ప్రతీకాత్మక చిత్రం
యువర్ అటెన్షన్ ప్లీజ్ ‘మీ స్నేహితులకు, బంధువులకు కానుకలు పంపించాలనుకుంటున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి.. మా సంస్థ నుంచి ఒక వ్యక్తి, చక్కని ప్యాకింగ్‌తో, చిరునవ్వు ఉన్న ముఖంతో వారి ఇంటికి వెళ్లి తలుపు కొట్టి, వారి చేతిలో మీ కానుకను ఉంచుతారు. ఆ కానుక అందుకున్నప్పటి వారి సంతోషాన్ని మేము ఫొటో రూపంలో మీకు పంపిస్తాము కూడా!’ ఈ తరహా ప్రకటనలు ఇదివరకు విదేశాలలో ఉండేవి. వస్తు వినిమయం పెరిగిన తరువాత ఇలాంటి ప్రకటనలు అన్నిచోట్ల చూస్తూనే ఉన్నాం. మరి కరోనా వైరస్‌కు కూడా ఇలాంటి ఒక ఆకర్షణీయమైన ‘ప్యాకేజీ’ ఉందండోయ్! అవే... తుంపరలు. నవ్వకండి మరీ! ఆ తుంపరల కహానీ ఏమిటో, కాస్త శాస్త్రీయంగా తెలుసుకుందామా?
నాన్జింగ్ నార్మల్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్లు గ్జియావోజియాంగ్సీ, యుగువో లీ లీ లియు 2009 డిసెంబర్‌లో జరిపిన పరిశోధన ఫలితాల వ్యాసం ప్రకారం.. మనం 1 నుంచి 100 వరకు అంకెలు లెక్క పెట్టినప్పుడు సుమారుగా 108 తుంపరలు తయారౌతాయి. 20 సార్లు దగ్గినప్పుడు సుమారుగా అదే సంఖ్యలో తుంపరలు బయటకు వస్తాయి. ఇందులో 10 సెంటీమీటర్ల దూరంలో 57.4%, 20 సెంటీమీటర్ల దూరంలో 27.4%, 30 సెంటీమీటర్ల దూరంలో 90% తుంపరలు ఉన్నాయి. ఇక దగ్గినప్పుడైతే 90 శాతం తుంపరలు 30 సెంటీమీటర్ల దూరం వరకూ పడ్డాయట.
ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని ఇచ్చినప్పుడు, పరిశీలిస్తే.. మాట్లాడినప్పుడు 100 కన్నా ఎక్కువ, దగ్గినపుడు 800 కన్నా ఎక్కువ తుంపరలు పడ్డాయి. మాస్కు ధరించి మాట్లాడితే, 18.7 మిల్లీగ్రాముల నీరు చేరుకుంది. ప్లాస్టిక్ బ్యాగు, టిష్యూ పేపర్ వాడితే 79.4 మిల్లీగ్రాముల నీరు పేరుకుంది. సర్జికల్ మాస్క్ వేసుకున్నప్పుడు 20 సార్లు దగ్గితే ఆ మాస్క్ మీద 22.9 మిల్లీ గ్రాముల నీరు చేరుకుంది.ప్లాస్టిక్ బ్యాగ్ టిష్యూ పేపర్ వాడినపుడు 85 మిల్లీగ్రాములు పేరుకుపోయింది.
సార్స్ వ్యాధి వచ్చినప్పుడు, 2007లో టోక్యో యూనివర్సిటీ, నేషనల్ తైవాన్ యూనివర్సిటీ, తైపీ, తైవాన్ చైనాలో తుంపరల పరిమాణం గురించి కూడా పరిశోధనలు చేశారు. దీని ప్రకారంగా మాట్లాడినప్పుడు తుంపరల సైజు 0.58–5.42 మైక్రో మీటర్లు. దగ్గినప్పుడు తుంపరల సైజు 0.62– 15.9 మైక్రోమీటర్లు. పి 100 ఫిల్టర్ మాస్క్ వాడడం వల్ల తుంపరల శాతం బాగా తగ్గింది.వివిధ వయసులలో, ఆడ, మగ వలంటీర్ల యావరేజ్ తుంపరల సంఖ్య, పరిమాణం చూస్తే వయో, లింగ భేదాల వలన పెద్దగా మార్పు కనబడలేదు. గాలిలో తుంపరల రూపంలో వ్యాప్తి చెందే అంటు వ్యాధులు చాలానే ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి మంప్స్, ఫ్లూ, ఎంటెరో వైరస్ వాంతులు, విరోచనాలు కలుగచేసేవి. క్షయ వ్యాధి, సార్స్, మెర్స్, కరోనా మొదలైనవి.
పెద్ద సైజు తుంపరలు వ్యాధి ఉన్న మనిషికి దగ్గరలోనే ఆగిపోతాయి. కానీ చిన్న సైజు ఉన్న తుంపరలు అయితే ఇంకాస్త ఎక్కువ సేపు ఎక్కువ దూరంలో గాలిలో ప్రయాణిస్తాయి. వ్యాధి కలుగచేసే సూక్ష్మజీవి వైరస్ ఐనా బ్యాక్టీరియా అయినా, ఆ మనిషిలో జబ్బునైనా కలుగచేయవచ్చు లేదా, మనిషిని కెరియర్ (వాహకం)గా తయారు చేయవచ్చు. అంటే అతనిలో వ్యాధి లేదు, బయటకు అతడు రోగి కాదు. ఐనా తనలో సూక్ష్మజీవి ఉంది, కనుక అతడు ఎందరికో దీనిని సంక్రమింప చేయవచ్చు. గాలిలో ఉన్న ఈ తుంపరలు ముక్కు ద్వారా ఊపిరి తీసుకున్నప్పుడు, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి దగ్గు కలుగుతుంది. అందుకే దూరంగా ఉండాలి. ఆ తుంపరలను మింగినపుడు, అవి మన జీర్ణాశయంలోనికి వెళ్తాయి. జీర్ణాశయం నుంచి మలద్వారం ద్వారా బయటికి కూడా వస్తాయి. అందుకే పదేపదే చేతులు శుభ్రంగా కడుక్కోమని చెప్పడం.
పై పరిశోధనలు చెప్పే సత్యాలు.. 1. తుమ్ము, దగ్గు, మాట్లాడే సమయంలో తుంపరలు వస్తాయి. 2. తుంపరలు సైజు, సంఖ్య ఆహార పదార్థాలు నోటిలో ఉన్నపుడు పెరుగుతాయి. 3. రోగి కాని వారు, వాహకంగా వ్యాధిని వ్యాపించే అవకాశం ఉంది. 4. వైద్య ఆరోగ్య రంగంలో పనిచేసే వారు మాస్క్ వాడాలి. 5. మాస్క్ ఉన్నపుడు సైగలు చేయడం మంచిది. మాట్లాడుతూ ఉంటే తుంపరల సంఖ్య పెరుగుతుంది. 6. చేతులు మోచేతుల దాకా 2 నిమిషాల చొప్పున రోజూ కనీసం 5 సార్లు సబ్బుతో కడుక్కోవాలి. 7. గట్టిగా మాట్లాడకండి. 8. నోటిలో ఆహారం ఉండగా మాట్లాడరాదు. విస్తృతంగా వచ్చే జబ్బును మహమ్మారి లేక ప్రపంచ వ్యాప్త వ్యాధి అంటారు. ఆ వ్యాధి ఉధృతంగా ఉన్నపుడు మనిషి తలవంచక తప్పదు.
నాగసూరి వేణుగోపాల్ : 919440 732392
కాళ్ళకూరి శైలజ : 98854 01882
Comments
Please login to add a commentAdd a comment