న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతుందని మరోసారి తేలింది. రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ 22 చోట్ల, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్స్ పేర్కొంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సాధారణ మెజారిటీ సాధించినా 2014తో పోలిస్తే సుమారు 70 సీట్లు కోల్పోయే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 మేజిక్ ఫిగర్ కాగా, బీజేపీ స్వతహాగా 238 చోట్ల, ఎన్డీయే కూటమి 285 సీట్లలో గెలుపొందుతుందని తెలిపింది.
2014లో 282 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి 44 సీట్లను కోల్పోయి 238 స్థానాలను దక్కించుకునే అవకాశముందని తెలిపింది. గతంలో 80 స్థానాలకే పరిమితమైన యూపీయే ఈసారి తన బలాన్ని 126 సీట్లకు పెంచుకునేందుకు అవకాశాలున్నట్లు సర్వే తెలిపింది. అప్పుడు 44 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈసారీ మూడంకెల స్కోరును అందుకోవడం కష్టమేనంది. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్‌ఎస్, ఇతర ప్రాంతీయ పార్టీలు సుమారు 130 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు తెలిపింది.
2014 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 16 స్థానాలు, అఖిలేశ్ యాదవ్ నేతృత్వం వహిస్తున్న ఎస్పీ 18 సీట్లు కైవసం చేసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ రాష్ట్రంలో 2014లో 80 స్థానాలకు గాను 71 చోట్ల గెలుపొందిన బీజేపీ ఈసారి 40 చోట్ల మాత్రమే విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ 14, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1 చోట గెలుస్తాయని పేర్కొంది. మార్చి 1–7 మధ్య దేశవ్యాప్తంగా 193 లోక్‌సభ స్థానాల్లో నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 20 వేల మంది పురుషులు, 18 వేల మంది మహిళల నుంచి సమాచారం సేకరించారు.
రాష్ట్రాల వారీగా అంచనాలు..
యూపీ(80): బీజేపీ 40, ఎస్పీ 18, బీఎస్పీ 16, కాంగ్రెస్ 4, ఆర్‌ఎల్డీ 1, అప్నా దళ్ 1
పశ్చిమబెంగాల్(42): టీఎంసీ 30, బీజేపీ 12
రాజస్తాన్(25): బీజేపీ 20, కాంగ్రెస్ 5
మధ్యప్రదేశ్(29): బీజేపీ 23, కాంగ్రెస్ 6
గుజరాత్(26): బీజేపీ 26: ఢిల్లీ(7): బీజేపీ 7
మహారాష్ట్ర(48): బీజేపీ 22, శివసేన 10,
కాంగ్రెస్ 9, ఎన్సీపీ 7
బిహార్(40): బీజేపీ 15, జేడీయూ 12, ఆర్జేడీ 8,
ఎల్జేపీ 3, కాంగ్రెస్ 2
తమిళనాడు(39): డీఎంకే 16, ఏడీఎంకే 12,
కాంగ్రెస్ 5, పీఎంకే 2, బీజేపీ 1
కర్ణాటక(28): బీజేపీ 13, కాంగ్రెస్ 13, జేడీఎస్ 2
కేరళ(20): యూడీఎఫ్ 12, ఎల్డీఎఫ్ 7, బీజేపీ 1
Comments
Please login to add a commentAdd a comment