ఏఈఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సీపీ బ్రౌన్ జయంతి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రసాద్‌నగర్‌లోని డాక్టర్ బీవీ నాథ్ అండ్ టి. ఆర్. రావ్ మెమోరియల్ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ సీనియర్ సెకండరీ స్కూలు(ఏఈఎస్)లో సోమవారం సీపీ బ్రౌన్ 216 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, హైదరాబాద్‌కు చెందిన లావణ్య సాంస్కృతికసంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. రాజమండ్రికి చెందిన సన్నిధానం నరసింహ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం లావణ్య సాంస్కతిక సంస్థ అందించే సి.పి. బ్రౌన్ పురస్కారాన్ని తెలుగు భాష,సంస్కృతులకు విశేష సేవలందించిన సన్నిధానం నరసింహశర్మకు అందజేశారు. ఢిల్లీలో ఈ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని ఆయన చెప్పారు.
తెలుగులోని వివిధ సాహిత్య ప్రక్రియలను విద్యార్థులకు వివరించారు. తెలుగుభాష తీయదనాన్ని తెలిపారు. తెలుగుభాషకు బ్రౌన్ అందించిన సేవలను వివరించారు. లావణ్య సాంస్కతిక సంస్థ కార్యదర్శి కామేశ్వర రావు మాట్లాడుతూ తెలుగు పద్య ప్రక్రియ సౌందర్యాన్ని వివరించారు. తెలుగు భాషకు సీపీ భ్రౌన్ చేసిన సేవలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ధనలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ఉమాపతినాయుడు, ఆంధ్ర విద్యాసంఘానికి చెందిన ఐటీఓ జనక్‌పురి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఏఈఎస్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.