వలస వెళ్లి.. విగతజీవిగా మారి
- రైతును కబళించిన రోడ్డుప్రమాదం
గుమ్మఘట్ట : వ్యవసాయం కలిసి రాకపోవడంతో కూలీగా మారి పొరుగు రాష్ట్రానికి వెళ్లిన రైతును రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం రోడ్డునపడింది. కర్ణాటకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన రైతు బలిజ నాగరాజు (46) దుర్మరణం చెందాడు. తన కళ్లెదుటే తండ్రి మరణించడంతో తనయుడు విలపించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. వివరాలిలా ఉన్నాయి. నాగరాజు, రుద్రమ్మ దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయబోరుబావిలో నీరు అడుగంటిపోయింది. వర్షాధారంపై సాగు చేసిన వేరుశనగ కూడా దెబ్బతింది. దీంతో ఈసారి పొలాన్ని బీడు పెట్టాడు. ఇటీవలే రూ.2లక్షల వరకు అప్పు చేసి కూతురి వివాహం చేశాడు. ఈ క్రమంలో అప్పులు చెల్లించాలంటూ ఒత్తిళ్లు పెరిగాయి. స్వగ్రామంలో చేయడానికి పనులు లేక.. కుటుంబ పోషణభారంగా మారడంతో ఇంటర్ చదువుతున్న కుమారుడు నరేష్‌ను వెంటబెట్టుకుని నాగరాజు ఆదివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం ఉడిపి ప్రాంతానికి వలస వెళ్లాడు. సోమవారం ఉదయం పనికోసం వెళుతూ రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లెదుటే తండ్రి మృతిని జీర్ణించుకోలేని కుమారుడు బోరున విలపిస్తూ తల్లికి సమాచారం చేరవేశాడు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపాడు. ఈ పేద కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు.
దేవుడా.. ఎంత పనిచేశావయ్యా..!
‘అయ్యో.. దేవుడా ఎంతపనిచేశావయ్యా.. పేదరికమే తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందికదయ్యా. నెలరోజుల్లో తిరిగి వస్తా.. ఇంటి వద్ద బాగాచూసుకోమంటివి కదయ్యా.. శ్యాశ్వతంగా తిరిగిరాని లోకానికి వెళ్లిపోతివా’ అంటూ నాగరాజు భార్య రుద్రమ్మ కన్నీటి పర్యంతమైంది.