వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలు
గెజిట్‌లో నోటిఫై చేసిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
ద్వివర్ణ తోటకూర, వంగపండు వర్ణంలో చిక్కుడు, ఎర్రటి చింత
జెమినీ వైరస్‌ను తట్టుకునే క్రాంతి, చైత్ర, తన్వి, సిరి వంటి మిరప రకాలు
వాము, వస, పసుపులో కొత్త రకాలు · తక్కువ కాలపరిమితిలో సాగు
తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడులు
రాష్ట్రంలోని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 18 రకాల వంగడాలు దేశవ్యాప్తంగా వినియోగంలోకి రానున్నాయి. ఈ యూనివర్సిటీ ఇప్పటికే రాష్ట్ర మార్కెట్‌లో విడుదల చేసిన 15 వంగడాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన వాము (వర్ష), వస (స్వర్ణస్వర), పసుపు (లామ్ స్వర్ణ) వంగడాలను జాతీయ స్థాయి మార్కెట్‌లోకి విడుదల చేస్తూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్‌లో ప్రచురించింది.
దేశవ్యాప్తంగా వినియోగించేందుకు వీలుగా వెంకట్రామన్నగూడెం, గుంటూరు లాం, బాపట్ల, తిరుపతి, కొవ్వూరు, పెద్దాపురం ఉద్యాన పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు ఈ వంగడాలను అభివృద్ధి చేశారు. రెండు రంగు (ద్వివర్ణ)లలో తోటకూర, వంగపండు రంగు చిక్కుడు, ఎర్రటి చింత వంటి వెరైటీలతో పాటు జెమినీ వైరస్‌ను తట్టుకునే క్రాంతి, చైత్ర, తనీ్వ, సిరి వంటి మిరప రకాలు కూడా వీటిలో ఉన్నాయి. కొత్తగా జాతీయ మార్కెట్‌లోకి వస్తున్న వంగడాలు, వాటి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతి
పసుపు (లామ్ స్వర్ణ) : అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక రకం (260–270 రోజులు). పసుపు పొడి ముదురు నిమ్మ పసుపు రంగులో ఉంటుంది. అధిక ఎండు కొమ్ముల రికవరి (24%) లో 3–4% కుర్కుమిన్ వద్ద పదార్ధం కల్గి ఉంటుంది. హెక్టారుకు 40–42 టన్నుల పచ్చి పసుపు, 9.8 నుంచి 11.3 టన్నుల ఎండు కొమ్ముల దిగుబడినిస్తుంది.
వస (స్వర్ణస్వర) : 8–9 నెలల పంట కాల పరిమితితో అధిక దిగుబడినిచ్చే రకం. దీనిలో బిటా ఆసరోన్– (15.90 మి. గ్రా/ గ్రాము) అధికంగా వుంటుంది. మొక్క మధ్యస్థ పెరుగుదలతో (56.40 సెం.మీ), ఆకులు అధికంగా కలిగి ఉంటుంది. దగ్గర దగ్గరగా నాటుకోవడానికి అనువైన రకం. వస కొమ్ములు మంచి పొడవు (44.88 సెం.మీ), వెడల్పు (6.53 సెం.మీ) సరాసరి బరువు (112.30 గ్రా.) ఉంటాయి. చిత్తడి నేలల్లో సాగుకు అనుకూలం, హెక్టారుకి 28 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.
వాము (వర్ష) : అధిక దిగుబడినిచ్చే, దీర్ఘకాలిక రకం (140–145 రోజులు). నీటి పారుదల, వర్షాధార ప్రాంతాల్లో సాగుకి అనుకూలం, అధిక నూనె శాతం (7–8%)తో పాటు సువాసన కలిగిన ఈ రకం సువాసన పరిశ్రమలకి అనుకూలం. గింజ ఆకర్షణీయమైన గోధుమ రంగుతోమధ్యస్థ పరిమాణంలో ఉండటం వలన మార్కెట్లో గిరాకీ అధికంగా ఉంటుంది. హెక్టారుకి 10–12 క్వింటాళ్ళు దిగుబడినిస్తుంది.
మిరప (క్రాంతి) : అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక (210–230 రోజులు) రకం. మొక్కలు నిటారుగా పొడవుగా పెరుగుతాయి. కాయలు మధ్యస్థ పొడవుతో పచి్చగా ఉన్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులో, పండినప్పుడు ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగులో ఉండి అధిక ఘాటును కలిగి ఉంటాయి. నేరుగా విత్తడానికి (సాలు తోటలు) అనుకూలమైన రకం. ఆకు ముడత (జెమిని వైరస్) తెగులు, బెట్టను సమర్ధంగా తట్టుకోగలదు. వర్షాధార పంటగా హెక్టార్‌కు 48 క్వింటాళ్లు, నీటి పారుదల కింద 65 క్వింటాళ్లు చొప్పున అధిక ఎండు మిరప దిగుబడినిస్తుంది.
మిరప (చైత్ర): అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక (180–190 రోజులు) రకం. మొక్కలు గుబురుగా పెరిగి, ఆకులు దట్టంగా ఉండడం వల్ల కాయలు ఎండ వేడిమిని తట్టుకోగలుగుతాయి. కాయలు పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో, పక్వానికి వచి్చనప్పుడు మెరుపుతో కూడిన ఎరుపు రంగులో ఉంటాయి. పచ్చి మిర్చి, ఎండు మిరపగా కూడా ఉపయోగపడుతుంది. నేరుగా విత్తడానికి అనుకూలమైన రకం. ఆకుముడతను పూర్తిగా, బెట్టను కొంతవరకు తట్టుకోగలదు. వర్షాధార పంటగా హెక్టారుకి 46 క్వింటాళ్లు, నీటి పారుదల కింద 65 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.
మిరప (తన్వీ) : అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక (210–230 రోజులు) రకం. మొక్కలు మధ్యస్థంగా పెరుగుతాయి. ఆకుపచ్చ రంగులోనున్న కాయలు రంగు తిరిగే దశలో తొలుత కుంకుమ వర్ణంలోకి, ఆ తర్వాత ముదురు ఎరుపు రంగులోకి మారతాయి. కాయలు సన్నగా అధిక ఘాటును కలిగి ఉంటాయి. నిల్వ సమయంలో రంగును త్వరగా కోల్పోవు. ఆకు ముడత, పండు కుళ్ళు తెగుళ్ళను తట్టుకుంటుంది. ఎగుమతికి అనువైన రకం. వర్షాధార పంటగా హెక్టారుకి 48 క్వింటాళ్లు, నీటి పారుదల కింద 65 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
పచ్చి మిరప (సిరి): మొక్కలు నిటారుగా, పొడవుగా పెరుగుతాయి. అధిక పచ్చి మిరప దిగుబడినిచ్చే మధ్యకాలిక (180–200 రోజులు) రకం. కాయలు పసుపుతో కూడిన లేత ఆకు పచ్చ రంగు నిగారింపుతో మధ్యస్థ పొడవు, మధ్యస్థ ఘాటును కలిగివుంటాయి. నాటిన రెండున్నర నెలల నుండి పచ్చి మిర్చి కోతకు సిద్ధమవుతుంది. హెక్టారుకి 310 నుంచి 320 క్వింటాళ్ల పచ్చి మిరప దిగుబడినిస్తుంది.
చిక్కుడు (శ్రేష్ఠ) : మొక్కలు మధ్యస్థంగా పెరిగి, సంవత్సరం పొడవునా సాగుకు అనువైన రకం. నిర్దిష్టమైన కాంతి/చీకటి అవసరం లేకుండా పూతనిచ్చే రకం. కాయలు ఉదా రంగును కలిగి నాటిన 80 – 85 రోజుల్లో కోతకొస్తాయి. హెక్టారుకి 19 టన్నుల దిగుబడి వస్తుంది.
కర్ర పెండలం (ఆదిత్య): వరి కోత తరువాత లోతట్టు, మాగాణి భూముల్లో సాగుకు అనువైన స్వల్పకాలిక రకం (7 నెలలు). మొక్కలు నిటారుగా పెరిగి కోత సులభంగా ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాధారంతోపాటు నీటి పారుదల కింద కూడా సాగు చేయొచ్చు. కసావా మెజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుంది. హెక్టారుకి 40 టన్నులు దిగుబడినిస్తుంది.
పెండలం (శబరి): దుంపలు పొడవుగా పెరిగి పై తోలు ముదురు గోధుమ వర్ణంలో, కండ మీగడ వర్ణంలో ఉంటుంది. దుంపలు మంచి నాణ్యత కలిగి, చిప్స్ తయారీకి పనికొస్తాయి. 25 – 30 శాతం పిండి పదార్ధం ఉంటుంది. ఆకుమచ్చ తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. హెక్టారుకి 45 – 50 టన్నుల దిగుబడినిస్తుంది.
తోట కూర (వర్ణ) : ఆకులు మధ్య భాగాన ఊదా రంగు కలిగి ద్వివర్ణంలో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆంధోసైనిన్ వర్ణ పదార్ధాన్ని (61.55 మి.గ్రా/ 100గ్రా) కలిగి ఉంటాయి. మొక్కలు ఆలస్యంగా పూతకు రావడం వల్ల నాటిన 60 రోజులలో 3 సార్లు కోతకు వస్తుంది. మొక్కలు త్వరగా పెరుగుతాయి. ఏడాది పొడవునా పండించేందుకు వీలైన రకం. హెక్టారుకి 25 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
నిమ్మ (వకుళ): చెట్టు మధ్యస్థంగా ఎదిగి, అధిక సాంద్రత పద్ధతిలో సాగుకు అనువైన రకం. త్వరగా కాపుకు వచి్చ, కాయలు గుత్తులుగా కాస్తుంది. కాయలు సగటున 45 గ్రాముల బరువుతో, 45 శాతం రసం కలిగి తోలు మందంగా మెరుపును కల్గి ఉంటుంది. పచ్చళ్ళకు అనువైన రకం. బాక్టీరియా గజ్జి తెగులును తట్టుకుంటుంది. హెక్టారుకి 39 టన్నుల దిగుబడినిస్తుంది.
జీడిమామిడి (బీపీపీ–10): గుత్తి కాపుతో అధిక దిగుబడినిచ్చే రకం. గింజ పెద్దదిగా (8.1 గ్రా) ఉండి, అధిక పప్పు (29.3%), ఎక్స్‌పోర్ట్ గ్రేడు (డబ్ల్యూ 210) రకం. అధికంగా ద్విలింగ పుష్పాలను (55.21 %) ఇవ్వడమే కాకుండా ద్విలింగ పుష్పదశ ముందుగా ఉంటుంది. సగటున చెట్టుకి 21 కిలోల దిగుబడి వస్తుంది. ఆకు, పూత, గింజలనాశించే పురుగులను తట్టుకుంటుంది.
జీడిమామిడి (బీపీపీ–11): త్వరగా కాపునిచ్చే గుత్తికాపు రకం. పూత, కాయ దశలో నీటి ఎద్దడిని తట్టుకొనే రకం. అధిక సాంద్రతలో నాటడానికి అనువైనది. మధ్యస్థ గింజ పరిమాణం (6.8 గ్రా.), ఒత్తైన పుష్ప గుచ్ఛాలతో, అధిక పప్పు దిగుబడి (28.5%)ని ఇవ్వగల ఎక్స్‌పోరŠట్ట్ గ్రేడ్ (డబ్ల్యూ 240) రకం. చెట్టు సగటు దిగుబడి 17 కిలోలు. ఆకు, పూత, గింజలనాశించే చీడపీడలను తట్టుకుంటుంది.
తమలపాకు (స్వర్ణకపూరి): కొమ్మలు, తీగలు ఎక్కువగా ఉండి, అత్యధిక పెరుగుదల సామర్థ్యాన్ని కలిగిన రకం. పెద్దగా, మృదువైన, లేత ఆకుపచ్చ రంగు ఆకులతో, పొడవైన కాడలు కలిగి ఎగుమతికి అనువైన రకం. స్థానిక రకాలకంటే 20 నుంచి 25 శాతం అధిక దిగుబడి ఇస్తుంది. హెక్టారుకు 53,820 పంతాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఫైటోప్తెరా మొదలు కుళ్ళు తెగులును మధ్యస్తంగా తట్టుకోగలదు. సంకరీకరణలో, సంవత్సరం పొడవునా పుషి్పంచే వంగడం.
వాము (లామ్ ఆజవాన్–2): మొక్కలు ఒక మీటరు పొడవుతో అధిక కొమ్మలు, పువ్వులను కలిగి ఉంటాయి. 145 – 175 రోజుల పంటకాలంతో అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక రకం. ఖరీఫ్‌కు అనుకూలం. అధిక నూనె శాతం (3–4%), సువాసన ఉంటాయి. వర్షాధార పంటగా హెక్టారుకి 6 నుంచి 13 క్వింటాళ్లు, నీటి పారుదల పంటగా 12 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. ఖరీఫ్ సీజన్లో వాతావరణ పరిస్థితులను బట్టి స్థానిక రకాలపై 30 నుంచి 60 శాతం ఎక్కువ దిగుబడులు ఇస్తుంది.
చింత (తెట్టు అమలిక) : నాటిన తర్వాత 70–80 ఏళ్ల వరకు కాపునిస్తుంది. 20 ఏళ్ల వయసున్న చెట్టు ఏడాదికి సరాసరి 150 – 220 కిలోల దిగుబడినిస్తుంది. కాయలు 50–56 శాతం గుజ్జుతో పెద్దగా, వెడల్పుగా కొద్దిగా వంకర తిరిగి చివర్లు గుండ్రంగా వుంటాయి. గుజ్జు మందంగా, మెత్తగా, ముదురు గోధుమ రంగులో ఉంటుంది.
చింత (అనంత రుధిర): అన్ని ప్రాంతాలకు అనువైన, క్రమం తప్పక అధిక దిగుబడినిచ్చే రకం. గుజ్జు (43.3%) ఆకర్షణీయమైన ఎరుపు రంగులో, ఆంథోసైనిన్ వర్ణ పదార్థం అధికంగా కల్గి ఉంటుంది. ఎరుపు రంగు గుజ్జు కలిగి ఉండటం వలన ఊరగాయలు, క్యాండీ, జామ్, సిరప్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అనువైన రకం. పచ్చి కాయల్లో బీటాకెరోటిన్ (188.23 మైక్రో గ్రాము/100గ్రా) అధికంగా ఉంటుంది. 10 ఏళ్ల వయస్సులో చెట్టుకి 50–60 కిలోలు, 20 ఏళ్ల వయసున్న చెట్లు 150 నుంచి 220 కిలోల దిగుబడినిస్తాయి.
రైతుల ఆదాయం పెంచే రకాలు
వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 18 వంగడాలను జాతీయ స్థాయిలో విడుదల చేయడం గర్వంగా ఉంది. జాతీయ స్థాయిలో మన మిరపకున్న ప్రాముఖ్యత దృష్ట్యా మిరపలో జెమిని వైరస్‌ను తట్టుకునే క్రాంతి, చైత్ర, తన్వి రకాలు దేశీయ మార్కెట్లో రైతులకు అందుబాటులోకి రాబోతున్నాయి. చింత, నిమ్మ రకాలు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఎంతగానో ఉపయోగకరం. విశిష్ట లక్షణాలు కలిగిన ఈ నూతన వంగడాలు రైతుల ఆదాయం పెంచడంలో కీలకంగా మారనున్నాయి. అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు. – డాక్టర్ తోలేటి జానకీరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment