దళిత ఉద్యమ సారథి కత్తి పద్మారావు | Rachapalem Chandrasekhar Reddy Article On Katti Padmarao | Sakshi
Sakshi News home page

దళిత ఉద్యమ సారథి కత్తి పద్మారావు

Published Sat, Jul 27 2019 1:18 AM | Last Updated on Sat, Jul 27 2019 1:19 AM

Rachapalem Chandrasekhar Reddy Article On Katti Padmarao - Sakshi

డాక్టర్‌ కత్తి పద్మారావు ప్రపంచ మెరిగిన హేతువాది. జగమెరిగిన దళిత ఉద్యమ నాయకుడు. ఆయనది భౌతిక తాత్విక వాద ప్రాపంచిక దృక్పథం. పైగా కల్తీలేని మానవతావాది. నిజాయితీ గల బోధకుడు. మనిషి తాను సృష్టించుకున్న దైవభావనకు తానే బానిసై, మతం స్వార్థపరుల చేతిలో చిక్కి, అధిక సంఖ్యాకులను మభ్యపెట్టడానికి, అణచిపెట్టడానికి సాధనంగా మారడంపై ఆయన యుద్ధం ప్రకటించారు.. హేతువాది, మానవతావాది అయిన కత్తి పద్మారావు బౌద్ధంవైపు మొగ్గారు. దళిత బహుజనుల రాజ్యాధికార సాధనకు ఆయన బౌద్ధాన్ని, అంబేడ్కర్‌ వాదాన్ని ఆధారం చేసుకున్నారు. బౌద్ధ ధర్మాన్ని, అంబేడ్కరిజాన్ని తన తాత్విక నేపథ్యంగా స్వీకరించారు. భారతదేశంలో మార్క్సిజం అగ్రకుల నాయకత్వంలో ఉండటం పట్ల ఆయనకు అభ్యంతరాలున్నాయి. మార్క్సిస్టు ఉద్యమ ధోరణుల పట్ల విమర్శనాత్మక దృష్టి కలిగి ఉన్నారు. అలా అని ఆయన మార్క్సిజానికి వ్యతిరేకి కారు. 

చుండూరు సంఘటన జరిగి దశాబ్దాలు గడిచిన సందర్భంగా దాని పరిణామాలను స్మరించుకుంటూ ‘సైనిక గీతం’ రాశారు. మొదటి నుంచీ ఆయనది ఉద్యమ జీవితం. మొదట హేతువాద ఉద్యమం. ఆ తర్వాత దళిత ఉద్యమం. మధ్యలో మార్క్సిజం అధ్యయనం. సైద్ధాంతిక గ్రంథ రచన, సాహిత్య విమర్శ, కవిత్వ రచన – ఆయన రచనా జీవితానికి మూడు ముఖాలు. కారంచేడు, చుండూరు సంఘటనలతో ఆయన కుల నిర్మూలనా ఉద్యమానికి నాయకత్వం వహించారు. కుల వ్యవస్థ విశ్లేషణకు, దాని నిర్మూలనకు, కుల రహిత సమాజ నిర్మాణానికి అవసరమైన జ్ఞానాన్ని అందివ్వడానికి సామాజికాంశాల మీద విస్తృతంగా గ్రంథ రచన చేశారు. ఆయన ప్రచురించిన ముళ్ళ కిరీటం (2002), భూమి భాష (2004), కట్టెల మోపు (2007), ఆత్మగౌరవ స్వరం (2010), ఈ యుగం మాది (2014) కవిత్వ సంపుటాలు చదివితే గత దశాబ్దాన్ని ఆయన కవిగా తనది చేసుకున్నారా అనిపిస్తుంది.

తన అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ తన కవిత్వ గురువులని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా కవిత్వ గురువులుగా పూర్వకవులను చెప్పుకుంటాం. పద్మారావు తన తల్లులనే చెప్పుకున్నారు. ఈ ముగ్గురు దళిత మహిళలు. శ్రామిక మహిళలు. వాళ్ళు జీవితాన్ని గడిపేసిన వాళ్ళుకారు. జీవితాన్ని జీవించిన వాళ్ళు, జీవిత సారాన్ని పాదం ముట్టినవాళ్ళు. జీవితం సజీవయానం అన్నది ప్రజా భావన. ఈ ‘యానం’లో సంఘర్షణ, శ్రమ, అనుభవం ఇమిడి ఉంటాయి. కవిని వాళ్ళమ్మ ఎలా పెంచిందో ‘ముళ్ళకీరిటం’ కవిత చదివితే అర్థమౌతుంది. నేల మీద బతికినప్పుడే జీవితయానమవుతుంది. అది పద్మారావుకి తెలుసు. అందుకే జీవితాన్ని సజీవయానం అన్నారు. సజీవయానమంటే శ్రమతో కూడిన బతుకు అని అర్థం.

జీవితం ఒక పరివేదన అని చెబుతారు పద్మారావు. పరివేదన అంటే ఏడుపు కాదు. ఇది కలిగిన వాళ్ళ లక్షణం. పరివేదన అంటే జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులకు పారిపోకుండా నిలవటం. ‘‘చీకటిని తొలగించటమే కాదు’’ అనే కవితను ‘చీకటిని జయించాలి’ అంటూ ముగించారు కవి (పైది; పు:44). దానికి అవసరమైన కొరముట్టు పరివేదన. జీవితం ఒక గీతం (భూమిభాష; పు:48). గ్రామీణ భారత జీవితాన్ని కాచి వడబోసిన జానపదులు మాత్రమే జీవితాన్ని ఇలా నిర్వహించగలరు. ‘జీవితం ఒక పరివేదన’ అన్న కవి ‘జీవితం ఒక గీతం’ అన్నారు. జీవితం ఒక సముద్రమని, దానిని ఈదడం సాధ్యం కాదని వేదాంతులు మనల్ని భయపెడితే, శ్రామికతత్వాన్ని జీర్ణించుకున్న కవి జీవితాన్ని గీతంగా నిర్వచించారు. ‘‘జీవితానికి సాహసమే ఊపిరి’’ (పైది; పు:379) అన్నా ‘‘జీవించటం ఒక యుద్ధ ప్రక్రియ’’ అన్నా (భూమి భాష; పు:152) కవి తన జాతిని తట్టి లేపడమే. పద్మారావు కవిత్వం ఒక చైతన్య గీతిక. ఒక పొలికేక. ఒక ఆత్మ గౌరవస్వరం. ఆత్మవిశ్వాసపతాక. ఆత్మస్థైర్య గొంతుక. పీడనకు వివక్షకు అణచి వేతకు గురౌతున్న సామాజిక వర్గాల ప్రజలకు పద్మారావుగారి కవిత్వంలోని జీవిత నిర్వచనాలు ధైర్యం చెబుతాయి.

ఈ యుగ దళిత గళం ఆయన. కవితా నిర్మాణ శిల్పి, దళిత ఉద్యమ నిర్మాత. మార్క్స్‌ను, అంబేడ్కర్‌ను లోతుగా అధ్యయనం చేసి దళిత ఉద్యమానికి కుల నిర్మూలనా రధసారధి అయ్యాడు. తెలుగువారి చరిత్రలో, భారతదేశ చరిత్రలో అనేక మలుపులకు ఆయన కారకుడు. చరిత్ర నిర్మాత, సిద్ధాంతకర్త, తెలుగు జాతి వైతాళికుడిగా ముందుకు నడుస్తున్న డా‘‘కత్తి పద్మారావు 67వ జన్మదినం తెలుగుజాతి చరిత్రలో మలుపు తిప్పిన ఒక గుర్తింపదగిన రోజు.
(నేడు డా‘‘ కత్తి పద్మారావు 67వ జన్మదినం నేపథ్యంలో లుంబినీవనం, పొన్నూరులో జరుగుతున్న సదస్సులో ఆయన రాసిన  70, 71వ పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా)

రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి 
వ్యాసకర్త ప్రముఖ విమర్శకులు
మొబైల్‌ : 94402 22117

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement