gummaghatta
-
వెదురు సాగుకు ఎదురు లేదు
చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో వెలుగులు నింపే సామర్థ్యమున్న ఆకుపచ్చని బంగారం అది. సారవంతం లేని భూమైనా పర్వాలేదు.. గ్యారంటీగా పంట పండుతుంది. రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది. రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పంటగా గుర్తింపు పొందిన ఆ పంటే వెదురు సాగు. గ్రామీణ పేదలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే వనరు కూడా వెదురే కావడం గమనార్హం. వెదురు వినియోగం పెరిగే కొద్ది మార్కెట్లో దాని విలువ బంగారంతో సమానంగా ఎగబాకుతోంది. అందుకే దీనిని ‘గ్రీన్ గోల్డ్’ (ఆకుపచ్చని బంగారం)గా ముద్దుగా పిలుస్తుంటారు. స్వల్ప పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయం పొందే ఈ పంటపై ఓ చిరుద్యోగి దృష్టి సారించి సఫలీకృతుడయ్యారు. సాగు ఆరంభంలో అందరూ నవ్వుకున్నా... పట్టువీడని విక్రమార్కుడిలా సత్ఫలితాలు సాధించారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. రాయదుర్గం: అనంతపురం జిల్లాలో వెదురు సాగు (Bamboo Cultivation) రైతు అంటూనే ఠక్కున గుర్తొచ్చేది గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన పాటిల్ వంశీకృష్ణారెడ్డి. జిల్లాలో తొలిసారి వెదురు సాగుకు శ్రీకారం చుట్టి అటు ఉద్యానశాఖ అధికారుల్లో, ఇటు అన్నదాతల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన బళ్లారిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగిగా స్థిరపడ్డారు. కరోనా (Carona) కారణంగా ఉద్యోగం వీడి వ్యవసాయంపై దృష్టి సారించారు. అందరిలా వరి, మొక్కజొన్న, రాగి, సజ్జ, పత్తి (Cotton) లాంటి పంటలు కాకుండా వినూత్న ఆలోచనతో 10 ఎకరాల్లో వెదురు సాగు చేపట్టారు. ఎకరాకు రూ.50 వేలు చొప్పన రూ.5 లక్షలు పెట్టుబడి అయింది. మూడేళ్ల పాటు పంటను కాపాడుతూ వచ్చారు. ఇది చూసిన చాలా మంది హేళనగా మాట్లాడారు. అయినా ఆయన వెనుదిరిగి చూడలేదు. మూడేళ్ల తర్వాత కోతలు.. వంశీకృష్ణారెడ్డి సాగు చేసిన వెదురు పంట మూడేళ్ల తర్వాత ప్రస్తుతం కోతకు వచ్చింది. ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో టన్ను వెదురు ధర రూ.6 వేలు పలుకుతోంది. నాణ్యమైన వెదురు కావడంతో వంశీకృష్ణారెడ్డి పొలం వద్దకే కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ధర పెంచేందుకు కూడా వెనుకాడడం లేదు. సరాసరి ఎకరాకు 20 టన్నులతో పదెకరాలకు 200 టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. టన్ను రూ.6 వేలతో లెక్కించినా రూ.12 లక్షల ఆదాయం ఇంటి వద్దకే సమకూరింది. వచ్చే ఏడాది 25 నుంచి 30 టన్నులు, ఐదో ఏడాది 45 నుంచి 50 టన్నులకుపైగా దిగుబడి వస్తుందని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి పంట కోతలు చేపడితే.. ఆ తర్వాత కేవలం నీటి తడులతోనే పంట ఏపుగా పెరుగుతుందని పేర్కొటున్నారు. పైగా కోత దశకు వచ్చిన వెదురు పంటలో వ్యర్థమన్నదే ఉండదంటున్నారు. చిన్న పరిమాణంలో ఉన్న వెదురు కర్రలకు సంబంధించి టన్ను రూ.5వేలకు పైగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వీటిని టమాట, ఇతర పంటల సాగులో ఊతకర్రలుగా వినియోగిస్తుంటారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి.. సాగుకు యోగ్యంగా లేని భూములైన సరే నీటి వసతి ఉంటే వెదురు సాగుకు అనుకూలం. వెదురు సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందజేస్తాం. ఎకరం పది సెంట్లలో నర్సరీ ఏర్పాటు చేసుకుంటే రూ.10 లక్షలు ఇస్తాం. వెదురు మొక్కలు రాయితీతో అందించడంతో పాటు ప్రధాన పంటగా సాగు చేస్తే హెక్టారుకు రూ.50 వేలు చెల్లిస్తాం. – నరసింహరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, అనంతపురం -
వలస వెళ్లి.. విగతజీవిగా మారి
రైతును కబళించిన రోడ్డుప్రమాదం గుమ్మఘట్ట : వ్యవసాయం కలిసి రాకపోవడంతో కూలీగా మారి పొరుగు రాష్ట్రానికి వెళ్లిన రైతును రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం రోడ్డునపడింది. కర్ణాటకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన రైతు బలిజ నాగరాజు (46) దుర్మరణం చెందాడు. తన కళ్లెదుటే తండ్రి మరణించడంతో తనయుడు విలపించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. వివరాలిలా ఉన్నాయి. నాగరాజు, రుద్రమ్మ దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయబోరుబావిలో నీరు అడుగంటిపోయింది. వర్షాధారంపై సాగు చేసిన వేరుశనగ కూడా దెబ్బతింది. దీంతో ఈసారి పొలాన్ని బీడు పెట్టాడు. ఇటీవలే రూ.2లక్షల వరకు అప్పు చేసి కూతురి వివాహం చేశాడు. ఈ క్రమంలో అప్పులు చెల్లించాలంటూ ఒత్తిళ్లు పెరిగాయి. స్వగ్రామంలో చేయడానికి పనులు లేక.. కుటుంబ పోషణభారంగా మారడంతో ఇంటర్ చదువుతున్న కుమారుడు నరేష్‌ను వెంటబెట్టుకుని నాగరాజు ఆదివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం ఉడిపి ప్రాంతానికి వలస వెళ్లాడు. సోమవారం ఉదయం పనికోసం వెళుతూ రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే తండ్రి మృతిని జీర్ణించుకోలేని కుమారుడు బోరున విలపిస్తూ తల్లికి సమాచారం చేరవేశాడు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపాడు. ఈ పేద కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. దేవుడా.. ఎంత పనిచేశావయ్యా..! ‘అయ్యో.. దేవుడా ఎంతపనిచేశావయ్యా.. పేదరికమే తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందికదయ్యా. నెలరోజుల్లో తిరిగి వస్తా.. ఇంటి వద్ద బాగాచూసుకోమంటివి కదయ్యా.. శ్యాశ్వతంగా తిరిగిరాని లోకానికి వెళ్లిపోతివా’ అంటూ నాగరాజు భార్య రుద్రమ్మ కన్నీటి పర్యంతమైంది. -
అంగరంగ వైభవం.. వీరభద్రస్వామి రథోత్సవం
గుమ్మఘట్ట మండలం తాళ్లకెరలో బుధవారం అశేష భక్తజనం నడుమ వీరభద్రస్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు పీఠాధిపతులు, వేదపండితుల ఆధ్వర్యంలో వేకువ జామునే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రాష్ట్ర వీరశైవ సంఘం అధ్యక్షులు, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గ్రామస్తులతో కలసి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేవణ సిద్ధేశ్వర ట్రస్ట్ సభ్యులు అన్నదానం తో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించారు -
బుల్లితెర నటి ప్రీతినిగమ్ సందడి
గుమ్మఘట్ట : బుల్లితెర నటి ప్రీతినిగమ్ సోమవారం మండలంలో సందడి చేశారు. గోపీవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఒక్క క్షణం’ షార్ట్‌ఫిలింలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. సోమవారం గుమ్మఘట్ట పీహెచ్సీ వద్ద ప్రీతినిగమ్పై సన్నివేశాలు చిత్రీకరించారు. షూటింగ్ అనంతరం ఆమె 75 వీరాపురం కొండలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బుల్లితెర నటిని చూసేందుకు మహిళా ప్రేఓకులు ఎగబడ్డారు. ప్రీతినిగమ్ మాట్లాడుతూ డైరెక్టర్‌తోపాటు పలువురు తనను సంప్రదించడంతో సమాజ హితం కోసం తీస్తున్న ఈ షార్ట్‌ఫిలింలో తాను నటించేందుకు ఒప్పుకున్నానన్నారు. -
కురుబలు రాజకీయంగా ఎదగాలి
ఎస్టీ జాబితాలో చేర్చి ఆదుకోవాలి కురుబ కార్పొరేషన్ ప్రకటించాలి విగ్రహావిష్కరణ సభలో నేతల పిలుపు గుమ్మఘట్ట : బలహీన వర్గాల్లో ఒకటైన కురుబలు రాజకీయంగా ఎదగాలని నాయకులు పిలుపునిచ్చారు. మండల కేంద్రం గుమ్మఘట్టలో కురుబల ఆరాధ్యదైవం భక్త కనకదాస విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ఈశ్వరానంద స్వామీజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. విశిష్ట అతిథిగా ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, అతిథులుగా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్, హైకోర్టు జడ్జి సిద్దప్ప, కురుబ సంఘం రీజనల్ అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు, గుమ్మఘట్ట అధ్యక్షులు రామాంజనేయులు, విగ్రహదాతలు కేఎన్ సక్రప్ప, శివలింగప్ప, రామలింగప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ గిరిమల్లప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భక్త కనకదాస విగ్రహాన్ని గ్రామగ్రామానా నెలకొల్పి, కురుబల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. మిగతా కులాల తరహాలోనే కురుబలకూ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ కనకదాస జయంతిని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. కురుబలందరూ కనకదాస అడుగుజాడల్లో నడవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వి.మారెక్క, భారత్‌గ్యాస్ ఏజెన్సీ కృష్ణమీనన్, పీఈటీ శివశరణ, మాజీ సర్పంచ్ చిత్రశేఖరప్ప, భీమప్ప, శివలింగప్ప, సాంబామూర్తి, రిటైర్డ్ ఏడీ వన్నూరప్ప, ఐకేపీ సీసీ గంగాధర ఎమ్మాఆర్ఎఫ్ హనుమంతు, నాగిరెడ్డిపల్లి రామాంజినేయులు తో పాటు వివిధ గ్రామాల కురుబ కులస్తులు పాల్గొన్నారు.