సాహసవీరుడా.. ఇక సెలవ్!
వైవీయూ:
కడప సాహసవీరుడు.. శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు.. మళ్లీ జన్మంటు ఉంటే సాహసవీరుడుగానే పుడతానంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లేవాకు మదన్‌మోహన్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి దివ్యధామరామం వాహనంలో పబ్బాపురం సమీపంలోని యాదవాపురానికి తీసుకెళ్లి అక్కడ ఆయన అన్న కుమారుడి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భౌతికకాయం వద్ద చిన్నారులు సెల్యూట్ చేసి జాతీయగీతాలపన చేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు ప్రమీల, నరసింహారెడ్డి, ఆయన సతీమణి లతల రోదనలు అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించాయి.
నివాళులర్పించిన మేయర్, ఎమ్మెల్యే...
నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో మదన్‌మోహన్‌రెడ్డి భౌతికకాయానికి కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా నివాళులర్పించారు. సాహసకృత్యాలతో జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన మదన్‌మోహన్‌రెడ్డి మరణం అందరినీ కలిచివేసిందని వారు పేర్కొన్నారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు.
మదన్‌మోహన్‌రెడ్డి పేరుతో సాహస అవార్డు...
పారామోటార్ గ్లైడర్ లేవాకు మదన్‌మోహన్‌రెడ్డి పేరుతో సాహస అవార్డును పెట్టేందుకు నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ (ఎన్‌ఏఎఫ్) నిర్ణయించిందని ఎన్‌ఏఎఫ్ జాయింట్ సెక్రటరీ, పారామోటార్ పైలెట్ సి.వి. సూర్యతేజ తెలిపారు. పూర్తి విధివిదానాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. ఈయన స్మారకార్థం జనవరిలో విజయవాడ, విశాఖ, కడప నగరాల్లో క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మదన్‌మోహన్‌రెడ్డి భౌతికకాయానికి ఎయిర్‌ఫోర్స్ అధికారులు దామోదర్‌పటేల్, సుకుమార్, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ ఎం.ఐ.కె. రెడ్డి, వింగ్ కమాండర్ జయశంకర్, ఎన్‌ఏఎఫ్ డైరెక్టర్ వై. శ్రీనివాసరావు తదితరులు మదన్‌మోహన్‌రెడ్డికి నివాళులర్పించారు.