కురుబలు రాజకీయంగా ఎదగాలి
ఎస్టీ జాబితాలో చేర్చి ఆదుకోవాలి
కురుబ కార్పొరేషన్ ప్రకటించాలి
విగ్రహావిష్కరణ సభలో నేతల పిలుపు
గుమ్మఘట్ట : బలహీన వర్గాల్లో ఒకటైన కురుబలు రాజకీయంగా ఎదగాలని నాయకులు పిలుపునిచ్చారు. మండల కేంద్రం గుమ్మఘట్టలో కురుబల ఆరాధ్యదైవం భక్త కనకదాస విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ఈశ్వరానంద స్వామీజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. విశిష్ట అతిథిగా ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, అతిథులుగా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్, హైకోర్టు జడ్జి సిద్దప్ప, కురుబ సంఘం రీజనల్ అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు, గుమ్మఘట్ట అధ్యక్షులు రామాంజనేయులు, విగ్రహదాతలు కేఎన్ సక్రప్ప, శివలింగప్ప, రామలింగప్ప హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీపీ గిరిమల్లప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భక్త కనకదాస విగ్రహాన్ని గ్రామగ్రామానా నెలకొల్పి, కురుబల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. మిగతా కులాల తరహాలోనే కురుబలకూ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ కనకదాస జయంతిని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని కోరారు.
కురుబలందరూ కనకదాస అడుగుజాడల్లో నడవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వి.మారెక్క, భారత్‌గ్యాస్ ఏజెన్సీ కృష్ణమీనన్, పీఈటీ శివశరణ, మాజీ సర్పంచ్ చిత్రశేఖరప్ప, భీమప్ప, శివలింగప్ప, సాంబామూర్తి, రిటైర్డ్ ఏడీ వన్నూరప్ప, ఐకేపీ సీసీ గంగాధర ఎమ్మాఆర్‌ఎఫ్ హనుమంతు, నాగిరెడ్డిపల్లి రామాంజినేయులు తో పాటు వివిధ గ్రామాల కురుబ కులస్తులు పాల్గొన్నారు.