nivali
-
నిబద్ధతే శ్వాసగా సాగిన వ్యక్తి
‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి.వెంకట్రామయ్య‘ అన్న ఒక స్పష్టమైన గొంతు, విస్పష్టమైన ఉచ్చారణతో 70 దశకం నుంచి 90వ దశకం మధ్య సంవత్సరాల వరకు శ్రోతలను పలకరించేది. వృత్తిపట్ల అం కితభావం, నిబద్ధతే ఆస్తిగా జీవిం చిన ఆయన సోమవారం శాశ్వతంగా అందర్నించీ సెలవు తీసుకున్నారు. కేవలం రేడియో జర్నలిజం ఆయన వృత్తి అయితే వారి ప్రవృత్తి సాహిత్యం. 1963లో ఆకాశవాణిలో ఆయన అనౌన్సర్‌గా ప్రవేశించారు. తరువాత ప్రాంతీయ విభాగంలో న్యూస్ రీడర్‌గా చేరారు. వార్తలను ఎడిట్ చేయడంలో, అనువదించడంలో ఆయన ప్రతిభ అపారం. రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకట్రామయ్య గారికి తెలుగు రాయడంలో, చదవడంలో, ఉచ్చారణలో ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ‘సొంతూరు దొండపాడులోని గ్రంథాలయంలోని అన్ని పుస్తకాలను చదివేసిన ఘనత నాది‘ అని ఆయన చెబుతుండేవారు. చిన్నప్పటి నుంచి నాటకం, బుర్రకథ వంటి కళారూపాలపట్ల ఉన్న ఆసక్తి ఆయనను రేడియో నాటక రచనవైపు పురికొల్పింది. రంగస్థలంపై షేక్స్పియర్ నాటకాల్లో ఆంగ్ల పాత్రలు ధరించేవారు. అయితే సాహిత్యంపై ఆయనకు వున్న ప్రేమ తరువాత కాలంతో రంగస్థలానికి వారిని దూరం చేసింది. వెంకట్రామయ్యగారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో చేరినప్పుడు స్థానం నరసింహారావు, పాలగుమ్మి విశ్వనాథం, బుచ్చిబాబు, రావూరి భరద్వాజ, శారదాశ్రీనివాస్, చిత్తరంజన్ వంటి అతిరథ మహారథులుండేవారు. వారి సాన్నిహిత్యం, ఆయన ప్రతిభకు మెరుగులు దిద్దింది. వృత్తి ప్రవృత్తిలను ఆయన సమన్వయపరిచిన తీరు అమోఘం. 76 ప్రాంతంలో వారు నారాయణగూడలో ఉన్నప్పుడు శని, ఆదివారాల్లో వారి ఇల్లు భువన విజయంలా ఉండేది. నగ్నముని, ఎ.రాజారామ్మోహనరావు, ఆర్టిస్టు చంద్ర, రాజగోపాల్, భైరవయ్య వంటివారు అక్కడ చేరి సాహిత్యగోష్టి నిర్వహిస్తుండేవారు. ఆయన పంతులమ్మ చిత్రానికి మాటలు రాశారు. కార్మికుల కార్యక్రమంలో రాంబాబుగా స్టార్ క్యారెక్టర్ పోషిస్తుండేవారు. ‘నేను రాసిన నాటికలు, రూపకాలు ఎన్నో ప్రసారమయ్యాయి. వాటి స్క్రిప్ట్స్ దాచుకోలేకపోయాను. అలా అవి నిజంగా గాలిలో కలసి పోయాయి’అని ఒకమారు చమత్కరించారు. వారి పువ్వుల మేడ, వెన్నెలవాన, రంగు వెలసిన మనుషులు సీరియల్స్ అప్పటితరం వారికి గుర్తే. వెంకట్రామయ్య గారి సమయపాలన చాలా గొప్పది. ఆయన పాటించడమే కాదు అవతలవారు కూడా పాటించాలని ఆయన కోరుతుండేవారు. ఉద్యోగాన్ని ప్రేమతో, ఆపేక్షతో చేయాలని ఆచరించి చూపిన మహనీయుడాయన. సున్నితమైన వ్యక్తిత్వం, సున్నితమయిన మాట ఆయనది. కానీ చెప్పడంలో మొహమాటపడరు. ఎవరితోనూ పరుషంగా మాట్లాడినట్టు కనిపించరు. ఆయన ముఖ కవళికలే ఆయన మూడ్‌ని పట్టిచ్చేవి. పద్ధతైన మనిషి. ఒకరు మనలను వేలెత్తి చూపకూడదన్న కోరిక అంతర్లీనంగా ఉండేది.మరొక విషయం ఏమిటంటే మన వలన మరొకరు ఇబ్బంది పడకూడదన్న ఎరుక వారిలో నిత్యమూ ఉండేది. ఉద్యోగవిరమణ చేసిన తరువాత చాలా తక్కువ సంద ర్భాల్లో వారు ఆకాశవాణికి వస్తుండేవారు. ఎంతో బలవంతపెడితే తప్ప గత సంవత్సరం ఆకాశవాణికి కథ చదవలేదు. కథకు సంబంధించి వారి అభిప్రాయాలను శ్రోతలతో పంచుకునేందుకు అతికష్టం మీద ఒప్పుకున్నారు. కొన్ని నెలల క్రితం తమ తరం వారందరినీ, ముఖ్యంగా ఆకాశవాణిలో తనతో పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న వారిని ఒకచోట చేర్చి,, జ్ఞాపికల వరదను సృష్టించి ఔరా వెంకట్రామయ్య గారు అనిపించుకున్నారు. చాలా సందర్భాలలో ఆయన చిరునవ్వే చాలా ప్రశ్నలకు సమాధానంగా ఉండేది. అనవసర విషయాలపై సంభాషణను పొడిగించడం బొత్తిగా ఆయనకు గిట్టని విషయం. కథా రచన ఆయనకు ఇష్టమయిన ప్రక్రియ. ఆయన కథలన్నీ అధో జగత్ జీవితాలను ప్రతిబింబించేవే. కొంత నాటకీయతను, కొంత వర్ణనలను కలుపుకుని పాఠకులను పలకరించేవి. ఎన్నో కథలకు బహుమతులు అందుకున్నారు. శిల్పం పట్ల, వస్తువు పట్ల ఆయనకు నిర్దిష్టమయిన అభిప్రాయాలుండేవి. పుంఖాను పుంఖాలుగా రాసి పేరు సంపాదించాలనో, నిత్యం పాఠకుల, శ్రోతల నోళ్లలో నానాలనో కోరిక లేని మనిషి ఆయన. కథారచన అంటే ఎంతో మధనపడాలని నమ్మేవారు. దానికి తగినట్టుగానే తన రచనా ప్రక్రియ కొనసాగించేవారు. బుచ్చిబాబు కథా పురస్కారం, కారా మాస్టారు నుంచి రావిశాస్త్రి పురస్కారం అందుకున్నారు. ఆయన సాహిత్య కృషిలో భాగంగా దాదాపు పాతిక పుస్తకాలకు పీఠికలు రాశారు. వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు వంటివి వందకుపైగానే ఉంటాయి. పదునైన భాష, ప్రయోజనకరమైన ఇతివృత్తం, అరుదైన శిల్పం సమపాళ్లలో కలిపితే వెంకట్రామయ్య కథలవుతాయి. కథా రచనలో ఆయనను మెప్పించడం కష్టం అని అందరూ అంటారు. రచన పత్రికలో రాసిన ఆకాశవాణి జ్ఞాపకాలులో ఆయన ఏవిషయాన్నీ దాచుకోకుండా చెప్పేశారు. జాలీ, కరుణ ఉన్న మనుషులతో మనకు తెలియకుండానే సాన్నిహిత్యం పెరిగిపోతుంది. అలాంటి జాలిగుండె కలవారు వెంకట్రామయ్య. తనకీ, ఎదుటివారికీ కూడా ఎటువంటి ఇబ్బందీ రాకూడదనీ, ఎవరికీ వంగకూడదనీ ఆయన తాపత్రయపడేవారు. గత ఏడాది ఆగస్టు 31న జరిగిన ఆకాశవాణి సీనియర్ అనౌన్సర్ దక్షిణామూర్తి పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 78 ఏళ్ల వయసులోనూ చెరగని చిరునవ్వుతోనే కనిపించారు. ‘ఇది వరకులాగా స్క్రిప్టు చదవలేకపోతున్నానయ్యా, అందుకే రేడియో రికార్డింగ్ అంటే తప్పించుకుంటున్నా. ఏమీ అనుకోకండి’అని చాలా బాధగా చెప్పిన క్షణాలు ఇంకా కళ్ల ముందు మెదలుతున్నాయి. సినిమాలంటే కూడా ఆయనకు ఇష్టం ఉండేది. సినిమాలు చూడటం ఆయనకో వ్యసనం కాదుగానీ, వ్యాపకంగా మాత్రం ఉండేది. సినిమాను ఆయన ప్రేయసిగా వర్ణించారు. చివరకు ఆ ప్రేయసి ఒడి(థియేటర్)లోనే తుదిశ్వాస వదలటం యాదృచ్ఛికమేగానీ.. ఆయన తుది కోరిక అలా తీరిందేమో అనిపిస్తుంది. మరొకరితో మనం చేయించుకోకూడదు.. ఆ దశ రాకూడదు అని ఆయన తన సన్నిహితులతో అంటుండేవారు. జ్ఞాపకాలను మనకు వదిలి దివికేగిన దివి వెంకట్రామయ్యగారు అరుదైన వ్యక్తి. సీతారాంబాబు చెన్నూరి వ్యాసకర్త ఆకాశవాణి కార్యనిర్వహణ అధికారి -
అంజలీదేవికి నివాళి
పెద్దాపురం : నటనతో ప్రజలందరినీ మెప్పించిన కలియుగ సీత అంజలీ దేవి అని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. పెద్దాపురం పట్టణ ఆడపడుచు అంజలీ దేవి మూడో వర్ధంతిని బుధవారం సాయంత్రం నిర్వహించారు. అంజలీదేవి ఫౌండేష¯ŒS చైర్మ¯ŒS, ప్రముఖ పారిశ్రామిక వేత్త గోలి రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆమెను నేటి కళాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గోలి రామారావు మాట్లాడుతూ అంజలీదేవి పెద్దాపురం పట్టణంలో జన్మించిడం గర్వకారణమన్నారు. అంజలిదేవి తనయుడు పీయూఎస్ చిన్నారావు మాట్లాడుతూ తన తల్లిపై పట్టణ ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలను చూస్తే గర్వకారణంగా ఉందన్నారు. ఫౌండేష¯ŒS కన్వీనర్ పొలమరశెట్టి సత్తిబాబు, అంజలిదేవి మేనల్లుళ్లు గోళ్ల బాబీ, గోళ్ల శ్రీను మాట్లాడారు. తొలుత అంజలీదేవి విగ్రహానికి ఎమ్మెల్సీ బొడ్డు, గోలి తదితరులు క్షీరాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వి.ముని రామయ్య, మున్సిపల్ వైస్ చైర్మ¯ŒS త్సలికి సత్య భాస్కరరావు, కౌన్సిలర్లు వాసంశెట్టి గంగ, గోకిన ప్రభాకరరావు, విజ్జపు రాజశేఖర్, తూతిక రాజు, పాగా సురేష్‌కుమార్, అభిమాన సంఘం కార్యదర్శి వెలగల కృష్ణ పాల్గొన్నారు. -
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి జాతీయ కవి
వర్ధంతి సభలో వక్తల నివాళి రాజమహేంద్రవరం కల్చరల్ : కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి జాతీయ కవి అని, స్వాతంత్య్ర ఉద్యమానికి ఆయన మద్దతు ఉండేదని ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ ఆవరణలోని శ్రీపాద విగ్రహం వద్ద ఆయన మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో గురువారం కృష్ణమూర్తి శాస్త్రి 56వ వర్ధంతి జరిగింది. సమకాలీన రచయితలను శ్రీపాద ఎంతగానో ప్రోత్సహించేవారని నరసింహారావు తెలిపారు. నాటి పురపాలక సంఘం ఆయనకు అరుదైన స్వేచ్ఛా పౌరసత్వాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. చిలకమర్తి ఫౌండేష¯ŒS వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ల రఘునాథ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకమునుపు జరిగిన భారతీ జాతీయ కవిసమ్మేళనంలో తెలుగువారి తరఫున శ్రీపాద హాజరయ్యారని చెప్పారు. ప్రముఖ సాహితీవేత్త చాగంటి శరత్‌బాబు మాట్లాడుతూ శ్రీపాద ఒంటిచేత్తో భారత, భాగవత, రామాయణాలను అనువదించారని కొనియాడారు. శ్రీపాద మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి రచనలను వెలుగులోకి తేవాలని కోరారు. రత్నం పె¯Œ్స అధినేత కేవీ రమణమూర్తి, విశ్రాంత బ్యాంకు అధికారి చావలి రామ్మూర్తిశాస్త్రి తదితరులు ప్రసంగించారు. సాహితీవేత్తలు డీవీ హనుమంతరావు, పెమ్మరాజు గోపాలకృష్ణ, కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి, బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీపాద స్వీయచరిత్ర పునర్ముద్రణకు కృషి ‘సాక్షి’తో కృష్ణమూర్తి శాస్త్రి మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ ‘కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి స్వీయచరిత్ర ’శ్రీకృష్ణస్వీయచరిత్రము’ నేడు అలభ్యంగా ఉంది, నా వద్ద సైతం జిరాక్సు ప్రతి మాత్రమే ఉంది’ అని శ్రీపాద మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీపాద వర్ధంతి సందర్భంగా నగరానికి వచ్చిన ఆయనను గురువారం ‘సాక్షి’ పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘శ్రీపాద స్వీయచరిత్రలో నాటి సమకాలీన కవులు, సమాజం–ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి చూడవచ్చు. తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్రి్తతో ఆయనకు న్యాయస్థానంలో వివాదాలుండేవి. ఇద్దరూ కలసి భోజనం చేసి, ఒకే జట్కాలో న్యాయస్థానానికి వెళ్లేవారని చెబుతారు. ఈ వివరాలు సాహిత్యపరంగా వెలుగులోకి రావలసిన అవసరం ఉంది. కొంతమంది ప్రచురణకర్తలు పునర్ముద్రణకు సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. వారితో సంప్రదించి, త్వరలో ఒక నిర్ణయానికి వస్తాను. సుమారు వంద శ్రీపాద రచనలు కూడా అలభ్యంగానే ఉన్నాయి. శ్రీపాద సంపాదకత్వంలో వెలువడిన వజ్రాయుధం అనే పత్రికలో శ్రీపాద నాటి కవుల గుణదోషాలను నిర్మొహమాటంగా ఎత్తిచూపేవారు. దీనికి సంబంధించిన ప్రతి ఒకటి నా వద్ద ఉంది. పరిశోధకులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. గ్రంథాలయాల్లో వీటి ప్రతులు ఉన్నాయోమో పరిశీలిస్తున్నాను. శ్రీపాద సమగ్ర సాహిత్యం తెలుగువారికి అందించే యజ్ఞంలో నేనూ ఒక సమిధనైతే.. అంతకన్నా అదృష్టం మరొకటి ఏముంటుంది?’ -
జీవధార ఘంటసాల గానం
ఘనంగా అమర గాయకుడి జయంతి రాజమహేంద్రవరం కల్చరల్ : వేదనాదమే ఘంటసాల గళం నుంచి సంగీతంగా రూపుదిద్దుకుని జీవధారలు కురిపించిందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొనియాడారు. గోదావరి సింగర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం అమర గాయకుడు ఘంటసాల జయంతిని ఘనంగా నిర్వహించారు. గోదావరి గట్టుపై ఉన్న ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ ఘంటసాల సంగీతంలో జీవించారని, పాటను రక్తి కట్టించడంలో, అందరినీ పాట ద్వారా రంజింపచేయడంలో ఆయనకు ఆయనే సాటిని పేర్కొన్నారు. ఘంటసాల మనసున్న గాయకుడు... మనసు విప్పి పాడారు... అందుకే నేటికీ ఆయన పాటలు అందర్నీ అలరింపజేస్తున్నాయని చెప్పారు. ఘంటసాల స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేసీ నాయకుడు ధార్వాడ రామకృష్ణ, ఘంటసాల విగ్రహ వ్యవస్థాపకుడు రాయడు చంద్రకుమార్, పిరాట్ల శ్రీహరి, ఘంటసాల శ్యామలాకుమారి, కోసూరి చండీప్రియ, రాళ్ళపల్లి నీలాద్రి, రాళ్ళపల్లి శ్రీనివాస్, సన్నిధానం శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
సాహసవీరుడా.. ఇక సెలవ్!
వైవీయూ: కడప సాహసవీరుడు.. శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు.. మళ్లీ జన్మంటు ఉంటే సాహసవీరుడుగానే పుడతానంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లేవాకు మదన్‌మోహన్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి దివ్యధామరామం వాహనంలో పబ్బాపురం సమీపంలోని యాదవాపురానికి తీసుకెళ్లి అక్కడ ఆయన అన్న కుమారుడి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భౌతికకాయం వద్ద చిన్నారులు సెల్యూట్ చేసి జాతీయగీతాలపన చేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు ప్రమీల, నరసింహారెడ్డి, ఆయన సతీమణి లతల రోదనలు అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించాయి. నివాళులర్పించిన మేయర్, ఎమ్మెల్యే... నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో మదన్‌మోహన్‌రెడ్డి భౌతికకాయానికి కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా నివాళులర్పించారు. సాహసకృత్యాలతో జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన మదన్‌మోహన్‌రెడ్డి మరణం అందరినీ కలిచివేసిందని వారు పేర్కొన్నారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. మదన్‌మోహన్‌రెడ్డి పేరుతో సాహస అవార్డు... పారామోటార్ గ్లైడర్ లేవాకు మదన్‌మోహన్‌రెడ్డి పేరుతో సాహస అవార్డును పెట్టేందుకు నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ (ఎన్‌ఏఎఫ్) నిర్ణయించిందని ఎన్‌ఏఎఫ్ జాయింట్ సెక్రటరీ, పారామోటార్ పైలెట్ సి.వి. సూర్యతేజ తెలిపారు. పూర్తి విధివిదానాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. ఈయన స్మారకార్థం జనవరిలో విజయవాడ, విశాఖ, కడప నగరాల్లో క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మదన్‌మోహన్‌రెడ్డి భౌతికకాయానికి ఎయిర్‌ఫోర్స్ అధికారులు దామోదర్పటేల్, సుకుమార్, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ ఎం.ఐ.కె. రెడ్డి, వింగ్ కమాండర్ జయశంకర్, ఎన్‌ఏఎఫ్ డైరెక్టర్ వై. శ్రీనివాసరావు తదితరులు మదన్‌మోహన్‌రెడ్డికి నివాళులర్పించారు. -
నిండు శోకంతో మొహర్రం
ఇమామ్ హుస్సేన్‌కు ఘన నివాళి గుమ్మటాలు, పీర్ల ఊరేగింపు ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) : మహ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ సంతాప దినాలు (మొహర్రం సంతాప దినాలు), మొహర్రం పండుగగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంటారు. 6వ శతాబ్దంలో ఇరాన్‌లోని కర్బలాలో జరిగిన యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్, అతని పరివారాన్నిSప్రత్యర్థులు హతమార్చారు. అప్పటి నుంచి ఏటా ముస్లింలు మొహర్రం సంతాపదినాలను పాటిస్తున్నారు. ఈ నెల 2 న చంద్ర దర్శనంతో ఇస్లాం క్యాలండర్‌లోని మొదటి నెల మొహర్రం ప్రారంభమైంది. 11 రోజుల మొహర్రం సంతాప దినాలు బుధవారంతో ముగిశాయి. ఈ 11 రోజుల్లో ముఖ్యమైన రోజులలో జులూస్ (ఊరేగింపులు), నిప్పుల గుండంపై నడవడం, మజ్లిస్‌లు నిర్వహించారు. రంగురంగుల పీర్ల(అలం) ఊరేగింపు తదితర కార్యక్రమాలలో మహిళలు కూడా పాల్గొన్నారు. ఇమాం హుస్సేన్ వీర మరణం(షహీద్) పొందిన మొహర్రం పదకొండో రోజైన బుధవారం ముస్లింలు ద్రాక్షారామలోని పెద్ద మసీదు సెంటర్ నుంచి, హజరత్ అబ్బాస్ రోడ్డు వరకు తమ వీపులపైన, శిరస్సులపైన, ఛాతీలపైన రక్తం చిందేలా మాతం చేసి ఇమాం హుస్సేన్‌పై తమ భక్తిని చాటుకున్నారు. రాత్రి మొహర్రం సంతాప దినాలలో ప్రధాన ఘట్టమైన బార్ మే ఇమాం(తల్లి పీరు) ఊరేగింపు ఆగా వారి పెద్ద పంజా నుంచి మాతం నిర్వహించుకుంటూ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. పంజాముజావర్లు(ధర్మకర్తలు) భక్తులకు భోజన వసతులు కల్పించారు. మజ్లిస్ (ప్రార్థన) బోధించేందుకు ఇరాక్‌లోని నజఫ్ పట్టణంలో విద్యాభ్యాసం చేసిన మౌలానా షమీముల్ హసన్ నజఫీ విచ్చేశారు. ఆయన మొహర్రం ప్రాశస్త్యాన్ని వివరించారు. ముస్లింలు నల్ల దుస్తులు ధరించి పీరులను, గుమ్మటాలను చెరువుకు తీసుకుని వెళ్లి కడిగి శాంతింపజేశారు. ద్రాక్షారామతో పాటు హసన్‌బాద, పెడపర్తి, పసలపూడి, తాళ్లరేవు గ్రామాలలో పీర్ల పంజాలలో సంతాప దినాలు నిర్వహించారు. వివిధ ముస్లిం సంఘాలు ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మీరా›్జ ఖాసిం హుస్సేన్ (చోటు), డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ కొమ్ముల శ్రీధర్‌కుమార్, ఎస్సై ఫజుల్ రహమన్, పంజా ధర్మకర్తలు, ఇమాంలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ద్రాక్షారామ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మామిడికుదురులో.. మామిడికుదురు : ముస్లింల ఆరాధ్య దైవం హజరత్ ఇమామ్ హుస్సేన్, ఆయన పరివారం అమరత్వం పొందిన రోజు (షహదత్) ను పురస్కరించుకుని మొహర్రం ను బుధవారం నిండు శోకంతో నిర్వహించారు. భక్తులు కత్తులు, బ్లేడులు, గొలుసులతో తమ శరీరాలను గాయపర్చుకుని రక్తం చిందిస్తూ ‘హుస్సేన్... హుస్సేన్’... అని నినదిస్తూ మాతం నిర్వహించారు. మామిడికుదురు, నగరం గ్రామాల్లోని సుమారు 45 పంజాల నుంచి పీర్లు, గుమ్మటాలను తీసి గ్రామ వీధుల్లో ఊరేగించారు. స్థానిక హజరత్ ఇమామ్ హుస్సేన్ పంజా నుంచి ప్రారంభమైన ఊరేగింపు నగరం పెద పంజీషా వరకు జరిగింది. నగరంలోని మంజిలే కర్బలా నుంచి రక్తం చిందిస్తూ మాతం నిర్వహిం చారు. పెద పంజీషాలో మౌలానా అలీ హైదర్ హైదరీ షహదత్ మజ్లిస్ ఆల పించారు. నగరంలోని చెరువులో పీర్లను శాంతింప చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ముస్లింలు నలుపు దుస్తులు ధరించి మొహర్రం సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ ముస్లిం సంఘాల ప్రతినిధులు భక్తులకు ప్రసాద వితరణ చేశాయి. -
అమర జవాన్లకు ఘన నివాళి
తీవ్రవాదుల దాడిలో మరణించిన అమర జవాన్లకు నర్సరీ రైతులు తమ శైలిలో నివాళులర్పించారు. వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, స్థానిక పల్ల వెంకన్న నర్సరీలో వివిధ రకాల మొక్కలతో కూర్పు ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో ఎల్లవేళలా పోరాడే సైనికుల సేవా నిరతి ప్రతిక్షణం మనం స్మరించుకోవాలని నర్సరీ రైతులు పల్ల సత్యనారాయణమూర్తి, పల్ల సుబ్రహ్మణ్యం, పల్లగణపతి, పల్ల వెంకటేష్ తెలిపారు. – కడియం -
ఎదలోని నీబొమ్మ ఎన్నటికీ పదిలం
మహానేత వైఎస్‌ను స్మరించుకున్న ప్రజలు ఊరూవాడా దివంగత ముఖ్యమంత్రి ఏడో వర్ధంతి ఆయన స్ఫూర్తితో పలు సేవాకార్యక్రమాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : పేదల మనసే మందిరంగా కొలువుదీరిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏడవ వర్ధంతిని జిల్లావ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శేణులు చెమ్మగిల్లిన కళ్లతో జరుపుకొన్నారు. బరువెక్కిన హృదయాలతో ఆ జనప్రియుని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ లోకాన్ని వీడి ఏడేళ్లవుతున్నా.. ఆయనపై తమ అభిమానం చెక్కుచెదరలేదని చాటుకున్నారు. నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు ఆయన అందించిన సేవలు, వారి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరోసారి గుర్తుకు తెచ్చుకుని నీరాజనాలు పలికారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన స్ఫూర్తితో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అంతటా వాడవాడలా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ రహితంగా వైఎస్ అభిమానులు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మన్యం, మైదాన ప్రాంతం అనే తారతమ్యాలు లేకుండా ప్రతి చోటా ఆ మహానేతను మనసారా స్మరించుకున్నారు. ఆ మహనీయుని విగ్రహాలను, చిత్రపటాలను పూలమాలలతో ముంచెత్తారు. పల్లెల్లో జనం తమ స్తోమతకు తగ్గట్టు చందాలు వేసుకుని మరీ వర్ధంతి జరుపుకోవడం కనిపించింది. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న వైఎస్ విగ్రహాలను రంగులతో అలంకరించారు. నేతలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నుంచి యువకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ సేకరించిన రక్తాన్ని మరొకరికి ప్రాణదానం చేసే లక్ష్యంతో రోటరీ, లయన్స్ వంటి సంస్థల బ్లడ్ బ్యాంక్‌లకు అందించారు. ఆస్పత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లు, పాలు పంచిపెట్టారు. జనహృదయాల్లో నిలిచిన వైఎస్ : కన్నబాబు ఫీజు రీ యింబర్స్‌మెంట్, రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేసి వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగానిలిచిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిలా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఆయన కాకినాడ సమీపాన గల పగడాల పేటలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనపర్తి మండలం రామవరంలో జరిగిన వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తపేట, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి తమ తమ నియోజకవర్గాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ కో ఆర్డినేటర్లు, రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ మాత్రమేనని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మనాభం
సింహాద్రిపురం : హాస్యనటుడు బసవరాజు పద్మనాభం బహుముఖ ప్రజ్ఞాశాలి అని కుటుంబ సభ్యులు, అభిమానులు కొనియాడారు. శనివారం పద్మనాభం జయంతిని ఘనంగా నిర్వహించారు. పద్మనాభం ోదరుడు, నాటి నిర్మాత పురుషోత్తమరావు నివాసంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమరావు మాట్లాడుతూ పద్మనాభం మన lసింహాద్రిపురం వాసి కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వెండి తెరపై హాస్యాన్ని పండించి చిత్ర రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్, సావిత్రిల కాంబినేషన్లో దేవత చిత్రాన్ని నిర్మించడంతోపాటు పొట్టి ప్లీడర్, శ్రీరామకథ సినిమాలకు దర్శకత్వం వహించారన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పురుషోత్తమరావు, ఆనంద్, కుసుమకుమారి, చంద్రరేఖ, స్నేహితులు కొండారెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటకృష్ణయ్య, షరీఫ్ తదితరుల పాల్గొన్నారు. -
అభినవ పోతనకు అశ్రునివాళి
వానమామలై వరదాచార్యులు 104వ జయంతి వేడుకలు నివాళులర్పించిన నాయకులు చెన్నూర్ : చీకటిని పారదోలడానికి కలం అనే ఆయుధం పట్టి.. కవిత్వం అనే మార్గం ఎంచుకున్నాడు.. సామాజిక రుగ్మతల్ని తొలగించాడు. మనిషికి మంచి నేర్పాడు.. మంచికి మారు పేరుగా నిలిచాడు. దేశభవిత విద్యార్థుల చేతుల్లో ఉంటుందని గ్రహించి ఉపాధ్యాయుడయ్యాడు. సాటి మనిషి కష్టం తెలుసుకుని సామాన్యుడయ్యాడు. అభినవ పోతనై ఆదర్శప్రాయంగా నిలిచాడు.. అక్షర తూణీరమై లక్షలాది ‘మనసు’ల మది దోచాడు. వానమామలై వరదాచార్యులు.. ఆయనకు అఖిల ప్రజానీకం అశ్రునివాళి తెలుపుతోంది. పట్టణంలో అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు 104వ జయంతి వేడుకలను సర్పంచ్ సాధనబోయిన కష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జగన్నాథాలయం ఎదుట గల వరదాచార్యుల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదాచార్యులు ఎన్నో మంచి మంచి పుస్తకాలు రాశారని పేర్కొన్నారు. ఆయన కీర్తీ రాష్ట్ర నలుమూలలా వ్యాప్తి చెందిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నవాజ్, వార్డు సభ్యులు గడ్డ మల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు దామోదర్‌రెడ్డి, తనుగుల రవికుమార్, మద్ద మధు, ఖాలీల్. ఆయుబ్, ఆరీఫ్. నహీం, పొగుల సతీశ్, చకినారపు మల్లేశ్, పాయిరాల బాపు, మల్లికార్జున్‌యాదవ్ అఖిల్, అగయ్య, కొండపార్తి వెంకటరాజం, తగరం శంకర్, లక్ష్మణ్, యాసిన్, రాయి వెంకటేశ్‌లు పాల్గొన్నారు. -
అక్షరయోధునికి అంతిమ వీడ్కోలు
పిఠాపురం నుంచి ప్రజాకవి ఆవంత్స అంతిమయాత్ర రంగరాయ మెడికల్ కాలేజీకి పార్థివదేహం అప్పగింత పిఠాపురం : సామాజిక అసమానతలు, అన్యాయాలపై ‘వజ్రాయుధాన్ని’ దూసిన అక్షరయోధుడు, సుదీర్ఘ జీవన, కవన ప్రస్థానంలో అభ్యుదయమే కరదీపికగా సాగిన పథికుడు ఆవంత్స సోమసుందర్‌కు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. శుక్రవారం కాకినాడ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన ఆ ప్రజాకవి పార్థివదేహాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్థం శనివారం సాయంత్రం వరకూ పిఠాపురంలోని స్వగృహంలో ఉంచారు. పలువురు కవులు, సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, వామపక్ష నేతలు ఆవంత్సకు శ్రద్ధాం జలి ఘటించారు. మధ్యాహ్నం జరిగిన సంతాప సభలో పలువురు మాట్లాడుతూ ఆయన సాహిత్యరంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన కాంస్య విగ్రహాన్ని కాకినాడ కుళాయి చెరువు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన పార్ధివ దేహాన్ని ఊరేగింపుగా తరలించి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతిమ యాత్ర సందర్భంగా ఆవంత్స అమర్‌రహే అంటు నినాదాలు చేశారు. సాహితీవేత్తలు, కవులు, విమర్శకులు సంతాపసభలో సోమసుందర్ సాహిత్య విశేషాలను, వ్యక్తిత్వ విలక్షణతను కొనియాడారు. ఆయన అభ్యుదయ సాహిత్య వికాసానికి ఎంతో దోహదపడ్డారని, వర్ధమాన కవులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, చందు సుబ్బారావు, ఎంవీ భరతలక్ష్మి, గౌరీనాయుడు, పెనుగొండ లక్ష్మీనారాయణ, ముత్యాల ప్రసాద్ తదితర ప్రముఖులు సంతాపసభలో ప్రసంగించారు. పేద ప్రజలకు తీరని లోటు కాకినాడ రూరల్ : అభ్యుదయ కవి ఆవంత్స సోమసుందర్ మృతి సాహితీ ప్రియులకే కాకుండా పేద వర్గాల ప్రజలకు తీరని లోటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన తన స్వగృహంలో మాట్లాడుతూ సోమసుందర్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బూర్జువాల నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ప్రజాకవిగా పేరు పొందారన్నారు. సోమసుందర్ రచనలు పేదలను అనేక సమస్యలపై పోరాట దిశగా నడిపించాయన్నారు. జనహృదయాల్లో పోరాటమున్నదని గుర్తించి తిరుగుబాటు తెచ్చిన విప్లవ కవి సోమసుందర్ అన్నారు. -
చిరంజీవికి విద్యార్థుల నివాళి
యూనివర్సిటీక్యాంపస్: బ్రెయిన్‌డెడ్‌కు గురై అవయవదానంతో ఇతరులకు జీవం పోసిన చిరంజీవిరెడ్డికి సోమవారం పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు నివాళి అర్పించారు. చిరంజీవి ఇదే కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఆదివారం మృతిచెందిన సంగతి తెలిసిందే. అనంతరం అతని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. చనిపోతూ పలువురికి జీవం పోసిన చిరంజీవి మృతికి నివాళిగా విద్యార్థులు కళాశాల నుంచి గాంధీపురంలోని ఆయన నివాసగృహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌బాబు మాట్లాడుతూ తమ కళాశాలలో పనిచేస్తున్న చిరంజీవిరెడ్డి తన అవయవాలను దానం చేయాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ప్రశంసించారు. చిరంజీవిగా తనపేరును సార్థకం చేసుకున్నారన్నారు. -
బ్రౌన్ శాస్త్రి!
నివాళి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (20.10.1925-28.02.2014) ఇవాళ ఒక లెజెండ్ మాత్రమే కాదు సెలబ్రిటీ కూడా. ఈ రెండు నిర్వచనాలకు ఆయన తగిన వారనడంలో కొంచెమైనా అతిశయోక్తి లేదు. వేమనను సీపీ బ్రౌన్ వెలుగులోకి తెస్తే, సీపీ బ్రౌన్‌ను జానమద్ది వెలుగులోకి తెచ్చారు. కడపలోని తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా వచ్చిన బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సేవ చేసి తెలుగు సూర్యుడిగా ప్రసిద్ధుడైతే బ్రౌన్‌ను వెలుగులోకి తెచ్చిన జానమద్ది సాహితీ సూర్యుడిగా ప్రసిద్ధి చెందాడు. సీపీ బ్రౌన్ జీవితం, కృషి ఆయనకు కొట్టిన పిండి. బ్రౌన్కు సంబంధించినంత వరకు ఆయన అధికార ప్రతినిధి అంటే అబద్ధం కాదు. అందుకే ఆచార్య సి.నారాయణరెడ్డి జానమద్దిని బ్రౌన్ శాస్త్రి అని కీర్తించారు. సీపీ బ్రౌన్ కడపలో నివసించిన స్థలాన్ని బ్రౌన్ కాలేజీ అంటారు. అది శిథిలావస్థలో ఉండగా గుర్తించిన జానమద్ది బంగోరే, ఆరుద్రల స్నేహంతో ఆ స్థలంలో సీపీ బ్రౌన్ స్మారక ట్రస్టీని ప్రారంభించారు. 1986లో దానికి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి క్రమంగా దానిని సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయంగా, ఆ పైన సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా ఎదిగించడంలో జానమద్ది కృషి అసమానమైనది. ఇవాళ సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో 75 వేల గ్రంథాలు, 250 తాళపత్ర గ్రంథాలు, విలువైన మెకంజీ కైఫీయత్తులు, బ్రౌన్ రచనలు, బ్రౌన్ లేఖలు ఉన్నాయి. అయితే ఇదంత సులువుగా జరగలేదు. మొండి గోడలున్న స్థానంలో మూడంతస్తుల మహా సౌధాన్ని నిర్మించి రాష్ట్ర స్థాయిలో దానికి గుర్తింపు తేవడానికి జానమద్ది పడిన శ్రమ అంతా ఇంతా కాదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కలుసుకుని నిధులను సేకరించారు. రెండు రూపాయల నుండి ఎవరు ఎంత ఇచ్చినా స్వీకరించారు. ఇటుక ఇటుక పేర్చి మూండతస్తులు నిర్మింపజేశారు. దానిని శాశ్వతంగా తన అధీనంలో ఉంచుకుందామనే స్వార్థానికి లోను కాకుండా 2005లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, ఆ తర్వాత యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అంతేకాదు సీపీ బ్రౌన్ ద్విశత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు. అనంతపురంజిల్లా రాయదుర్గంలో సామాన్య కుటుంబంలో జన్మించిన జానమద్ది పొట్ట చేతపట్టుకుని ఉద్యోగ రీత్యా కడపజిల్లాకు వచ్చి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే ఆయన కేవలం ఉద్యోగిగా మిగిలిపోయి ఉంటే ఆయన్ను గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఆయన ఉద్యోగాన్ని జీవితానుసారంగా మాత్రమే చేసుకుని జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు. తనకు మంచి జీవితాన్ని ఇచ్చిన సమాజానికి తాను ఏం చేయగలనోనని తలచుకుని తన చేతనైనంత రూపంలో ఈ సమాజం రుణం తీర్చుకున్నారు. డాక్టర్ జానమద్ది జీవితంలో మూడు తరాలుగా వికసించింది. ఒకటి రచనా జీవితం, రెండు జిల్లా రచయితల సంఘం, మూడు సీపీ బ్రౌన్ గ్రంథాలయం. జానమద్ది రచయిత. ప్రధానంగా జీవిత చరిత్రకారుడు. దేశ విదేశాల్లో గొప్ప వ్యక్తుల జీవితాలను ఆయన వందల కొలది వ్యాసాలతో, నేటి తరానికి పరిచయం చేశారు. ‘ఎందరో మహానుభావులు’, ‘భారత మహిళ’, ‘సుప్రసిద్దుల జీవిత విశేషాలు’, ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య’, ‘బళ్లారి రాఘవ’, ‘శంకరంబాడి సుందరాచారి’ వంటి గ్రంథాలు ఆయన జీవిత చరిత్ర రచనా సామర్థ్యానికి సంకేతాలు. ‘కన్నడ కస్తూరి’, ‘మా సీమ కవులు’ వంటి గ్రంథాలు ఆయన సాహిత్యాభిరుచికి నిదర్శనాలు. కడపజిల్లా రచయితల సంఘాన్ని 1973లో స్థాపించి దాని కార్యదర్శిగా 20 ఏళ్లు పనిచేశారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ రచయితలను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. రెండు మూడు రోజులపాటు జరిగే మహాసభలను ఎనిమిదింటిని నిర్వహించారు. ప్రతి మహాసభకు ప్రత్యేక సంచికను తీసుకు వచ్చారు. బెజవాడ గోపాల్‌రెడ్డి, అరుద్ర, దాశరథి, కుందుర్తి, పురిపండ అప్పలస్వామి, శ్రీశ్రీ, సినారె, ఎమ్మెస్ రెడ్డి, దేవులపల్లి రామానుజరావు, దివాకర్ల వెంకట అవధాని వంటి రచయితలను, విద్వాంసులను రప్పించి అద్భుతమైన సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అనేక సంస్థలు, లోక నాయక ఫౌండేషన్ వంటివి ఆయనకు పురస్కారాలను అందించి తమను తాము గౌరవించుకున్నాయి. ఆయన పేరు మీదనే జానమద్ది సాహితీపీఠం మూడేళ్ల క్రితం మొదలై కళారంగంలో కృషి చేసిన వారిని ప్రోత్సహిస్తోంది. మలినం లేని హృదయం, మల్లెపువ్వు వంటి, తెలుగుతనం ఉట్టిపడే వేషం, అందమైన వాక్కు, మృదువైన కంఠం, మందస్మిత వదనారవిందం చూపరులను ఆకర్షించే జానమద్ది మూర్తి. వయోభేదం లేకుండా కులమతాలతో సంబంధం లేకుండా ఎవరితోనైనా స్నేహం చేయగల సహృదయతకు ప్రతీక జానమద్ది. నైరాశ్యం ఎరుగని ఉత్సాహం, పారుష్యం ఎరుగని సంభాషణం ఆయన జీవిత లక్షణాలు. ఒకసారి మాట్లాడితే మళ్లీ మాట్లాడాలనిపించే వ్యక్తిత్వం ఆయనది. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆయన శ్వాస, ఆయన ధ్యాస. తాను మరణిస్తే తన పార్థివదేహాన్ని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ప్రజల కోసం కొన్ని గంటలు ఉంచాలని ఉబలాటపడిన డాక్టర్ జానమద్ది స్వార్థ రాహిత్యానికి మారుపేరు. అందుకే 2014 ఫిబ్రవరి 28 ఉదయం 6.00 గంటలకు తుది శ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల మధ్య సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో అభిమానులు, ప్రజల సందర్శనార్థం పెట్టారు. ‘ఎందరో మహానీయులు’ గ్రంథాన్ని రచించిన జానమద్ది హనుమచ్ఛాస్త్రి రాయదుర్గం నుండి బ్రౌన్ దుర్గం దాక పయనించిన మహానీయుడు. - రాచపాళెం చంద్రశేఖర రెడ్డి తొంభై ఏళ్ల జీవితంలో అరవై ఏళ్లు సమాజానికి అంకితం చేసిన డాక్టర్ జానమద్ది జీవితం అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారులతో నిండిపోయిన నేటి సమాజాన్ని సంస్కరించాలనుకునే వాళ్లకు నిస్సందేహంగా దీపధారి.