వాసి ఉంది రాశి లేదు! | The first physician in India | Sakshi
Sakshi News home page

వాసి ఉంది రాశి లేదు!

Published Wed, Feb 18 2015 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

వాసి ఉంది  రాశి లేదు!

వాసి ఉంది రాశి లేదు!

ఇప్పుడంటే మహిళా డాక్టర్లు ఈమాత్రమైనా కనిపిస్తున్నారు కానీ భారతదేశంలో ఒక మహిళ డాక్టర్ అవడం అంత తేలిగ్గా జరిగిన పని కాదు. డాక్టర్ అయేందుకు మొదటి తరం మహిళలు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అలా కష్టపడి భారత్‌లో మొట్టమొదటి ఫిజీషియన్ అయిన ఘనత ఇద్దరు మహిళలకు దక్కుతుంది. ఇంచుమించుగా వారిద్దరూ ఒకేసారి డాక్టర్లయినప్పటికీ తొలి డాక్టర్‌గా ఆనందీబాయి గోపాల్‌రావు జోషీనే పరిగణిస్తారు. ఆ రెండో మహిళ  కాదంబినీ గంగూలీ. ఈ ఇద్దరిలో ఆనందీబాయి జోషీ డాక్టర్‌గా రూపొందినతీరు ఆసక్తిదాయకం. మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. అయినప్పటికీ ఈ వందేళ్లలోనూ పెరిగిన మహిళా
 డాక్టర్ల సంఖ్య తక్కువేనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.
 
ఆనందీబాయి మహారాష్ట్రలోని కళ్యాణ్ పట్టణంలో ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టింది. తొమ్మిదో ఏటనే ఆమెను ఆమెకన్నా కళ్యాణ్‌లో పోస్టల్ విభాగంలో పనిచేసే గోపాల్‌రావు కిచ్చి పెళ్లిచేశారు. ఆనందీ పద్నాల్గవ ఏట ఆమెకు ఓ మగపిల్లాడు పుట్టాడు. వైద్యసదుపాయం లేనందువల్ల పుట్టిన పదిరోజులకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. ఇదే ఆనందీబాయి జీవితంలో ఒక పెద్ద మలుపుగా పరిణమించింది. పురుష వైద్యులే చాలా తక్కువైన ఆ రోజుల్లో తన భార్య డాక్టర్ కోర్సు చదవాలనీ, తద్వారా తన పిల్లల్లాంటి ఎందరో పిల్లల్ని మరణపు కోరల బారిన పడకుండా కాపాడాలని గోపాల్‌రావు భావించాడు. భర్త సూచనను ఆనందీ ఆనందంగా ఆమోదించడమే కాదు... తాను అమెరికాలో మెడిసిన్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పింది. ఆనందీ తన మనసులోని ఉద్దేశం చెప్పగానే గోపాల్‌రావు... ‘‘నువ్వు తప్పక డాక్టరీ చదువు. భారత చరిత్రలో అల్లోపతి ప్రక్రియలో మొట్టమొదటి మహిళావైద్యురాలిగా చరిత్ర సృష్టించాలి’’ అంటూ ప్రోత్సహించాడు. అంతేకాదు... యూఎస్‌లో తన భార్య మెడిసిన్ చదివేందుకు గల అవకాశాలపై సమాచార సేకరణ మొదలుపెట్టాడు. ఎట్టకేలకు న్యూజెర్సీలోని రోజెల్లీ ప్రాంతానికి చెందిన థియోడీసియా అనే మహిళకు ఆనందీ ఆసక్తి గురించి తెలిసి, ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే అనుకోకుండా ఆనందీ ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఆనందీ రోగ లక్షణాలను వివరిస్తూ గోపాలరావు థియోడీసియాకు ఉత్తరాలు రాసేవాడు. వాటి ఆధారంగా ధియోడీసియా ఆనందీ కోసం అమెరికా నుంచి మందులు పంపించేది. కానీ అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. దాంతో తానే స్వయంగా మెడిసిన్ చదువుకోవాలనే సంకల్పం ఆనందీలో బలపడింది. ఈ లోగా అమెరికాలో ఉన్న థార్‌బర్న్ అనే వైద్యదంపతులు ఆనందీకి పరిచయమయ్యారు. ‘పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాల’ ఆనందీ చదువుకోడానికి చాలా అనువైన కాలేజీగా వారు సూచించారు.

తాను అమెరికా వెళ్లి చదువుకోవాలని భావిస్తున్నట్లు సెరంపూర్ కాలేజీ హాల్‌లో ప్రకటించింది ఆనందీ. అంతే! ఆ ప్రాంతంలోనే కాదు... తాను పుట్టిన ఊళ్లోని జోషీ కుటుంబాల నుంచి కూడా ఆమెకు తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఆ రోజుల్లో వారి సామాజిక వర్గానికి చెందిన పురుషులు సైతం సముద్రాన్ని దాటి విదేశాలకు వెళ్లడాన్ని పాపంగా పరిగణించేవారు. కానీ ఈ ఆంక్షలన్నింటినీ పక్కన పెట్టి ఆనందీ అమెరికాకు పయనమైంది. థార్‌బార్న్ దంపతుల సహాయంతో పెన్సిల్వేనియా మెడికల్ కాలేజీలో చేరింది. మెడికల్ కాలేజీలో చేరేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు. అక్కడి వాతావరణం సరిపడక ఆమెకు ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా ఇలాంటి ఎన్నో అవరోధాలను లెక్క చేయక తన వైద్య విద్యను కొనసాగించింది. ఎట్టకేలకు 1886 మార్చి 11న ఆమె తన ఎండీ పట్టా పుచ్చుకుంది. ఈ సందర్భంగా క్వీన్ విక్టోరియా ఆమెకు తన అభినందనలను తెలియజేసింది. ఎట్టకేలకు పట్టాపుచ్చుకుని ఆమె భారత్ తిరిగి వచ్చింది. తాను మెడిసిన్ చదువుకోడాన్ని నిరాకరిస్తూ ఏ ప్రాంతంలోనుంచైతే విపరీతమైన ఒత్తిడి ఎదురైందో... అక్కడే ఆనందీకి అత్యంత వైభవమైన స్వాగతం లభించింది. అయితే ఆనందీ అమెరికాలో పట్టా పొందిన ఏడాదే (1886లో) కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి కాదంబినీ గంగూలీ కూడా పట్టాపొందింది. ఇంచుమించూ ఈ ఇద్దరు మహిళలూ మొదటితరానికి చెంది డాక్టర్లుగా ఒకేసారి ఆవిర్భవించారు.
 ఇక ప్రస్తుత విషయానికి వస్తే- ఈ తరంలో ఎందరో మహిళలు డాక్టరీ చదువుతున్నారు. కానీ... వాళ్లంతా గైనకాలజిస్టులు, అబ్‌స్టెట్రీషియన్స్, చిన్నపిల్లల నిపుణులైన పీడియాట్రీషియన్, జనరల్ ఫిజీషియన్ లాంటి కోర్సులే తప్ప... న్యూరోసర్జరీ, యూరాలజీ, యాండ్రాలజీ లాంటి కోర్సులు చదవడం తక్కువే. అయినా, డాక్టర్ నమితా గంజావాలా లాంటి కొద్దిమంది మహిళలు తమను తాము ‘సెక్సాలజిస్టు’లుగా సగర్వంగా ప్రకటించుకుంటారు. అంతెందుకు... భారతదేశంలోనే ప్రఖ్యాతి పొందిన ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ ప్రకాశ్ కొఠారీ... గుజరాత్‌కు చెందిన తన పేషెంట్లను ఆమె వద్దకే రిఫర్ చేస్తుంటారు.

ప్రస్తుతం సూరత్‌లో సెక్సాలజిస్ట్‌గా ప్రాక్టీస్ కొనసాగిస్తున్న నమితా... ‘‘సెక్స్ పట్ల వివక్ష అన్నది మన మెదడులో మాత్రమే ఉంటుంది. నా పేషెంట్లు నా దగ్గరికి వచ్చినప్పుడు అంతగా బెరుకు లేకుండానే తమ సమస్యలు చెప్పుకుంటుంటారు. అయినా అనేకమంది పురుషులు గైనకాలజిస్టులుగా పనిచేస్తున్నప్పుడు ఒక మహిళ సెక్సాలజిస్ట్‌గా పనిచేయడంలో అవరోధం ఏముంటుంది?’’ అంటారు.  
 అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- గతంతో  పోలిస్తే ఇవ్వాళ ఎంతో మంది మహిళా డాక్టర్లున్నారు. ఇక నర్సింగ్ రంగంలో దాదాపు అందరూ మహిళలే. అయినప్పటికీ ల్యాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో 2011లో ‘‘హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ హెల్త్ ఇన్ ఇండియా’’ శీర్షికతో ప్రచురితమైన కథనం ప్రకారం... వైద్యరంగంలో మహిళల భూమిక ఇంకా 17 శాతం మాత్రమే. అంటే ఆకాశంలో సగమైన మహిళ వైద్యరంగంలో ఇంకెంత పురోగమించాల్సిన అవసరం ఉందో తెలుస్తూనే ఉందిగా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement