సమర శంఖారావం సభలో ప్రసంగిస్తున్న జగన్
సాక్షి ,కాకినాడ : కాకినాడ సభ ద్వారా వెఎస్సార్‌సీపీలో సమరోత్సాహం వెల్లివిరిసింది. కాకినాడ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ఢంకా మోగించి ఎన్నికల సమర శంఖం పూరించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బూత్ కమిటీ సభ్యులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ‘జై జగన్’ నినాదాలతో మార్మోగింది. 36 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా అభిమాన నేత రాకకోసం, మాట కోసం ఎదురు చూశారు. అధినేత ఇచ్చిన స్పూర్తి పార్టీ శ్రేణులకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన ర్యాంపుపై తిరుగుతూ బూత్ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులివ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది.
మీ కష్టం నాకు తెలుసు... గుండెల్లో పెట్టుకుంటా...
‘మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి బూత్ కమిటీ సభ్యుడు, నా కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ... అష్ట,కష్టాలు పెట్టినా అండగా నిలిచారు. ఎన్ని బాధలు పెట్టారో ... మీరెంత నష్టపోయారో నాకు తెలుసు. మీ కష్టాన్ని, నష్టాన్ని చూశాను. మీకు తగిలిన ప్రతి గాయమూ...నా గుండెకు తగిలిందని కచ్చితంగా చెబుతున్నాను.
మీలో ప్రతి ఒక్కర్నీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను. మీ బాగోగులు చూసుకుంటానని, మిమ్మల్ని అన్ని రకాలుగా పైకి తీసుకువస్తానని హామీ ఇస్తున్నాను. రేపు దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ మీద పెట్టిన అక్రమ, దొంగ కేసులన్నీ ఉపసంహరిస్తానని మాటిస్తున్నాను.’ అంటూ జగన్ చేసిన భావోద్వేగ ప్రసంగం ప్రతి ఒక్కరి హృదయాన్నీ కదిలించింది.
మండు టెండను లెక్క చేయకుండా...
ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక జరిగిన మొట్టమొదటి సభ కావడంతో కాకినాడ సమర శంఖారావం కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. 19 నియోజకవర్గాల నుంచి వెల్లువలా వైఎస్సార్ సీపీ కుటుంబం శ్రేణులు తరలి వచ్చారు. అశేషంగా తరలివచ్చిన బూత్ కమిటీ సభ్యులనుద్దేశించి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగించారు. శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడంతోపాటు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేలా జోష్ నింపారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5.40 గంటల వరకు వేచి ఉన్నారు. వేదికపై నుంచి పార్టీ కేడర్‌కు దిశా నిర్దే«శం చేయడంతోపాటు బూత్ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వేదిక ముందు ఏర్పాటు చేసిన ర్యాంపుపై అటు,ఇటు నడుస్తూ సమాధానాలు ఇవ్వడంతో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో జై జగన్, సీఎం సీఎం నినాదాలతో హోరెత్తించారు.
ఓటర్లూ... బహుపరాక్
కాకినాడ వేదికగా చంద్రబాబు మోసాలను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల మీద మాట్లాడుతున్నాడు, ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు దొంగతనం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చంద్రబాబు సలహదారునిగా పెట్టుకున్నాడు.. ఏ ఒక్కరైనా బాబు పాలనలో స్వచ్ఛందంగా ఓటు వేయాలంటే బూత్‌ల దగ్గరకు వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేశాడు. ప్రపంచంలోనే నెంబర్ ఒన్ అవినీతి పరుడు. ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన నేరగాడు.
చివరకు తనకు ఓట్లు వేయరనుకుంటే ఓట్లు తీయించే నెంబర్ వన్ క్రిమినల్ కూడా. తనకు ఓట్లు వేస్తారనుకుంటే ఒకే ఓటరుకు రెండు ఓట్లు చేయిస్తారు. లేకపోతే ఉన్న ఓట్లు తీసేస్తారు. ఇలాంటి వ్యక్తిని సైబర్ క్రిమినల్ అంటారు. మన ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు దొంగలించడానికి ముఖ్యమంత్రి ఎవరు? ప్రజల డేటాను దొంగిలించినందుకు టీడీపీని ఏరకంగా రద్దు చేయాలి. ఓట్లున్నాయో లేదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. లేకపోతే ఫాం 6 ద్వారా ఆన్‌లైన్‌లో అభ్యర్థన పెట్టుకోవాలి... కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది.
తర్వాత ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ సీ విజిల్ యాప్ మనందరి కోసం ప్రవేశ పెట్టారు. అందరికీ స్మార్ట్ సెల్‌ఫోనులున్నాయి. యాప్ స్టోర్‌లోకి వెళ్లి సీ విజిల్ అని టైప్ చేస్తే అందుబాటులోకి వస్తుంది. దాన్ని లోడ్ చేసుకుంటే ఎన్నికల సమయంలో టీడీపీ అక్రమాలు, అన్యాయాలు చేసినట్టు కనిపించగానే రికార్డు చేసి, సెల్ ఫోన్‌లో సెండ్ చేస్తే 15 నిమిషాల్లో ఓ టీం వస్తుంది. 100 నిమిషాల్లో రిటర్నింగ్ అధికారి నివేదిక ఇస్తారు’ అని ఓటు ఆవశ్యకతను, అధికార పార్టీ చేస్తున్న ఓట్ల దొంగ తనం, ఎన్నికల్లో టీడీపీ పాల్పడే అక్రమాలు, అన్యాయాలపై ఏ విధంగా అప్రమత్తమవ్వాలన్నదానిపై శ్రేణులకు తెలియజేశారు.
హాజరైన నేతలు...
సభలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్త చింతా అనురాధ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, పార్టీ సమన్వయకర్తలు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎన్.ధనలక్ష్మి, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, పితాని అన్నవరం, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత్ ఉదయ భాస్కర్, పార్టీ నాయకులు మిండగుదిటి మోహన్, సాకా ప్రసన్నకుమార్, రావూరి వెంకటేశ్వరరావు, కర్రి వెంకటరమణ, కర్రి పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment