National ST Commission
-
మా శవాలపైనే శంకుస్థాపన చేయాలి
కొడంగల్: తమ భూములు లాక్కుంటే.. తమ శవాలపైనే ఫార్మా కంపెనీలకు శంకుస్థాపన చేయాల్సి ఉంటుందంటూ రోటిబండతండా, లగచర్ల గ్రామ స్తులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఎంత ముఖ్యమో, తమకు తమ భూములూ అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. హుస్సేన్ నాయక్ సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడారు.కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు ఇతర అధికారులపై దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా ఫార్మా భూములకు సంబంధం లేని వ్యక్తులు ఒక్కసారిగా అధికారులపై దాడికి పాల్పడ్డారని ఈ సందర్భంగా బాధితులు ఎస్టీ కమిషన్ సభ్యుడికి వివరించారు. ఎవరో చేసిన తప్పిదాలకు తాము బలయ్యామని చెప్పారు. దాడి చేసిన రోజు అర్ధరాత్రి పోలీసులు మద్యం మత్తులో వచి్చ, మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలి: హుస్సేన్ నాయక్ పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డికి హుస్సేన్ నాయక్ సూచించారు. ఫార్మా బాధిత గ్రామాల నుంచి పోలీసులను వెనక్కి తీసుకోవాలని చెప్పారు. లగచర్లలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామసభ ఎలా నిర్వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. రైతులతో మాట్లాడడానికి కలెక్టర్ లగచర్లకు వెళ్తుంటే పోలీసులు ఎందుకు భద్రత కలి్పంచలేదని నిలదీశారు. భూములు తీసుకోవాలంటే రైతులతో శాంతియుతంగా మాట్లాడాలని సూచించారు. ఆయన వెంట ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి, డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. ఇలావుండగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ప్రతినిధులు గోవింద్, సురేందర్ సోమవారం ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.ఫార్మా పేరిట భూ దందా సంగారెడ్డి టౌన్: లగచర్లలో ఫార్మా పేరిట భూదందాకు తెరలేపారని హుస్సేన్ నాయక్ ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్టు అయ్యి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న 16 మందితో సోమవారం సాయంత్రం జాతీయ ఎస్టీ కమిషన్ బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ విలేకరులతో మాట్లాడారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తాం..1,350 ఎకరాలు కావాలంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు. రైతులు భూమిని వదులు కోవడానికి సిద్ధంగా లేరని, వారి భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘పునరావాస కాలనీ’లు పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు
దేవీపట్నం: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పోలవరం పునరావాస కాలనీలను బుధవారం సందర్శించారు. పెదభీంపల్లి 2,3 కాలనీలను మూలమెట్ట, మెట్టవీధి గ్రామస్తులకు నిర్మించిన పోతవరం కాలనీలో ఇళ్లను, టాయిలెట్లను, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్వాసితులకు అందిస్తున్న ప్యాకేజి ప్రయోజనాలు, పునరావాస కాలనీలు, భూమికి భూమి పరిహారం, జరుగుతున్న పనుల వివరాలను పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఆనంద్, ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ సింహాచలం ఆయనకు వివరించారు. కొండమొదలు పంచాయతీలో గ్రామాలకు నిర్మించిన కాలనీలో నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని వారి నుంచి అర్జీలను స్వీకరించారు. అనంత నాయక్ మాట్లాడుతూ..జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు పునరావాస కాలనీల పర్యటనకు వచ్చినట్లు చెప్పారు. గిరిజన నిర్వాసితుల సమస్యలను కమిషన్‌కు నివేదిస్తామని, అవసరమైతే రాష్ట్రపతికి కూడా నివేదిస్తామని తెలిపారు. -
అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వహించొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి అధికారులను ఆదేశించారు. ఏదైనా ఘటన వెలుగుచూసిన వెంటనే బాధితులకు ఆర్థికసాయం అందించాలని, కేసు నమోదుతో పాటు చార్జిషీట్ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. అట్రాసిటీ కేసుల పరిష్కారం, పరిహారం పంపిణీలో ఆలస్యమైతే బాధితులకు చట్టంపై విశ్వసనీయత తగ్గే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ నందకుమార్ సాయి, సభ్యులు మాయా చింతం, హరిక్రిష్ణ దామొర్, హర్షబాయ్ చున్నిలాల్, సంయుక్త కార్యదర్శి ఎస్కే రాథో బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంది. తొలిరోజు పర్యటనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కమిషన్ సభ్యు లు పర్యటించారు. గురువారం రాష్ట్ర ఉన్నతాధికారులతో కమిషన్ సమావేశం నిర్వహించింది. నందకుమార్ సాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ విభాగాధిపతులు హాజరయ్యారు . గిరిజన సంక్షేమం, జనజాతి తెగల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను శాఖల వారీగా సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గిరిజన యూనివర్సిటీ మాత్రమే జాప్యం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని నందకుమార్ స్పష్టం చేశారు. 500 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలుగా నవీకరణ చేసి గిరిజనుల్లో రాజకీయ చైతన్యం పెంచడం శుభపరిణామమంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనల్లో చెంచులు సాగుభూమి కావాలని కోరారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తామన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతుందని కమిషన్ చైర్మన్ అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు కల్పించి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గిరిజనులకు ఉన్నత విద్య కల్పనకు గురుకులాల ఏర్పాటు, ఆశ్రమ పాఠశాలల అప్‌గ్రెడేషన్ బాగుందని, గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు సీఎస్ జోషి వివరించారు. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను రెండు వందల రోజులకు పెంచాలని పలువురు గిరిజనులు తమను కోరినట్లు నందకుమార్ సాయి తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూ కార్యదర్శి సోమేశ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి, నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటివరకు 1317 కుటుంబాలకు మాత్రమే పునరావాసం..
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో 56,495 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. అయితే అందులో ఇప్పటివరకు 1317 ఎస్టీ కుటుంబాలను మాత్రమే పునరావాస కాలనీలకు తరలించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోమవారం రాజ్యసభకు తెలిపారు. పోలవరం నిర్వాసిత ఎస్టీ కుటుంబాలకు పునరావాసం కల్పించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు జాతీయ ఎస్టీ కమిషన్ రాష్ట్రపతికి సమర్పించిన నివేదిక వాస్తవమేనా అని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. అదే విధంగా పునరావాసం కల్పించిన కుటుంబాలకు సేద్యానికి పనికిరాని భూములు పంపిణీ చేశారా, దీని ద్వారా వారు జీవనోపాధి కోల్పోయిన విషయం వాస్తవం కాదా అనే ప్రశ్నకు కూడా కేంద్రం సమాధానమిచ్చింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులైన ఎస్టీ కుటుంబాలకు సేద్యానికి యోగ్యమైన భూములనే పంపిణీ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని మేఘవాల్ పేర్కొన్నారు. ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులైన గిరిజనులు అనే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్ ప్రత్యేక నివేదిక రూపొందించింది వాస్తమేనని మంత్రి అంగీకరించారు. నిర్వాసితులైన గిరిజన కుటుంబాల సామాజిక-ఆర్థిక అభ్యున్నతి కోసం, రాజ్యాంగపరంగా వారికి సంక్రమించిన హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన ముఖ్యమైన చర్యలను ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని తెలిపారు. నిర్వాసిత గిరిజన కుటుంబాలకు సాగు యోగ్యమైన భూముల పంపిణీ, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, ప్రాజెక్టు ప్రారంభానికి ముందుగానే ఆర్ అండ్ ఆర్ పనులను పూర్తి చేయాలని ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాని అందజేసిన నివేదికలో సిఫార్సు చేసిందని అన్నారు. ఆర్ అండ్ ఆర్ పనుల పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందని వెల్లడించారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సమీక్షపై కమిటీ.. కోస్టల్ రెగ్యులేటరీ జోన్(సీఆర్‌జెడ్) నిబంధనల సడలింపు అంశాన్ని సమీక్షించి, పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నెలకొల్పిందని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక జవాబిచ్చారు. సీఆర్‌జెడ్ కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలు, భాగస్వాములు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తీర ప్రాంతం కలిగిన ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్ళను ఈ కమిటీ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. 2018లో విడుదల చేసిన కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ముసాయిదా ప్రకటనలో ఏపీ తీర ప్రాంతాన్ని కూడా చేర్చినట్టు తెలిపారు. -
నా సమావేశానికే రారా?
సిద్దిపేటటౌన్/రాయపోలు(దుబ్బాక) : కేంద్ర కేబినెట్ స్థాయి కలిగిన తాను దళితుల సమస్యలపై సమీక్షించడానికి వస్తే జిల్లా ఉన్నతాధికారులు రాకపోవడంపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు నా సమావేశానికే రాకపోతే, సామాన్యులకేం న్యాయం చేస్తారు’అని ప్రశ్నించారు. రాములు శనివారం సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం లో దళిత సంఘాలు, నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యలపై చర్చించడానికి ఒక్కో విభాగం అధికారి వచ్చారా? లేదా? అని ఆరా తీశారు. 34 శాఖలకు ఇద్దరే అధికారులు వచ్చారని తేలడంతో సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల రెండో వారంలో మళ్లీ వస్తానని చెప్పారు. శనివారం సమావేశానికి రాని అధికారులందరికీ ఢిల్లీ వెళ్లాక నోటీసులు పంపిస్తానని స్పష్టం చేశారు. -
ఇదేమి తీరు?
♦ గిరిజనులకు పరిహారం చెల్లింపుపై జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి ♦ వివిధ అంశాలపై ఏపీ అధికారులిచ్చిన వివరణ పట్ల సందేహాలు సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో గిరిజనులకు పరిహారం చెల్లిస్తున్న తీరు, పునరావాసం కల్పిస్తున్న తీరు పట్ల జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలని కమిషన్ నిర్ణయించిన ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కమిషన్ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్ ఒరాఒన్ మంగళవారం ఇక్కడి ఎస్టీ కమిషన్ కార్యాలయంలో విచారణ జరిపారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని దేవరగొద్ది, తూర్పుగోదావరి జిల్లాలోని పూడిపల్లి పంచాయతీ పరిధిలో గిరిజనులు నిర్వాసితులైన తీరు, వారికి చెల్లిస్తున్న పరిహారం, కల్పిస్తున్న పునరావాసం తదితర అంశాలపై ఈ విచారణ కొనసాగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పోలవరం నిర్వాసితులకిస్తున్న పరిహారంపై అడిగిన ప్రశ్నలకు ఏపీ అధికారులిచ్చిన వివరణ పట్ల కమిషన్ చైర్మన్ సంతృప్తి చెందలేదు. 2013 నాటి భూసేకరణ చట్టం వర్తింపజేయకపోవడం తదితర విషయాల్లో ఏపీ అధికారులిచ్చిన వివరణకు చైర్మన్ సంతృప్తి చెందనట్టు సమాచారం. ఆ సమాధానాలు సంతృప్తినివ్వలేదు సమావేశానంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షా 91 వేలమంది నిర్వాసితులవుతుండగా అందులో లక్షా 7 వేలమంది గిరిజనులని, వారికి సరైన పునరావాసం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ విషయమై ఏపీ అధికారుల నుంచి సరైన వివరణ లభించలేదన్నారు. అందుకే కమిషన్ స్వయంగా పోలవరం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. పాత చట్టాల ప్రకారం ఇస్తున్న పరిహారం సముచితంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించి తదనంతరం తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పోలవరం వల్ల ఒడిశాలో అరుదైన ఆదిమ జాతి, ఛత్తీస్‌గఢ్‌లో రెండు అరుదైన ఆదిమ జాతులు అంతరించిపోతాయని, ఇది చాలా తీవ్రమైన అంశమని చైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలపై విచారణ
ఢిల్లీ: పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టనుంది. పోలవరం ప్రాజెక్టుతో లక్షా 7 వేల మంది గిరిజనులు నిరాశ్రయులౌతున్నారని ఎస్టీ కమిషన్ పేర్కొంది. నిర్వాసితులైన గిరిజనుల పరిహారంపై ఎస్టీ కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. సరైన నష్ట పరిహారం, పునరావాసం కల్పించలేదని ఎస్టీ కమిషన్ అభిప్రాయపడింది. నిరాశ్రయులౌతున్న గిరిజనుల స్థితిగతులు తెలుసుకునేందుకు జూలైలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటించనుంది. -
పకడ్బందీ హత్యలా ఉందే!
జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిఠాకూర్ తిరుపతి రూరల్ : ‘కనుచూపు మేరలో ఎవరున్నా చక్కగా కనిపిస్తున్నారు. వందలాది మంది కూలీలు ఎదురుపడితే కాల్పులు జరిపామంటున్నారు. ఇదంతా మైదాన ప్రాంతం. ఇక్కడ కాల్పులు జరిపితే అందులో కేవలం తొమ్మిది మందే చనిపోయారా? మిగిలిన వారిలో ఒక్కరూ ప్రాణాలతో దొరకలేదా? ఇదంతా ప్రీప్లాన్డ్ మర్డర్లా అనిపిస్తుందే’ అని శేషాచలం ఎన్‌కౌంటర్‌పై జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిఠాకూర్ అనుమానాలు వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలను ఏపీ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం, మృతుల్లో 13 మంది ఎస్టీలే ఉండడంతో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీఐజీ, ప్రజాసంఘాలు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాలను శుక్రవారం సాయంత్రం రవిఠాకూర్ స్వయంగా పరిశీలించారు. చీకటీగల కోనలో 9, చచ్చినోడిబండ వద్ద 11 మృతదేహాలు పడివున్న తీరు, ఎన్కౌంటర్ జరిగిన విధానంపై తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ దుంగలెలా వచ్చాయి? ఎన్కౌంటర్లో చనిపోయిన వారివద్ద పెయింటింగ్ మరకలున్న దుంగలు ఉండడం వాస్తవమేనా? అవి వారి వద్దకెలా వచ్చాయి? అంటూ చైర్మన్ రవిఠాకూర్ అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులులను ప్రశ్నించారు. వాటికి అర్బన్ ఎస్పీ సమాధానమిచ్చారు. అధికారులపై మండిపాటు ముందుగా సమాచారమిచ్చినా ఎన్కౌంటర్లో పాల్గొన్న 20 అధికారులుగానీ, టాస్క్‌ఫోర్స్ డీఐజీగానీ రాకపోవడంపై జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారంతో శనివారం ఉదయం 10 గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరారు. టాస్క్‌ఫోర్స్ డీఐజీ, అధికారులు, అటవీముఖ్య అధికారులు, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది హాజరుపరచాలని ఆదేశించారు. -
కళంకితురాలికి కేబినెట్ పదవా?
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యేలు హైదరాబాద్: తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సబబు కావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, రాజన్నదొర, రాజేశ్వరిలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మిని కలసి ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ఎంపీ గీత అసలు ఎస్టీ కాదని, అలాంటప్పుడు ఆమెను పదవి నుంచి తొలగించి తగిన చర్యలు చేపట్టాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధతో జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించేందుకు కేంద్రానికి సిఫార్సు చేయాలని చూడడం సిగ్గుచేటని విమర్శించారు. సాధారణ ఎంపీగా ఉండేదానికన్నా కేబినెట్ ర్యాంకు హోదాను పొందితే ప్రజా ధనాన్ని దోచుకోవచ్చనే దుర్బుద్ధితోనే కొత్తపల్లి గీత టీడీపీతో కుమ్మకైందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది వ్యక్తిగత లబ్ధికోసమే ఆమె తెలుగుదేశం పంచన చేరారని వారు దుయ్యబట్టారు.