బ్రౌన్ శాస్త్రి! | legend Brown Shastri! | Sakshi
Sakshi News home page

బ్రౌన్ శాస్త్రి!

Published Fri, Feb 28 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

బ్రౌన్ శాస్త్రి!

బ్రౌన్ శాస్త్రి!

  నివాళి
 డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (20.10.1925-28.02.2014) ఇవాళ ఒక లెజెండ్ మాత్రమే కాదు సెలబ్రిటీ కూడా. ఈ రెండు నిర్వచనాలకు ఆయన తగిన వారనడంలో కొంచెమైనా అతిశయోక్తి లేదు.  వేమనను సీపీ బ్రౌన్ వెలుగులోకి తెస్తే, సీపీ బ్రౌన్‌ను జానమద్ది వెలుగులోకి తెచ్చారు. కడపలోని తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా వచ్చిన బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సేవ చేసి తెలుగు సూర్యుడిగా ప్రసిద్ధుడైతే బ్రౌన్‌ను వెలుగులోకి తెచ్చిన జానమద్ది సాహితీ సూర్యుడిగా ప్రసిద్ధి చెందాడు. సీపీ బ్రౌన్ జీవితం, కృషి ఆయనకు కొట్టిన పిండి. బ్రౌన్‌కు సంబంధించినంత వరకు ఆయన అధికార ప్రతినిధి అంటే అబద్ధం కాదు. అందుకే ఆచార్య సి.నారాయణరెడ్డి జానమద్దిని బ్రౌన్ శాస్త్రి అని కీర్తించారు.
 
 సీపీ బ్రౌన్ కడపలో నివసించిన స్థలాన్ని బ్రౌన్ కాలేజీ అంటారు. అది శిథిలావస్థలో ఉండగా గుర్తించిన జానమద్ది బంగోరే, ఆరుద్రల స్నేహంతో ఆ స్థలంలో సీపీ బ్రౌన్ స్మారక ట్రస్టీని ప్రారంభించారు. 1986లో దానికి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి క్రమంగా దానిని సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయంగా, ఆ పైన సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా ఎదిగించడంలో జానమద్ది కృషి అసమానమైనది. ఇవాళ సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో 75 వేల గ్రంథాలు, 250 తాళపత్ర గ్రంథాలు, విలువైన మెకంజీ కైఫీయత్తులు, బ్రౌన్ రచనలు, బ్రౌన్ లేఖలు ఉన్నాయి.
 
 అయితే ఇదంత సులువుగా జరగలేదు. మొండి గోడలున్న స్థానంలో మూడంతస్తుల మహా సౌధాన్ని నిర్మించి రాష్ట్ర స్థాయిలో దానికి గుర్తింపు తేవడానికి జానమద్ది పడిన శ్రమ అంతా ఇంతా కాదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కలుసుకుని నిధులను సేకరించారు. రెండు రూపాయల నుండి ఎవరు ఎంత ఇచ్చినా స్వీకరించారు. ఇటుక ఇటుక పేర్చి మూండతస్తులు నిర్మింపజేశారు. దానిని శాశ్వతంగా తన అధీనంలో ఉంచుకుందామనే స్వార్థానికి లోను కాకుండా 2005లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, ఆ తర్వాత యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అంతేకాదు సీపీ బ్రౌన్ ద్విశత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు.
 
 అనంతపురంజిల్లా రాయదుర్గంలో సామాన్య కుటుంబంలో జన్మించిన జానమద్ది పొట్ట చేతపట్టుకుని ఉద్యోగ రీత్యా కడపజిల్లాకు వచ్చి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే ఆయన కేవలం ఉద్యోగిగా మిగిలిపోయి ఉంటే ఆయన్ను గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఆయన ఉద్యోగాన్ని జీవితానుసారంగా మాత్రమే చేసుకుని జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు. తనకు మంచి జీవితాన్ని ఇచ్చిన సమాజానికి తాను ఏం చేయగలనోనని తలచుకుని తన చేతనైనంత రూపంలో ఈ సమాజం రుణం తీర్చుకున్నారు.
 
 డాక్టర్ జానమద్ది జీవితంలో మూడు తరాలుగా వికసించింది. ఒకటి రచనా జీవితం, రెండు జిల్లా రచయితల సంఘం, మూడు సీపీ బ్రౌన్ గ్రంథాలయం. జానమద్ది రచయిత. ప్రధానంగా జీవిత చరిత్రకారుడు. దేశ విదేశాల్లో గొప్ప వ్యక్తుల జీవితాలను ఆయన వందల కొలది వ్యాసాలతో, నేటి తరానికి పరిచయం చేశారు. ‘ఎందరో మహానుభావులు’, ‘భారత మహిళ’, ‘సుప్రసిద్దుల జీవిత విశేషాలు’, ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య’, ‘బళ్లారి రాఘవ’, ‘శంకరంబాడి సుందరాచారి’ వంటి గ్రంథాలు ఆయన జీవిత చరిత్ర రచనా సామర్థ్యానికి సంకేతాలు. ‘కన్నడ కస్తూరి’, ‘మా సీమ కవులు’ వంటి గ్రంథాలు ఆయన సాహిత్యాభిరుచికి నిదర్శనాలు. కడపజిల్లా రచయితల సంఘాన్ని 1973లో స్థాపించి దాని కార్యదర్శిగా  20 ఏళ్లు పనిచేశారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ రచయితలను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. రెండు మూడు రోజులపాటు జరిగే మహాసభలను ఎనిమిదింటిని నిర్వహించారు.  ప్రతి మహాసభకు ప్రత్యేక సంచికను తీసుకు వచ్చారు. బెజవాడ గోపాల్‌రెడ్డి, అరుద్ర, దాశరథి, కుందుర్తి, పురిపండ అప్పలస్వామి, శ్రీశ్రీ, సినారె, ఎమ్మెస్ రెడ్డి, దేవులపల్లి రామానుజరావు, దివాకర్ల వెంకట అవధాని వంటి రచయితలను, విద్వాంసులను రప్పించి అద్భుతమైన సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు.
 
 ఆయనను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అనేక సంస్థలు, లోక నాయక ఫౌండేషన్ వంటివి ఆయనకు పురస్కారాలను అందించి తమను తాము గౌరవించుకున్నాయి. ఆయన పేరు మీదనే జానమద్ది సాహితీపీఠం మూడేళ్ల క్రితం మొదలై కళారంగంలో కృషి చేసిన వారిని ప్రోత్సహిస్తోంది.
 మలినం లేని హృదయం, మల్లెపువ్వు వంటి, తెలుగుతనం ఉట్టిపడే వేషం, అందమైన  వాక్కు, మృదువైన కంఠం, మందస్మిత వదనారవిందం చూపరులను ఆకర్షించే జానమద్ది మూర్తి. వయోభేదం లేకుండా కులమతాలతో సంబంధం లేకుండా ఎవరితోనైనా స్నేహం చేయగల సహృదయతకు ప్రతీక జానమద్ది. నైరాశ్యం ఎరుగని ఉత్సాహం, పారుష్యం ఎరుగని సంభాషణం ఆయన జీవిత లక్షణాలు. ఒకసారి మాట్లాడితే మళ్లీ మాట్లాడాలనిపించే వ్యక్తిత్వం ఆయనది.
 
 సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆయన శ్వాస, ఆయన ధ్యాస. తాను మరణిస్తే తన పార్థివదేహాన్ని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ప్రజల కోసం కొన్ని గంటలు ఉంచాలని ఉబలాటపడిన డాక్టర్ జానమద్ది స్వార్థ రాహిత్యానికి మారుపేరు. అందుకే  2014 ఫిబ్రవరి 28 ఉదయం 6.00 గంటలకు తుది శ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల మధ్య సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో అభిమానులు, ప్రజల సందర్శనార్థం పెట్టారు. ‘ఎందరో మహానీయులు’ గ్రంథాన్ని రచించిన జానమద్ది హనుమచ్ఛాస్త్రి రాయదుర్గం నుండి బ్రౌన్ దుర్గం దాక పయనించిన మహానీయుడు.
 - రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
 
 తొంభై ఏళ్ల జీవితంలో అరవై ఏళ్లు సమాజానికి అంకితం చేసిన డాక్టర్ జానమద్ది జీవితం అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారులతో నిండిపోయిన నేటి సమాజాన్ని సంస్కరించాలనుకునే వాళ్లకు నిస్సందేహంగా దీపధారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement