అక్షరయోధునికి అంతిమ వీడ్కోలు
-
పిఠాపురం నుంచి ప్రజాకవి ఆవంత్స అంతిమయాత్ర
-
రంగరాయ మెడికల్ కాలేజీకి పార్థివదేహం అప్పగింత
పిఠాపురం :
సామాజిక అసమానతలు, అన్యాయాలపై ‘వజ్రాయుధాన్ని’ దూసిన అక్షరయోధుడు, సుదీర్ఘ జీవన, కవన ప్రస్థానంలో అభ్యుదయమే కరదీపికగా సాగిన పథికుడు ఆవంత్స సోమసుందర్‌కు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. శుక్రవారం కాకినాడ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన ఆ ప్రజాకవి పార్థివదేహాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్థం శనివారం సాయంత్రం వరకూ పిఠాపురంలోని స్వగృహంలో ఉంచారు. పలువురు కవులు, సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, వామపక్ష నేతలు ఆవంత్సకు శ్రద్ధాం జలి ఘటించారు. మధ్యాహ్నం జరిగిన సంతాప సభలో పలువురు మాట్లాడుతూ ఆయన సాహిత్యరంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన కాంస్య విగ్రహాన్ని కాకినాడ కుళాయి చెరువు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన పార్ధివ దేహాన్ని ఊరేగింపుగా తరలించి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతిమ యాత్ర సందర్భంగా ఆవంత్స అమర్‌రహే అంటు నినాదాలు చేశారు. సాహితీవేత్తలు, కవులు, విమర్శకులు సంతాపసభలో సోమసుందర్ సాహిత్య విశేషాలను, వ్యక్తిత్వ విలక్షణతను కొనియాడారు. ఆయన అభ్యుదయ సాహిత్య వికాసానికి ఎంతో దోహదపడ్డారని, వర్ధమాన కవులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, చందు సుబ్బారావు, ఎంవీ భరతలక్ష్మి, గౌరీనాయుడు, పెనుగొండ లక్ష్మీనారాయణ, ముత్యాల ప్రసాద్ తదితర ప్రముఖులు సంతాపసభలో ప్రసంగించారు.
పేద ప్రజలకు తీరని లోటు
కాకినాడ రూరల్ : అభ్యుదయ కవి ఆవంత్స సోమసుందర్ మృతి సాహితీ ప్రియులకే కాకుండా పేద వర్గాల ప్రజలకు తీరని లోటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన తన స్వగృహంలో మాట్లాడుతూ సోమసుందర్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బూర్జువాల నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ప్రజాకవిగా పేరు పొందారన్నారు. సోమసుందర్ రచనలు పేదలను అనేక సమస్యలపై పోరాట దిశగా నడిపించాయన్నారు. జనహృదయాల్లో పోరాటమున్నదని గుర్తించి తిరుగుబాటు తెచ్చిన విప్లవ కవి సోమసుందర్ అన్నారు.