అలుపెరగని ‘వజ్రాయుధ’ కవి
ఆవంత్స సోమసుందర్ కన్నుమూత
మూగబోయిన సాహితీలోకం
తాను నమ్మిన విలువలకు పట్టం కట్టి కలాన్ని ఆయుధంగా చేసుకొని సాహితీ ఉద్యమాన్ని నడిపిన వజ్రాయుధ కవి ఆవంత్స సోమసుందర్. కవిజనపోషకుడిగా ఆయన పేరుగడించారు. ఎందరో సాహితీమూర్తులను పురస్కారాలతో సత్కరించిన కవిపండితుడు ఆయన. పీడిత తాడిత ప్రజానీకం గళమై నిలిచిన సాహితీస్రష్ట ఆవంత్స శుక్రవారం కన్నుమూశారు. ఆ సాహితీమూర్తి జీవన రేఖా చిత్రణ..
పిఠాపురం:
కలాన్ని వజ్రాయుధంగా చేసుకుని పీడిత ప్రజలకు బాసటగా నిలిచిన ప్రజాకవి ఆవంత్స సోమసుందర్. ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన ఆయన రచనలు సాహిత్య ఉద్యమానికి ఊపిరి పోశాయి. ‘యుగయుగాల బానిసతత్వ జీవమును రోసిరోసి తరతరాల దారిద్య్రం సైపలేక తిరగబడి’ అని సోమసుందర్ రాసిన గేయం నైజాం ప్రభువుల పాలనలో పీడిత ప్రజల్లో విప్లవాన్ని రగిలించింది. పీడిత ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన ఆవంత్స వయోభారం మీదపడినా.. అర్థాంగి అశువులు బాసినా.. ఇద్దరు కుమారులు కన్నుమూసినా.. అనారోగ్యం ఆస్పత్రిపాల్జేసినా.. చలించని మనోధైర్యంతో కలమే ఆయుధంగా సాహిత్య ఉద్యమాన్ని ఆవంత్స కొనసాగించారు. కవి, కథకుడు, విమర్శకుడిగా ఏడు దశాబ్దాలపాటు తెలుగు సాహిత్య రంగంలో సోమసుందర్ తనదైన ముద్ర వేసుకున్నారు.
జీవన ప్రస్థానం
ప్రస్తుత ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం గ్రామానికి చెందిన కాళ్లూరి సూర్యప్రకాశరావు, వెంకయ్యమ్మ దంపతులకు 6వ సంతానంగా 1924 నవంబర్ 18న సోమసుందర్ జన్మించారు. ఆయన నాల్గవ ఏట పిఠాపురానికి చెందిన తన పినతల్లి ఆవంత్స వెంకయ్యమ్మకు దత్తత వెళ్లారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ పూర్తిచేశాక కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతూ కమ్యూనిస్టుల ఉద్యమానికి ఆకర్షితుడై మధ్యలో చదువు మానేశారు.1942లో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరి పలు ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు పలు ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. 1948లో నెల్లాళ్లపాటు పిఠాపురంలోని స్వగృహంలో ప్రభుత్వం ఆయనను గృహనిర్బంధం చేసింది. ఆయనకు ప్రస్తుతం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
అవార్డుల పంట
సోమసుందర్ రచించిన ‘మా ఊరు మారింది’ కావ్యానికి 1977లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు లభించింది. ‘కృష్ణ శాస్త్రి కవితాత్మ’కు మద్రాసుకు చెందిన రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు 1980లో ఇచ్చారు. గురజాడ అప్పారావు, కొండేపూడి శ్రీనివాసరావు స్మారక అవార్డులను ఆవంత్స అందుకున్నారు. 1992లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సోమసుందర్‌ను పురస్కారంతో గౌరవించింది. 2002లో నవంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం సోమసుందర్‌ను తెలుగు ఆత్మ గౌరవ పురస్కారంతో సత్కరించింది. ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆయనను ఘనంగా సత్కరించి అవార్డు బహుకరించారు. 2008లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కళారత్న పురస్కారాన్ని సోమసుందర్‌కు అందజేశారు. 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని, లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని, పలు అవార్డులను సోమసుందర్ అందుకున్నారు.
రచనలతోనే ఉద్యమం
1939 నుంచి ఆయన పద్యాలు, గేయాలు రాయడం ప్రారంభించారు. 1942 నుంచి సోమసుందర్ రాసిన పలు కథలు, గేయాలు, వ్యాసాలు, ఆనందవాణి, రూపవాణి, పెంకిపిల్ల తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నైజాం ప్రభువుల పాలనకు నిరసనగా తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా 1949లో సోమసుందర్ రచించిన ‘వజ్రాయుధంన ఆయనకు ఎనలేని పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. వజ్రాయుధంలోని ‘బానిసల దండయాత్ర’ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో బీఏ డిగ్రీ తెలుగు పుస్తకంలో విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. 6వ తరగతి తెలుగు పుస్తకంలో సోమసుందర్ రచించిన ‘సమైక్య భారతి గేయం’ పాఠ్యాంశంగా ఉంచారు. 1952లో ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా సోమసుందర్ రచించిన ‘కాహళి’ గేయాలు మిక్కిలి ప్రాచుర్యం పొందాయి. ‘‘తన చరిత్ర తానే పఠించి పక్కున నవ్వింది ధరణీ, తన గాధను తానే స్మరించి భోరున ఏడ్చింది ధరణీ’’ అంటూ సోమసుందర్ పుడమి తల్లి వేదనారావాన్ని వినిపించారు. 1953 ఆగస్టులో గోదావరి వరదలతో జరిగిన ప్రాణ నష్టానికి చలించి ‘గోదావరి జల ప్రళయం’ కావ్యాన్ని ఆయన రచించారు. ఆయన రచించిన సాహిత్యవిమర్శ ‘చరమ దశాబ్దిలో కవితా రసాబ్ది’ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఇప్పటి వరకు సోమసుందర్ రచించిన కథలు, గేయాలు, కావ్యాలు కలిపి 79 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. మరో 20కి పైగా ప్రచురణకు సిద్దంగా ఉన్నాయి.
లిటరరీ ట్రస్టు ఏర్పాటుl
సాహిత్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను డాక్టర్ ఆవంత్స సోమసుందర్ లిటరరీ ట్రస్టు ప్రతీ ఏటా సాహితీ పురస్కారాలతో సత్కరిస్తోంది. డాక్టర్ సోమసుందర్ సాహిత్య పురస్కారం, రాంషా స్మారక విమర్శక పురస్కారం, రాజహంస కృష్ణశాస్త్రి కవితా పురస్కారం, గురజాడ కథాప్రభాస పురస్కారం వంటి పురస్కారాలను రచయితలకు అందజేసి సోమసుందర్ ప్రోత్సహించారు. ‘సోమసుందర్ తన కలం నుంచి నిత్యం సాహిత్యకాంతులు వెదజల్లుతుంటారు’ అని సోమసుందర్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కె. వెంకటరావు పేర్కొనడం అక్షర సత్యం.