క్విట్‌ ఇండియాకు ఊపిరులూదిన రేడియో | Nagasuri Venugopal Article On Indian Broadcasting Day 23rd July | Sakshi
Sakshi News home page

క్విట్‌ ఇండియాకు ఊపిరులూదిన రేడియో

Published Tue, Jul 23 2019 1:19 AM | Last Updated on Tue, Jul 23 2019 1:20 AM

Nagasuri Venugopal Article On Indian Broadcasting Day 23rd July - Sakshi

బ్రిటిష్‌ వారితో గానీ, వారి ప్రభుత్వంతో గానీ ఎటువంటి వ్యవహారం పెట్టుకోవద్దు. వారికి మీరిచ్చే ధనంగానీ, లేదా మీకు వారిచ్చే ధనంగానీ మన సోదర భారతీయుల రక్తంతో తడిసింది. ప్రతి ఇంటి మీదా, కిటికీ మీద మువ్వన్నెల జెండా ఎగురవేయండి. కోర్టులకెళ్ళడం పాపంగా పరిగణించాలి. విదేశీ వస్తువులు కొనవద్దు. ప్రభుత్వ బ్యాంకుల నుండి మీ ధనం తీసేయండి. న్యాయం లేని ప్రభుత్వానికి సేవలందించే అధికారులను బాయ్‌కాట్‌ చెయ్యండి. రైతు పండించే ధాన్యం మొదలైనవి అతని దగ్గరే ఉండనివ్వండి.

ఇలాంటి పది విధులను ప్రతి భారతీయుడు తప్పకుండా నిర్వహించాలని 1942 అక్టోబరు 29వ తేదీన రహస్య ఆకాశవాణి కాంగ్రెస్‌ రేడియో హిందూస్తానీలో ఉద్బోధించింది. అవి క్విట్‌ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. అంతేకాదు, అవి రెండో ప్రపంచ యుద్ధం రోజులు కూడా. బ్రిటిష్‌ ప్రభుత్వం నడిపే ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్లు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, లక్నో, మద్రాసు, తిరుచ్చురాపల్లిలు మాత్రమే ఉన్నాయి. ఇవేకాక తిరువాంకూరు, మైసూరు, హైదరాబాదు, ఔరంగాబాదు సంస్థానాలు నడిపే రేడియో కేంద్రాలున్నాయి. అయితే ఇవేవీ ప్రజల స్పందననుగానీ, స్వాతంత్య్ర ఉద్యమం వార్తలు కానీ ఇవ్వడం లేదు. వార్తాపత్రికలు సెన్సార్‌ కాకుండా అచ్చు కావడంలేదు. దాంతో భాగ్యనగర్‌ రేడియో వంటి రహస్య రేడియో కేంద్రాలు కీలకపాత్ర పోషించాయి. 

1942 ఆగస్టు 27 నుంచి నవంబరు 12 వరకు 78 రోజులపాటు రామమనోహర్‌ లోహియా పర్యవేక్షణలో కాంగ్రెస్‌ రేడియో గొప్పగా సాగింది. మనదేశంలో 1927 జూలై 23న వ్యవస్థీకృతమైన రేడియో ప్రసారాలు మొదలయ్యాయనే కారణంతో ఆరోజును భారత ప్రసార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విలువైన ప్రసారాలు చేసి గొప్ప చరిత్ర సృష్టించిన ఈ ఆజాద్‌ రేడియో గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వం కన్నుగప్పడానికి కొన్నిరోజులకొకసారి ప్రసార ఫ్రీక్వెన్సీతోపాటు ట్రాన్స్‌మీటర్‌ స్థానం ఆరేడుచోట్లకు మార్చారు. విఠల్‌దాస్‌ కాకర్, ఉషా మెహతా, విఠల్‌దాస్‌ జవేరి, నానక్‌ మెత్వానివంటి మెరికల్లాంటి నలుగురు యువతీయువకులతో ఈ ప్రసారాలలో తోడ్పడ్డారు.

ఇంటెలిజెన్స్‌ సీక్రెట్‌ ఫైల్స్‌ ఆధారంగా ఈ కాంగ్రెస్‌ రేడియో లేదా ఆజాద్‌ రేడియో గురించి మరిన్ని విషయాలు ఇటీవలే బయల్పడ్డాయి. రోజుకు ఒకసారి ఇంగ్లిష్‌లో, మరోసారి హిందూస్తానీలో అంటే రెండుసార్లు, ప్రతిసారి సుమారు అరగంటపాటు ప్రసారాలు చేసిన ఈ రేడియో ఎటువంటి విషయాలు ఇచ్చిందనే అంశంపై అధ్యయనం ప్రారంభించినపుడు ఈ వ్యాసం మొదట్లో పేర్కొన్న విషయాలు తారసపడ్డాయి. ఈ సమాచారంతో 2018లో ‘అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ బ్రాడ్‌కాస్ట్‌ డూరింగ్‌ క్విట్‌ఇండియా మూమెంట్‌’ అనే పుస్తకం వెలువడింది. ఈ 78 రోజుల ప్రసారాలు హిందూస్తాన్‌ హమారా అనే పాటతో మొదలై వందేమాతరం పాటతో ముగిసేవి. వార్తలు, వార్తా సమీక్షలు, గాంధీ, వల్లభ్‌భాయ్‌ పటేల్, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వంటి నాయకుల ప్రసంగాలు, భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం ప్రత్యేకత, డూ అండ్‌ డై కార్యాచరణ వెనుక ఉండే తాత్విక నేపథ్యం, వర్తమాన విషయాలపై ప్రశ్నోత్తరాలు– ఇలా చాలా ప్రయోజనకరంగా ఆ రేడియో కార్యక్రమాలు ఉండేవి. 

భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం చాలా ప్రత్యేకమైందని 1942 అక్టోబరు 21న చేసిన ప్రసారంలో కనబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గత 200 ఏళ్లలో జరిగిన విప్లవాలలో పోల్చి ఒక భారత్‌లోనే పేదలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నట్లు విశదం చేశారు. రష్యన్‌ విప్లవంలో కేవలం ఒక శాతం జనాభా పాల్గొనగా, ఫ్రెంచి విప్లవంలో సైతం కొందరే పాలుపంచుకున్నారు. వీరందరూ ధనికులే కానీ పేదలు కాదు. సాంప్రదాయకంగా విప్లవాల పంథాలో పోకుండా, ఆయుధాలు లేని పేదవారు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక ప్రత్యేకత. భారత్‌లో అనాదిగా ఉండే శాంతి భావన, నిరాయుధీకరణ, గాంధీ అహింసా ప్రబోధం కలగలిసి భారత స్వాతంత్య్రోద్యమాన్ని ప్రపంచంలోనే సరికొత్తగా రూపొందించాయి. ఇటువంటి కారణాలతో భారత స్వాతంత్య్రోద్యమం విశేషమైంది, విలక్షణమైంది. జాతికవసరమైన ఎన్నో ప్రబోధాలు రామ్‌మనోహర్‌ లోహియా సారథ్యంలో ఆనాటి ఆజాద్‌ రేడియో దేశానికందించింది. ఈ రేడియో సాగింది 78 రోజు లైనా ప్రసారం చేసిన సమాచారం, మార్గదర్శకత్వం మాత్రం విలువైనవి.

 
డా.నాగసూరి వేణుగోపాల్‌ 
వ్యాసకర్త వర్తమానాంశాల పరిశోధకులు, పత్రికా రచయిత, మొబైల్‌ : 94407 32392

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement