జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడితో ఫార్మా భూ బాధితులు
ఎవరో చేసిన తప్పులకు తమను బలి చేస్తున్నారని ఆవేదన
కొడంగల్: తమ భూములు లాక్కుంటే.. తమ శవాలపైనే ఫార్మా కంపెనీలకు శంకుస్థాపన చేయాల్సి ఉంటుందంటూ రోటిబండతండా, లగచర్ల గ్రామ స్తులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఎంత ముఖ్యమో, తమకు తమ భూములూ అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. హుస్సేన్ నాయక్ సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు ఇతర అధికారులపై దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా ఫార్మా భూములకు సంబంధం లేని వ్యక్తులు ఒక్కసారిగా అధికారులపై దాడికి పాల్పడ్డారని ఈ సందర్భంగా బాధితులు ఎస్టీ కమిషన్ సభ్యుడికి వివరించారు. ఎవరో చేసిన తప్పిదాలకు తాము బలయ్యామని చెప్పారు. దాడి చేసిన రోజు అర్ధరాత్రి పోలీసులు మద్యం మత్తులో వచి్చ, మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించారు.
పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలి: హుస్సేన్ నాయక్
పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డికి హుస్సేన్ నాయక్ సూచించారు. ఫార్మా బాధిత గ్రామాల నుంచి పోలీసులను వెనక్కి తీసుకోవాలని చెప్పారు. లగచర్లలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామసభ ఎలా నిర్వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. రైతులతో మాట్లాడడానికి కలెక్టర్ లగచర్లకు వెళ్తుంటే పోలీసులు ఎందుకు భద్రత కలి్పంచలేదని నిలదీశారు. భూములు తీసుకోవాలంటే రైతులతో శాంతియుతంగా మాట్లాడాలని సూచించారు. ఆయన వెంట ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి, డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. ఇలావుండగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, ప్రతినిధులు గోవింద్, సురేందర్ సోమవారం ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.
ఫార్మా పేరిట భూ దందా
సంగారెడ్డి టౌన్: లగచర్లలో ఫార్మా పేరిట భూదందాకు తెరలేపారని హుస్సేన్ నాయక్ ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్టు అయ్యి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న 16 మందితో సోమవారం సాయంత్రం జాతీయ ఎస్టీ కమిషన్ బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ విలేకరులతో మాట్లాడారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తాం..1,350 ఎకరాలు కావాలంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు. రైతులు భూమిని వదులు కోవడానికి సిద్ధంగా లేరని, వారి భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment