Rachapalem Chandrasekhar reddy
-
ఎంత చేయాలో అంత చేశారు!
జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన కేతు విశ్వనాథ రెడ్డి కడుపు నిండినవాళ్ళ కోసం రాయలేదు. కడుపు కాలినవాళ్ళ కోసం రాశారు. రాయలసీమను పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు – కరువు, ముఠాతత్వం గురించి అత్యుత్తమ కథలు రాశారు. స్త్రీ పట్లగల మానవీయ దృష్టికి కూడా ఆయన కథలు నిదర్శనాలు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సంపుటాలుగా వింగడించి పెద్ద చలనం తీసుకొచ్చారు. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన తీరును అనేక వ్యాసాలలో స్పష్టం చేశారు. విరుద్ధ భావజాలం గలవారిపట్ల కూడా గౌరవంగా మాట్లాడేవారు. ఒకరు ఉపయోగకరమైన పని చేస్తే, ఆ కృషి కొనసాగింపునకు ప్రోత్సహించే సంస్కారి. ‘మానవతావాదులు కాని వారెవరూ కమ్యూనిస్టులు కాలేరు’ అన్నారు శ్రీశ్రీ ఒక ఇంటర్వ్యూలో. కులం, మతం, జెండర్, ప్రాంతం వంటివాటితో సంబంధం లేకుండా మనుషులను ప్రేమించడమే మానవవాదం. ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (10 జూలై 1939– 22 మే 2023) అలాంటి మానవ వాది, మానవతావాది. లేకుంటే ‘అమ్మవారి నవ్వు’ అనే మంచికథ రాసేవారు కాదు. ‘బోధి’, ‘వేర్లు’ నవలికలు రాసేవారు కాదు. ‘శశిశ్రీ’, రహమతుల్లా, షేక్ హుస్సేన్ సత్యాగ్ని లాంటి ముస్లిం రచయితలను, హయాత్ అనే ఆచార్యుని సోదరులుగా గౌరవించేవారు కాదు. విశ్వనాథరెడ్డి వ్యవసాయక కుటుంబం నుండి వచ్చారు. బాగా జరుగుబాటున్న కుటుంబంలో పుట్టిన ఆయన కడుపు నిండిన వాళ్ళ కోసం రాయలేదు. కడుపు కాలిన వాళ్ళకోసం రాశారు. అదే ఆయన మానవత్వం. మానవతావాది కనుకనే, రాయలసీమను పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు – కరువు, ముఠాతత్వం గురించి ‘జప్తు’, ‘విరూపం’, ‘సానుభూతి’ లాంటి అత్యుత్తమ కథలు రాశారు. ఆయన ఆకాంక్ష , ఆయన స్వప్నం కరువు, కక్షలు లేని రాయలసీమ. ఆయన బంధువర్గం ఫ్యాక్షన్ గొడవల్లో పడి నలిగిపోవడం చూశారు. ఫ్యాక్షన్ వల్ల ఇతర ప్రాంతాల దృష్టిలో రాయలసీమ గౌరవం దెబ్బతింటున్నదని గ్రహించి ‘వెనకా ముందు’ కథ రాశారు. ఫ్యాక్షనిస్టులు చివరికి ఒక్కటై, వాళ్ళ కోసం పేదలు బలైపోతున్న అమానుషత్వాన్ని ‘పీర్లసావిడి’ కథలో చిత్రించారు. నేను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న సమయం (1973–1977)లో బహుశా 1975 ప్రాంతంలో విశ్వనాథ రెడ్డి పరిచయమయ్యారు. నన్ను ‘చంద్రా’ అని పిలిచేవారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఒకసారి నన్ను తిరుపతిలో కేతు ఇంటికి పిలుచుకొని వెళ్ళారు. ఆ సమయంలో కేతును గురించి వల్లంపాటి నాతో ‘ఈయన పైకి చూడడానికి నవ్వుతూ కనిపిస్తాడు కానీ, పెద్ద రౌడీ’ అన్నారు. అప్పుడు కేతు నవ్వుతూనే ‘చంద్రా! ఆయన మాటలు నమ్మొద్దు’ అన్నారు. అలా మొదలైన మా పరిచయం నిరాఘాటంగా కొనసాగింది. కేతు మార్క్సిస్టు అయినా, మార్క్సిస్టులు కాని చెరుకు పల్లి జమదగ్ని శర్మ, పేరాల భరత శర్మ వంటి సహాధ్యాపకుల గురించి ఉన్నతమైన మాటలు చెప్పేవారు. ఒకరిని చూస్తే ఇంకొకరికి పడని కాలంలో విరుద్ధ భావజాలం గలవారిపట్ల గౌరవంగా మాట్లా డడం నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒకరు ఉపయోగకరమైన పని చేస్తే, దానిని మెచ్చుకొని, ఆ కృషి కొనసాగింపునకు ప్రోత్సహించే గొప్ప సంస్కారం ఆయనది. ‘నేను చాలా స్లో రైటర్ని’ అని విశ్వనాథరెడ్డి చెప్పుకొన్నారు. సమాజాన్ని దహించి వేస్తున్న రుగ్మతలను సమగ్రంగా మనసులో రూపుకట్టించుకొని రాయడానికి చాలా సమయమే తీసుకొనేవారు. ‘వాన కురిస్తే’ కథలో రైతు పాపయ్య, ఆయన కుటుంబమంతా వానకోసం ఎదురు చూడడంలోనే జీవితాలు గడిచిపోతాయి. కరువు కాలంలో ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే గడ్డిని ఆధిపత్య వాదులు పేదలకు అందకుండా తస్కరించే వాస్తవికతను ‘గడ్డి’ కథలో చిత్రించారు. ఈ అమాన వీయతను ‘నా బట్టా! నువ్వు రైతు కొంపల్లోనే పుట్టి నావా? కాపోడి వేనా?’ అని ఒక పేద మహిళ నిలదీస్తుంది. ఇలాంటి మాటలు రాయాలంటే రచయిత ‘అ–కులీక రణ’ (డీక్యాస్టిఫై) అయితే తప్ప సాధ్యం కాదు. అకులీకరణ చెందా లన్నా, అవర్గీకరణ చెందా లన్నా రచయిత హృదయంలోని మానవ త్వమే దారి చూపుతుంది. పులివెందుల కాలువ వస్తు వుగా ఆర్తితో రాసిన ‘పొడినిజం’ కథలో కరువుతో ఎండిపోయి,పంటలు పండని నేలను ఒక విద్యార్థి దృష్టికోణం నుండి ‘అచ్చరాలు తుడిచేసిన పలకలాగా ఉంది’ అనిపిస్తాడు. పంటలు పండించి బతికే రైతులు కరువు వల్ల సారా వ్యాపారులుగా మారి, పోటీలు పడి, ఆఖరికి ఫ్యాక్షనిస్టులుగా మారి ఒకర్నొకరు చంపుకొనే అమానుష దశకు చేరుతున్న వాస్తవమే ‘కూలిన బురుజు’ కథ. భారతీయ సమా జంలో వితంతువులు పీడిత వర్గం. వాళ్ళపట్ల సమాజం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో ‘ముఖదర్శనం’ కథలో చిత్రించారు. కేతు విశ్వనాథరెడ్డి రెడ్డి స్త్రీపక్షపాతి. అలా కాని రచయితలు మానవతా వాదులు కారు. ‘తారతమ్యం’, ‘మారి పోయారు’ వంటికథలు ఆయ నకు స్త్రీ పట్లగల మానవీయ దృష్టికి నిదర్శనాలు. ‘ఎందరి దయా దాక్షిణ్యాల మీద ఆడవాళ్ళు బతకాలి?’ అని ‘తారతమ్యం’ కథ ప్రశ్ని స్తుంది. ఈ కథ 1977 నాటిది. అప్పటికి తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం పుట్టలేదు. డబ్బు కొంతమంది చేతుల్లో ఉండిపోవడాన్ని వేమన వంటి ప్రాచీన కవులే గుర్తించారు. ఆధునిక కాలంలో మార్క్సిజం నేర్పిన పాఠాలతో ప్రభావితమైన అభ్యుదయ రచయితలు అసమ ఆర్థిక వ్యవస్థ çసృష్టించే వైరుధ్యాలను బలంగా చిత్రించారు. ‘డబ్బు ఈ సంఘంలో అన్నింటినీ శాసిస్తోంది’ అన్న అవగాహన విశ్వనాథరెడ్డిది. ఈ అవగాహనతో ‘చీకటితప్పు’, ‘దాపుడుకోక’, ‘చెదిరిన గుండెలు’ వంటి విలువైన కథలు రాశారు. ‘దాపుడుకోక’ కథలో చెన్నమ్మ పేదరికం మానవత్వం ఉన్నవాళ్ళను కలవరపరుస్తుంది. సంపద ఒకరి చేతిలో ఉండే వ్యవస్థలో పీడితులు కూడా సంపద తమ చేతికి వేస్తే, పీడకులుగా ఎలా మారతారో ‘సొతంత్రం’ కథలో సాయమ్మ పాత్ర ద్వారా చూపించారు. మార్క్సిజం వ్యక్తి గత ఆస్తిని వ్యతిరేకిస్తుంది. ఆ దృష్టి ఈ కథలో కనిపిస్తుంది. ఆయన కథలు చదివితే మన సంస్కారంలో ఒక కదలిక వస్తుంది. వర్తమాన ఆర్థిక రాజకీయ సాంఘిక వ్యవస్థ మీద మనల్ని పునరాలోచింప చేస్తాయి. ప్రజలకు సేవ చేయడానికి ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి ఉద్యోగులుగా ప్రభుత్వం నియమిస్తుంది. ఆ ఉద్యో గులు అదనపు ఆదాయం కోసం ప్రజలను పీడించడాన్ని సహించరు అభ్యుదయ రచయితలు. ‘చక్రబంధం’, ‘పద్ధతి’ (విద్యారంగం), ‘అనధికారం’, ‘ఆ రోజుల్లో వస్తే’, ‘సందాకబళం’, ‘అంతర్ముఖం’ (పోలీసు శాఖ), ‘పారు వేట’ (అటవీ శాఖ), ‘దప్పిక’ (రెవెన్యూ), ‘వైరుధ్యం’ (పంచాయతీ రాజ్) వంటి కథల ద్వారా కార్యనిర్వహణ వ్యవస్థలోని అమానుషత్వాలను ప్రతిబింబించారు కేతు. ప్రాంతాల మధ్య వైరుధ్యాలను కూడా ‘తేడా’, ‘ఒక దృశ్యం– మరొక చిత్రం’ వంటి కథల్లో ఆవిష్కరించారు. ‘శిలువ వేసిన మనుషులు’ వంటి కథలలో దళితుల జీవితాల లోని దైన్యాన్ని ప్రతిపాదించారు. పల్లెలు, నగరాలు, భారతదేశం, విదేశాలు – వీటి మధ్య తేడాలను ‘రెండు ప్రపంచాల మధ్య’, ‘దగ్గరైన దూరం– దూరమైన దగ్గర’, ‘అంత్యాక్షరి’ వంటి కథలలో కంటికి కొట్టి నట్లు చిత్రించారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, కేతు విశ్వనాథరెడ్డి కథలు పొడినిజాల పట్ల తడిగీతాలు! కేతు శాస్త్రీయమైన సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. ‘కడప ఊర్ల పేర్లు’ అంశం మీద పరిశోధించి, ఓనమాస్టిక్స్ అనే ప్రత్యేక అధ్య యన విభాగానికి పునాది వేశారు. సామాజిక శాస్త్రాల సహాయంతో సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన తీరును అనేక వ్యాసాలలో స్పష్టం చేశారు. ‘దృష్టి’, ‘సంగమం’, ‘పరిచయం’ వంటి గ్రంథాలు ఆయన విమర్శన గాఢతకు నిదర్శనాలు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలుగు వాచకాల్లో విప్లవం తీసుకొచ్చారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యాన్ని సంపుటాలుగా వింగడించి విలువైన సంపాదకీయాలు రాసి పెద్ద చలనం తీసుకొచ్చారు. గొప్ప విద్యావేత్త. దూరవిద్యా విధానం మీద ఆయన చేసిన కృషి ‘భాషాబోధన, విద్య– మార్పులు, ప్రాసంగికత’ అనే పుస్తకంగా వచ్చింది. ‘రాయలసీమ రాగాలు’, ‘చదువుకోలేదు’ వంటి పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహ రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం, అజోవిభొ కందాళై పురస్కారం వంటివి ఆయనకు దక్కాయి. ఒక మధ్య తరగతి మేధావి, ఆధునిక రచయిత తన సమాజానికి ఎంత చేయాలో అంత చేశారు! రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త తెలుగు సాహిత్య విమర్శకులు -
ఆయన... కాలం చెల్లని కవి
తెలుగు సమాజంలో జాషువా ప్రాసంగికత కాలం నడుస్తున్న కొలదీ పెరుగుతోంది. ఆయన మరణించి యాభై ఏళ్ళు గడచినా ఆయన కవిత్వం మన సమాజంతో సజీవ సంబంధం కలిగి ఉంది. 1895 సెప్టెంబర్ 28న అంటే 126 ఏళ్ళ క్రితం పుట్టిన జాషువా 1971లో మరణించారు. ఆయన 76 ఏళ్ళు జీవించారు. ఈ జీవిత కాలంలో 1917 నుండి 1966 దాకా విభిన్న రచనలు చేశారు. కొన్ని పౌరాణిక రచనలు మినహాయిస్తే, ఆయన రచించిన సాంఘిక కావ్యాలు ఈనాటికీ తెలుగు సమాజంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. గుర్రం జాషువా ఏయే సామాజిక రుగ్మతల్ని తన కవిత్వంలో విమర్శకు పెట్టారో, అవి ఇప్పుడు కూడా యథాతథంగాగానీ, రూపం మార్చుకొనిగానీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనకు ఒక అందమైన భారతదేశ సామాజిక స్వప్నం ఉంది. ఆ కల ఇంకా సాకారం కాలేదు. ఆ అందమైన భారతీయ సమాజం ఆవిర్భవించేదాకా ఆయన కవిత్వానికి సామాజిక ప్రాసంగికత ఉంటుంది. వలసపాలన ముగిసిన వెంటనే ‘అచ్చముగ భారతీయుడనైతి నేడు’ అని ఎగిరి గంతేసిన కవి జాషువా. సాంఘికంగా వివక్షలు, ఆర్థికంగా అసమానత, రాజకీయంగా అవినీతి, సాంస్కృతికంగా మౌఢ్యం లేని కొత్త భారతదేశం జాషువా స్వప్నం. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ఆయన సమాజంలో రావలసిన మార్పులను గుర్తుచేస్తూ వచ్చారు. తన స్వప్నం సాకారం కావడానికి ఏయే సామాంజి కాంశాలు అడ్డుపడుతున్నాయో వాటినన్నిటినీ విమర్శిం చారు జాషువా. 1932 నాటి ‘పిరదౌసి’ కావ్యం నుండే ఆయన శ్రమదోపిడీని విమర్శించారు. 1934 నాటి ‘అనాథ’ కావ్యం నుండే స్త్రీ శక్తిని కీర్తించారు. ఆధిపత్యం, అసమానత, అవినీతి, మౌఢ్యం ఈ నాల్గింటిని ప్రజలకు శత్రువులుగా భావించిన జాషువా, అవి లేని భారతదేశం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. అయితే, స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడచిపోతున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల ఆయన ఈనాటికీ మనకు కావలసిన కవి. సాంఘిక నిరంకుశత్వానికి భౌతిక రూపమైన కులవ్యవస్థను, దాని వికృతచేష్ట అయిన అస్పృశ్యతను జాషువా తీవ్రంగా విమర్శించారు. అస్పృశ్యతా నిర్మూలనకు అనేక సందర్భాలలో పిలుపునిచ్చారు. ‘అనాథ’, ‘గబ్బిలం’ వంటి అనేక కావ్యాలలో తన దళిత వేదనను ఆగ్రహం గానూ, ఆర్ద్రతతోనూ వినిపించారు. ‘కుల భేద పిశాచి’ అని కులవ్యవస్థను నిర్వచించారు. దళితకులంలో పుట్టినకవిగా తన అనుభవాలను కవితలుగా మలిచారు. ‘కసరిబుసకొట్టు నాతని గాలిసోకనాల్గుపడగల హైందవ నాగరాజు’ అన్న వాక్యం జాషువా కులనిరసనలలో అగ్రగామి. ‘చెండింపుమస్పృశ్యతన్’ అని ఒక చోట, ‘కారుణ్యంబున నంటరాని తనమును ఖండింపవా?’ అని మరోచోట ఇలా అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశారు. సాంఘిక వివక్ష, కులనిరంకుశత్వం లేని వ్యవస్థను కోరుకొన్న జాషువ ఈనాటికీ సామాజిక అవసరమే. కాలం ఎంతమారుతున్నా, దళితులు చదువుకొని, చైతన్యవంతులవుతున్నా వాళ్ల పట్ల వివక్ష మాత్రం తగ్గవలసినంతగా తగ్గలేదు. అందుకే ఆయన కాలంచెల్లిన కవి కాదు. అభ్యుదయ సాహిత్యం మొదలవుతున్నప్పుడే జాషువా ఇతర మార్క్సిస్టు కవులలాగే మన సమాజంలోని వర్గ వైరుధ్యాలను గుర్తించారు. సంపద అందరిదీ కావాలని, శ్రమదోపిడీ నశించాలని కోరుకున్నారు. దళితులు శ్రమదోపిడీకి గురికావడాన్ని నిరసించారు. వాని రెక్కలకష్టంబు లేనినాడు / సస్యరమ పండి పులకింప సంశయించు / వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు / భోజనము బెట్టు, వానికి భుక్తి లేదు (గబ్బిలం) అంటూ దళిత శ్రామికుల శ్రమ పరాయీకరింపబడటాన్ని జాషువా అధిక్షేపించారు. ‘ఒక ప్రాణి కొక ప్రాణి యోగిరంబ’య్యే వ్యవస్థను నిరసించి, మానవీయ భారతదేశం ఆవిర్భవించాలని జాషువా ఆకాంక్షించారు. ఇప్పుడు దేశంలో ఎంతో మార్పు వచ్చినా అధిక సంఖ్యాకుల శ్రమ మాత్రం దోపిడీకి గురౌతూనే ఉంది. శ్రమ దోపిడి నశించేదాకా జాషువా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. ఆయన గాంధీజీ అడుగుజాడలలో నడిచిన రాజకీయ కవి. ‘గబ్బిలం’, ‘బాపూజీ’ వంటి కావ్యాలలో జాషువా తన రాజకీయ దృక్పథాన్ని చాటి చెప్పారు. అయితే స్వాతంత్య్రానంతర రాజకీయాలలో ఆడంబరాలు పెరిగిపోవడం, ఆర్థిక అవినీతి పెచ్చరిల్లడం, ఎన్నికలలో ధనప్రాబల్యం ప్రవేశిం చడం వంటి అనేక దుష్పరిణామాల మీద జాషువా కవితాగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం రాగానే దేశం పూర్తిగా మారిపోతుందని కవి ఆశించారు. ఒక ఏడాది గడచినా మార్పు కనిపించలేదు. మొదటి సార్వత్రిక ఎన్నికలలోనే ధనం పాత్రను గుర్తించి ఆనాడే ప్రజలను హెచ్చరించారు జాషువ. ఇప్పుడు ఈ ధనప్రధాన ఎన్నికల రంగం బాగా బలిసిపోయింది. మతం పేరు మీద మౌఢ్యం రాజ్యమేలడాన్ని ఆయన వ్యతిరేకించారు. మతం కన్నా మనిషి ప్రధానమని భావిం చారు. నరుని కష్టపెట్టి నారాయణుని కొలిచే వింత సంస్కృతిని ప్రశ్నించారు. పెండ్లిండ్లకు, విగ్రహాలకు విపరీతంగా ధనం ఖర్చుపెడుతూ ప్రజలు ఆకలితో మాడుతుంటే పట్టిం చుకోని అమానుషత్వాన్ని నిలదీశారు. అంటువ్యాధులు వచ్చినపుడు ప్రతిమలను పూజించడం ‘ముతక తెలివి’ అన్నారు. కందుకూరి, గురజాడల నుండి అనేకమంది తెలుగు ప్రజా రచయితలు సమాజ పునర్నిర్మాణానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో గుర్రం జాషువా ఒక్కరు. మరణించి 50 ఏళ్ళు ముగిసినా ఆయన కవిత్వం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఈ సందర్భంలో ఆయన కవిత్వాన్ని సమకాలీన దృక్పథంతో అధ్యయనం చేసి, పునర్మూల్యాంకనం చేయడం ఇప్పుడు చేయవలసిన పని. ఇదే ఆ మహాకవికి అసలైన నివాళి. ‘కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి/పంజరాన కట్టువడను నేను /లోకనిఖిలమెట్ల నిర్ణయించిన నాకు/తరుగులేదు విశ్వనరుడ నేను’ (నేడు గుర్రం జాషువా 126వ జయంతి) రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు -
దళిత ఉద్యమ సారథి కత్తి పద్మారావు
డాక్టర్ కత్తి పద్మారావు ప్రపంచ మెరిగిన హేతువాది. జగమెరిగిన దళిత ఉద్యమ నాయకుడు. ఆయనది భౌతిక తాత్విక వాద ప్రాపంచిక దృక్పథం. పైగా కల్తీలేని మానవతావాది. నిజాయితీ గల బోధకుడు. మనిషి తాను సృష్టించుకున్న దైవభావనకు తానే బానిసై, మతం స్వార్థపరుల చేతిలో చిక్కి, అధిక సంఖ్యాకులను మభ్యపెట్టడానికి, అణచిపెట్టడానికి సాధనంగా మారడంపై ఆయన యుద్ధం ప్రకటించారు.. హేతువాది, మానవతావాది అయిన కత్తి పద్మారావు బౌద్ధంవైపు మొగ్గారు. దళిత బహుజనుల రాజ్యాధికార సాధనకు ఆయన బౌద్ధాన్ని, అంబేడ్కర్ వాదాన్ని ఆధారం చేసుకున్నారు. బౌద్ధ ధర్మాన్ని, అంబేడ్కరిజాన్ని తన తాత్విక నేపథ్యంగా స్వీకరించారు. భారతదేశంలో మార్క్సిజం అగ్రకుల నాయకత్వంలో ఉండటం పట్ల ఆయనకు అభ్యంతరాలున్నాయి. మార్క్సిస్టు ఉద్యమ ధోరణుల పట్ల విమర్శనాత్మక దృష్టి కలిగి ఉన్నారు. అలా అని ఆయన మార్క్సిజానికి వ్యతిరేకి కారు. చుండూరు సంఘటన జరిగి దశాబ్దాలు గడిచిన సందర్భంగా దాని పరిణామాలను స్మరించుకుంటూ ‘సైనిక గీతం’ రాశారు. మొదటి నుంచీ ఆయనది ఉద్యమ జీవితం. మొదట హేతువాద ఉద్యమం. ఆ తర్వాత దళిత ఉద్యమం. మధ్యలో మార్క్సిజం అధ్యయనం. సైద్ధాంతిక గ్రంథ రచన, సాహిత్య విమర్శ, కవిత్వ రచన – ఆయన రచనా జీవితానికి మూడు ముఖాలు. కారంచేడు, చుండూరు సంఘటనలతో ఆయన కుల నిర్మూలనా ఉద్యమానికి నాయకత్వం వహించారు. కుల వ్యవస్థ విశ్లేషణకు, దాని నిర్మూలనకు, కుల రహిత సమాజ నిర్మాణానికి అవసరమైన జ్ఞానాన్ని అందివ్వడానికి సామాజికాంశాల మీద విస్తృతంగా గ్రంథ రచన చేశారు. ఆయన ప్రచురించిన ముళ్ళ కిరీటం (2002), భూమి భాష (2004), కట్టెల మోపు (2007), ఆత్మగౌరవ స్వరం (2010), ఈ యుగం మాది (2014) కవిత్వ సంపుటాలు చదివితే గత దశాబ్దాన్ని ఆయన కవిగా తనది చేసుకున్నారా అనిపిస్తుంది. తన అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ తన కవిత్వ గురువులని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా కవిత్వ గురువులుగా పూర్వకవులను చెప్పుకుంటాం. పద్మారావు తన తల్లులనే చెప్పుకున్నారు. ఈ ముగ్గురు దళిత మహిళలు. శ్రామిక మహిళలు. వాళ్ళు జీవితాన్ని గడిపేసిన వాళ్ళుకారు. జీవితాన్ని జీవించిన వాళ్ళు, జీవిత సారాన్ని పాదం ముట్టినవాళ్ళు. జీవితం సజీవయానం అన్నది ప్రజా భావన. ఈ ‘యానం’లో సంఘర్షణ, శ్రమ, అనుభవం ఇమిడి ఉంటాయి. కవిని వాళ్ళమ్మ ఎలా పెంచిందో ‘ముళ్ళకీరిటం’ కవిత చదివితే అర్థమౌతుంది. నేల మీద బతికినప్పుడే జీవితయానమవుతుంది. అది పద్మారావుకి తెలుసు. అందుకే జీవితాన్ని సజీవయానం అన్నారు. సజీవయానమంటే శ్రమతో కూడిన బతుకు అని అర్థం. జీవితం ఒక పరివేదన అని చెబుతారు పద్మారావు. పరివేదన అంటే ఏడుపు కాదు. ఇది కలిగిన వాళ్ళ లక్షణం. పరివేదన అంటే జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులకు పారిపోకుండా నిలవటం. ‘‘చీకటిని తొలగించటమే కాదు’’ అనే కవితను ‘చీకటిని జయించాలి’ అంటూ ముగించారు కవి (పైది; పు:44). దానికి అవసరమైన కొరముట్టు పరివేదన. జీవితం ఒక గీతం (భూమిభాష; పు:48). గ్రామీణ భారత జీవితాన్ని కాచి వడబోసిన జానపదులు మాత్రమే జీవితాన్ని ఇలా నిర్వహించగలరు. ‘జీవితం ఒక పరివేదన’ అన్న కవి ‘జీవితం ఒక గీతం’ అన్నారు. జీవితం ఒక సముద్రమని, దానిని ఈదడం సాధ్యం కాదని వేదాంతులు మనల్ని భయపెడితే, శ్రామికతత్వాన్ని జీర్ణించుకున్న కవి జీవితాన్ని గీతంగా నిర్వచించారు. ‘‘జీవితానికి సాహసమే ఊపిరి’’ (పైది; పు:379) అన్నా ‘‘జీవించటం ఒక యుద్ధ ప్రక్రియ’’ అన్నా (భూమి భాష; పు:152) కవి తన జాతిని తట్టి లేపడమే. పద్మారావు కవిత్వం ఒక చైతన్య గీతిక. ఒక పొలికేక. ఒక ఆత్మ గౌరవస్వరం. ఆత్మవిశ్వాసపతాక. ఆత్మస్థైర్య గొంతుక. పీడనకు వివక్షకు అణచి వేతకు గురౌతున్న సామాజిక వర్గాల ప్రజలకు పద్మారావుగారి కవిత్వంలోని జీవిత నిర్వచనాలు ధైర్యం చెబుతాయి. ఈ యుగ దళిత గళం ఆయన. కవితా నిర్మాణ శిల్పి, దళిత ఉద్యమ నిర్మాత. మార్క్స్‌ను, అంబేడ్కర్‌ను లోతుగా అధ్యయనం చేసి దళిత ఉద్యమానికి కుల నిర్మూలనా రధసారధి అయ్యాడు. తెలుగువారి చరిత్రలో, భారతదేశ చరిత్రలో అనేక మలుపులకు ఆయన కారకుడు. చరిత్ర నిర్మాత, సిద్ధాంతకర్త, తెలుగు జాతి వైతాళికుడిగా ముందుకు నడుస్తున్న డా‘‘కత్తి పద్మారావు 67వ జన్మదినం తెలుగుజాతి చరిత్రలో మలుపు తిప్పిన ఒక గుర్తింపదగిన రోజు. (నేడు డా‘‘ కత్తి పద్మారావు 67వ జన్మదినం నేపథ్యంలో లుంబినీవనం, పొన్నూరులో జరుగుతున్న సదస్సులో ఆయన రాసిన 70, 71వ పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా) రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి వ్యాసకర్త ప్రముఖ విమర్శకులు మొబైల్ : 94402 22117 -
విద్యా విధానం అమలుకు తొందరేల?
భారత ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం జాతీయ విద్యా విధానం 2019 అనే నివేదిక ముసాయిదాను విడుదల చేసింది. దాని మీద ప్రజల అభిప్రాయాలను తెలపాలని కోరింది. అయితే ఈ నెలాఖరుకల్లా అభిప్రాయాలు తెలపాలని విద్యాశాఖ కోరినట్లు తెలుస్తున్నది. ప్రసిద్ధ శాస్త్రవేత్త, ఇస్రో పూర్వ అధ్యక్షులు డాక్టర్ కె. కస్తూరి రంగన్ అధ్యక్షులుగా, ఎనిమిది మంది సభ్యులుగా భారత ప్రభుత్వం నియమించిన కమిటీ 2018 డిసెంబర్ 15వ తేదీన నివేదిక సమర్పించింది. వెంటనే ఎన్నికలు వచ్చినందువల్ల ఈ నివేదికను ప్రభు త్వం అప్పుడు విడుదల చేయలేదు. ఎన్నికలు పూర్తయిన ఈ నెల మొదట్లోనే విడుదల చేసింది. ఈ ముసాయిదా చాలా పెద్దది. 480 పుటలున్నాయి. నివేదిక ఆంగ్ల, హిందీ భాషలలో మాత్రమే ఉంది. ప్రతి పౌరుడినీ చర్చలో పాల్గొనమని ప్రభుత్వం కోరింది. అందరూ చర్చలో పాల్గొనాలంటే, ఈ ముసాయిదా అన్ని భారతీయ భాషలలో అనువాదమై భారతీయులందరికీ అందుబాటులోకి రావాలి. అందువల్ల ఈ ముసాయిదాను నామమాత్రపు చర్చకు పెట్టి గబగబా అమలు చేయాలని ప్రభుత్వం తొందరపడవద్దు. ముసాయిదా అన్ని భారతీయ భాషలలోకి అనువాదమై రావాలి. అప్పుడు దానిని చర్చకు పెట్టాలి. ముసాయిదాను అర్థం చేసుకోవడానికి అవసరమైనంత సమయం ఇవ్వాలి. తర్వాతనే ప్రజల అభిప్రాయాలకనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఈ ప్రణాళికలు అమలు చేయాలి. ఈ ముసాయిదాలో నాలుగు ప్రధానాంశాలు ఉన్నాయి. మొత్తం 23 అధ్యాయాలు, 14 అనుబంధాలున్నాయి. ప్రతి అధ్యాయానికీ ఆకర్షణీయమైన శీర్షిక ఉంది. అందమైన వివరణ ఉంది. ఉత్సాహం కలిగించే నిర్వచనాలు ఉన్నాయి. నిర్మాణాత్మకమైన భాష ఉంది. ప్రాథమిక విద్య నుంచి అత్యున్నత స్థాయి విద్య దాకా విద్యా సంస్థల ప్రస్తుత స్థితిగతులను పేర్కొంటూ, ఆయా అంశాలలో ఇప్పుడు ఏమి చేయబోతున్నారో నివేదిక ముసాయిదా చెబుతున్నది. అధ్యాపకులు, వారికి శిక్షణ, విద్యార్థులు, వారికి సౌకర్యాల కల్పన, పాఠ్యాంశాల పునర్నిర్మాణం, ఇంటర్ సప్లిమెంటరీ విద్య, లిబరల్ ఆర్ట్స్‌వంటి అనేక విషయాలను ఈ ముసాయిదా ప్రతిపాదించింది. పైపైన చూస్తే ఈ ముసాయిదాను ఆమోదించడానికి అభ్యంతరం చెప్పవలసిన పనిలేదనిపిస్తుంది. కానీ లోపలకు వెళితే, దీనిలో లోతుగా చర్చించాల్సినవి చాలా ఉన్నా యని తెలుస్తుంది. ఈ ముసాయిదాలోని పదజాలం చాలా ప్రజాస్వామికంగా ఉన్నట్లు కని పిస్తుంది. కానీ, ఆ పదాల పరమార్థం వేరుగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ ముసాయిదాలో గతంపట్ల వ్యామోహం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సైన్సుకు, మతానికి ముడివేసే ప్రయత్నం కనిపిస్తుంది. అన్నీ వేదాల్లో ఉన్నాయని రుజువు చేసే సంకల్పమూ కనిపిస్తుంది. చరిత్ర పట్ల భ్రమలు పెంచే దృష్టి తొంగిచూస్తున్నది. చాలా చోట్ల అశాస్త్రీయ, అచారిత్రక ఆలోచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ ముసాయిదా మీద దేశ వ్యాప్తంగా అనేక స్థాయిలలో చర్చ జరగాలి. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలలో చర్చ జరగాలి. ప్రతిపౌరుడూ చర్చలో పాల్గొనాలని కోరినందున పౌరులందరికీ వాళ్లకు తెలిసిన భాషలోకి ఈ ముసాయిదా అనువాదమై రావాలి. గ్రామస్థాయి దాకా ఈ చర్చ జరగాలి. ఈ చర్చ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి. చర్చలలో వ్యక్తమయ్యే అభిప్రాయాలను ప్రభు త్వం నిజాయితీగా స్వీకరించి తన ప్రణాళికలో చేర్చుకోవాలి. ఈ ముసాయిదా మీద ప్రసార, ప్రచార మాధ్యమాలలో విస్తృతంగా చర్చలను ఏర్పాటు చెయ్యాలి. ఈ చర్చలలో అధ్యాపకులను, విద్యారంగ నిపుణులను, మేథావులను నిమగ్నం చేయాలి. చర్చలు సమగ్రంగా జరిగేదాకా, ప్రజాభిప్రాయం సంపూర్ణంగా వ్యక్తం అయ్యే దాకా ఆగాలి. అప్పటి దాకా ప్రభుత్వం ఓపిక పట్టాలి. ముసాయిదాను త్వరత్వరగా అమలు చేయకుండా నెమ్మదిగా వ్యవహరించాలి. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి వ్యాసకర్త ఎస్కే యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు -
సాహిత్యానికి రాచబాట
కథా రచయితగానే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణం. కవిగా.. కథకునిగా.. విమర్శకునిగా.. విలువలతో కూడిన సాహిత్యం ఆయన సొంతం. ‘అనంత’ సాహితీవనంలో తనదైన ముద్రతో సాగించిన రచనా సేద్యం అద్భుత ఫలాలను అందించింది. జిల్లా కీర్తి పతాకను జాతీయ స్థాయిలో ఆవిష్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న ఆ కలం ఎందరికో స్ఫూర్తిదాయకం. రాసినా.. మాట్లాడినా.. రాగద్వేషాలకు అతీతంగా వస్తు వివేచనను సాగించే ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి రచనామృతం అద్భుతం.. అజరామరం. పరిచయం చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కుంట్రపాకంలో 1948, అక్టోబర్ 16న మంగమ్మ, రామిరెడ్డి దంపతులకు రాచపాలెం చంద్రశేఖరరెడ్డి జన్మించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ, పీహెచ్‌డీలతో పాటు వయోజన విద్యలో డిప్లొమా చేశారు. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తమిళంలో సర్టిఫికెట్ కోర్సు చేశారు. 37 సంవత్సరాలు బోధనానుభవం (ఎస్వీలో 31సంవత్సరాలు, వైవీయూలో ఆరు సంవత్సరాలు) గల ఆచార్య రాచపాలెం... లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, శాఖ అధ్యక్షులుగా పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా వ్యవహారించారు. ఈయన నేతృత్వంలో 25మంది పీహెచ్‌డీలు, మరో 20 మంది ఎంఫిల్ చేశారు. అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా, గుర్రం జాషువా జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా వ్యవహారించారు. అరసం రాష్ట్ర అధ్యక్షునిగా, జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షునిగా, రాష్ట్ర అధికారభాషా సంఘం సభ్యునిగా సేవలు అందించారు. నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సలహా మండలి, సాహిత్య అకాడమి (న్యూఢిల్లీ) సభ్యుడిగాను పనిచేశారు. ‘మన నవలలు– మన కథానికలు’ అనే రచనకు ఉత్తమ విమర్శకుడిగా 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. నా ఒరవడి కూడా మారింది ఒకప్పుడు సాహిత్యమంటే సంప్రదాయరీతిలో మూసబోసినట్టుండేది. వాటికి కామా పెడుతూ కొత్త వాదాలు పుట్టకొచ్చాయి. 1980 ప్రాంతాలలో అనుకుంటా యుద్దనపూడి మరణం తర్వాత స్త్రీ వాదం, కారంచేడు, చుండూరు ఘటనలతో దళిత వాదం, బాబ్రీ మసీదు విధ్వంసంతో మైనార్టీ వాదం పుట్టుకొచ్చాయి. ప్రాంతీయ అసమానతల వల్ల అస్థిత్వ వాదాలు కూడా జనిస్తున్నాయి. కాబట్టే నా రచనా వస్తువు కూడా తొలినాళ్లలో ఉన్నట్టు కాకుండా ఒరవడి మారింది. కథలు మాత్రమే రాయడంతో రచయిత పని అయిపోదని నా కలం గ్రహించింది కాబట్టే ఫ్యాక్షనిజం, కరువు రక్కసి, వర్తమాన రాజకీయాలు చేస్తున్న వికృత చేష్టలు ఓ వైపు ఎత్తి చూపుతూనే వాటి పరిష్కార మార్గాలు వెతికే పని చేపట్టాల్సి వచ్చింది. మార్క్సిజమే ఎందుకు? చాలా మంది అనుకుంటారు ఇన్ని వాదాలుండగా మార్క్సిజమే ఎందుకని. ప్రపంచాన్ని బాగా అర్ధం చేసుకోవాలంటే మార్క్సిజాన్ని మించినది మరేది ఉండదు. చరిత్ర అంతా వర్గపోరాటమే. రెండు వర్గాల నడుమ సాగే పోరులో అంతిమ విజయం శ్రామిక వర్గానిదే అని చెప్పే మార్క్సిజం.. పీడిత వర్గం వైపు ఉండాలని కవులకు, రచయితలకు, మేధావులుకు సూచిస్తుంది. అభివృద్ది పథంలో ప్రపంచమంతటా ఒకలా ఉంటే మన దేశంలో కులం అడ్డుగోడగా నిలిచిందనడంలో సందేహం లేదు. శక్తి వంతమైన సమాజ నిర్మాణానికి అంబేద్కరిజమే చక్కటి పరిష్కార మార్గం. కుల రక్కసి చేసే విలయతాండవం మరెన్ని రోజులు చూడాల్సి వస్తోందో. ఆ రోజులే వేరు.. ఒకసారి మా జ్ఞాపకాలలోకి వెళితే అప్పుడుండే పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని అనిపిస్తుంది. ఇప్పుడున్నంత బిజీ లైఫ్ ఉండేది కాదు. కాబట్టే అప్పట్లో నాతో పాటు చిలకూరి దేవపుత్ర, బండి నారాయణస్వామి, రాయుడు, బోసు, బద్వేలు రమేష్, దక్షిణామూర్తి, రఘుబాబు వంటి వారితో నగరంలో ఉండే గిల్డ్ ఆఫ్ సర్వీసు పాఠశాలలోని ఓ తరగతి గదిలో కూర్చొని అనేక విషయాలు చర్చించుకునే వాళ్లం. ముఖ్యంగా 21 వారాలు ‘లిటరరీ మీట్’ నడిపాం. కథా చర్చలు జోరుగా సాగేవి. ముఖ్యంగా అవధాని ఆశావాది ప్రకాశరావు ‘రాయల కళా గోష్టి’ పేరిట సాగిన చర్చలు ఎంతో రసవత్తరంగా ఉండేవి. కవితా వస్తువు కూడా విభిన్నమే రాయలసీమ నిర్ధిష్ట సమస్యలైన కరువు, ఫ్యాక్షనిజం, వర్తమాన రాజకీయాలు..ఇవే నా కవితా వస్తువులు.. కథలలో నాటకీయత కన్నా సజీవ చిత్రణ గొప్పగా కనపడాలని నేననుకుంటాను. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు కళ్లముందు కదలాడే విధంగా రచనలుండాలి. వాటికి తగ్గట్టుగానే నా ‘రెండు ప్రపంచాలు’, ç‘స్వర్ణభారతి సాక్షిగా’, ‘సీమ నానీలు’, ‘పొలి’ వంటి కవితా సంకలనాలు, ‘తెలుగు కవిత్వంలో నన్నయ్య ఒరవడి’, ‘గురజాడ తొలి కొత్త తెలుగు కథలు’, ‘చర్చ మరోచర్చ’, ‘విమర్శ –2009’ వంటి విమర్శనా గ్రంథాలు.. ‘అనంత’ సాహిత్యం ప్రత్యేకతను చాటాయనే అనుకుంటున్నా. ముఖ్యంగా చాలా మందిని కదిలించిన విమర్శనా గ్రంథం ‘ప్రతిఫలనం.’ ఇందులో అనేక మంది రచయితల ప్రసిద్ధ కథలపై విమర్శ సాగుతుంది. ఇదే ఒరవడిలో సాగిన ‘మన నవలలు–మన కథానికలు’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది. విమర్శపై విమర్శ రాసినవారు అరుదుగా కనిపిస్తారు. ఆ అదృష్టం నాకు దక్కడం ఆనందమే మరి. బయోడేటా పేరు : రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పుట్టిన తేదీ : 16.10.1948 స్వగ్రామం : కుంట్రపాకం, చిత్తూరు జిల్లా తల్లిదండ్రులు: రామిరెడ్డి, మంగమ్మ భార్య : లక్ష్మీకాంతమ్మ పిల్లలు : శ్రీవిద్య, ఆనందకుమార్ చదువు : ఎంఏ., పీహెచ్డీ., వృత్తి : ఆచార్యులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు అభిరుచులు : విస్తృత పఠనం, తరచూ చర్చా గోష్టుల్లో పాల్గొనడం పురస్కారాలు: గురుజాడ పురస్కారం (2012), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2014), తెలుగు భాషా పురస్కారం(2016), గుర్రం జాషువా అవార్డు(2017) అంతరాలు వాస్తవమే అప్పటి గురువులకు.. ఇప్పటి వారికి చాలా అంతరమే ఉంది. మా రోజుల్లో పాఠాలు చెప్పడమే ఉపాధ్యాయుల పని. కానీ ఇవాళ అలా కాదే.. వృత్తితో పాటు మరెన్నో వ్యాపకాలు.. వ్యాపారాలు. నిబద్ధత అనేది లోపిస్తోంది. అందరూ అలా ఉంటారని కాదు కానీ... మా రోజుల్లో శిష్యులను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దేవారనేది స్పష్టం. ఈ విషయంలో నేను చాలా జాగ్రత్త పడ్డాను. మా శిష్యులు కిన్నెర శ్రీదేవి, జూలూరు గౌరీశంకర్, జూపల్లి ప్రేమ్‌చంద్ (ప్రస్తుతం జిరసం అధ్యక్షులుగా ఉన్నారు), నానీల నాగేంద్ర వంటి వారిలో చాలా మంది పీహెచ్‌డీలు చేసినా సాహితీ కృషి మరవకుండా చేయడంలో నా వంతు పాత్ర ఉందని సగర్వంగా చెబుతున్నా. గురువులే స్ఫూర్తి నాలోనూ మంచి రచయిత ఉన్నాడని గుర్తించిన తొలి వ్యక్తి తుమ్మపూడి కోటేశ్వరరావుగారు. నా పరిశోధనా గ్రంథం ‘శిల్ప ప్రభావతి’కి ఆయనే గైడ్‌గా వ్యవహరించారు. అలాగే ఆచార్య జి.ఎన్.రెడ్డి, జాస్తి సూర్యనారాయణ, తిమ్మావఝల కోదండరామయ్య, మద్దూరు సుబ్బారెడ్డి, ఆచార్య నాగయ్య వంటి వారు చాలా మంది గురువులుగా, స్నేహితులుగా నన్నెంతో ప్రోత్సహించారు. అదే ఆప్యాయతను నా శిష్యుల పట్ల చూపించడానికి నాకు పునాదులేశారు. అలాగే మిత్రులు ఆచార్య పి.ఎల్.శ్రీనివాసరెడ్డి, భక్తవత్సలరెడ్డి నా పట్ల చూపిన ఆదరణ కూడా మరవలేనిదే. నాకే ఆశ్చర్యమనిపిస్తుంది నా జీవితాన్ని తరచి చూసుకుంటే నాకే ఆశ్చర్యమనిపిస్తుంది అత్యంత నిరుపేద కుటుంబం మాది. తిరుపతికి సమీపంలోని కుంట్రపాకం చిన్న పల్లె. నా రెండేళ్ల ప్రాయంలోనే తల్లి చనిపోయారు. అప్పటి నుంచి పిన్ని రాజమ్మే నన్ను పెంచారు. వయసొచ్చేకొద్దీ నిత్యమూ పొలం పనులు చూసుకుని పాఠశాలకు, కళాశాలకు వెళ్లాల్సి వచ్చేది. యూనివర్శిటీ చేరినా ప్రతి రోజూ ఆరు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లే వాన్ని. మనమేమి చేయగలమో ఆలోచించాలి ‘సమాజం మనకేమిచ్చింది’ అని ఆలోచించే కంటే మనం ఏం చేయగలమో చెప్పగలగాలి. అదే సాహిత్యం అందించే జీవ లక్షణం. ముఖ్యంగా రచయితలు నిబద్ధతతో ఉండాలి. సమస్యలను ఆవిష్కరించడమే కాదు.. వాటి పరిష్కారమార్గం చెప్పగలగాలి. మొదట అందరూ సమాజాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వర్ధమాన రచయితలు ఒక్కరోజులోనే గొప్ప పేరు వచ్చేయాలనుకుంటుంటారు. వారికి నేనిచ్చే సలహా ఒక్కటే. బాగా చదవాలి. చుట్టుపక్కల సాగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే వారు చేసే రచనల్లో జీవం ఉంటుంది. -
పెన్ పవర్మెంట్
‘‘ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారు’’ అని నూరేళ్ళ క్రితం గురజాడ అన్నారు. ఆ మాటను అప్పటి నుండి తెలుగు సాహిత్యం నిజం చేస్తున్నది. 2014లోనూ తెలుగు సాహిత్యం చరిత్రను తిరిగి రచిస్తున్న మహిళనే చిత్రించింది. ‘‘మగడు వేల్పన పాత మాటది, ప్రాణసఖుడ నేను’’ అన్న ప్రజాస్వామిక స్త్రీ పురుష సంబంధాల నిర్మాణంలో 2014 తెలుగు సాహిత్యం కూడా తలమునకలైంది. సామూహిక వంటశాలలు నిర్మించాలని /ఒక చిన్నమాట రాసిన గురజాడ చేతిపై ఒక చిన్నముద్దు పెట్టాలని నాకోరిక ఇదే నూరేళ్ళ నుండి జరుగుతున్న సమరంలో భాగంగా 2014లోనూ స్త్రీ కోరిక, ‘‘స్త్రీ లేచి తిరగబడాలి’’ అని నినదించిన గురజాడ స్త్రీ 2014లోనూ అలాగే గర్జించింది, ‘‘మగ గొట్టాలకు కత్తిర్లేయుండ్రి’’ ‘‘మా ఆడకడుపులమీన్నే కవాతులు జేసే కత్తెర క్యాంపుల్ని మగగొట్టాల మీదికి మల్లించుండ్రి’’ అని ఈ యేడాది స్త్రీ మార్గనిర్దేశం చేసింది. మధ్యతరగతి బ్రాహ్మణ స్త్రీల జీవితాల చిత్రణతో మొదలైన స్త్రీ జీవిత చిత్రణ ఇవాళ ఆదిలాబాద్ గోండు స్త్రీల దాకా విస్తరించింది. 2014లో కూడా మిట్టూరులోని మూలింటామె నుండి ఢిల్లీ గల్లీల స్త్రీల దాకా తెలుగు సాహిత్యంలో ప్రతిబింబించారు. నేలమీద బతుకుతున్న స్త్రీల జీవితాలు సమగ్రంగా కాకపోయినా చాలావరకూ 2014లో చిత్రింపబడ్డాయి. అగ్ర కుల స్త్రీ పురుషుల ద్వారానేగాక, సొంత మొగవాళ్ళతో కూడా సతమతమయ్యే దళిత వాళ్ళు, ఆధిపత్యమతంతో పాటు స్వమత కట్టుబాట్ల మధ్య నలుగుతున్న ముస్లిం మహిళలు ఈ ఏడాది సాహిత్యంలో దర్శనమిస్తారు. అడవి తల్లులు కూడా కొందరు చెట్టుకొమ్మల చాటు నుండి తొంగిచూస్తూనే కనిపిస్తారు. నూరేళ్ళ నుంచి మహిళా జీవిత చీకటి కోణాలను గాలిస్తున్నా ఇంకా బయట పడని పార్శ్వాలు ఎలాగూ ఉన్నాయి. అయినా ఈయేటి సాహిత్యంలో స్త్రీ బహుముఖ వ్యక్తిత్వం ప్రదర్శితమైంది. ‘‘పురుషులు స్త్రీలను గౌరవించడం తెలుసుకోవాలి’’ అని బుద్ధి చెప్పడమేకాదు, ‘మనసులు కలుపుదాం రా నేస్తం’ అని నాగరికంగా ఆహ్వానిస్తున్నది 2014 తెలుగు సాహిత్యంలో స్త్రీ. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలైనా ‘‘ఆడవాళ్ళు వంటింట్లో అవధానం చేయకతప్పదు’’ అని గ్రహించింది ఈయేట తెలుగు సాహిత్యంలో స్త్రీ. అంతేకాదు.. ఐదేళ్ళకొకసారి అవకాశమిస్తే /బాగుపర్చేవాడ్ని భాగ్యమిచ్చేవాడ్ని ఎంచుకునేభాగ్యం వాళ్ళదైతే /బ్రతుకు నిచ్చేవాడికై దేవులాడే దైన్యంనాది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భారతీయ మహిళను సమీపించని స్థితిని స్త్రీ గ్రహించింది ఈయేటి సాహిత్యంలో. అయినా ‘‘ప్రేమా! నీవులేని జీవితం నిరాశామయం, నీవు చెంతవుంటే ఈలోకం స్వర్గధామం’’ అని కలగనడానికి ఆమె విసుగు చెందడంలేదు.పొలంలో పనిచేసే స్త్రీ మొదలు కార్పొరేట్ మహిళలదాకా అంతటా పడుతున్న బాధలగాధలు ఈయేటి సాహిత్యంలో ధ్వనిస్తున్నాయి. ‘‘స్త్రీల జీవితాలు మారవలసినంతగా మారకపోవడానికి కారణం పురుషులే కాదు స్త్రీలు కూడా’’ననే జ్ఞానం 2014 తెలుగు సాహిత్య స్త్రీకి ఉంది. స్త్రీలను చదువుకోమని కందుకూరి, గురజాడ చెప్పారు. స్త్రీలు చదువుకున్నారు. అయినా బాధలు రెట్టింపయ్యాయి. ఈ సత్యాన్ని 2014 తెలుగు సాహిత్య మహిళ గ్రహించింది. అమ్మయ్యా అంటూ గూటికి పరుగుపెట్టడం డ్యూటీ దిగడం కోసం కాదు ఇంట్లో మరో చాకిరీ బండను భుజాలకెత్తుకోవడానికి అన్నది ఆమె ఫిర్యాదు. తన కొడుకు దుర్మార్గాలకు బలైపోతున్న తన కోడలుకు నిర్దాక్షిణ్యంగా విడాకులిప్పించి మరో మొగాడితో పెళ్ళి చేసిన అత్త 2014 తెలుగు సాహిత్యంలో మేటి మహిళ. నేను కోటి ఉద్యమాల కాననేగాదురా కోటికలల కోననూ గూడా వీరస్వర్గాలూ విజయాలూ వీరస్వరాలుగా పొడిచే పొద్దస్తది... అనే ఆత్మస్థైర్యం 2014 తెలుగు సాహిత్య మహిళకుంది. ‘‘వివక్ష ధ్వనిని ఒడిసిపట్టే ఇద్దరు వ్యక్తుల సంభాషణ’’ కూడా ఈ స్త్రీ పసిగట్టగలిగింది. చాకిరీనుంచి, వివక్ష నుంచి, అణిచివేత నుంచి, దౌర్జన్యం నుంచి, నిరాదరణ నుంచి, అవహేళన నుంచి స్త్రీ బయటపడి ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవంతో బతికే జీవితం కోసం ఈయేటి సాహిత్యంలో స్త్రీ అన్వేషిస్తూ కనబడుతుంది. శత్రువు మీద సవారి వంటి జీవితాన్నిగాక.. స్నేహం, ప్రేమ, గౌరవం పునాది మీద మూర్తికట్టిన జీవితాన్ని ఈయేటి మహిళ కోరుతున్నది. దుర్మార్గులతో సమరం, మంచి వాళ్ళతో స్నేహం ఈయేటి తెలుగు సాహిత్య స్త్రీ కోరుకుంది. ఇప్పుడు ఏ వాదమూ లేదు అన్నది నిజం కాదు. నిజాలతో నిండిన ఇజాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. వీటిలో స్త్రీ బలమైన గొంతు వినిపిస్తూనే ఉంటుంది. పద్యాన్ని విత్తనాల్ని చేయడం నేర్చుకో సతతారణ్యాలుగా అవి ఈ నేలపై మొలకెత్తుతాయి ఇదీ ఈయేటి తెలుగు సాహిత్య మహిళ కంఠస్వరం. -
విమర్శలో రాచ‘పాళీ’యం
పద్నాలుగేళ్ల్ల విరామం తర్వాత రాయలసీమ సాహిత్య విమర్శకునికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మాటల్లో చేతల్లో తనువెత్తు ఆదర్శం రాచపాళెం. గత 42 ఏళ్లుగా సుదీర్ఘ కాలం విరామం పాటించకుండా విమర్శా సాహిత్యం అందిస్తున్న నిబద్ధ, మార్క్సిస్ట్ సాహిత్యకారుడాయన. ఆయన పేరు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. ఆయన రచించిన ‘మన నవలలు-మన కథాని కలు’ పుస్తకానికి, జీవిత కాల సాహిత్య కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. 2014వ ఏడాదికి ఇచ్చే ఈ అవార్డు ఆయనకు న్యూఢిల్లీలో జనవరి 9న ప్రదానం చేస్తారు. 42 ఏళ్ల క్రితం 1972 అక్టోబర్ నెలలో ‘స్రవంతి’ మాసపత్రికలో ‘సినిమా కవిత్వం’ మీద రాచపాళెం తొలి విమర్శా వ్యాసం అచ్చయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 36 గ్రంథాలు రచించారు. దాదాపు 3,500 పేజీల సాహిత్య విమర్శ రాశారు. సాహిత్యం ఇచ్చిన సంస్కారం రాచపాళెంలోని సంస్కర్తను తట్టి లేపింది. చిత్తూరు జిల్లా కుంట్రపాకం గ్రామంలోని సామాన్య రైతు కుటుంబంలో 1948 అక్టోబర్ 16న రాచపాళెం చంద్రశేఖరరెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు రాచపాళెం రామిరెడ్డి, మంగమ్మలు. కుంట్రపాకం, కట్టకింద వెంకటాపురం, తిరుపతిలో ప్రాథమిక, ఉన్నత విద్య, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఆ తర్వాత 1977 ఆగస్టు 25న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరారు. 31 ఏళ్లపాటు అనంతపురంలో పనిచేసి 2008లో ఉద్యోగ విరమణ చేశారు. ఆపై కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖలోను, సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ప్రధాన బాధ్యులుగా గత 6 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. రాచపాళెం అనంతపురంలో ఆచార్యునిగా పని చేస్తున్న కాలంలోనే లక్ష్మీ కాంతమ్మతో పెండ్లి జరిగింది. అప్పట్లో ఆయన పచ్చి భావవాది. సరిగా ఆ కాలంలో గురజాడ కన్యాశుల్కంపై విద్యార్థులకు ఏకంగా నాలుగేళ్లపాటు పాఠం చెప్పాల్సివచ్చింది. దాంతో కన్యాశుల్కం నాటకానికి సంబంధించిన విమర్శనా గ్రంథాలు అధ్యయనం చేయడంతో తనలో కొత్త ఆలోచనలు రేకెత్తాయి. ఆలోచనలు మారాయి. పైగా అనంతపురంలో జనవిజ్ఞాన వేదిక, అభ్యుదయ రచయితల సంఘం, విశాలాంధ్ర, సీపీఎం, సీసీఐ నాయకులతో పరిచయాలు మార్క్సిస్టుగా ఆయన్ను తేర్చాయి. ఈ క్రమంలో కులాంతర మతాంతర వివాహాలు నిర్వహించారు. గుర్రంజాషువా విగ్రహం ఏర్పాటులో ప్రధాన భూమిక నిర్వహించారు. ఈ ప్రభావంతో కూతురు శ్రీవిద్యకు నారాయణ స్వామితో కులాంతర వివాహం, అలాగే కుమారుడు ఆనందకుమార్‌కు సుధా లావణ్యతో మతాంతర వివాహం చేశారు. అవార్డు గ్రంథం మన నవలలు-మన కథానికలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఏకగ్రీవంగా న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన గ్రంథం ‘మన నవలలు- మన కథానికలు’. ఈ పుస్తకంలోని 24 వ్యా సాలు 13 ఏళ్ల సాహిత్య అధ్యయన కృషికి అక్షరరూపం. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన ప్రాతినిధ్య నవలలు, కథానికల మీద చేసిన మూల్యాంకనం, పునర్ మూల్యాంకనాలే ఇందులో ఉన్నాయి. ఈ పుస్త కంలో మాస్టర్పీస్లు రెండు ఉన్నాయి. అవి ఒకటి. ‘సామాజిక ఉద్యమాలు- తెలుగు కథానికా వికాసం’. ఈ వ్యాసంలో సంఘసంస్కరణ ఉద్యమం నుండి ప్రపంచీకరణ నేపథ్యం వరకు తెలుగు కథానిక ఎలా వికసించిందో చెప్పారు. రెండు. ‘అయ్యో పాపం నుండి ఆగ్రహం దాకా తెలుగు దళిత కథానిక’. ఈ వ్యాసంలో 1925-2008 మధ్య 9 దశాబ్దాలలో దళిత జీవితం వస్తువుగా వచ్చిన కథానికల్ని చారిత్రక దృక్పథంతో అధ్యయనం చేశారు. దళిత సాహిత్య విమ ర్శలో ఈ వ్యాసం కలికితురాయి. జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన చంద్రశేఖరరెడ్డికి అభినందనలు. - శశిశ్రీ (వ్యాసకర్త రచయిత, పత్రికా సంపాదకుడు) ఫోన్: 9347914465 -
పుస్తక సమీక్ష: కొత్త పుస్తకాలు
1. సి.పి.బ్రౌన్ (సి.పి.బ్రౌన్పై విమర్శ వ్యాసాలు) పేజీలు: 272; వెల: 300 2. వేమన-2 (వేమనపై విమర్శ వ్యాసాలు) పేజీలు: 232; వెల: 250 ప్రధాన సంపాదకులు: ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ప్రతులకు: సభ్య కార్యదర్శి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, 1-1254, సి.పి.బ్రౌన్ రోడ్, ఎర్రముక్కపల్లి, కడప-516004. ఫోన్: 08562-255517 ఉదయిని (దాట్ల దేవదానం రాజు 60వ జన్మదినోత్సవ ప్రత్యేక సంచిక) సంపాదకుడు: డా. శిఖామణి పేజీలు: 254; వెల: 100 ప్రతులకు: దాట్ల దేవదానం రాజు, 8-1-048, ఉదయిని, జక్రియా నగర్, యానాం-533464. ఫోన్: 9440105987 గోరు ముద్దలు (పిల్లల కథలు) రచన: గీతా సుబ్బారావు పేజీలు: 128; వెల: 125 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో. శాంతివనం (పిల్లలు అనుభవాలు ప్రయోగాలు) రచన: మంచికంటి పేజీలు: 244; వెల: 200 ప్రతులకు: నవోదయా, విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు. శిథిల స్వర్గం (నవల) రచన: కె.వి.నరేందర్ పేజీలు: 128; వెల: 100 ప్రతులకు: కె.వి.శ్రీదేవి, 7-4-264/బి, బైపాస్ రోడ్ దగ్గర, విద్యానగర్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా-505327. ఫోన్: 9440402871 శాంతికపోతం (కవిత్వం) రచన: బి.భూపతిరావు పేజీలు: 44; వెల: 25 ప్రతులకు: బొడ్డేపల్లి అరుణకుమారి, అచ్చిపోలవలస గ్రామం, పొందూరు మం., శ్రీకాకుళం-532402 -
బ్రౌన్ శాస్త్రి!
నివాళి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (20.10.1925-28.02.2014) ఇవాళ ఒక లెజెండ్ మాత్రమే కాదు సెలబ్రిటీ కూడా. ఈ రెండు నిర్వచనాలకు ఆయన తగిన వారనడంలో కొంచెమైనా అతిశయోక్తి లేదు. వేమనను సీపీ బ్రౌన్ వెలుగులోకి తెస్తే, సీపీ బ్రౌన్‌ను జానమద్ది వెలుగులోకి తెచ్చారు. కడపలోని తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా వచ్చిన బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సేవ చేసి తెలుగు సూర్యుడిగా ప్రసిద్ధుడైతే బ్రౌన్‌ను వెలుగులోకి తెచ్చిన జానమద్ది సాహితీ సూర్యుడిగా ప్రసిద్ధి చెందాడు. సీపీ బ్రౌన్ జీవితం, కృషి ఆయనకు కొట్టిన పిండి. బ్రౌన్కు సంబంధించినంత వరకు ఆయన అధికార ప్రతినిధి అంటే అబద్ధం కాదు. అందుకే ఆచార్య సి.నారాయణరెడ్డి జానమద్దిని బ్రౌన్ శాస్త్రి అని కీర్తించారు. సీపీ బ్రౌన్ కడపలో నివసించిన స్థలాన్ని బ్రౌన్ కాలేజీ అంటారు. అది శిథిలావస్థలో ఉండగా గుర్తించిన జానమద్ది బంగోరే, ఆరుద్రల స్నేహంతో ఆ స్థలంలో సీపీ బ్రౌన్ స్మారక ట్రస్టీని ప్రారంభించారు. 1986లో దానికి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి క్రమంగా దానిని సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయంగా, ఆ పైన సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా ఎదిగించడంలో జానమద్ది కృషి అసమానమైనది. ఇవాళ సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో 75 వేల గ్రంథాలు, 250 తాళపత్ర గ్రంథాలు, విలువైన మెకంజీ కైఫీయత్తులు, బ్రౌన్ రచనలు, బ్రౌన్ లేఖలు ఉన్నాయి. అయితే ఇదంత సులువుగా జరగలేదు. మొండి గోడలున్న స్థానంలో మూడంతస్తుల మహా సౌధాన్ని నిర్మించి రాష్ట్ర స్థాయిలో దానికి గుర్తింపు తేవడానికి జానమద్ది పడిన శ్రమ అంతా ఇంతా కాదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కలుసుకుని నిధులను సేకరించారు. రెండు రూపాయల నుండి ఎవరు ఎంత ఇచ్చినా స్వీకరించారు. ఇటుక ఇటుక పేర్చి మూండతస్తులు నిర్మింపజేశారు. దానిని శాశ్వతంగా తన అధీనంలో ఉంచుకుందామనే స్వార్థానికి లోను కాకుండా 2005లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, ఆ తర్వాత యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అంతేకాదు సీపీ బ్రౌన్ ద్విశత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు. అనంతపురంజిల్లా రాయదుర్గంలో సామాన్య కుటుంబంలో జన్మించిన జానమద్ది పొట్ట చేతపట్టుకుని ఉద్యోగ రీత్యా కడపజిల్లాకు వచ్చి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే ఆయన కేవలం ఉద్యోగిగా మిగిలిపోయి ఉంటే ఆయన్ను గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఆయన ఉద్యోగాన్ని జీవితానుసారంగా మాత్రమే చేసుకుని జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు. తనకు మంచి జీవితాన్ని ఇచ్చిన సమాజానికి తాను ఏం చేయగలనోనని తలచుకుని తన చేతనైనంత రూపంలో ఈ సమాజం రుణం తీర్చుకున్నారు. డాక్టర్ జానమద్ది జీవితంలో మూడు తరాలుగా వికసించింది. ఒకటి రచనా జీవితం, రెండు జిల్లా రచయితల సంఘం, మూడు సీపీ బ్రౌన్ గ్రంథాలయం. జానమద్ది రచయిత. ప్రధానంగా జీవిత చరిత్రకారుడు. దేశ విదేశాల్లో గొప్ప వ్యక్తుల జీవితాలను ఆయన వందల కొలది వ్యాసాలతో, నేటి తరానికి పరిచయం చేశారు. ‘ఎందరో మహానుభావులు’, ‘భారత మహిళ’, ‘సుప్రసిద్దుల జీవిత విశేషాలు’, ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య’, ‘బళ్లారి రాఘవ’, ‘శంకరంబాడి సుందరాచారి’ వంటి గ్రంథాలు ఆయన జీవిత చరిత్ర రచనా సామర్థ్యానికి సంకేతాలు. ‘కన్నడ కస్తూరి’, ‘మా సీమ కవులు’ వంటి గ్రంథాలు ఆయన సాహిత్యాభిరుచికి నిదర్శనాలు. కడపజిల్లా రచయితల సంఘాన్ని 1973లో స్థాపించి దాని కార్యదర్శిగా 20 ఏళ్లు పనిచేశారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ రచయితలను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. రెండు మూడు రోజులపాటు జరిగే మహాసభలను ఎనిమిదింటిని నిర్వహించారు. ప్రతి మహాసభకు ప్రత్యేక సంచికను తీసుకు వచ్చారు. బెజవాడ గోపాల్‌రెడ్డి, అరుద్ర, దాశరథి, కుందుర్తి, పురిపండ అప్పలస్వామి, శ్రీశ్రీ, సినారె, ఎమ్మెస్ రెడ్డి, దేవులపల్లి రామానుజరావు, దివాకర్ల వెంకట అవధాని వంటి రచయితలను, విద్వాంసులను రప్పించి అద్భుతమైన సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అనేక సంస్థలు, లోక నాయక ఫౌండేషన్ వంటివి ఆయనకు పురస్కారాలను అందించి తమను తాము గౌరవించుకున్నాయి. ఆయన పేరు మీదనే జానమద్ది సాహితీపీఠం మూడేళ్ల క్రితం మొదలై కళారంగంలో కృషి చేసిన వారిని ప్రోత్సహిస్తోంది. మలినం లేని హృదయం, మల్లెపువ్వు వంటి, తెలుగుతనం ఉట్టిపడే వేషం, అందమైన వాక్కు, మృదువైన కంఠం, మందస్మిత వదనారవిందం చూపరులను ఆకర్షించే జానమద్ది మూర్తి. వయోభేదం లేకుండా కులమతాలతో సంబంధం లేకుండా ఎవరితోనైనా స్నేహం చేయగల సహృదయతకు ప్రతీక జానమద్ది. నైరాశ్యం ఎరుగని ఉత్సాహం, పారుష్యం ఎరుగని సంభాషణం ఆయన జీవిత లక్షణాలు. ఒకసారి మాట్లాడితే మళ్లీ మాట్లాడాలనిపించే వ్యక్తిత్వం ఆయనది. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆయన శ్వాస, ఆయన ధ్యాస. తాను మరణిస్తే తన పార్థివదేహాన్ని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ప్రజల కోసం కొన్ని గంటలు ఉంచాలని ఉబలాటపడిన డాక్టర్ జానమద్ది స్వార్థ రాహిత్యానికి మారుపేరు. అందుకే 2014 ఫిబ్రవరి 28 ఉదయం 6.00 గంటలకు తుది శ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల మధ్య సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో అభిమానులు, ప్రజల సందర్శనార్థం పెట్టారు. ‘ఎందరో మహానీయులు’ గ్రంథాన్ని రచించిన జానమద్ది హనుమచ్ఛాస్త్రి రాయదుర్గం నుండి బ్రౌన్ దుర్గం దాక పయనించిన మహానీయుడు. - రాచపాళెం చంద్రశేఖర రెడ్డి తొంభై ఏళ్ల జీవితంలో అరవై ఏళ్లు సమాజానికి అంకితం చేసిన డాక్టర్ జానమద్ది జీవితం అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారులతో నిండిపోయిన నేటి సమాజాన్ని సంస్కరించాలనుకునే వాళ్లకు నిస్సందేహంగా దీపధారి. -
పీడితవర్గ రచయితకు పద్మశ్రీ
కొలకలూరి ఇనాక్‌కు పద్మశ్రీ రావడం అంటే అశ్రువుకు పద్మశ్రీ రావడం... వేదనకు పద్మశ్రీ రావడం... తరతరాలుగా చెప్పుల్లేకుండా పరుగులెత్తిన పాదాలకీ సీసపుపోతతో నెత్తురు కార్చిన చెవులకీ తాటాకులు కట్టిన వీపుకీ రక్తమే చెమటగా చిందించిన మట్టి కట్టెకీ శ్రమజీవికీ బడుగుజీవికీ దళిత ఆక్రందనికీ పద్మశ్రీ రావడం. ఇది అక్షరం తనను తాను గౌరవించుకోవడం కాదు. సమాజం తనను తాను గౌరవించుకోవడం. కింద పడ్డ అన్నం ముద్దను దోసిళ్లలో అందుకొని కళ్లకద్దుకొని భుజించడం. కథకుడిగా, కవిగా, విమర్శకుడిగా, అధ్యాపకుడిగా ఇనాక్ ప్రస్థానాన్ని రెండు నెలల క్రితం ఇదే పేజీలో ప్రస్తావించింది సాక్షి. ఇనాక్‌కు సాహిత్య అకాడెమీ పురస్కారం రాకపోవడాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు అంతకు మించిన గౌరవం అందుకున్నందుకు హర్షం ప్రకటిస్తోంది. నిలదీసే కథలు ఆయనవి నా కన్నీళ్లే నా సాహిత్యం అని కొలకలూరి ఇనాక్ అన్నంత మాత్రాన కేవలం కష్టాలు చెప్పి, బాధలు ఏకరువు పెట్టి పాఠకుల్ని ఏడిపించడం ఆయన తన రచనా ధోరణిగా పెట్టుకోలేదు. కరుణ ఆయన సాహిత్యంలో అంతర్గతంగా ఉన్నా అది పాఠకులను ఆలోచన వైపు మళ్లిస్తుంది. పీడితులను మారుతున్న సమాజంలో భాగస్వాములను కమ్మని చైతన్యపరుస్తుంది. ఆయన పాత్రలేవీ శ్రమ నుంచి దూరం కావు. అవి పిరికివి కావు. వాటికి తామెలా ఉన్నామో, అలా ఎందుకున్నామో, తామెలా ఉండాలో, అలా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసు, లేదా తెలుసుకుంటాయి. హక్కుల సాధనను ఆయన పాత్రలు అనేక రకాలుగా చేస్తుంటాయి. కూలి రాబట్టుకోవడం, దేవాలయ ప్రవేశం, నీళ్లు సంపాదించుకోవడం, ఆకలిని తీర్చుకోవడం, మద్యపాన రుగ్మత వంటి వస్తువుల నుండి కులాంతర వివాహాల దాకా ఆయన సాహిత్య వస్తువు విస్తరించి ఉంటుంది. కంచికచర్ల కోటేశు సజీవ దహనం, రూప్‌కన్వర్ సహగమనం, ప్యాపిలి వినాయక చవితి సంఘటన వంటి నిర్దిష్ట వస్తువులు ఆయన కథలు కావడం విశేషం. నిర్దిష్టతను సంభాషణల ద్వారా, వ్యాఖ్యల ద్వారా సాధారణీకరించడం కొలకలూరికి తెలిసిన విద్య. - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, విమర్శకులు ఇనాక్ కథల నుంచి... పొట్ట పేగులిబ్బందిగోడు.... ఇబ్బందిగోడు మాంసం గోత్తే పెద్ద గిరాకీ. లేద్దూడల్ని, రోగం రొచ్చు లేనివాటిని, కుర్రాటిని, కొవ్వినాటిని గోత్తాడు ఇబ్బందిగోడు. పక్కూళ్ల పల్లెలోళ్లు గూడా ఆదోరవైతే అజీలుగా ఆడింటిముందు తెల్లారగట్టకే కాకులోలినట్టోలి కావుకావుమంటుంటారు. వొక్కక్కడూ రెండూ మూడూ కుప్పలెత్తుకుంటాడు. ఆల్లొత్తన్నారు గందాని ఈడు బేరం బెంచడు. కొంటన్నారు గందాని రోగిష్టోటిని గొయ్డు. ఆదోరం యాపారం. ఇంక వారవంతా కాళ్లారజావుక్కూకోటమే. ఉంటే కూడొండుకుంటాడు లేబోతే గంజి కాసుకుంటాడు. గంజిగ్గతిలేనోడు కాడీడు. ఆడి కొంపని గుడిసెంటే సిన్నమాట. ఇల్లంటే పెద్ద మాట. గూడంటే సరిపోద్ది. మట్టిగోడలు, తడికె తలుపు, ఒంటి నిట్టాడి, తాటాక్కప్పు, కిటికీలంటే తప్పు, బొక్కలంటే సెల్లు. తడికేత్తే ఇల్లంతా సీకటి గుయ్యారం. పొయ్యి ముట్టిచ్చకపోతే పొగులు. బెడ్డలిగిచ్చకపోతే రేత్రి. ఆడి గూట్లో కన్ను బొడసుకున్నా యేందీ కానరాదు..... తాకట్టు..... శాస్త్రి ఇంట్లోగాని వంటి మీద గాని విలువైన వస్తువేదీ లేదు. ‘తాకట్టు పెట్టడానికి నా దగ్గరేముంది?’ ‘ఏమున్నా సరే’ ‘ఏమీ లేదనేగా. ఇవ్వననరాదూ?’ ‘ఇస్తానంటున్నానుగా’ ‘ఏం తాకట్టు పెట్టేది?’ ‘నీ జందెం’ ‘జంధ్యమా?’ శాస్త్రి బిత్తరపోయాడు. తిక్కపట్టినవాడిలాగా మిత్రుడి ముఖంలోకి చూశాడు. జంధ్యం మంత్రపునీతం. ద్వితీయ జన్మం. ఉపనయన చిహ్నం. ద్విజలక్షణం. వేదవిద్యా పరిరక్షణభారం. మోక్షదాయని. శత్రు సంహారిణి, గాయత్రీ మంత్ర పరిరక్షితం. ఆలోచిస్తున్నకొద్దీ శాస్త్రికి పిచ్చెక్కుతూ ఉంది. ఓబిలేసు మాట్లాడకుండా కూర్చున్నాడు.... ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాలు: ఉత్తమమైన కవిత్వానికి ప్రతి ఏటా ఇచ్చే ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాలను 2012, 2013 సంవత్సరాలకుగాను వరుసగా రామాచంద్రమౌళి, ఈతకోట సుబ్బారావులకు ప్రకటించారు. ఫిబ్రవరి 1 సాయంత్రం చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో బహుమతి ప్రదానం.