సాక్షి, అమరావతి: పెళ్లిళ్లు.. వేడుకల్లో భారీగా వినియోగించే పూలను ఒకే రంగులోకి మార్చాలంటే టింటింగ్ పద్ధతి మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. ఈ పద్ధతిలో ఒక్కొక్క పువ్వును మాత్రమే రంగు మార్చాల్సి వస్తోంది. ఇలా చేయడం చాలా కష్టతరమైన పని. ఒకేసారి అన్ని పూల రంగును సులువుగా మార్చేందుకు ఇంతవరకు ఎలాంటి పద్ధతి కనుగొనలేదు.
ప్రపంచంలోనే తొలిసారి ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తిరుపతిలో ఉన్న ఉద్యాన పరిశోధన స్థానం ఓ చక్కని పరిష్కారాన్ని కనుగొంది. పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి.. వాటితో విలువ ఆధారిత వస్తువులను తయారు చేసేందుకు పీహెచ్‌డీ విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పూల ఇంకులను వినియోగించి ఒకేసారి మనకు నచ్చిన రంగులో భారీ ఎత్తున పూలను ఉత్పత్తి చేసుకునే విధానాన్ని కనుగొన్నారు.
ఎలా తయారు చేస్తారంటే..
సేకరించిన పూలను మెత్తగా గ్రైండ్ చేస్తారు. ఆ తర్వాత ప్రకృతి సిద్ధంగా లభించే ద్రవ్యాలను జతచేసి మరోసారి గ్రైండింగ్ చేస్తారు. ఇలా వచ్చిన ద్రవ్యాలను వడగట్టి వాటి సహజతత్వం కోల్పోకుండా శీతలీకరణ చేయడం ద్వారా రంగు ద్రావణాన్ని తయారు చేస్తారు. ఎంపిక చేసిన తెలుపు రంగు పూలపై.. వాటిని కోసేందుకు ముందు ఆ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. స్ప్రే చేసిన వెంటనే పూల రంగు మనకు కావాల్సిన రంగులోకి సహజ సిద్ధంగా మారిపోతుంది. గంటసేపు ఆరిన తరువాత పువ్వుల్ని కోత కోసి నిల్వ చేసుకోవచ్చు. ఈ విధానంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే వెసులుబాటు ఉంది.
ప్రయోగం ఇలా..
తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగిస్తున్న పూల నుంచి తయారు చేసిన రంగులతో కోతకు సిద్ధంగా ఉన్న తెల్ల రంగు చామంతి పూలపై ప్రయోగించి ఫలితాలను రాబట్టారు. కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటుందని గుర్తించారు. అలాగే పూర్ణిమ రకం చామంతి తోటలోని పూలపై ఇలా తయారు చేసిన పూల రంగును ప్రయోగాత్మకంగా పిచికారీ చేసి వాటి రంగు, తాజాదనాన్ని పరిశీలించారు. ఇది నూరు శాతం సహజసిద్ధంగా తయారవడంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపలేదని గుర్తించారు.
వినియోగదారుల కోరిక మేరకు అవసరమైతే వారు కోరుకున్న సువాసనల కోసం సెంట్‌ను అద్దుకునే వెసులుబాటు సైతం ఉంది. ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగించే పూలను ఉచితంగా సేకరిస్తున్నారు. వాడిన పూలను కొనుగోలు చేస్తే కిలోకు సుమారుగా రూ.10 ఖర్చవుతుంది. వీటి ద్వారా ఒక లీటర్ రంగు తయారీకి రూ.20 నుంచి రూ.50 వరకు ఖర్చవుతుంది. లీటర్ ద్రావణం 15–20 మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. ఒక ఎకరాకు 2 వేల లీటర్ల ద్రావణం అవసరమవుతుంది.
మరింత విస్తృతంగా పరిశోధనలు
జెక్స్ బెరా (వైట్), రోజా (వైట్) ఇతర రకాల పూలపై కూడా ప్రయోగాలు చేసేందుకు ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పూల రంగులతో పెన్నుల తయారీపైనా పరిశోధనలు చేస్తున్నారు. రంగుల కోసం ప్రస్తుతం ఏ పూలను వినియోగిస్తున్నారంటే రోజా (మిరాబుల్ రెడ్), డెకరేషన్‌కు ఉపయోగించే బంతి (ఆరంజ్), చామంతి (ఎల్లో), తామర (పింక్, వైట్), ఆర్కిడ్స్ (సోనియా రకం పర్పల్ కలర్)ను ఉపయోగిస్తున్నారు. తోటల్లోని పూలపై స్ప్రే చేసినప్పుడు వాతావరణంలో తేమను బట్టి వాటి రంగులు మారే అవకాశం ఉందని గుర్తించారు. సాఫ్ట్ ల్యాండ్ స్కేపింగ్ ఇండస్ట్రీ, ఫ్లోరిస్ట్స్–బాక్వీ షాప్స్, ఇన్‌స్టంట్‌గా కలర్ చేంజ్ చేసి కస్టమర్ చాయిస్‌కు అనుగుణంగా బాంక్విట్స్‌ను ఇచ్చేందుకు ఉపయోగించవచ్చు.
చాలా ఆనందంగా ఉంది
రసాయనాలు కలపకుండా ప్రకృతిలో లభించే పూల నుంచే సహజ సిద్ధమైన రంగులను తయారు చేయవచ్చని నిరూపించాం. తద్వారా ఏక మొత్తంలో ఒకే రంగు పూలను తయారు చేసేందుకు వీలుగా నూతన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భాగస్వామి అయినందుకు చాలా ఆనందంగా ఉంది. – జగదీశ్వరి, పీహెచ్‌డీ విద్యార్థిని, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం
పరిశోధన విజయవంతం
పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి వాటి ద్వారా విలువ ఆధారిత వస్తువులను తయారు చేసే క్రమంలో పలువురు పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులు చేసిన ఈ తరహా ప్రయోగం సక్సెస్ అయ్యింది. 10 రోజుల్లో 8 వేల లీటర్ల ద్రావణం తయారు చేశాం. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకు సైడ్‌ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇతర పూల విషయంలో ఈ తరహా ప్రయోగం చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోననే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. పూలకు సెంట్స్ యాడ్ చేసే విషయంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం
ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ముందడుగు
ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ఇదో గొప్ప చారిత్రాత్మక ముందడుగుగా పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు ఇలా ఏక మొత్తంలో ఒక రంగు పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే సాంకేతికత ఎక్కడా లేదు. ఈ తరహా ప్రయోగం జరిగినట్టుగా జర్నల్స్‌లో కూడా ఎక్కడా లేదు. కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన పీహెచ్‌డీ విద్యార్థిని జగదీశ్వరి బృందంకు నా అభినందనలు. – టి.జానకీరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment