నిండు శోకంతో మొహర్రం
-
ఇమామ్ హుస్సేన్‌కు ఘన నివాళి
-
గుమ్మటాలు, పీర్ల ఊరేగింపు
ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) :
మహ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ సంతాప దినాలు (మొహర్రం సంతాప దినాలు), మొహర్రం పండుగగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంటారు. 6వ శతాబ్దంలో ఇరాన్‌లోని కర్బలాలో జరిగిన యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్, అతని పరివారాన్నిSప్రత్యర్థులు హతమార్చారు. అప్పటి నుంచి ఏటా ముస్లింలు మొహర్రం సంతాపదినాలను పాటిస్తున్నారు. ఈ నెల 2 న చంద్ర దర్శనంతో ఇస్లాం క్యాలండర్‌లోని మొదటి నెల మొహర్రం ప్రారంభమైంది. 11 రోజుల మొహర్రం సంతాప దినాలు బుధవారంతో ముగిశాయి. ఈ 11 రోజుల్లో ముఖ్యమైన రోజులలో జులూస్ (ఊరేగింపులు), నిప్పుల గుండంపై నడవడం, మజ్లిస్‌లు నిర్వహించారు. రంగురంగుల పీర్ల(అలం) ఊరేగింపు తదితర కార్యక్రమాలలో మహిళలు కూడా పాల్గొన్నారు. ఇమాం హుస్సేన్ వీర మరణం(షహీద్) పొందిన మొహర్రం పదకొండో రోజైన బుధవారం ముస్లింలు ద్రాక్షారామలోని పెద్ద మసీదు సెంటర్ నుంచి, హజరత్ అబ్బాస్ రోడ్డు వరకు తమ వీపులపైన, శిరస్సులపైన, ఛాతీలపైన రక్తం చిందేలా మాతం చేసి ఇమాం హుస్సేన్‌పై తమ భక్తిని చాటుకున్నారు. రాత్రి మొహర్రం సంతాప దినాలలో ప్రధాన ఘట్టమైన బార్ మే ఇమాం(తల్లి పీరు) ఊరేగింపు ఆగా వారి పెద్ద పంజా నుంచి మాతం నిర్వహించుకుంటూ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. పంజాముజావర్లు(ధర్మకర్తలు) భక్తులకు భోజన వసతులు కల్పించారు. మజ్లిస్ (ప్రార్థన) బోధించేందుకు ఇరాక్‌లోని నజఫ్ పట్టణంలో విద్యాభ్యాసం చేసిన మౌలానా షమీముల్ హసన్ నజఫీ విచ్చేశారు. ఆయన మొహర్రం ప్రాశస్త్యాన్ని వివరించారు. ముస్లింలు నల్ల దుస్తులు ధరించి పీరులను, గుమ్మటాలను చెరువుకు తీసుకుని వెళ్లి కడిగి శాంతింపజేశారు. ద్రాక్షారామతో పాటు హసన్‌బాద, పెడపర్తి, పసలపూడి, తాళ్లరేవు గ్రామాలలో పీర్ల పంజాలలో సంతాప దినాలు నిర్వహించారు. వివిధ ముస్లిం సంఘాలు ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మీరా›్జ ఖాసిం హుస్సేన్ (చోటు), డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ కొమ్ముల శ్రీధర్‌కుమార్, ఎస్సై ఫజుల్ రహమన్, పంజా ధర్మకర్తలు, ఇమాంలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ద్రాక్షారామ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మామిడికుదురులో..
మామిడికుదురు : ముస్లింల ఆరాధ్య దైవం హజరత్ ఇమామ్ హుస్సేన్, ఆయన పరివారం అమరత్వం పొందిన రోజు (షహదత్) ను పురస్కరించుకుని మొహర్రం ను బుధవారం నిండు శోకంతో నిర్వహించారు. భక్తులు కత్తులు, బ్లేడులు, గొలుసులతో తమ శరీరాలను గాయపర్చుకుని రక్తం చిందిస్తూ ‘హుస్సేన్... హుస్సేన్’... అని నినదిస్తూ మాతం నిర్వహించారు. మామిడికుదురు, నగరం గ్రామాల్లోని సుమారు 45 పంజాల నుంచి పీర్లు, గుమ్మటాలను తీసి గ్రామ వీధుల్లో ఊరేగించారు. స్థానిక హజరత్ ఇమామ్ హుస్సేన్ పంజా నుంచి ప్రారంభమైన ఊరేగింపు నగరం పెద పంజీషా వరకు జరిగింది. నగరంలోని మంజిలే కర్బలా నుంచి రక్తం చిందిస్తూ మాతం నిర్వహిం చారు. పెద పంజీషాలో మౌలానా అలీ హైదర్ హైదరీ షహదత్ మజ్లిస్ ఆల పించారు. నగరంలోని చెరువులో పీర్లను శాంతింప చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ముస్లింలు నలుపు దుస్తులు ధరించి మొహర్రం సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ ముస్లిం సంఘాల ప్రతినిధులు భక్తులకు ప్రసాద వితరణ చేశాయి.