సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి మేలు కలిగేలా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంకలనం చేసిన ఉద్యాన పంటల పంచాంగం ఆవిష్కరణ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఆర్థిక ప్రయోజనాలు, ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కలిగించేలా మన వ్యయసాయ పద్దతులుండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమతమని, అందుకు తగ్గట్టుగా మనందరం కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యాన సాగులో ఆరోగ్యానికి మరింతగా ఉపకరించే కొత్త పంటలను ప్రోత్సాహించాలని, పురుగు మందులు, రసాయనాల వినియోగం తగ్గిస్తూ అధిక దిగుబడి వచ్చేలా పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని శాస్త్రవేత్తలకు సూచించారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయానికి, మన రాష్ట్ర ఉద్యాన పంటల ఉత్పత్తలకు జాతీయ స్థాయిలో ఉన్నత గుర్తింపు ఉందని, ఈ గుర్తింపును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నతికి ఉప కులపతి డా జానకి రామ్, వారి శాస్త్రవేత్తల బృందం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
98 ఉద్యాన పంటల సమగ్ర సమాచారంతో రైతులకు సులువుగా అవగాహన కలిగించేలా ఉద్యాన పంటల పంచాంగం రూపొందించారని మంత్రి ప్రశంసించారు. ఉద్యాన పంచాంగ పుస్తకాలు ప్రతి ఆర్బీకేలో ఉండేలా చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులకు సూచించారు. ఉద్యాన పంటల సాగుపై నిర్వహిస్తున్న "తోటబడి" శిక్షణా కార్యక్రమాల్లో ఉద్యాన శాస్త్రవేత్తలు మరింత శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా పూనమ్ మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, ఉప కులపతి డా జానకి రామ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
చదవండి: రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
Comments
Please login to add a commentAdd a comment