
సాక్షి, కర్నూలు : మొహరం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పిట్టగోడ కూలిన ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాలు.. కర్నూలు మండలం బి.తాండ్రపాడులో పీర్ల పండుగ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పీర్ల చావిడి వద్ద నిప్పులు తొక్కుతున్న దృశ్యాల్ని చూసేందుకు పక్కనే ఉన్న ఓ ఇంటిపై పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.
వారంతా బంగ్లాపై ఉన్న పిట్టగోడను ఆనుకుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుప్పకూలింది. గోడను ఆనుకుని ఉన్నవారందరూ అంతెత్తు నుంచి కిందపడిపోయారు. గోడ, దాంతోపాటు మనుషులు కిందనున్నవారిపై పడటంతో అందరూ తీవ్ర గాయాలపాలయ్యారు. దాంతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బాధితులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment