ఎదలోని నీబొమ్మ ఎన్నటికీ పదిలం
-
మహానేత వైఎస్‌ను స్మరించుకున్న ప్రజలు
-
ఊరూవాడా దివంగత ముఖ్యమంత్రి ఏడో వర్ధంతి
-
ఆయన స్ఫూర్తితో పలు సేవాకార్యక్రమాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
పేదల మనసే మందిరంగా కొలువుదీరిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏడవ వర్ధంతిని జిల్లావ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శేణులు చెమ్మగిల్లిన కళ్లతో జరుపుకొన్నారు. బరువెక్కిన హృదయాలతో ఆ జనప్రియుని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ లోకాన్ని వీడి ఏడేళ్లవుతున్నా.. ఆయనపై తమ అభిమానం చెక్కుచెదరలేదని చాటుకున్నారు. నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు ఆయన అందించిన సేవలు, వారి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరోసారి గుర్తుకు తెచ్చుకుని నీరాజనాలు పలికారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన స్ఫూర్తితో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అంతటా వాడవాడలా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ రహితంగా వైఎస్ అభిమానులు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మన్యం, మైదాన ప్రాంతం అనే తారతమ్యాలు లేకుండా ప్రతి చోటా ఆ మహానేతను మనసారా స్మరించుకున్నారు. ఆ మహనీయుని విగ్రహాలను, చిత్రపటాలను పూలమాలలతో ముంచెత్తారు. పల్లెల్లో జనం తమ స్తోమతకు తగ్గట్టు చందాలు వేసుకుని మరీ వర్ధంతి జరుపుకోవడం కనిపించింది. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న వైఎస్ విగ్రహాలను రంగులతో అలంకరించారు. నేతలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నుంచి యువకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ సేకరించిన రక్తాన్ని మరొకరికి ప్రాణదానం చేసే లక్ష్యంతో రోటరీ, లయన్స్ వంటి సంస్థల బ్లడ్ బ్యాంక్‌లకు అందించారు. ఆస్పత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లు, పాలు పంచిపెట్టారు.
జనహృదయాల్లో నిలిచిన వైఎస్ : కన్నబాబు
ఫీజు రీ యింబర్స్‌మెంట్, రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేసి వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగానిలిచిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిలా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఆయన కాకినాడ సమీపాన గల పగడాల పేటలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనపర్తి మండలం రామవరంలో జరిగిన వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తపేట, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి తమ తమ నియోజకవర్గాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ కో ఆర్డినేటర్‌లు, రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ మాత్రమేనని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు.