మండపేట(తూర్పుగోదావరి జిల్లా) : పేదవాడికి ఫ్లాట్ ఇస్తామంటూ దోచేస్తున్నారు.. ప్లాటుకు నెలనెలూ రూ.3 వేలు కడుతూ పోవాలట.. చంద్రబాబు ప్లాట్లు ఇస్తే తీసుకోండి.. అధికారంలోకి రాగానే ఆ ప్లాట్లపై ఉన్న రుణం మొత్తాన్ని మాఫీ చేస్తాం’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ప్రసగించారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని చెప్పారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానని అధికారంలోకి రాగానే అందరిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
‘పంటలకు గిట్టుబాటు ధరలు లేవని రైతులు నాతో చెప్పారు. ధాన్యం దళారీల పాలవుతున్న విషయాన్ని రైతులు నాతో చెప్పారు. అధికారంలోకి రాగానే రైతులకు సరైన మద్ధతు ధర ఇచ్చే బాధ్యత నాదే. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. ఫీజులు కట్టేందుకు అప్పులు చేస్తున్న తల్లిదండ్రులను చూశా.. పిల్లలు, తల్లిదండ్రులకు చెబుతున్నా..నేనున్నాననే హామీ ఇస్తున్నా.. ఆరోగ్య శ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. ఆరోగ్యం అందని పేదవాడిని చూశా.. వాళ్ల బాధలు కూడా విన్నా.. ప్రతి పేదవాడికి చెబుతున్నా.. నేనున్నాననే హామీ ఇస్తున్నా’ అని వ్యాక్యానించారు.
నిరుద్యోగులకు హామీ ఇస్తున్నా..
‘ఉద్యోగాలు రాక అవస్థలు పడుతోన్న యువతను చూశా.. నిరుద్యోగులకు హామీ ఇస్తున్నా..నేనున్నాననే భరోసా ఇస్తున్నా. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అబద్ధాలు, మోసాలే.. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతోనే కాదు..ఎల్లో మీడియాతో కూడా. ఎన్నికలు దగ్గర పడగానే చంద్రబాబు ప్రతి గ్రామానికి డబ్బుల మూటలు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. మీరు అందరూ గ్రామాలకు వెళ్లండి.. ప్రతి ఒక్కరికీ చెప్పండి.. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్ద’ని వైఎస్ జగన్ ప్రజలను కోరారు.
రైతుకు మే నెలలో రూ.12,500
‘కొన్ని రోజులు ఓపిక పడితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పండి. అలాగే రైతన్నలకు ప్రతి మే నెలలో ఒకే సారి రూ.12,500 ఇస్తామని చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు ఇస్తామని చెప్పండి. డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణం ఉన్నా నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాం. బ్యాంకులకు సగర్వంగా వెళ్లే రోజులు మళ్లీ వస్తాయి. ప్రతి మహిళ లక్షాధికారి అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. అవ్వా తాతలకు రూ. 3 వేల వరకు పింఛన్ ఇస్తామ’ని వైఎస్ జగన్ అన్నారు.
పిట్టగోడ కూలి అభిమానులకు గాయాలు
మండపేట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. పిట్టగోడ కూలి పలువురు అభిమానులకు గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో గాయపడ్డ వారిని కార్యకర్తలు స్థానికంగా ఉన్న కృష్ణా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నేత, మండపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరమార్శించారు.
Comments
Please login to add a commentAdd a comment