puppets
-
తోలుబొమ్మ.. రూపు మార్చిందమ్మా!
ఒకప్పుడు తెరవెనుక లేలేత వెలుగుల మధ్య సందడి చేసిన బంగారక్క.. కేతిగాడు.. జుట్టుపోలిగాడు.. అల్లాటప్పగాడు రూపం మార్చేసుకున్నారు. తోలు బొమ్మలాటకు ఆదరణ కరువైన తరుణంలో అలనాటి తోలు బొమ్మలు కొత్తరూపు సంతరించుకుని అలంకరణ వస్తువులుగా జనాన్ని అలరిస్తున్నాయి. లాంతర్లు, ఇళ్లలో గోడలకు అమర్చుకునే అందమైన కర్టెన్లు, హ్యాండ్ బ్యాగుల రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయి.ధర్మవరం రూరల్: కరువు.. కళలు పేరు చెబితే గుర్తొచ్చేది ఉమ్మడి అనంతపురం జిల్లానే. ధర్మవరం మండలం నిమ్మలకుంటలో (Nimmalakunta) తయారయ్యే తోలుబొమ్మలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీదారులు ఏ డిగ్రీలు చేయకపోయినా.. ఇతర దేశాలకు వెళ్లిమరీ తోలు బొమ్మల తయారీలో శిక్షణ సైతం ఇస్తున్నారు. కేవలం పొట్టకూటి కోసం పేద కళాకారులు అంకితభావంతో చేస్తున్న ఈ పని కళాభిమానుల మనసు దోచుకుంటోంది. ఇళ్లలో అంతర్గత అలంకరణ (ఇంటీరియర్ డెకరేషన్) పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ నిమ్మలకుంట కళాకారులు తయారు చేసే తోలు బొమ్మల్ని కొని తీరాల్సిందే అనేంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. తరతరాలుగా ఇదే వృత్తి ధర్మవరం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి వెళ్లే రహదారిపై గల నిమ్మలకుంట కళాకారులు తరతరాలుగా హస్తకళల్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరంతా తోలు బొమ్మలాట ప్రదర్శనతో పాటు తోలుబొమ్మల తయారీలోనూ అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. వీరి పూర్వీకులు ఎడ్లబండ్లపై గ్రామాలు తిరుగుతూ తోలు బొమ్మలాట ప్రదర్శించేవారు. కాలక్రమేణా సినిమాలు, టీవీల ప్రభావం ఎక్కువ కావడంతో తోలుబొమ్మల ప్రదర్శనకు ఆదరణ కరువైంది. బొమ్మలాటనే నమ్ముకున్న కుటుంబాలు తోలుబొమ్మల తయారీ, విక్రయం వైపు దృష్టి సారించారు. మేక, గొర్రె, జంతువుల చర్మాలతో ల్యాంప్‌సెట్స్ (లాంతర్లు), ఇళ్లలో గోడలకు అమర్చుకునే అందమైన కర్టెన్లు, హ్యాండ్ బ్యాగులు తదితర ఆకృతుల్లో తోలుబొమ్మల్ని తయారు చేస్తున్నారు. వీటిని ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాలలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో తోలుబొమ్మలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు 200 వరకు ఉన్నాయి. తయారీ ఇలా.. మేక తోలును మాత్రమే బొమ్మల తయారీకి ఉపయోగిస్తున్నారు. మేక చర్మాన్ని బాగా కడిగిన తర్వాత ఎండబెడతారు. ఎండిన చర్మంపై తయారు చేయాలనుకున్న బొమ్మను మొదట పెన్సిల్‌తో గీస్తారు. చిన్నచిన్న రంధ్రాల ద్వారా మిగతా భాగాన్ని తొలగించి బొమ్మకు రంగులు వేస్తారు. ఒక బొమ్మ తయారీకి మూడు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. తయారైన బొమ్మలను హ్యాండ్లూమ్ సొసైటీ ద్వారా పట్టణాలలో మార్కెటింగ్ చేస్తున్నారు. గతంలో కొద్దిమంది మాత్రమే ఈ బొమ్మలను తయారు చేసేవారు. మార్కెటింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో తయారీదారులు పెరుగుతున్నారు. పద్మశ్రీ వరించింది తోలుబొమ్మలాటకు ఆదరణ కరువైన తరువాత ఆ కళాకారులంతా వివిధ ప్రాంతాల్లో స్థిరపడి వేర్వేరు వృత్తుల్లోకి మారిపోగా.. దళవాయి కడేరావు, వీరనారప్ప, అంజినప్ప అనే కళాకారులు మాత్రం ఇదే వృత్తిని కొనసాగిస్తూ నిమ్మలకుంట గ్రామంలో స్థిరపడ్డారు. వీరి వారసులే గ్రామంలో తోలుబొమ్మలకు జీవం పోస్తున్నారు.వీరితో పాటు ఇతర కులాల వారు కూడా తోలుబొమ్మల తయారీ నేర్చుకుని.. ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. తోలుబొమ్మల ప్రదర్శనకు విశేష గుర్తింపు తె చ్చినందుకు గాను గ్రామానికి చెందిన దళవాయి చలపతిరావును 2020వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా చలపతిరావు అవార్డు అందుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన శివమ్మ అనే కళాకారిణి ‘శిల్పగురు’ అవార్డుకు ఎంపికైంది. షిండేరావు, శ్రీరాములు వంటి కళాకారులు సైతం అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. -
Nori Ratnamala: బొమ్మలకు జీవం పోసే టీచరమ్మ
ఆమె ఊహల్లో కథ అల్లుకుపోతే అవి బొమ్మలై మన ముందు కదలాడతాయి. చూసే పిల్లల మొహాల్లో ఆశ్చర్యానందాలను పెద్దల మెదళ్లలో ఆలోచనలను కొత్తగా వికసింపజేస్తాయి. ముప్పైఏళ్లుగా పప్పెట్రీతో స్నేహం చేస్తూ ‘మా బొమ్మల టీచర్’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే పేరు నోరి రత్నమాల. హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలనీలో ఉంటున్న ఈ విశ్రాంత టీచరమ్మను కలిస్తే ఎన్నో అందమైన కథల మాలను మన ముందుంచుతారు. ‘విష్ణుశర్మ అడవి గుండా ప్రయాణిస్తుంటాడు. దారిలో బావిలోనుంచి మమ్మల్ని కాపాడండీ.. అని కేకలు విని అక్కడకు వెళ్లి లోపలకు చూస్తాడు. అందులో ఒక పులి, కోతి, పాముతో పాటు మనిషి ఉంటాడు. వారందరినీ కాపాడే సమయంలో ‘మనిషిని మాత్రం కాపాడవద్దు’ అని చెబుతాయి మిగతా జంతువులు...’ అంటూ మనిషిలో ఉండే స్వార్థం ప్రాణాపాయం ఎలా కలిగిస్తుందో చెబుతూనే నేటి సాయంత్రం హైదరాబాద్‌లో ప్రదర్శించబోతున్న కథనాన్ని, అందుకోసం చేసుకున్న ఏర్పాట్ల గురించి చెబుతూనే తనలో ఈ కళ పట్ల ఆసక్తి కలగడానికి దారి తీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు ఈ టీచరమ్మ. ‘‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫైన్ ఆర్ట్స్ టీచర్‌గా వర్క్ చేశాను. పిల్లలకు ఆసక్తి గొలిపేలా సృజనాత్మకతను పరిచయం చేసే ఆ సబ్జెక్ట్ నాకెంతగానో రచ్చింది, ఎప్పటికప్పుడు నన్ను నేను కొత్తగా సిద్ధం చేసుకోవడం ఎలా అని ఆలోచించినప్పుడు చిన్నప్పుడు నేను నేర్చుకున్న పప్పెట్రీ గురించి గుర్తొచ్చింది, నా చిన్నతనంలో మా నాయనమ్మ నన్ను తోలుబొమ్మలాటకు తీసుకెళ్లేది. అందులో రామాయణ భారత కథలను తెల్లవార్లూ ప్రదర్శించేవారు. బాల్యంలో నా మనసులో నాటుకుపోయిన ఆ కళ ఆ తర్వాత నాకు విద్యార్థులకు పరిచయం చేయడానికి తోడ్పడింది. స్కూల్ నుంచి మొదలు సంప్రదాయ తోలుబొమ్మల తయారీ అంటే అంత సులువు కాదు. అందుకని కాగితం, క్లాత్, ఇతర వేస్ట్ మెటీరియల్‌ను ఉపయోగించి పప్పెట్రీ బొమ్మలు తయారుచేసేదాన్ని. వాటిద్వారా పిల్లలకు పంచతంత్ర వంటి ఎన్నో కథలు చెప్పేదాన్ని. పిల్లలు కూడా ఈ బొమ్మల ద్వారా తమ ఆసక్తులను కనబరిచేవారు. అక్కడ నుంచి ఇతర టీచర్లకు శిక్షణ, రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. దూరదర్శన్లోనూ బాలల వికాసానికి పప్పెట్రీతో కార్యక్రమాలు చేశాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో సామాజిక అవగాహన కలిగించే అంశాలెన్నో కథలుగా రూపొందించి, ప్రదర్శించాను. కదిలించే కథనాలు.. స్వాతంత్య్రానికి ముందు మనకున్న అవగాహన కార్యక్రమాలలో ప్రధానమైనది తోలుబొమ్మలాటనే. ఇది దేశవ్యాప్త కళ. బొమ్మలను తెరముందు కదిలిస్తూ, దీపం వెలుతురు సాయంతో ప్రదర్శన ఉండేది. సంప్రదాయ బొమ్మల తయారీ ఇప్పుడు కొంచెం కష్టమే. ఇక ప్రదర్శన ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అలాగని నేర్చుకున్న కళను మన దగ్గరే ఉంచలేం. పదిమందికి తెలిసినప్పుడే ఆ కళ బతుకుతుంది. సామాజిక అవగాహనకు నా భాగస్వామ్యమూ ఉండాలి. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చాయి. సంగీత నాటక అకాడమీ నుంచి ఇన్నేళ్లలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. విదేశాలలోనూ పప్పెట్రీ ప్రదర్శన చేయడం, అభినందనలు, అవార్డులు, మరచిపోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టీమ్ వర్క్ విజయం బొమ్మల తయారీ, బొమ్మలు కదల్చడానికి, మంచి కథనానికి, పాటలకు, నేపథ్య సంగీతానికి.. ఇలా ఇదంతా టీమ్ వర్క్‌తో కూడుకున్నది. ఇందుకోసం మావారితోపాటు పిల్లలనూ ఆ తర్వాత వారి పిల్లలనూ ఈ పనిలో భాగస్థులను చేశాను. దీనివల్ల వారి లోపల ఉన్న వారికే తెలియని కళ బయటకు వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఉన్న మా పిల్లలు కూడా కథనానికి తగ్గ వాయిస్ డబ్బింగ్‌ను క్లిప్పింగ్స్ ద్వారా నాకు పంపిస్తుంటారు. ఇందులో నా కుటుంబ సభ్యులే కాదు స్నేహితులు, కొందరు స్వచ్ఛందంగానూ మేం చేసే పనిలో భాగమవుతుంటారు. ఈ కళ బతికుంది అనడానికి ఇంతకుమించి నిదర్శనాన్ని చూపలేం. డిజిటల్ మీడియాలోనూ.. కరోనా సమయంలో నోరి ఆర్ట్ అండ్ పప్పెట్రీ పేరుతో యూ ట్యూబ్‌లో ఛానెల్ స్టార్ట్ చేశాను. పిల్లల కోసం పప్పెట్రీ ద్వారా కొన్ని వందల కథలను పరిచయం చేశాను. అవన్నీ ఒక్కదాన్నే చేశాను. పెద్దవాళ్లూ ఆస్వాదించారు. ఎంతోమంది అభినందనలు తెలియజేశారు. ఏ దేశానికి లేనన్ని సంప్రదాయ కళలు మన దగ్గర ఉన్నాయి. వాటికి పునరుజ్జీవం కలగాలంటే ప్రభుత్వాలు, సంస్థలు, ఆసక్తి కలవారు ముందుకు రావాలి. పిల్లల్లో ఈ కళలను బతికిస్తే చాలు– ముందు తరాలకు అవి వారసత్వంగా ప్రయాణిస్తాయి. ఏ దేశంలో ఉన్నా మన ప్రత్యేకతను ఈ కళలే చాటుతాయి. అందుకే ప్రాచీన కళలకు ప్రోత్సాహమిద్దాం’’ అని వివరించారు ఈ పప్పెట్రీ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి -
కుక్కపిల్లలకు బారసాల
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన సూదగోని భూమాగౌడ్ నివాసంలో బుధవారం నిర్వహించారు. తన పెంపుడు కుక్క తొమ్మిది రోజుల క్రితం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. కుటుంబంలో ఒకరిగా మారిన పెంపుడు కుక్కకు పిల్లలు జన్మించడంతో బారసాల చేస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కుక్కను మల్లన్నదేవునిగా భావించి పూజలు చేయడం ద్వారా ఇంట్లో మంచి జరుగుతుందని అన్నారు. అనంతరం కుక్కకు పూలమాలలు వేసి, బొట్లుపెట్టి పూజలు చేయడంతోపాటు కాలనీవాసులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. -
'సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి తొత్తులు'
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే సోనియా గాంధీ విభజిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కేంద్ర మంత్రులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైన కేంద్రమంత్రులు వెంటనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.