరుదైన రికార్డు నెలకొల్పింది. వర్సిటీ అభివృద్ధి చేసిన 13 కొత్త ఉద్యాన వంగడాలను కేంద్రం నోటిఫై చేసింది. ఇంతకుముందు వర్సిటీ అభివృద్ధి చేసిన 16 వంగడాలకు ఇప్పటికే గుర్తింపు లభించగా.. తాజాగా నోటిఫై చేసిన 13 వంగడాలతో కలిపి యూనివర్సిటీ ఏర్పడ్డాక 13 ఏళ్లలో మొత్తంగా 29 నూతన ఉద్యాన వంగడాలను రైతుల ముంగిటకు చేర్చి రికార్డు సృష్టించింది. ఒకేసారి ఇన్ని వంగడాలను అభివృద్ధి చేయడం, వాటిని కేంద్రం నోటిఫై చేయడం దేశంలోని వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. 

2007లో ప్రస్థానం మొదలై.. 
ఉద్యాన పంటల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2007లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెం వద్ద ఉద్యాన యూనివర్సిటీని నెలకొల్పారు. 19 పరిశోధనా కేంద్రాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, 4 ఉద్యాన కళాశాలలు, 4 ఉద్యాన పాలిటెక్నిక్‌లు, 4 అనుబంధ ఉద్యాన కళాశాలలు, 7 అనుబంధ ఉద్యాన పాలిటెక్నిక్‌లతో విస్తరించింది. అధిక దిగుబడులనిచ్చే కొత్త రకాల వంగడాల రూపకల్పన, సమర్థ యాజమాన్య పద్ధతులపై పరిశోధనలు చేయడం ద్వారా ఈ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే మిరపలో 5, ధనియాలులో 7, మెంతులులో 1, చామలో 2, కందలో ఒకటి చొప్పున కొత్త వంగడాలను వర్సిటీ అభివృద్ధి చేసింది.

వీటిని గతంలో కేంద్రం నోటిఫై చేయగా.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇవి సాగులో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. 90 శాతం సుగంధ ద్రవ్యాలు, 60 శాతం మిరప, కొబ్బరి హైబ్రీడ్‌ రకాలు విస్తరించడం వర్సిటీ పరిశోధనల ఫలితమే. తాజాగా వర్సిటీ పరిశోధనా కేంద్రాల్లో రెండేళ్ల క్రితం అభివృద్ధి చేసిన 23 వంగడాలను  కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు పంపింది. వాటిలో 13 వంగడాలు సాగుకు యోగ్యమైనవిగా గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసింది. భవిష్యత్‌లో సాగు విస్తరణ కార్యక్రమాల్లో అందించే రాయితీలు, ప్రోత్సాహకాలను ఈ కొత్త వంగడాలకు కూడా వర్తింపచేస్తారు. ఈ గుర్తింపు ఉద్యాన రంగంలో మరిన్ని పరిశోధనలకు, ఏపీని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిస్తుంది. 

సాంకేతికతను బదలాయించేందుకు చర్యలు 
ఈ నూతన రకాలు సాంద్ర పద్ధతిలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు ఎంతగానో అనుకూలం. వీటి సాంకేతికతను వాణిజ్య పరంగా వివిధ సంస్థలకు బదలాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్‌ టి.జానకిరామ్, ఉప కులపతి, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ 

అందుబాటులోకి కొత్త రకాల విత్తన మొక్కలు  
పురుగులు, తెగుళ్లను తట్టుకుని నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే రకాలివి. తాజాగా విడుదల చేసిన విత్తన మొక్కలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కే రెడ్డి, పరిశోధన సంచాలకులు, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement