పెన్ పవర్‌మెంట్ | Pen parmenter | Sakshi
Sakshi News home page

పెన్ పవర్‌మెంట్

Published Tue, Dec 30 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

పెన్ పవర్‌మెంట్

పెన్ పవర్‌మెంట్

‘‘ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారు’’ అని నూరేళ్ళ క్రితం గురజాడ అన్నారు. ఆ మాటను అప్పటి నుండి తెలుగు సాహిత్యం నిజం చేస్తున్నది. 2014లోనూ తెలుగు సాహిత్యం చరిత్రను తిరిగి రచిస్తున్న మహిళనే చిత్రించింది. ‘‘మగడు వేల్పన పాత మాటది, ప్రాణసఖుడ నేను’’ అన్న ప్రజాస్వామిక స్త్రీ పురుష సంబంధాల నిర్మాణంలో 2014 తెలుగు సాహిత్యం కూడా తలమునకలైంది.
సామూహిక వంటశాలలు నిర్మించాలని /ఒక చిన్నమాట రాసిన గురజాడ చేతిపై
 ఒక చిన్నముద్దు పెట్టాలని నాకోరిక

 
ఇదే నూరేళ్ళ నుండి జరుగుతున్న సమరంలో భాగంగా 2014లోనూ స్త్రీ కోరిక, ‘‘స్త్రీ లేచి తిరగబడాలి’’ అని నినదించిన గురజాడ స్త్రీ 2014లోనూ అలాగే గర్జించింది, ‘‘మగ గొట్టాలకు కత్తిర్లేయుండ్రి’’ ‘‘మా ఆడకడుపులమీన్నే కవాతులు జేసే కత్తెర క్యాంపుల్ని మగగొట్టాల మీదికి మల్లించుండ్రి’’ అని ఈ యేడాది స్త్రీ మార్గనిర్దేశం చేసింది. మధ్యతరగతి బ్రాహ్మణ స్త్రీల జీవితాల చిత్రణతో మొదలైన స్త్రీ జీవిత చిత్రణ ఇవాళ ఆదిలాబాద్ గోండు స్త్రీల దాకా విస్తరించింది. 2014లో కూడా మిట్టూరులోని మూలింటామె నుండి ఢిల్లీ గల్లీల స్త్రీల దాకా తెలుగు సాహిత్యంలో ప్రతిబింబించారు.

నేలమీద బతుకుతున్న స్త్రీల జీవితాలు సమగ్రంగా కాకపోయినా చాలావరకూ 2014లో చిత్రింపబడ్డాయి. అగ్ర కుల స్త్రీ పురుషుల ద్వారానేగాక, సొంత మొగవాళ్ళతో కూడా సతమతమయ్యే దళిత వాళ్ళు, ఆధిపత్యమతంతో పాటు స్వమత కట్టుబాట్ల మధ్య నలుగుతున్న ముస్లిం మహిళలు ఈ ఏడాది సాహిత్యంలో దర్శనమిస్తారు. అడవి తల్లులు కూడా కొందరు చెట్టుకొమ్మల చాటు నుండి తొంగిచూస్తూనే కనిపిస్తారు. నూరేళ్ళ నుంచి మహిళా జీవిత చీకటి కోణాలను గాలిస్తున్నా ఇంకా బయట పడని పార్శ్వాలు ఎలాగూ ఉన్నాయి. అయినా ఈయేటి సాహిత్యంలో స్త్రీ బహుముఖ వ్యక్తిత్వం ప్రదర్శితమైంది.

‘‘పురుషులు స్త్రీలను గౌరవించడం తెలుసుకోవాలి’’ అని బుద్ధి చెప్పడమేకాదు, ‘మనసులు కలుపుదాం రా నేస్తం’ అని నాగరికంగా ఆహ్వానిస్తున్నది 2014 తెలుగు సాహిత్యంలో స్త్రీ. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలైనా ‘‘ఆడవాళ్ళు వంటింట్లో అవధానం చేయకతప్పదు’’ అని గ్రహించింది ఈయేట తెలుగు సాహిత్యంలో స్త్రీ. అంతేకాదు..
ఐదేళ్ళకొకసారి అవకాశమిస్తే /బాగుపర్చేవాడ్ని భాగ్యమిచ్చేవాడ్ని
ఎంచుకునేభాగ్యం వాళ్ళదైతే /బ్రతుకు నిచ్చేవాడికై దేవులాడే దైన్యంనాది

 
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భారతీయ మహిళను సమీపించని స్థితిని స్త్రీ గ్రహించింది ఈయేటి సాహిత్యంలో. అయినా ‘‘ప్రేమా! నీవులేని జీవితం నిరాశామయం, నీవు చెంతవుంటే ఈలోకం స్వర్గధామం’’ అని కలగనడానికి ఆమె విసుగు చెందడంలేదు.పొలంలో పనిచేసే స్త్రీ మొదలు కార్పొరేట్ మహిళలదాకా అంతటా పడుతున్న బాధలగాధలు ఈయేటి సాహిత్యంలో ధ్వనిస్తున్నాయి. ‘‘స్త్రీల జీవితాలు మారవలసినంతగా మారకపోవడానికి కారణం పురుషులే కాదు స్త్రీలు కూడా’’ననే జ్ఞానం 2014 తెలుగు సాహిత్య స్త్రీకి ఉంది. స్త్రీలను చదువుకోమని కందుకూరి, గురజాడ చెప్పారు. స్త్రీలు చదువుకున్నారు. అయినా బాధలు రెట్టింపయ్యాయి. ఈ సత్యాన్ని 2014 తెలుగు సాహిత్య మహిళ గ్రహించింది.
 
అమ్మయ్యా అంటూ గూటికి పరుగుపెట్టడం డ్యూటీ దిగడం కోసం కాదు ఇంట్లో మరో చాకిరీ బండను భుజాలకెత్తుకోవడానికి అన్నది ఆమె ఫిర్యాదు. తన కొడుకు దుర్మార్గాలకు బలైపోతున్న తన కోడలుకు నిర్దాక్షిణ్యంగా విడాకులిప్పించి మరో మొగాడితో పెళ్ళి చేసిన అత్త 2014 తెలుగు సాహిత్యంలో మేటి మహిళ.
నేను కోటి ఉద్యమాల కాననేగాదురా కోటికలల కోననూ గూడా వీరస్వర్గాలూ విజయాలూ వీరస్వరాలుగా పొడిచే పొద్దస్తది...
అనే ఆత్మస్థైర్యం 2014 తెలుగు సాహిత్య మహిళకుంది. ‘‘వివక్ష ధ్వనిని ఒడిసిపట్టే ఇద్దరు వ్యక్తుల సంభాషణ’’ కూడా ఈ స్త్రీ పసిగట్టగలిగింది.

చాకిరీనుంచి, వివక్ష నుంచి, అణిచివేత నుంచి, దౌర్జన్యం నుంచి, నిరాదరణ నుంచి, అవహేళన నుంచి స్త్రీ బయటపడి ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవంతో బతికే జీవితం కోసం ఈయేటి సాహిత్యంలో స్త్రీ అన్వేషిస్తూ కనబడుతుంది. శత్రువు మీద సవారి వంటి జీవితాన్నిగాక.. స్నేహం, ప్రేమ, గౌరవం పునాది మీద మూర్తికట్టిన జీవితాన్ని ఈయేటి మహిళ కోరుతున్నది. దుర్మార్గులతో సమరం, మంచి వాళ్ళతో స్నేహం ఈయేటి తెలుగు సాహిత్య స్త్రీ కోరుకుంది. ఇప్పుడు ఏ వాదమూ లేదు అన్నది నిజం కాదు. నిజాలతో నిండిన ఇజాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. వీటిలో స్త్రీ బలమైన గొంతు వినిపిస్తూనే ఉంటుంది.
పద్యాన్ని విత్తనాల్ని  చేయడం నేర్చుకో సతతారణ్యాలుగా అవి ఈ నేలపై మొలకెత్తుతాయి
ఇదీ ఈయేటి తెలుగు సాహిత్య మహిళ కంఠస్వరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement