AP CM YS Jagan Meet With East Godavari Mandapeta Party Workers Live Updates - Sakshi
Sakshi News home page

ఇంత మంచి చేస్తున్నాం గనుకే గెలిచి తీరతాం.. మండపేట కార్యకర్తలతో సీఎం జగన్‌

Published Wed, Nov 2 2022 4:00 PM | Last Updated on Wed, Nov 2 2022 8:05 PM

AP CM YS Jagan Meet East Godavari Mandapeta Party Workers Updates - Sakshi

సాక్షి, తాడేపల్లి: మనకు ఓటు వేయకపోయినా.. అర్హులకు మంచి చేశాం. అలాంటప్పుడు వాళ్లు మనల్ని ఎందుకు ఆదరించారు?. కచ్చితంగా ఆదరించి తీరతారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండపేట కార్యకర్తలతో తాడేపల్లిలో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

మండపేట ప్రజలకు 946 కోట్ల రూపాయలను డీబిటీ(డైరెక్ట్‌ బెనిఫిషియరీ ట్రాన్‌జాక్షన్‌) ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పనిచేశాం. గ్రామాల్లో వచ్చిన మార్పును మనం జనంలోకి తీసుకెళ్లాలి. ఒక మిషన్ ద్వారా దీన్ని జనంలోకి తీసుకెళ్లాలి. మండపేట నియోజకవర్గంలో 96,469 ఇళ్లకు గాను 92 శాతం ఇళ్లకు పథకాలు చేరాయి.  ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే 92 శాతం మంచి పనులు చేయగలిగాము.  ఆ మంచిని వివరిస్తూ గడపగడపకు వెళ్లేలా ప్లాన్ చేశాం. అలా వెళ్ళినప్పుడు అక్క చెల్లెమ్మలు మనకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటప్పుడు వచ్చే ఎన్నికలలో 175కు 175 సీట్లు ఎందుకు రావు?. 

ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. అర్హత ఉంటే చాలు.. అందరికీ మేలు చేశాం. మనకు ఓటు వేయకపోయినా మంచి చేస్తే వారి మనసు కరుగుతుందని మేలు చేశాం. కలిసికట్టుగా అందరూ పనిచేసి ఎన్నికలలో పార్టీని గెలిపించాలి’ అని సీఎం జగన్‌ కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు.   

ఇంకా ఆయన ఏమన్నారంటే.. 
మిమ్నల్ని  కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి కలిసి చాలారోజులైంది. కలిసినట్టు ఉంటుందన్నది ప్రధాన కారణమైతే... రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉంది. 18 నెలలు అంటే చాలా దూరం ఉంది అనుకోవచ్చు. దానికి సంబందించి ఇప్పుడే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టాలా ? అని అనుకోవచ్చు. 18 నెలలు ఉన్నప్పటికీ ఆ దిశగా మనం అడుగులు ఎందుకు వేయాలన్నది చెప్పడానికే మిమ్నల్ని రమ్మన్నాం.

► ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సర్వసహజంగా జరుగుతాయి. కానీ మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్ద ప్రతి 2వేల జనాభాకు 12 మంది అక్కడే కూర్చుని పనిచేసేటట్టుగా ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో అనుసంధానం చేసి, ప్రతి గడప, ప్రతి కుటుంబం కూడా అర్హత ఉండి రాని పరిస్థితులు ఉండకూడదని తాపత్రయపడుతున్నాం. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని ఎప్పుడూ జరగని విధంగా సాచ్యురేషన్‌ విధానంలో అడుగులు వేశాం.

► ఒక్క మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో  కేవలం బటన్‌ నొక్కి ప్రతి ఇంటికి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వైయస్సార్‌ పెన్షన్‌ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా మొదలుకుని క్రాప్‌ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెన వరకు రకరకాల పథకాలు డీబీటీ ద్వారా ఆధార్‌ కార్డు సహా ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది ఆధారాలతో సహా పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరు మిస్‌ కాకుండా దేవుడి దయతో అడుగులు వేయగలిగాం. ఇటువంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇంత మార్పు జరుగుతున్నప్పుడు దాన్ని మనం ప్రజలదగ్గరకు తీసుకుని వెళ్లి...వారికి ఇవన్నీ గుర్తు చేసి.. ప్రజల ఆశీస్సులు మనం తీసుకుని అడుగులు ఇంకా ఎఫెక్టివ్‌గా వేసేదానికి మిమ్నల్ని భాగస్వామ్యులను చేస్తున్నాం. 

మొట్టమొదటిసారిగా గడప గడప అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే.. మన ఎమ్మెల్యే కానీ, మన ఎమ్మెల్యే అభ్యర్ధి కానీ... గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సచివాలయ వ్యవస్ధ, మండల స్ధాయి అధికారులు, గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మమేకమై ప్రతి గడపనూ తట్టి, ప్రతి గడపలోనూ జరిగిన మంచిని వివరిస్తూ వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటూ మరోవైపు  పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే... అటువంటి వారు కూడా మిగిలిపోకూడదనే తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు డబ్బులు కూడా కేటాయించాం. ఆ సచివాలయానికి వెళ్లినప్పుడు ఆ సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. సచివాలయానికి రూ.20 లక్షలుఅంటే నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు కేటాయించినట్లవుతుంది. ఆ సచివాలయంలో రెండు రోజుల పాటు ఉండాలి. ఒక్కోరోజు కనీసం 6 గంటలు ఆ సచివాలయంలో ఉండాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. 

► మీ నియోజకవర్గంలో 96,469 ఇళ్లు ఉన్నాయి. ఇందులో మన పథకాలు చేరిన ఇళ్లు 91.96 శాతం. అంటే సుమారు 92 శాతం ఇళ్లలో ఆ అక్కచెల్లెమ్మల పేర్లతో ఏ పథకం చేరింది, ఎన్ని పథకాలు చేరాయి అని ఏకంగా ఆథార్‌ కార్డు డీటైల్స్‌తో సహా చెప్పగలికే పరిస్థితుల్లో సహాయం చేయగలిగాం. 

► గ్రామమే ఒక యూనిట్‌గా తీసుకుంటే ఆ గ్రామంలో 92 శాతం ఇళ్లకు.. ప్రతి ఇంట్లో మనం మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
ఆ జరిగిన మంచిని వివరిస్తూ మనం గడప, గడపకూ కార్యక్రమం చేస్తున్నప్పుడు అవునన్నా  పథకాలు అందాయి అని చల్లని ఆశీస్సులు ఆ అక్కచెల్లెమ్మలు మనమీద చూపించినప్పుడు ఆగ్రామంలో మనం గెలుస్తాం.

► గ్రామం గెల్చినప్పుడు నియోజకవర్గం గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గం గెల్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 కి 175 ఎందుకు రావు ?. ఒక్క మండపేట నియోజకవర్గంలో మండపేట మున్సిపాల్టీతో సహా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు లెక్క తీసుకుంటే.. మున్సిపాల్టీలో 30 కి 23 వైయస్సార్సీపీ, జడ్పీటీసీలు మూడింటికి మూడు, ఎంపీపీలు మూడింటికి మూడు ఏ లెక్కలు తీసుకున్నా గతంలో రానివి ఇప్పుడు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ అన్నీ క్లీన్‌స్వీప్‌ చేశాం. ప్రజల దీవెనలు మనవైపు కనిపిస్తున్నాయి. కారణం పాలన పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా లంచాలు అవసరం లేదు. వివక్ష చూపించడం లేదు. మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే కచ్చితంగా వచ్చేటట్టు చేస్తాం. మనం చేసిన మంచిని చూసి మార్పు వస్తుంది. 

► సోషల్‌ ఆడిట్‌లో జాబితాలు ప్రదర్శిస్తున్నాం. ఇవన్నీ జరుగుతుండగానే మారుతున్న గ్రామాలు కనిపిస్తున్నాయి. గ్రామంలోకి అడుగుపెడుతూనే సచివాలయం కనిపిస్తుంది. వాలంటీర్‌ వ్యవస్ధ కనిపిస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, విలేజ్‌ క్లీనిక్కులు కనిపస్తాయి. శరవేగంగా డిజిటల్‌ లైబ్రరీలు కట్టే కార్యక్రమం కూడా మొదలుపెడుతున్నాం. ఇవన్నీ గతంలో లేనివి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాయి. గతంలో పిల్లలు చదువుకునే వయస్సుకు వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం గ్రామాలు వదిలిపెట్టే పరిస్థితి. ఆ పరిస్థితి పోయి ఇంగ్లిషు మీడియం బడులు మన గ్రామాల్లో వస్తున్నాయి. వైద్యం అన్నది విలేజ్‌ క్లీనిక్కుల ద్వారా మన గ్రామంలోనే ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంతా ఒకేచోట ఉంటూ.. 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు చేసేటట్టుగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ క్రియేట్‌ చేసి ఊర్లోనే వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇంత మార్పు గతంలో జరగలేదు. 

► డీసెంట్రలైజేషన్‌ ఈ స్ధాయిలోకి వెళ్లి మంచి చేయాలన్న ఆరాటం గతంలో లేదు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న నేపధ్యంలో కచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా మార్పు రావాలి. వై నాట్‌ 175. కచ్చితంగా జరుగుతుంది.  మీరు నేను ఒక్కటైనప్పుడు ఇది జరుగుతుంది. ఇది నా ఒక్కడి వలన జరిగేది కాదు. నేను చేయాల్సింది నేను చేయాలి. మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఇద్దరం కలిసికట్టుగా చేయాలి. నేను బటన్‌ సరిగ్గా నొక్కాలి. అక్కడ పొరపాట్లు జరగకూడదు. నా ధర్మం నేను చేయాలి. మీరు అంతా కలిసి ప్రతి గ్రామంలో మనం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకునిపోవడమే కాకుండా, వారికి అర్ధమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ల చల్లని ఆశీస్సులు తీసుకోవాలి. ఆ ఆశీస్సులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇద్దరం కలిస్తే సాధ్యం కాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఇది చేయడం కోసం మీ అందరి మద్దతు కూడా ఈ దిశగా కూడగట్టేందుకు ఈ రోజు మిమ్నల్ని ఇక్కడికి ఆహ్వానించాం అని సీఎం జగన్‌ ప్రసంగించారు. 

టార్గెట్‌ 175లో భాగంగా.. కొన్ని నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో బుధవారం సీఎం జగన్ సమావేశం అయ్యారు. సీఎం వైఎస్‌ జగన్‌తో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభసభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement