ప్రపంచాన్ని కుదిపేసిన ఈ రెండేళ్లూ.. కోవిడ్ వల్ల పడిన అనేక రకాల అవస్థలు ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తించాయి. మన ఆర్థిక వ్యవస్థ కకావికలమైపోగా, మన ఆరోగ్య వ్యవస్థ కూడా నిరర్థకమైపోయింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రంగాల్లాగే వైద్య, ఆరోగ్య రంగాలు కూడా ప్రైవేట్ పరమై జనానికి అందుబాటులో లేకుండా పోయాయి. కోవిడ్ కాలంలో ఈ దురవస్థ మరింతగా బయటపడింది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టు కుని, దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతూ.. నిస్సహా యంగా మిగిలిపోయారు.
ప్రాథమిక వైద్యం కుంటుపడిన ఫలి తంగా మహమ్మారిని అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యా మని అన్ని దేశాలూ గ్రహించాయి. ఫలితంగా స్పెయిన్ వంటి కొన్ని దేశాలు తమ ఆరోగ్య వ్యవస్థను వెంటనే జాతీయం చేయడం గానీ, లేదా ఐర్లండ్‌లో లాగా ప్రైవేటు ఆసుపత్రుల్ని ప్రభుత్వ అధీ నంలోకి తీసుకోవడంగానీ చేసి, తమ ప్రజల్ని సమర్థంగా కాపాడు కునే ప్రయత్నం చేశాయి. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వైఫల్యాలని సమీక్షించుకుని, ప్రాథమిక ఆరోగ్య సేవలని బలో పేతం చేయాలనీ, అందరినీ సంరక్షించాలనీ ఆదేశించింది.
ఆరోగ్యాన్ని పరిరక్షించే నిర్ణయాత్మకమైన ప్రమాణాల్లో ఆరోగ్య సంరక్షణ పాత్ర 10 శాతమైతే, జన్యు సంబంధ వార సత్వం 30 శాతం, సామాజిక స్థితి 15 శాతం, పర్యావరణం 5 శాతం, జీవనశైలి పాత్ర 40 శాతం అని చెప్పవచ్చు. సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండటం, పరిసరాల ప్రభావం, సామా జిక సామూహిక పరిస్థితులు, ఆర్థిక స్థిరత్వం, అందుబాటులో నాణ్యమైన విద్య వంటి సామాజిక అంశాలు కూడా ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అంటే, ప్రాథమిక వైద్యం, ప్రజారోగ్యం రెండూ బలోపేతం అయితేనే అందరికీ ఆరోగ్యం సాధ్యమవుతుందన్న మాట!
ప్రాథమిక ఆరోగ్యసేవ అనేది యావత్తు సమాజానికీ వర్తిస్తుంది. అంటే, అన్ని వయసుల వారికీ అన్ని రకాల వ్యాధుల విషయంలో కూడా! ఎనభై శాతం పైగా వ్యాధులను ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థతో నియంత్రించవచ్చు. నాణ్యమైన వైద్యాన్ని ప్రజల అవసరాలకి అనుగుణంగా, తేలికగా, చౌకగా అందించగల నైపుణ్యం, శిక్షణ గలిగిన వారు ఫ్యామిలీ ఫిజీషియన్లు. ఈ ఫ్యామిలీ మెడిసిన్ వ్యవస్థని పటిష్ఠపరచగలిగితే, మన దేశంలో వైద్యాన్ని ప్రజల వాకిట్లోకి తీసుకువెళ్ళవచ్చు. ఫలితంగా ప్రజల మౌలిక వైద్యపరమైన అవసరాలు తీరతాయి. ప్రజారోగ్యం మెరుగు కావడం, వ్యాధుల నియంత్రణలోకి రావడం, రోగనివారణ చర్య లౖపై దృష్టి కేంద్రీకరించడం సాధ్యమవుతుంది.
కానీ మన దేశంలో ఇలాంటి ఫ్యామిలీ ఫిజీషియన్ల వ్యవస్థకు బదులు స్పెషలిస్టులపై కేంద్రీకరణ, ప్రైవేటు ఆసుపత్రుల ఆధిక్యం ఎక్కువవుతున్నాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ల వ్యవస్థ ద్వారా ప్రాథమిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకుంటున్నాయి. ఈ డాక్టర్లు మొదటి వరస రక్షకులు (ఫ్రంట్ లైన్ వారియర్స్)గా పనిచేస్తూ, తమ నైపుణ్యంతో 80 శాతం రోగాలను నయం చేయగలుగుతున్నారు.
మిగిలిన 20 శాతం రోగాలను సకాలంలో గుర్తించి, ఆయా స్పెషలిస్టుల పరిరక్షణలోకి పంపుతున్నారు. ఇందువల్ల వైద్య వ్యవస్థపై భారం తగ్గడమే కాక, వ్యాధులు ముదరక ముందే గుర్తించడం వల్ల ప్రభుత్వాలపై ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ప్రజల ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. కొన్ని లాటిన్ అమెరికన్ దేశాలు మరో అడుగు ముందుకు వేసి, దాదాపు ప్రతి కుటుంబాన్నీ ఒక ఫామిలీ డాక్టరు, ఒక నర్సు ఉండే టీమ్‌కి అనుసంధానిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ ఆవశ్యకతను గుర్తించి అమలు చేస్తున్నాయి.
మన దేశంలోనూ దీనిపై ప్రభుత్వాలు మరింతగా అధ్య యనం చేసి, ప్రజారోగ్యానికీ ఫ్యామిలీ మెడిసిన్‌కీ ఉన్న సంబం ధాన్ని గుర్తించాలి. ప్రతి మెడికల్ కాలేజీలో ఈ సబ్జెక్టుని అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే ప్రవేశపెట్టి, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయికి తీసుకుపోతే తప్ప మన ప్రాథమిక వైద్య ఆరోగ్య వ్యవస్థ బాగుపడదు. అప్పుడే దేశం ఇలాంటి పాండమిక్ సునామీలను తట్టుకోగలుగుతుంది.
ఈ అవసరాన్ని నొక్కి చెప్తూ ‘ఫ్యామిలీ మెడిసిన్, ప్రైమరీ కేర్–2022’ పేరుతో జాతీయ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో హైదరాబాద్ ఈఎస్‌ఐ, అపోలో మెడికల్ కాలేజీల్లో జరుగుతోంది. దేశంలోని ఎందరో ఫ్యామిలీ మెడిసిన్ నిపుణులు, ప్రజారోగ్య నిపుణులు ఒకే వేదికపైకి వచ్చి, ఈ ఫ్యామిలీ మెడిసిన్ ఆవశ్యకతను నొక్కి చెప్పబోతున్నారు.
-డాక్టర్ శ్రీనివాస్
వ్యాసకర్త ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్, ఎఫ్‌ఎంపీసీ–22
మొబైల్: 98481 39190
(నేటి నుంచి హైదరాబాద్‌లో ‘ఫ్యామిలీ మెడిసిన్, ప్రైమరీ కేర్’
జాతీయ మహాసభల సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment