సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభయహస్తం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి రాయితీ కౌలు రైతులతో సహా అన్నదాతలందరికీ కచ్చితంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమం కోసమే రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఏర్పాటైందని ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ (అగ్రి మిషన్) తొలి సమావేశం శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగింది. అగ్రి మిషన్ చైర్మన్ హోదాలో దీనికి అధ్యక్షత వహించిన సీఎం వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన అగ్రి మిషన్ సమావేశంలో అజెండాలోని ఏడు అంశాలను వివరంగా చర్చించారు. సభ్యుల సూచనలు, సలహాలను ముఖ్యమంత్రి ఓపిగ్గా వింటూ రైతులకు మేలు జరిగేలా అగ్రి మిషన్ పని చేయాలని సూచిం చారు. వైఎస్సార్ రైతు భరోసాలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ అన్నదాతలకు అందేలా చూడడం అగ్రి మిషన్ కీలక బాధ్యతన్నారు. ప్రతి నెలా అగ్రి మిషన్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
విత్తన సరఫరాపై ప్రణాళికకు ఆదేశం
అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, మంత్రులు కె.కన్నబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అనిల్ కుమార్ యాదవ్, ఆ శాఖల అధిపతులు మధుసూధన్‌రెడ్డి, పూనం మాలకొండయ్య, అరుణ్‌కుమార్, చిరంజీవి ఛౌదురి, మురళీ, నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అజయ్ కల్లం, ధనుంజయ్‌రెడ్డి, ఆర్‌డీటీ ప్రతినిధి మల్లారెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త చంద్రశేఖర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైఎస్ ఛాన్స్‌లర్ రాఘవరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం ఎంవీఎస్ నాగిరెడ్డి, మంత్రి కన్నబాబు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ తొలి సమావేశం సంతృప్తికరంగా జరిగిందన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాల మాటే వినబడకూడదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, వచ్చే సీజన్‌కు సంబంధించి విత్తన సరఫరా ప్రణాళికలు రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయని చెప్పారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన వ్యవసాయ మిషన్ తొలి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, మిషన్ సభ్యులు ఉన్నతాధికారులు
వ్యవసాయ విద్యుత్తు ఫీడర్లకు తక్షణమే రూ.1,700 కోట్లు
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని అగ్రి మిషన్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ప్రస్తుతం పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు అనువైన ఫీడర్లు 60 శాతం అందుబాటులో ఉండగా మిగతా 40 శాతం ఫీడర్లు కూడా పని చేసేలా రూ.1,700 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వచ్చే మార్చి నెలాఖరులోగా 40 శాతం ఫీడర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా పర్యవేక్షించాలని అగ్రి మిషన్ సభ్యులకు సూచించారు.
ప్రణాళికతో పని చేద్దాం..
ప్రతి పనికీ ప్లానింగ్ ఉండాలని, గత ప్రభుత్వ ప్రణాళికా లోపమే ప్రస్తుతం విత్తనాల కొరత సహా వ్యవసాయ రంగ సంక్షోభానికి కారణమని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. ప్రతి నియోజకవర్గంలో పరీక్షా ప్రయోగశాలలు (టెస్టింగ్ ల్యాబ్స్) ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను క్షుణ్నంగా తనిఖీ చేసి నిర్ధారించిన తర్వాతే మార్కెట్‌కు విడుదల చేయాలని ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇకపై రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోరాదని హెచ్చరించారు. ఇన్‌పుట్ సరఫరాదారులు ఇచ్చిన నమూనాలే మార్కెట్‌లో కూడా ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అగ్రి మిషన్‌లో ఇన్‌పుట్ సరఫరాదారుల సంఘం ప్రతినిధుల్ని చేర్చడం వెనక ఉద్దేశం కూడా అదేనని వివరించారు.
ఇన్‌పుట్ సబ్సిడీ అంటే ఎప్పుడో ఇచ్చేది కాదు..
వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అక్టోబర్ 15వతేదీ నుంచి రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం కింద రూ.12,500 చొప్పున ఇస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో నూటికి 50 శాతం మంది రైతులు 1.22 ఎకరాల లోపు పొలం ఉన్నవారేనని, వారందరికీ ఈ పెట్టుబడి సాయం ఉపకరిస్తుందని, దీంతో పాటు ప్రభుత్వం వడ్డీలేని పంట రుణాలు కూడా ఇప్పిస్తున్నందున రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రైతులకు ప్రకటించిన రాయితీలలో ఎక్కడా అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి మిషన్ సభ్యుడిపై ఉందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ అంటే ఎప్పుడో రెండు మూడేళ్లకు ఇచ్చేది కాదని, ఒక సీజన్‌లో నష్టపోతే ఆ తర్వాత సీజన్‌లో పంట వేసుకునేందుకు అందేలా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిపడ్డ రూ.2 వేల కోట్లకుపైగా ఇన్‌పుట్ సబ్సిడీ, ధాన్యం రైతులకు బకాయిపడ్డ రూ.970 కోట్లను చెల్లించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ధాన్యం రైతులకు ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.
బెండ విత్తనాలపై ఫిర్యాదులను విచారించండి
సహకార రంగాన్ని గాడినపెట్టి ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా కసరత్తు చేపట్టే బాధ్యతను వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబుకు, భూ రికార్డుల సంస్కరణ బాధ్యతను అజయ్ కల్లంకు, సాగునీటి సంఘాల ఎన్నికల బాధ్యతను నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు అప్పగించినట్టు తెలిసింది. రాయలసీమలో బెండ విత్తనాలపై అందిన ఫిర్యాదులను అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా తక్షణమే విచారించాలని ఉద్యాన శాఖాధికారులను ఆదేశించారు. సమావేశంలో కౌల్దారీ చట్టం అమలుపై కూడా చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment