కథా రచయితగానే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణం. కవిగా.. కథకునిగా.. విమర్శకునిగా.. విలువలతో కూడిన సాహిత్యం ఆయన సొంతం. ‘అనంత’ సాహితీవనంలో తనదైన ముద్రతో సాగించిన రచనా సేద్యం అద్భుత ఫలాలను అందించింది. జిల్లా కీర్తి పతాకను జాతీయ స్థాయిలో ఆవిష్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న ఆ కలం ఎందరికో స్ఫూర్తిదాయకం. రాసినా.. మాట్లాడినా.. రాగద్వేషాలకు అతీతంగా వస్తు వివేచనను సాగించే ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి రచనామృతం అద్భుతం.. అజరామరం.
పరిచయం
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కుంట్రపాకంలో 1948, అక్టోబర్ 16న మంగమ్మ, రామిరెడ్డి దంపతులకు రాచపాలెం చంద్రశేఖరరెడ్డి జన్మించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ, పీహెచ్‌డీలతో పాటు వయోజన విద్యలో డిప్లొమా చేశారు. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తమిళంలో సర్టిఫికెట్ కోర్సు చేశారు. 37 సంవత్సరాలు బోధనానుభవం (ఎస్వీలో 31సంవత్సరాలు, వైవీయూలో ఆరు సంవత్సరాలు) గల ఆచార్య రాచపాలెం... లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, శాఖ అధ్యక్షులుగా పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా వ్యవహారించారు. ఈయన నేతృత్వంలో 25మంది పీహెచ్‌డీలు, మరో 20 మంది ఎంఫిల్ చేశారు. అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా, గుర్రం జాషువా జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా వ్యవహారించారు. అరసం రాష్ట్ర అధ్యక్షునిగా, జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షునిగా, రాష్ట్ర అధికారభాషా సంఘం సభ్యునిగా సేవలు అందించారు. నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సలహా మండలి, సాహిత్య అకాడమి (న్యూఢిల్లీ) సభ్యుడిగాను పనిచేశారు. ‘మన నవలలు– మన కథానికలు’ అనే రచనకు ఉత్తమ విమర్శకుడిగా 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.
నా ఒరవడి కూడా మారింది
ఒకప్పుడు సాహిత్యమంటే సంప్రదాయరీతిలో మూసబోసినట్టుండేది. వాటికి కామా పెడుతూ కొత్త వాదాలు పుట్టకొచ్చాయి. 1980 ప్రాంతాలలో అనుకుంటా యుద్దనపూడి మరణం తర్వాత స్త్రీ వాదం, కారంచేడు, చుండూరు ఘటనలతో దళిత వాదం, బాబ్రీ మసీదు విధ్వంసంతో మైనార్టీ వాదం పుట్టుకొచ్చాయి. ప్రాంతీయ అసమానతల వల్ల అస్థిత్వ వాదాలు కూడా జనిస్తున్నాయి. కాబట్టే నా రచనా వస్తువు కూడా తొలినాళ్లలో ఉన్నట్టు కాకుండా ఒరవడి మారింది. కథలు మాత్రమే రాయడంతో రచయిత పని అయిపోదని నా కలం గ్రహించింది కాబట్టే ఫ్యాక్షనిజం, కరువు రక్కసి, వర్తమాన రాజకీయాలు చేస్తున్న వికృత చేష్టలు ఓ వైపు ఎత్తి చూపుతూనే వాటి పరిష్కార మార్గాలు వెతికే పని చేపట్టాల్సి వచ్చింది.
మార్క్సిజమే ఎందుకు?
చాలా మంది అనుకుంటారు ఇన్ని వాదాలుండగా మార్క్సిజమే ఎందుకని. ప్రపంచాన్ని బాగా అర్ధం చేసుకోవాలంటే మార్క్సిజాన్ని మించినది మరేది ఉండదు. చరిత్ర అంతా వర్గపోరాటమే. రెండు వర్గాల నడుమ సాగే పోరులో అంతిమ విజయం శ్రామిక వర్గానిదే అని చెప్పే మార్క్సిజం.. పీడిత వర్గం వైపు ఉండాలని కవులకు, రచయితలకు, మేధావులుకు సూచిస్తుంది. అభివృద్ది పథంలో ప్రపంచమంతటా ఒకలా ఉంటే మన దేశంలో కులం అడ్డుగోడగా నిలిచిందనడంలో సందేహం లేదు. శక్తి వంతమైన సమాజ నిర్మాణానికి అంబేద్కరిజమే చక్కటి పరిష్కార మార్గం. కుల రక్కసి చేసే విలయతాండవం మరెన్ని రోజులు చూడాల్సి వస్తోందో.
ఆ రోజులే వేరు..
ఒకసారి మా జ్ఞాపకాలలోకి వెళితే అప్పుడుండే పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని అనిపిస్తుంది. ఇప్పుడున్నంత బిజీ లైఫ్ ఉండేది కాదు. కాబట్టే అప్పట్లో నాతో పాటు చిలకూరి దేవపుత్ర, బండి నారాయణస్వామి, రాయుడు, బోసు, బద్వేలు రమేష్, దక్షిణామూర్తి, రఘుబాబు వంటి వారితో నగరంలో ఉండే గిల్డ్ ఆఫ్ సర్వీసు పాఠశాలలోని ఓ తరగతి గదిలో కూర్చొని అనేక విషయాలు చర్చించుకునే వాళ్లం. ముఖ్యంగా 21 వారాలు ‘లిటరరీ మీట్’ నడిపాం. కథా చర్చలు జోరుగా సాగేవి. ముఖ్యంగా అవధాని ఆశావాది ప్రకాశరావు ‘రాయల కళా గోష్టి’ పేరిట సాగిన చర్చలు ఎంతో రసవత్తరంగా ఉండేవి.
కవితా వస్తువు కూడా విభిన్నమే
రాయలసీమ నిర్ధిష్ట సమస్యలైన కరువు, ఫ్యాక్షనిజం, వర్తమాన రాజకీయాలు..ఇవే నా కవితా వస్తువులు.. కథలలో నాటకీయత కన్నా సజీవ చిత్రణ గొప్పగా కనపడాలని నేననుకుంటాను. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు కళ్లముందు కదలాడే విధంగా రచనలుండాలి. వాటికి తగ్గట్టుగానే నా ‘రెండు ప్రపంచాలు’, ç‘స్వర్ణభారతి సాక్షిగా’, ‘సీమ నానీలు’, ‘పొలి’ వంటి కవితా సంకలనాలు, ‘తెలుగు కవిత్వంలో నన్నయ్య ఒరవడి’, ‘గురజాడ తొలి కొత్త తెలుగు కథలు’, ‘చర్చ మరోచర్చ’, ‘విమర్శ –2009’ వంటి విమర్శనా గ్రంథాలు.. ‘అనంత’ సాహిత్యం ప్రత్యేకతను చాటాయనే అనుకుంటున్నా. ముఖ్యంగా చాలా మందిని కదిలించిన విమర్శనా గ్రంథం ‘ప్రతిఫలనం.’ ఇందులో అనేక మంది రచయితల ప్రసిద్ధ కథలపై విమర్శ సాగుతుంది. ఇదే ఒరవడిలో సాగిన ‘మన నవలలు–మన కథానికలు’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది. విమర్శపై విమర్శ రాసినవారు అరుదుగా కనిపిస్తారు. ఆ అదృష్టం నాకు దక్కడం ఆనందమే మరి.
బయోడేటా
పేరు : రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
పుట్టిన తేదీ : 16.10.1948
స్వగ్రామం : కుంట్రపాకం,
చిత్తూరు జిల్లా
తల్లిదండ్రులు: రామిరెడ్డి, మంగమ్మ
భార్య : లక్ష్మీకాంతమ్మ
పిల్లలు : శ్రీవిద్య, ఆనందకుమార్
చదువు : ఎంఏ., పీహెచ్‌డీ.,
వృత్తి : ఆచార్యులుగా పనిచేసి ఉద్యోగ
విరమణ పొందారు
అభిరుచులు : విస్తృత పఠనం, తరచూ చర్చా
గోష్టుల్లో పాల్గొనడం
పురస్కారాలు:
గురుజాడ పురస్కారం (2012),
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2014),
తెలుగు భాషా పురస్కారం(2016),
గుర్రం జాషువా అవార్డు(2017)
అంతరాలు వాస్తవమే
అప్పటి గురువులకు.. ఇప్పటి వారికి చాలా అంతరమే ఉంది. మా రోజుల్లో పాఠాలు చెప్పడమే ఉపాధ్యాయుల పని. కానీ ఇవాళ అలా కాదే.. వృత్తితో పాటు మరెన్నో వ్యాపకాలు.. వ్యాపారాలు. నిబద్ధత అనేది లోపిస్తోంది. అందరూ అలా ఉంటారని కాదు కానీ... మా రోజుల్లో శిష్యులను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దేవారనేది స్పష్టం. ఈ విషయంలో నేను చాలా జాగ్రత్త పడ్డాను. మా శిష్యులు కిన్నెర శ్రీదేవి, జూలూరు గౌరీశంకర్, జూపల్లి ప్రేమ్‌చంద్ (ప్రస్తుతం జిరసం అధ్యక్షులుగా ఉన్నారు), నానీల నాగేంద్ర వంటి వారిలో చాలా మంది పీహెచ్‌డీలు చేసినా సాహితీ కృషి మరవకుండా చేయడంలో నా వంతు పాత్ర ఉందని సగర్వంగా చెబుతున్నా.
గురువులే స్ఫూర్తి
నాలోనూ మంచి రచయిత ఉన్నాడని గుర్తించిన తొలి వ్యక్తి తుమ్మపూడి కోటేశ్వరరావుగారు. నా పరిశోధనా గ్రంథం ‘శిల్ప ప్రభావతి’కి ఆయనే గైడ్‌గా వ్యవహరించారు. అలాగే ఆచార్య జి.ఎన్.రెడ్డి, జాస్తి సూర్యనారాయణ, తిమ్మావఝల కోదండరామయ్య, మద్దూరు సుబ్బారెడ్డి, ఆచార్య నాగయ్య వంటి వారు చాలా మంది గురువులుగా, స్నేహితులుగా నన్నెంతో ప్రోత్సహించారు. అదే ఆప్యాయతను నా శిష్యుల పట్ల చూపించడానికి నాకు పునాదులేశారు. అలాగే మిత్రులు ఆచార్య పి.ఎల్.శ్రీనివాసరెడ్డి, భక్తవత్సలరెడ్డి నా పట్ల చూపిన ఆదరణ కూడా మరవలేనిదే.
నాకే ఆశ్చర్యమనిపిస్తుంది
నా జీవితాన్ని తరచి చూసుకుంటే నాకే ఆశ్చర్యమనిపిస్తుంది అత్యంత నిరుపేద కుటుంబం మాది. తిరుపతికి సమీపంలోని కుంట్రపాకం చిన్న పల్లె. నా రెండేళ్ల ప్రాయంలోనే తల్లి చనిపోయారు. అప్పటి నుంచి పిన్ని రాజమ్మే నన్ను పెంచారు. వయసొచ్చేకొద్దీ నిత్యమూ పొలం పనులు చూసుకుని పాఠశాలకు, కళాశాలకు వెళ్లాల్సి వచ్చేది. యూనివర్శిటీ చేరినా ప్రతి రోజూ ఆరు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లే వాన్ని.
మనమేమి చేయగలమో ఆలోచించాలి
‘సమాజం మనకేమిచ్చింది’ అని ఆలోచించే కంటే మనం ఏం చేయగలమో చెప్పగలగాలి. అదే సాహిత్యం అందించే జీవ లక్షణం. ముఖ్యంగా రచయితలు నిబద్ధతతో ఉండాలి. సమస్యలను ఆవిష్కరించడమే కాదు.. వాటి పరిష్కారమార్గం చెప్పగలగాలి. మొదట అందరూ సమాజాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వర్ధమాన రచయితలు ఒక్కరోజులోనే గొప్ప పేరు వచ్చేయాలనుకుంటుంటారు. వారికి నేనిచ్చే సలహా ఒక్కటే. బాగా చదవాలి. చుట్టుపక్కల సాగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే వారు చేసే రచనల్లో జీవం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment