సాక్షి, తూర్పు గోదావరి: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ.. వారికి వెన్నుదన్నుగా ఉండాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దేశంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. జిల్లాలోని మండపేట మండలం ఆర్తమూరులో సోమవారం రైతులతో నిర్వహించిన ఇష్టాగోష్టి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 10600 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సహకారం అందుతోందని.. రానున్న కాలంలో వీటిని మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చబోతున్నామని తెలిపారు. అదే విధంగా 200 కోట్ల రూపాయిలతో ఇంటిగ్రేటెడ్ ల్యాబులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
‘‘త్వరగా పాడయ్యే పంటలకు సైతం గిట్టుబాటు ధర కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అదే విధంగా రైతులకు ఏదైనా ప్రమాదం లేదా మరణం సంభవిస్తే ఏడు లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోంది. ప్రతి రైతు భరోసా కేంద్రంలో 15 లక్షల రూపాయిలు విలువ చేసే వ్యవసాయ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతుకు అన్ని రకాలుగా అండగా ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యం’’అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment