నిబద్ధతే శ్వాసగా సాగిన వ్యక్తి | Sitaram Chennuri Guest Column On Venkatramaiah | Sakshi
Sakshi News home page

నిబద్ధతే శ్వాసగా సాగిన వ్యక్తి

Published Wed, Jan 15 2020 12:29 AM | Last Updated on Wed, Jan 29 2020 11:58 PM

Sitaram Chennuri Guest Column On Venkatramaiah - Sakshi

‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి.వెంకట్రామయ్య‘ అన్న ఒక స్పష్టమైన గొంతు, విస్పష్టమైన ఉచ్చారణతో 70 దశకం నుంచి 90వ దశకం మధ్య సంవత్సరాల వరకు శ్రోతలను పలకరించేది. వృత్తిపట్ల అం కితభావం, నిబద్ధతే ఆస్తిగా జీవిం చిన ఆయన సోమవారం శాశ్వతంగా అందర్నించీ సెలవు తీసుకున్నారు. కేవలం రేడియో జర్నలిజం ఆయన వృత్తి అయితే వారి ప్రవృత్తి సాహిత్యం. 1963లో ఆకాశవాణిలో ఆయన అనౌన్సర్‌గా ప్రవేశించారు. తరువాత ప్రాంతీయ విభాగంలో న్యూస్‌ రీడర్‌గా చేరారు. వార్తలను ఎడిట్‌ చేయడంలో, అనువదించడంలో ఆయన ప్రతిభ అపారం. రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకట్రామయ్య గారికి తెలుగు రాయడంలో, చదవడంలో, ఉచ్చారణలో ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ‘సొంతూరు దొండపాడులోని గ్రంథాలయంలోని అన్ని పుస్తకాలను చదివేసిన ఘనత నాది‘ అని ఆయన చెబుతుండేవారు. చిన్నప్పటి నుంచి నాటకం, బుర్రకథ వంటి కళారూపాలపట్ల ఉన్న ఆసక్తి ఆయనను రేడియో నాటక రచనవైపు పురికొల్పింది. రంగస్థలంపై షేక్స్‌పియర్‌ నాటకాల్లో ఆంగ్ల పాత్రలు ధరించేవారు. అయితే సాహిత్యంపై ఆయనకు వున్న ప్రేమ తరువాత కాలంతో రంగస్థలానికి వారిని దూరం చేసింది. 

వెంకట్రామయ్యగారు ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో చేరినప్పుడు స్థానం నరసింహారావు, పాలగుమ్మి విశ్వనాథం, బుచ్చిబాబు, రావూరి భరద్వాజ, శారదాశ్రీనివాస్, చిత్తరంజన్‌ వంటి అతిరథ మహారథులుండేవారు. వారి సాన్నిహిత్యం, ఆయన ప్రతిభకు మెరుగులు దిద్దింది. వృత్తి ప్రవృత్తిలను ఆయన సమన్వయపరిచిన తీరు అమోఘం. 76 ప్రాంతంలో వారు నారాయణగూడలో ఉన్నప్పుడు శని, ఆదివారాల్లో వారి ఇల్లు భువన విజయంలా ఉండేది. నగ్నముని, ఎ.రాజారామ్మోహనరావు, ఆర్టిస్టు చంద్ర, రాజగోపాల్, భైరవయ్య వంటివారు అక్కడ చేరి సాహిత్యగోష్టి నిర్వహిస్తుండేవారు. ఆయన పంతులమ్మ చిత్రానికి మాటలు రాశారు. కార్మికుల కార్యక్రమంలో రాంబాబుగా స్టార్‌ క్యారెక్టర్‌ పోషిస్తుండేవారు.  

‘నేను రాసిన నాటికలు, రూపకాలు ఎన్నో ప్రసారమయ్యాయి. వాటి స్క్రిప్ట్స్‌ దాచుకోలేకపోయాను. అలా అవి నిజంగా గాలిలో కలసి పోయాయి’అని ఒకమారు చమత్కరించారు. వారి పువ్వుల మేడ, వెన్నెలవాన, రంగు వెలసిన మనుషులు సీరియల్స్‌ అప్పటితరం వారికి గుర్తే. వెంకట్రామయ్య గారి సమయపాలన చాలా గొప్పది. ఆయన పాటించడమే కాదు అవతలవారు కూడా పాటించాలని ఆయన కోరుతుండేవారు. ఉద్యోగాన్ని ప్రేమతో, ఆపేక్షతో చేయాలని ఆచరించి చూపిన మహనీయుడాయన. సున్నితమైన వ్యక్తిత్వం, సున్నితమయిన మాట ఆయనది. కానీ చెప్పడంలో మొహమాటపడరు. ఎవరితోనూ పరుషంగా మాట్లాడినట్టు కనిపించరు. ఆయన ముఖ కవళికలే ఆయన మూడ్‌ని పట్టిచ్చేవి. పద్ధతైన మనిషి. ఒకరు మనలను వేలెత్తి చూపకూడదన్న కోరిక అంతర్లీనంగా ఉండేది.మరొక విషయం ఏమిటంటే మన వలన మరొకరు ఇబ్బంది పడకూడదన్న ఎరుక వారిలో నిత్యమూ ఉండేది.

ఉద్యోగవిరమణ చేసిన తరువాత చాలా తక్కువ సంద ర్భాల్లో వారు ఆకాశవాణికి వస్తుండేవారు. ఎంతో బలవంతపెడితే తప్ప గత సంవత్సరం ఆకాశవాణికి కథ చదవలేదు. కథకు సంబంధించి వారి అభిప్రాయాలను శ్రోతలతో పంచుకునేందుకు అతికష్టం మీద ఒప్పుకున్నారు. కొన్ని నెలల క్రితం తమ తరం వారందరినీ, ముఖ్యంగా ఆకాశవాణిలో తనతో పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న వారిని ఒకచోట చేర్చి,, జ్ఞాపికల వరదను సృష్టించి ఔరా వెంకట్రామయ్య గారు అనిపించుకున్నారు. చాలా సందర్భాలలో ఆయన చిరునవ్వే చాలా ప్రశ్నలకు సమాధానంగా ఉండేది. అనవసర విషయాలపై సంభాషణను పొడిగించడం బొత్తిగా ఆయనకు గిట్టని విషయం. 

కథా రచన ఆయనకు ఇష్టమయిన ప్రక్రియ. ఆయన కథలన్నీ అధో జగత్‌ జీవితాలను ప్రతిబింబించేవే. కొంత నాటకీయతను, కొంత వర్ణనలను కలుపుకుని పాఠకులను పలకరించేవి. ఎన్నో కథలకు బహుమతులు అందుకున్నారు. శిల్పం పట్ల, వస్తువు పట్ల ఆయనకు నిర్దిష్టమయిన అభిప్రాయాలుండేవి. పుంఖాను పుంఖాలుగా రాసి పేరు సంపాదించాలనో, నిత్యం పాఠకుల, శ్రోతల నోళ్లలో నానాలనో కోరిక లేని మనిషి ఆయన. కథారచన అంటే ఎంతో మధనపడాలని నమ్మేవారు. దానికి తగినట్టుగానే తన రచనా ప్రక్రియ కొనసాగించేవారు. బుచ్చిబాబు కథా పురస్కారం, కారా మాస్టారు నుంచి రావిశాస్త్రి పురస్కారం అందుకున్నారు. ఆయన సాహిత్య కృషిలో భాగంగా దాదాపు పాతిక పుస్తకాలకు పీఠికలు రాశారు. వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు వంటివి వందకుపైగానే ఉంటాయి. 

పదునైన భాష, ప్రయోజనకరమైన ఇతివృత్తం, అరుదైన శిల్పం సమపాళ్లలో కలిపితే వెంకట్రామయ్య కథలవుతాయి. కథా రచనలో ఆయనను మెప్పించడం కష్టం అని అందరూ అంటారు. రచన పత్రికలో రాసిన ఆకాశవాణి జ్ఞాపకాలులో ఆయన ఏవిషయాన్నీ దాచుకోకుండా చెప్పేశారు. జాలీ, కరుణ ఉన్న మనుషులతో మనకు తెలియకుండానే సాన్నిహిత్యం పెరిగిపోతుంది. అలాంటి జాలిగుండె కలవారు వెంకట్రామయ్య. తనకీ, ఎదుటివారికీ కూడా ఎటువంటి ఇబ్బందీ రాకూడదనీ, ఎవరికీ వంగకూడదనీ ఆయన తాపత్రయపడేవారు.  

గత ఏడాది ఆగస్టు 31న జరిగిన ఆకాశవాణి సీనియర్‌ అనౌన్సర్‌ దక్షిణామూర్తి పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 78 ఏళ్ల వయసులోనూ చెరగని చిరునవ్వుతోనే కనిపించారు. ‘ఇది వరకులాగా స్క్రిప్టు చదవలేకపోతున్నానయ్యా, అందుకే రేడియో రికార్డింగ్‌ అంటే తప్పించుకుంటున్నా. ఏమీ అనుకోకండి’అని చాలా బాధగా చెప్పిన క్షణాలు ఇంకా కళ్ల ముందు మెదలుతున్నాయి.  సినిమాలంటే కూడా ఆయనకు ఇష్టం ఉండేది. సినిమాలు చూడటం ఆయనకో వ్యసనం కాదుగానీ, వ్యాపకంగా మాత్రం ఉండేది. సినిమాను ఆయన ప్రేయసిగా వర్ణించారు. చివరకు ఆ ప్రేయసి ఒడి(థియేటర్‌)లోనే తుదిశ్వాస వదలటం యాదృచ్ఛికమేగానీ.. ఆయన తుది కోరిక అలా తీరిందేమో అనిపిస్తుంది. మరొకరితో మనం చేయించుకోకూడదు.. ఆ దశ రాకూడదు అని ఆయన తన సన్నిహితులతో అంటుండేవారు. జ్ఞాపకాలను మనకు వదిలి దివికేగిన  దివి వెంకట్రామయ్యగారు అరుదైన వ్యక్తి.

సీతారాంబాబు చెన్నూరి
వ్యాసకర్త ఆకాశవాణి కార్యనిర్వహణ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement