Kadambini Ganguly
-
సమాజానికి ఎదురీదిన తొలి వైద్యురాలు
ఆధునిక భారతదేశంలో పాశ్చాత్య వైద్య శాస్త్రపు పట్టా పొంది, ప్రాక్టీస్ చేసి, విజయం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబినీ బోస్ గంగూలీ. వీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో మాట్లాడిన తొలి మహిళ కూడా! అమెరికన్ చరిత్రకారుడు డేవిడ్ కోఫ్ ప్రకారం... కాదంబినీ గంగూలీ చాలా ఆధునికంగా ఆలోచించిన, తొలి తరం బ్రహ్మ సమాజపు భారతీయ మహిళ. భారతదేశానికి సంబంధించి మహిళల తొలి సంస్థ ‘భాగల్పూర్ మహిళా సమితి’ని ప్రారంభించినవారిలో ఒకరైన బ్రజా కిషోర్ బసుకు కాదంబిని 1861 జూలై 18న జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో కాదంబిని ఢాకాలోని బ్రహ్మో ఈడెన్ ఫిమేల్ స్కూల్, అటు తర్వాత కలకత్తాలోని హిందూ మహిళా విద్యాలయలో చదువుకున్నారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1879లో విద్యార్థినులకు ప్రవేశం కల్పించగా, మరుసటి సంవత్సరం కలకత్తా విశ్వవిద్యాలయంలో మహిళా విద్యార్థులకు డిగ్రీ చదువుకు అవకాశం లభించింది. అలా భారతదేశంలో పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు కాదంబినీ గంగూలీ కాగా, మరొకరు చంద్రముఖీ బసు. డిగ్రీ చదువు పూర్తి అయ్యాక 1883 జూన్ నెలలో ద్వారకానాథ్ గంగూలీతో కాదంబిని వివాహమైంది. ద్వారకానాథ్ మనదేశంలో మహిళల కోసం తొలి పత్రిక ‘అబలా బంధోబ్’ను నిర్వహించిన అభ్యుదయవాది. బహుభార్యాత్వానికి, అంధ విశ్వాసాలకు, పరదా పద్ధతికి, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ద్వారకానాథ్ గంగూలీ తొలి భార్యను కోల్పోయిన తర్వాత, కాదంబినిని వివాహమాడారు. వారిద్దరి మధ్య 20 ఏళ్ల వయసు తేడా ఉంది. ద్వారకానాథ్ పోరాడిన తర్వాత కానీ కాదంబినికి కలకత్తా మెడికల్ కళాశాలలో ప్రవేశం లభించలేదు. దాంతో కాదంబినీ గంగూలీ భారతీయ విశ్వ విద్యాలయపు వైద్యవిద్యలో ప్రవేశించిన తొలి మహిళ అయ్యారు. విద్యాలయాల్లో మహిళల ప్రవేశం గురించి చాలామంది వ్యతిరేకిస్తూ కూడా పోరాడారు. అలాంటి వారిలో ఆ విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్ ఆర్సీ చంద్ర కూడా ఉన్నారు. కనుకనే కాదంబినీ గంగూలిని ప్రాక్టికల్ ఎగ్జామ్‌లో ఫెయిల్ చేయగా బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ పట్టా లభించలేదు. వివక్ష ఆ స్థాయిలో ఉండేది. నెలకు 20 రూపాయల చొప్పున ఉపకార వేతనం కాదంబినీ గంగూలికి జారీ చేసి, 1883 నుంచి ఒకేసారి పెద్ద మొత్తం ఇచ్చారు. దాంతో భర్త ప్రోత్సాహంతో 1892లో ఇంగ్లాండ్ వెళ్లి ఎడిన్‌బరో నుంచి ఎల్‌ఆర్‌సీ (లైసెన్షియేట్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్), గ్లాస్కో నుంచి ఎల్‌ఆర్‌సీ ఎస్ (లైసెన్షియేట్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్), ఇంకా డబ్లిన్ నుంచి జీఎఫ్పీఎస్ పట్టాలు పొందారు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత కలకత్తాలోని లేడీ డఫ్రిన్ హాస్పిటల్లో నెలకు 300 రూపాయల జీతంతో ప్రసూతి శాస్త్రం, గైనకాలజీ విభాగాలలో సేవలందించారు.డాక్టర్ వృత్తిలో బిజీగా ఉన్నా పిల్లలను శ్రద్ధగా పెంచారు. ఆమె కుమార్తె జ్యోతిర్మయి స్వాతంత్య్ర సమరయోధురాలు కాగా, కుమారుడు ప్రభాత్ చంద్ర జర్నలిస్టుగా తండ్రి నడిపిన ‘అబలా బంధోబ్’ పత్రికలో గొప్పగా రాణించారు. ఆమె సవతి కూతురు మనవడే ప్రఖ్యాత చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే! ఆగ్నేయాసియాలోనే యూరోపియన్ వైద్యశాస్త్రాన్ని అభ్యసించి, పట్టా పొంది, ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ కాదంబినీ గంగూలీ. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాదంబిని మహిళల హక్కులకు సంబంధించి విశేషంగా పోరాడారు కనుకనే ఆనాటి సమాజం నుంచి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ‘బంగభాషి’ అనే పత్రిక ‘కులట’ అంటూ ఆమెను పరోక్షంగా విమర్శించే దాకా వెళ్ళింది. అయితే భర్త ద్వారకానాథ్ పోరాడి ఆ పత్రికా సంపాదకుడు మహేష్ పాల్‌ను కోర్టుకీడ్చి ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించేలా విజయం సాధించారు. అరవై రెండేళ్ల వయసులో 1923 అక్టోబర్ 3వ తేదీన కన్నుమూసిన కాదంబినీ గంగూలీ నేటికీ భారతీయ మహిళా లోకానికే కాదు, అందరికీ ప్రాతఃస్మరణీయులు. కనుకనే ఇటీవల అంటే 2020లో ‘స్టార్ జల్సా’లో వచ్చిన ‘ప్రోతోమా కాదంబిని’ అనే బెంగాలీ టెలివిజన్ సీరియల్; జీ బంగ్లాలో ‘కాదంబిని’ అనే బెంగాలీ సిరీస్ చాలా ప్రజాదరణ పొందాయి.డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి విశ్రాంత అధికారి 9440732392 -
చైతన్య భారతి: వైద్య ఉద్యమకారిణి కాదంబిని గంగూలీ
కాదంబిని వైద్యురాలిగా అవతరించిన కాలాన్ని చూస్తే ఆమె విజయం ఎంత చరిత్రాత్మకమో అర్థం అవుతుంది. ఆమె పుట్టిన సంవత్సరం 1861. ఆ సంవత్సరమే భారతదేశంలో సతీ దురాచారాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ విక్టోరియా రాణి ప్రకటన జారీ చేశారు! 1803లో ఒక్క కలకత్తాలోనే కేవలం 30 మైళ్ల పరిధిలో 438 సతీసహగమనాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న నేల మీద పుట్టిన కాందబిని గైనకాలజిస్ట్ అయ్యారు. కానీ ఆ రోజుల్లో వైద్య విద్య చదివిన మహిళా డాక్టరు అన్నా మంత్రసాని కంటే ఎక్కువ విలువ ఇచ్చేది కాదు సమాజం. కాదంబిని గంగూలీ అసలు పేరు కాదంబిని బసు. భారతదేశం నుంచి పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు. ఆ రెండో మహిళ డెహ్రాడూన్ కు చెందిన చంద్రముఖి బసు. కాదంబిని వైద్యురాలిగా ఎంతో ప్రతిభను కనపరచడమే కాకుండా, భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో, మహిళల హక్కుల సాధన ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. కాదంబిని బిహార్‌లోని భాగల్పూరులో పుట్టారు. ఆమె కుటుంబం బ్రహ్మ సమాజ దీక్షను స్వీకరించింది. ఇండియాలో విద్యాభ్యాసం అయ్యాక 1892లో కాదంబిని లండన్ వెళ్లారు. విదేశాలలో వైద్య పట్టాపుచ్చుకుని వచ్చి, ఆ వృత్తి నిర్వహించిన తొలి ఆసియా మహిళగా కాదంబిని చరిత్ర ప్రసిద్ధురాలయ్యారు. నేపాల్ రాజమాతను దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యను పరిష్కరించడంతో ఉన్నత వర్గాలలో ఆమె పేరు మారుమోగిపోయింది. కాదంబిని ద్వారకానాథ్ గంగూలీని వివాహం చేసుకున్నారు. ఆయన కూడా బ్రహ్మ సమాజీకుడే. ఆయన ప్రోత్సాహంతోనే కాదంబిని విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేశారు. కాదంబిని గొప్ప వైద్యురాలు. గొప్ప సామాజిక కార్యకర్త. మేధావి. వీటితో పాటు గొప్ప తల్లి. ఆమె తన భర్త ముందు భార్యకు జన్మించిన ముగ్గురు పిల్లలతో పాటు, తామిద్దరికీ జన్మించిన మరో ఐదుగురు పిల్లలను కూడా పెంచారు. భర్తకు, ఆమెకు పదిహేడు సంవత్సరాల తేడా ఉంది.ఆమె పలు సామాజిక ఉద్యమాలతో పాటు కాంగ్రెస్ జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ సభలలో వేదిక మీద కనిపించిన తొలి మహిళ కూడా కాదంబినియే. ఆమె బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1908లో కలకత్తాలోనే మహిళా సమావేశం నిర్వహించారు. తూర్పు భారతంలో గనులలో పనిచేసే మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం గాంధీజీ స్థాపించిన ట్రాన్స్‌వాల్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1923లో మరణించే వరకు ఆమె వైద్య వృత్తిని వీడలేదు. -
భారత తొలి మహిళ డాక్టర్ ఎవరో తెలుసా...?
కోల్‌కతా: భారత తొలి మహిళ డాక్టర్ కాదంబిని గంగూలీ. ఆనాటి పురుషాధిక్య సమాజంలో గెలిచి, విజయవంతంగా డాక్టర్ విద్యను పూర్తి చేశారు. నేడు గంగూలీ పుట్టినరోజు. కాదంబిని గంగూలీ జూలై 18, 1861 జన్మించారు. కాదంబిని గంగూలీ 160 వ జయంతిని పురస్కరించుకొని గూగుల్ డూడల్ను విడుదల చేసింది. డూడుల్‌లో భాగంగా కోల్‌కతా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ప్రధాన భవనం చిత్రంతో పాటు గంగూలీ ఫోటో వచ్చేలా గూగుల్ డూడుల్‌ను రూపొందించింది. కాగా ఈ డూడుల్‌ను బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్ ఒడ్రిజా రూపొందించారు. రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు గంగూలీని దేశంలో మహిళల హక్కులకోసం పాటుపడిన వ్యక్తిగా కీర్తించారు. గంగూలీ ఆనాటి సమాజపు పోకడలను పట్టించుకోకుండా ముందుకు సాగింది. కాగా గంగూలీకి సమాజం నుంచి అనేక విమర్శలను ఎదుర్కొంది. ఎడిన్బగ్ నుంచి భారత్‌కి తిరిగి వచ్చి మహిళల హక్కుల కోసం ప్రచారం చేసింది. ఒకానొక సమయంలో బెంగాలీ పత్రిక ఆమెను పరోక్షంగా బంగాబాషిలో 'వేశ్య' అని పిలిచింది. ఆమె భర్త ద్వారకానాథ్ గంగూలీ ఈ కేసును కోర్టుకు తీసుకెళ్లి గెలిచారు, 6 నెలల జైలు శిక్షతో ఎడిటర్ మహేష్ పాల్‌కు శిక్షను విధించారు. -
ఆపరేషన్ కాదంబిని
‘భారత జాతీయ కాంగ్రెస్ సభా వేదిక మీద కనిపించిన తొలి భారతీయ మహిళ శ్రీమతి కాదంబిని గంగూలీ. తుది పలుకులు చెప్పవలసిందని కోరగానే ఆమె వేదిక ఎక్కి ప్రసంగించారు. స్వేచ్ఛాభారతం మహిళకు చేయూతనిస్తుందని చెప్పడానికి ఇదొక సంకేతం.’ అనిబీసెంట్ ‘హౌ ఇండియా రాట్ ఫర్ ఫ్రీడమ్’ అన్న పుస్తకంలో రాసిన మాటలు ఇవి. కాదంబిని గంగూలీ జీవితంలో ఇలాంటి ‘తొలి’ఘనతలు చాలా ఉన్నాయి. ఆమె భారతదేశ చరిత్రలో కనిపించే ఒక అద్భుత మహిళ. ఆమె సేవలను బట్టి ఫ్లారెన్స్ నైటింగేల్, అనిబీసెంట్లతో సమంగా కీర్తి పొందవలసిన విదుషీమణి వెంటనే అర్థమవుతుంది. కానీ భారతీయ చరిత్రకు ఏదో శాపం ఉంది. ఇలాంటి వారిని నిర్దాక్షణ్యంగా పట్టించుకోకుండా సాగింది. కాదంబిని వైద్యురాలిగా అవతరించిన కాలాన్ని చూస్తే తప్ప ఆమె విజయం ఎంత చరిత్రాత్మకమో అర్థం కాదు. ఆమె పుట్టిన సంవత్సరం 1861. ఆ సంవత్సరమే భారతదేశంలో సతీ దురాచారాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ విక్టోరియా రాణి ప్రకటన జారీ చేశారు. ఇంకాస్త వెనక్కి వెళితే దారుణమైన దృశ్యం కనిపిస్తుంది. 1803లో కలకత్తాలోనే కేవలం 30 మైళ్ల పరిధిలో 438 సతీసహగమనాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న నేల మీద పుట్టిన కాందబిని ఒక గైనకాలజిస్ట్‌గా అవతరించారు. బ్రహ్మ సమాజీకుల కుటుంబంలో పుట్టారామె. కానీ సనాతన హిందువులు సరే, మహిళను ఉద్ధరించడమే ఉద్యమ ధ్యేయమని చెప్పుకున్న బ్రహ్మ సమాజీకులు కూడా ఆమె వైద్య విద్యను అభ్యసించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడ పేర్కొంటున్న ఈ ఉదాహరణకి మనుషులను తప్పు పట్టాలో, కాలాన్ని తప్పు పట్టాలో ఓ పట్టాన అర్థం కాదు. ఎందుకంటే సంస్కరణోద్యమాలకీ, రాజకీయోద్యమాలకీ, సాంస్కృతికపునరుజ్జీవనోద్యమాలకి ఆటపట్టయిన వంగదేశంలో ఇది జరిగింది. పురిటి నెప్పులు పడుతున్న బాలికను పరీక్షించేందుకు కలకత్తాలోనే ఒకసారి ఒక ధనిక కుటుంబం కాదంబినిని ఇంటికి పిలిచింది. పురుడొచ్చింది. తల్లీ, శిశువు క్షేమంగా బయటపడ్డారు. తరువాత కాదంబినికీ, ఆమె సహాయకురాలికీ భోజనం పెట్టిందా కుటుంబం– బయట వరండాలో. అంతేకాదు, ఎంగిలి విస్తళ్లు తీసి, అక్కడ శుభ్రం చేయమన్నారు కూడా. ఆ రోజుల్లో వైద్య విద్య చదివిన మహిళా డాక్టరు అన్నా మంత్రసాని కంటే ఎక్కువ విలువ ఇచ్చేది కాదు సమాజం. కాదంబిని గంగూలీ (జూలై 18, 1861–అక్టోబర్ 3, 1923) అసలు పేరు కాదంబిని బసు. భారతదేశం నుంచి పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు. ఆ రెండో మహిళ డెహ్రాడూన్‌కు చెందిన చంద్రముఖి బసు. నిజానికి మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యంలోనే పట్టభద్రులైన తొలి మహిళలు వారు. దేశంలో వైద్యవృత్తి చేసిన తొలితరం స్త్రీలలో కాదంబిని ఒకరు. అయితే కాదంబిని పాశ్చాత్య వైద్యం చేయడానికి సర్టిఫికెట్ పొందిన మహిళగా ఖ్యాతి గాంచారు. ఆమె వైద్యురాలిగా ఎంతో ప్రతిభను కనపరచడమే కాకుండా, భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమంలో, మహిళల హక్కుల సాధన ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. కాదంబిని బిహార్‌లోని భాగల్పూరులో పుట్టారు. ఆమె కుటుంబం బ్రహ్మ సమాజ దీక్షను స్వీకరించింది. నిజానికి వీరి అసలు ఊరు వంగదేశంలోని బారిసాల్ జిల్లాలోని చాండ్సి. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది. ఆమె తండ్రి బ్రజ్ కిశోర్ బసు. ఆయన స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. బ్రహ్మ సమాజ సభ్యుడు కాబట్టి సంఘ సంస్కరణోద్యమంలో కూడా కీలకంగా వ్యవహరించేవారు. స్త్రీ విముక్తి కోసం బ్రహ్మ సమాజం పాటు పడేది. కాదంబిని బ్రాహ్మో ఈడెన్ ఫిమేల్ స్కూల్లో ఆంగ్ల విద్యను అభ్యసించింది. ఇది ఢాకాలో ఉంది. తరువాత కలకత్తాలోనే బాల్యాగంజ్లో హిందూ మహిళా విద్యాలయంలో (1876) చదువుకున్నారు. తరువాత దీనిని బెతూన్ స్కూల్లో విలీనం చేశారు. ఇందులో చేరడమూ ఆమెకు గగనమైపోయింది. దీనికి కలకత్తా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష నిర్వహించేది. కానీ మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. ఇది కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్న మోడ్రన్ దురాచారమే అనుకోనక్కరలేదు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ల సంప్రదాయాన్ని అనుసరించే కలకత్తా విశ్వవిద్యాలయం కూడా మహిళలకు ప్రవేశం కల్పించేది కాదు. ఆమెతో పాటే డెహ్రాడూన్‌కి చెందిన చంద్రముఖి బసు కూడా దరఖాస్తు చేశారు. ప్రవేశ పరీక్ష కోసం పెద్ద పోరాటమే చేసిన వ్యక్తి ద్వారకానాథ్ గంగూలీ. ఆయన అదే స్కూల్లో ఉపాధ్యాయుడు. మొత్తానికి ఆ ఇద్దరు బాలికలు ప్రవేశ పరీక్ష 1877లో రాశారు. మరుసటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి. ఒక్క మార్కు తక్కువగా కాదంబిని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు. చంద్రముఖి కొంచెం తక్కువ మార్కులతో ఉత్తీర్ణురాలయ్యారు. కాదంబినికి బెతూన్‌లో కళాశాల స్థాయిలో ప్రవేశం దక్కింది. చంద్రముఖి ఫ్రీ చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ కళాశాలలో ప్రవేశించారు. 1880లో ఇద్దరూ ఫస్ట్ ఆర్ట్స్ (ఎఫ్ఏ) పట్టా తీసుకున్నారు. తరువాత కాదంబిని కలకత్తా వైద్య కళాశాలలో చేరాలని ఆశించారు. కానీ మహిళలకు ప్రవేశం లేదు. దీనితో కాదంబిని, చంద్రముఖి ఇద్దరూ బెతూన్ కళాశాలలోనే డిగ్రీలో చేరారు. 1883లో ఉత్తీర్ణులయ్యారు. ఆ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యంలోనే పట్టభద్రులైన తొలి మహిళలుగా పేరు సంపాదించారు. తరువాత కలకత్తా వైద్య కళాశాలలో చేరాలని కాదంబిని కోరుకున్నారు. ఇందుకూ మళ్లీ ఆటంకాలు ఎదురయ్యాయి. ఇక్కడే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మద్రాస్ మెడికల్ కాలేజీ 1875 నాటికే మహిళలను చేర్చుకోవడానికి సిద్ధపడింది. కానీ 1882 నాటికి కూడా కలకత్తా వైద్య కళాశాల మాత్రం అందుకు సిద్ధపడలేదు. మళ్లీ ద్వారకానాథ్ రంగంలోకి దిగి పోరాడారు. 1884లో ఆ వైద్య కళాశాలలో చేరిన తొలి మహిళ కాదంబిని. వైద్య విద్య చదవడానికి ఆమెకు ప్రభుత్వం నెలకు 20 రూపాయలు విద్యార్థి వేతనం మంజూరు చేసింది. కానీ ఈ విజయం కోసం ఆమె ఎన్నో అవరోధాలను అధిగమించవలసి వచ్చింది. ఎందుకంటే ఆ వైద్య కళాశాలలో మహిళల ప్రవేశం నిర్వాహకులకు రుచించేది కాదు. ఒక బెంగాలీ ఆచార్యుడు కూడా ఆమె వ్యతిరేకులలో ఉన్నారు. ఆయనే మెటీరియా మెడికా, కంపేరిటివ్ అనాటమీ పరీక్షలో మార్కులు తగ్గించాడు. దీనితో ఆమె ఎంబి (బేచిలర్ ఆఫ్ మెడిసిన్) పట్టాను కోల్పోయింది. గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఆఫ్ బెంగాల్ (డిప్లొమా) పట్టా మాత్రమే దక్కింది. ఇన్ని ఆటంకాల నడుమ 1886లో ఆమె ఆ స్థాయికి చేరడం మహోన్నత చరిత్రాత్మక విజయమే. ఆ డిప్లొమాతో కాదంబిని లేడీ డఫ్రిన్ ఉమెన్స్ హాస్పిటల్లో చేరారు. జీతం రెండువందల రూపాయలు. అక్కడ కొద్దికాలమే ఉన్నారు. కారణం– వివక్ష. ఆమెతో పాటు పనిచేసే పాశ్చాత్య మహిళా వైద్యులు ఆమెను చులకనగా చూసేవారు. కారణం ఆమెకు ఎంబి పట్టాలేదు. మూడేళ్లు గడిచినా ఆమెకు ఆ శాఖ బాధ్యతలు అప్పగించలేదు. దీనితో కొద్దికాలంలోనే ఆమె అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రైవేటు ప్రాక్టీసు ఆరంభించారు. కానీ పెద్దగా విజయవంతం కాలేదు. అప్పుడే ఆమె లండన్‌లో పాశ్చాత్య వైద్య విద్య చదివి మరో శిఖరం అధిరోహించాలన్న నిర్ణయానికి వచ్చారు. 1892లో అనుకున్న విధంగానే కాదంబిని లండన్ వెళ్లారు. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఆర్సిపి పట్టా, డబ్లిన్ విశ్వవిద్యాలయం నుంచి సీఎఫ్పిసి పట్టా, గ్లాస్గో విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఆర్‌సీఎస్ పట్టా తీసుకుని ఇండియా వచ్చారు. విదేశాలలో వైద్య పట్టాపుచ్చుకుని వచ్చి ఆ వృత్తిని నిర్వహించిన తొలి ఆసియా మహిళగా కాదంబిని చరిత్ర ప్రసిద్ధురాలయ్యారు. ఆమె మళ్లీ సగౌరవంగా డఫ్రిన్ ఆస్పత్రిలో చేరారు. కొద్దికాలమే పనిచేసి ప్రైవేట్ ప్రాక్టీసు పెట్టారు. నేపాల్ రాజమాతను దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యను పరిష్కరించడంతో ఉన్నత వర్గాలలో ఆమె పేరు మారుమోగిపోయింది. ఇక ఆమె వెనుతిరిగి చూడలేదు. కాదంబిని ద్వారకానాథ్ గంగూలీని వివాహం చేసుకున్నారు. ఆయన కూడా బ్రహ్మ సమాజీకుడే. అప్పటికి ఆయన భార్య పోయింది. ముగ్గురు పిల్లలు. బెతూన్‌లో ఉపాధ్యాయుడైన ద్వారకానాథ్ కాదంబినికి అన్ని విధాలా సహకరించారు. అన్నట్టు ఇద్దరూ బ్రహ్మ సమాజీకులే అయినా ఈ వివాహాన్ని బ్రహ సమాజంలో కొందరు అంగీకరించలేదు. ఆయన ప్రోత్సాహంతోనే కాదంబిని విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేశారు. 1891లో మరొక దారుణ సంఘటన జరిగింది. ఆనాడు ‘బంగా బసి’ పేరుతో ఒక ప్రముఖ పత్రికకు నడిచేది. దానికి మహేశ్‌చంద్ర పాల్ సంపాదకుడు. కాదంబినిని చూస్తే బ్రహ్మ సమాజ స్త్రీలోకం తల దించుకుంటోందని విమర్శిస్తూ, ఆమెను పరోక్షంగా ‘వేశ్య’ అని రాసింది. దీనితో ద్వారకానాథ్, డాక్టర్ నీల్‌రతన్ సర్కార్, శివనాథశాస్త్రి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ పత్రికకు వంద రూపాయల జరిమానా, సంపాదకుడికి ఆరుమాసాలు జైలు శిక్ష విధించింది. కాదంబిని గొప్ప వైద్యురాలు. గొప్ప సామాజిక కార్యకర్త. మేధావి. వీటితో పాటు గొప్ప తల్లి. ఆమె తన భర్త ముందు భార్యకు జన్మించిన ముగ్గురు పిల్లలతో పాటు, తామిద్దరికీ జన్మించిన మరో ఐదుగురు పిల్లలను కూడా పెంచారు. భర్తకు, ఆమెకు పదిహేడు సంవత్సరాల తేడా ఉంది.ఆమె పలు సామాజిక ఉద్యమాలతో పాటు కాంగ్రెస్ జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ సభలలో వేదిక మీద కనిపించిన తొలి మహిళ కూడా కాదంబిని. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1908లో కలకత్తాలోనే మహిళా సమావేశం నిర్వహించారు. తూర్పు భారతంలో గనులలో పనిచేసే మహిళల హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం గాంధీజీ స్థాపించిన ట్రాన్స్‌వాల్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1923లో మరణించే వరకు ఆమె వైద్య వృత్తిని వీడలేదు. విదేశాలలో వైద్య విద్య చదివి వచ్చి దేశంలో సేవలు అందించిన వారిలో కాదంబిని తొలి మహిళ కాదన్న వాదన ఒకటి ఉంది. అందులో నిజం లేకపోలేదు. కానీ ఇదొక వ్యర్థ వాదన. ఆనందీబాయి జోషి పాశ్చాత్య దేశాలలో వైద్యవిద్యను అభ్యసించి వచ్చిన తొలి భారతీయ వనిత. మహారాష్ట్రకు చెందినవారు. ఆమె 1885లోనే అమెరికాలోని పెన్సిల్వేనియాలో వైద్య విద్యను పూర్తి చేశారు. 1886లో భారత్ వచ్చారు. ఆ తరువాత సంవత్సరమే ఆమె కన్నుమూశారు. ఆమె వైద్య సేవలు అందుకునే అవకాశం నాటి భారతీయ మహిళకు దక్కలేదు. కాదంబిని 1886లో కలకత్తాలోని బెంగాల్ మెడికల్ కళాశాల నుంచి వైద్యవిద్యలో పట్టా తీసుకున్నారు. 1892లో ఇంగ్లండ్‌లో వైద్య విద్య పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ప్రసూతి వైద్యురాలిగా ఆమె సేవలు చిరకాలం భారతీయ మహిళలు అందుకున్నారు. ఆనందీబాయి, కాదంబిని ఎవరు ముందు అంటూ ఆ మధ్య అమెరికా నుంచి వెలువడే వైద్య విశేషాల పత్రిక ‘యూరాలజీ’ ఒక ప్రశ్న వేసింది. ఆనందీ తొలి మహిళ కావచ్చు. కానీ భారతీయ సమాజానికి సేవలు అందించిన మహిళగా కాదంబిని కూడా గుర్తుంటారు. ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. 1886–1887లో మద్రాస్ వైద్య కళాశాల నుంచి అనీ జగన్నాథన్ అనే మహిళ వైద్య విద్యలో డిప్లొమా తీసుకున్నారు. అయినా తొలితరం కాబట్టి ఎవరి విలువ వారిదే. చరిత్ర వీరిని సమంగా గౌరవించవలసిందే. · కాంగ్రెస్ సభలలో వేదిక మీద కనిపించిన తొలి మహిళ కూడా కాదంబిని. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1908లో కలకత్తాలోనే మహిళా సమావేశం నిర్వహించారు. తూర్పు భారతంలో గనులలో పనిచేసే మహిళల హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు. -
వాసి ఉంది రాశి లేదు!
ఇప్పుడంటే మహిళా డాక్టర్లు ఈమాత్రమైనా కనిపిస్తున్నారు కానీ భారతదేశంలో ఒక మహిళ డాక్టర్ అవడం అంత తేలిగ్గా జరిగిన పని కాదు. డాక్టర్ అయేందుకు మొదటి తరం మహిళలు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అలా కష్టపడి భారత్‌లో మొట్టమొదటి ఫిజీషియన్ అయిన ఘనత ఇద్దరు మహిళలకు దక్కుతుంది. ఇంచుమించుగా వారిద్దరూ ఒకేసారి డాక్టర్లయినప్పటికీ తొలి డాక్టర్‌గా ఆనందీబాయి గోపాల్‌రావు జోషీనే పరిగణిస్తారు. ఆ రెండో మహిళ కాదంబినీ గంగూలీ. ఈ ఇద్దరిలో ఆనందీబాయి జోషీ డాక్టర్‌గా రూపొందినతీరు ఆసక్తిదాయకం. మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. అయినప్పటికీ ఈ వందేళ్లలోనూ పెరిగిన మహిళా డాక్టర్ల సంఖ్య తక్కువేనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆనందీబాయి మహారాష్ట్రలోని కళ్యాణ్ పట్టణంలో ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టింది. తొమ్మిదో ఏటనే ఆమెను ఆమెకన్నా కళ్యాణ్‌లో పోస్టల్ విభాగంలో పనిచేసే గోపాల్‌రావు కిచ్చి పెళ్లిచేశారు. ఆనందీ పద్నాల్గవ ఏట ఆమెకు ఓ మగపిల్లాడు పుట్టాడు. వైద్యసదుపాయం లేనందువల్ల పుట్టిన పదిరోజులకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. ఇదే ఆనందీబాయి జీవితంలో ఒక పెద్ద మలుపుగా పరిణమించింది. పురుష వైద్యులే చాలా తక్కువైన ఆ రోజుల్లో తన భార్య డాక్టర్ కోర్సు చదవాలనీ, తద్వారా తన పిల్లల్లాంటి ఎందరో పిల్లల్ని మరణపు కోరల బారిన పడకుండా కాపాడాలని గోపాల్‌రావు భావించాడు. భర్త సూచనను ఆనందీ ఆనందంగా ఆమోదించడమే కాదు... తాను అమెరికాలో మెడిసిన్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పింది. ఆనందీ తన మనసులోని ఉద్దేశం చెప్పగానే గోపాల్‌రావు... ‘‘నువ్వు తప్పక డాక్టరీ చదువు. భారత చరిత్రలో అల్లోపతి ప్రక్రియలో మొట్టమొదటి మహిళావైద్యురాలిగా చరిత్ర సృష్టించాలి’’ అంటూ ప్రోత్సహించాడు. అంతేకాదు... యూఎస్‌లో తన భార్య మెడిసిన్ చదివేందుకు గల అవకాశాలపై సమాచార సేకరణ మొదలుపెట్టాడు. ఎట్టకేలకు న్యూజెర్సీలోని రోజెల్లీ ప్రాంతానికి చెందిన థియోడీసియా అనే మహిళకు ఆనందీ ఆసక్తి గురించి తెలిసి, ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే అనుకోకుండా ఆనందీ ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఆనందీ రోగ లక్షణాలను వివరిస్తూ గోపాలరావు థియోడీసియాకు ఉత్తరాలు రాసేవాడు. వాటి ఆధారంగా ధియోడీసియా ఆనందీ కోసం అమెరికా నుంచి మందులు పంపించేది. కానీ అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. దాంతో తానే స్వయంగా మెడిసిన్ చదువుకోవాలనే సంకల్పం ఆనందీలో బలపడింది. ఈ లోగా అమెరికాలో ఉన్న థార్బర్న్ అనే వైద్యదంపతులు ఆనందీకి పరిచయమయ్యారు. ‘పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాల’ ఆనందీ చదువుకోడానికి చాలా అనువైన కాలేజీగా వారు సూచించారు. తాను అమెరికా వెళ్లి చదువుకోవాలని భావిస్తున్నట్లు సెరంపూర్ కాలేజీ హాల్లో ప్రకటించింది ఆనందీ. అంతే! ఆ ప్రాంతంలోనే కాదు... తాను పుట్టిన ఊళ్లోని జోషీ కుటుంబాల నుంచి కూడా ఆమెకు తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఆ రోజుల్లో వారి సామాజిక వర్గానికి చెందిన పురుషులు సైతం సముద్రాన్ని దాటి విదేశాలకు వెళ్లడాన్ని పాపంగా పరిగణించేవారు. కానీ ఈ ఆంక్షలన్నింటినీ పక్కన పెట్టి ఆనందీ అమెరికాకు పయనమైంది. థార్బార్న్ దంపతుల సహాయంతో పెన్సిల్వేనియా మెడికల్ కాలేజీలో చేరింది. మెడికల్ కాలేజీలో చేరేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు. అక్కడి వాతావరణం సరిపడక ఆమెకు ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా ఇలాంటి ఎన్నో అవరోధాలను లెక్క చేయక తన వైద్య విద్యను కొనసాగించింది. ఎట్టకేలకు 1886 మార్చి 11న ఆమె తన ఎండీ పట్టా పుచ్చుకుంది. ఈ సందర్భంగా క్వీన్ విక్టోరియా ఆమెకు తన అభినందనలను తెలియజేసింది. ఎట్టకేలకు పట్టాపుచ్చుకుని ఆమె భారత్ తిరిగి వచ్చింది. తాను మెడిసిన్ చదువుకోడాన్ని నిరాకరిస్తూ ఏ ప్రాంతంలోనుంచైతే విపరీతమైన ఒత్తిడి ఎదురైందో... అక్కడే ఆనందీకి అత్యంత వైభవమైన స్వాగతం లభించింది. అయితే ఆనందీ అమెరికాలో పట్టా పొందిన ఏడాదే (1886లో) కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి కాదంబినీ గంగూలీ కూడా పట్టాపొందింది. ఇంచుమించూ ఈ ఇద్దరు మహిళలూ మొదటితరానికి చెంది డాక్టర్లుగా ఒకేసారి ఆవిర్భవించారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే- ఈ తరంలో ఎందరో మహిళలు డాక్టరీ చదువుతున్నారు. కానీ... వాళ్లంతా గైనకాలజిస్టులు, అబ్స్టెట్రీషియన్స్, చిన్నపిల్లల నిపుణులైన పీడియాట్రీషియన్, జనరల్ ఫిజీషియన్ లాంటి కోర్సులే తప్ప... న్యూరోసర్జరీ, యూరాలజీ, యాండ్రాలజీ లాంటి కోర్సులు చదవడం తక్కువే. అయినా, డాక్టర్ నమితా గంజావాలా లాంటి కొద్దిమంది మహిళలు తమను తాము ‘సెక్సాలజిస్టు’లుగా సగర్వంగా ప్రకటించుకుంటారు. అంతెందుకు... భారతదేశంలోనే ప్రఖ్యాతి పొందిన ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ ప్రకాశ్ కొఠారీ... గుజరాత్‌కు చెందిన తన పేషెంట్లను ఆమె వద్దకే రిఫర్ చేస్తుంటారు. ప్రస్తుతం సూరత్‌లో సెక్సాలజిస్ట్‌గా ప్రాక్టీస్ కొనసాగిస్తున్న నమితా... ‘‘సెక్స్ పట్ల వివక్ష అన్నది మన మెదడులో మాత్రమే ఉంటుంది. నా పేషెంట్లు నా దగ్గరికి వచ్చినప్పుడు అంతగా బెరుకు లేకుండానే తమ సమస్యలు చెప్పుకుంటుంటారు. అయినా అనేకమంది పురుషులు గైనకాలజిస్టులుగా పనిచేస్తున్నప్పుడు ఒక మహిళ సెక్సాలజిస్ట్‌గా పనిచేయడంలో అవరోధం ఏముంటుంది?’’ అంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- గతంతో పోలిస్తే ఇవ్వాళ ఎంతో మంది మహిళా డాక్టర్లున్నారు. ఇక నర్సింగ్ రంగంలో దాదాపు అందరూ మహిళలే. అయినప్పటికీ ల్యాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో 2011లో ‘‘హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ హెల్త్ ఇన్ ఇండియా’’ శీర్షికతో ప్రచురితమైన కథనం ప్రకారం... వైద్యరంగంలో మహిళల భూమిక ఇంకా 17 శాతం మాత్రమే. అంటే ఆకాశంలో సగమైన మహిళ వైద్యరంగంలో ఇంకెంత పురోగమించాల్సిన అవసరం ఉందో తెలుస్తూనే ఉందిగా!