
డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, చెన్నై : కరోనా వైరస్ సోకిందని కంగారుపడాల్సిన అవసరం లేదు, కనీస అప్రమత్తతను పాటిస్తే కరోనాను సులువుగా జయించవచ్చని అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, బర్డ్ ఆస్పత్రి (తిరుపతి) డైరెక్టర్ డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పాజిటివ్ బారినపడగానే ప్రాణం పోదనే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. కరోనాకు భయపడకూడదు, మనమే కరోనాను భయపెట్టి తరిమికొట్టాలని చెప్పారు. కరోనా వైరస్‌పై లేనిపోని అపోహలు, పాజిటివ్ వస్తే ప్రాణం పోవడం ఖాయమనే అనసర భయాందోళనలు, దీంతో కొందరు బలవన్మరణాలకు పాల్పడడం వంటి దయనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో చెన్నై అన్నానగర్‌లోని సన్‌వే క్లినిక్‌లో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
ఒక కరోనా వైరస్సే కాదు ఏ వ్యాధినైనా నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకు వస్తుంది. వ్యాధిని ప్రాథమిక దశ లోనే గుర్తించడం, తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి. అయితే కరోనా విషయంలో మరికొంత అదనపు అప్రమత్తత అవసరం. కరోనా గురించి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. పాజిటివ్ బారినపడిన వారిని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చనే భరోసా వైద్యరంగానికి కలిగింది. కోవిడ్–19 భారత్‌లోకి ప్రవేశించిన కొత్తల్లో కోవిడ్–19 కేవలం శ్వాసను మాత్రమే దెబ్బతీస్తుందని వైద్యరంగం భావించింది. రోగులకు చికిత్స చేసేకొద్దీ కాలక్రమేణా ఎంతో క్లారిటీ వచ్చింది. కరోనా ముదిరితే రక్తనరాలు దెబ్బతినడం, రక్తం కలుషితం కావడం, క్రమేణా ఆక్సిజన్ క్యారీ సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా ప్రాణాపాయ స్థితికి తీసుకెళుతుందని తేలింది.
ఆ రెండు దశల్లోనే అదుపు సాధ్యం:
కరోనా వైరస్ వ్యాప్తిని రెండు దశలుగా విభిజించాల్సి ఉంటుంది. తొలి దశను వైద్యపరిభాషలో వైరిమియా అంటారు. ఈ దశలో జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు రుగ్మతలతోపాటూ రుచి, వాసన శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాలు. మానవ శరీరంలో సహజంగా ఇమిడిఉండే రోగ నిరోధక వ్యవస్థ మూడు నుంచి ఐదు రోజుల్లో రోగిని కోలుకునేలా చేస్తుంది. లేదా పారాసిటమాల్ వంటి మాత్రలను తీసుకోవడం ద్వారా ఇంటిలోనే నయం చేసుకోవచ్చు. ఐదురోజులు దాటినా నయం కాకుంటే కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. తొలి దశలోనే చికిత్స తీసుకుంటే రోగి ఇతరత్రా ఆరోగ్యసమస్యలను బట్టి పూర్తిగా కోలుకునే అవకాశాలు 90 శాతం వరకు ఉంటాయి.
రెండోదశలోనూ మెరుగైన అవకాశాలు:
ఇక రెండో దశలోనే అసలైన కరోనా వైరస్ వ్యాధిని రోగి అధికంగా ఎదుర్కొంటాడు. జ్వరం తగ్గకపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, సహజంగా ఉండాల్సిన 95 నుంచి వందశాతం ఆక్సిజన్ క్యారీ సామర్థ్యం 85 శాతానికి పడిపోవడం దీని ప్రధాన లక్షణాలు. అయినా రోగి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. యాంటీ వైరల్ ట్రీట్‌మెంట్‌తో రక్షించవచ్చు. రోగిని బోర్లాపడుకోబెట్టి ముక్కు ద్వారా ఆక్సిజన్, డెక్సామెథాసొనె ఇంజక్షన్ ఇచ్చి రక్తనాళాలు చిట్లిపోకుండా అరికట్టవచ్చు. ఈ వైద్యవిధానంతో రికవరీ రేట్ పెరిగినట్లు గుర్తించాంపాజిటివ్ నుంచి కోలుకున్న వారు నుంచి సేకరించిన ప్లాస్మా కణాలను రోగికి ఎక్కించడం ద్వారా నయం చేసే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రెండో దశలోకి రాకుండా జాగ్రత్తలు పాటించాలి లేదా రెండో దశలోకి ప్రవేశించగానే చికిత్స తీసుకున్నపుడే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ.
వీరంతా జాగ్రత్త
పొగతాగేవారు, కేన్సర్, షుగర్, అవయవాల మార్పిడి చేయించుకున్నవారు, స్థూలకాయం కలిగిన వారు అదనపు జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. బాహ్యప్రపంచంలో తిరగడం పురుషుల్లోనే ఎక్కువ కావడం వల్ల మరణాలు కూడా వారిలోనే ఎక్కువగా ఉన్నాయి. వైద్య చికిత్స ఎంత ముఖ్యమో రోగి భయానికి లోనుకాకుండా ఉండడం అంతే ముఖ్యం. కేవలం భయంతో ప్రాణాలు తీసుకునే వారి సంఖ్య పదిశాతం వరకు ఉంది.