ఏం తక్కువైంది ఈ మగమహారాజులకు?!
ఏం మునిగిందని వీళ్లకో ‘ఇంటర్నేషనల్ మెన్స్‌డే’?!
జెంట్స్ సీట్లో కూర్చొని, లేడీస్ ఎవరైనా లేవట్లేదా?
ఆఫీస్‌లో ‘ముద్దారగా నేర్పిస్తాం’ అని చెప్పి...
ఫిమేల్ స్టాఫ్ వచ్చి మీద మీద పడుతున్నారా?!
క్యాబ్స్‌లో ప్రయాణిస్తున్న మగవాళ్లపై...
లేట్ నైట్ అఘాయిత్యాలు జరుగుతున్నాయా?!
ఆడవాళ్లకు ‘మహిళా దినోత్సవం’ ఉన్నట్లే...
మగవాళ్లకు ‘మెన్స్‌డే’ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
దీనిపై మన స్త్రీవాదులు, మానవవాదులు ఏమంటున్నారు?
ఇదే ఈవారం మన ‘ప్రజాంశం’
నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 1999లో ట్రినిడాడ్ టొబాగో దేశంలో మొదటిసారి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న కొందరు సుప్రసిద్ధ మహిళల అభిప్రాయాలివి.
ఇద్దరూ అభివృద్ధి చేతి పావులే
ప్రకృతిపరంగా ఆడ, మగ తేడాలేమీ ఉండవు. జీవులన్నీ ఒక్కటే. సమాజంలో మనుషులు కృత్రిమంగా సృష్టించిన అంతరాలలో కులం, వర్గం, జాతి, మతం వంటి అణచివేతల్లో జెండర్ కూడా ఒకటి. ఆడ, మగ అనే జెండర్ వ్యత్యాసం కూడా నిర్మాణాత్మకమైనదే. స్త్రీలు, బలహీన పురుషులు బలమైన పురుషాహంకార బాధితులే. ఎక్కువ క్రూరంగా ఉండమని రాజ్యాల్ని, మరింత మగవాడిగా ఉండమని పురుషుల్ని అభివృద్ధి నిర్దేశిస్తుంది. ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రపంచీకరణ, కులస్వామ్యాలన్నీ పురుషస్వామ్య రక్తమాంసాలతో నిర్మిస్తున్నవే. ఈ నిర్మాణాలు స్త్రీలనే కాదు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనులైన మగవాళ్లను కూడా నిర్ధేశిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయ ఎన్జీవోల వరకూ స్త్రీల సాధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా... మహిళలు మానవహక్కులు లేకుండా విధ్వంసమవుతున్నారంటే పితృస్వామ్యంలో నిజాయితీ లేకపోవడం వల్లనే. పురుషుల్లో మార్పు రావాలి. ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకంలో మగవారి పాత్ర పెరగాలి. ఆధునిక ఉత్పాదక రంగంలో, వ్యవసాయక రంగంలో, రాజకీయాల్లో మహిళల నాయకత్వాన్ని అంగీకరించాలి. వాళ్ల ప్రాతినిధ్యాన్ని, ప్రవేశాల్ని ప్రోత్సహించాలి. మన దేశంలో 22 నిమిషాలకొక లైంగికదాడి జరుగుతోంది. ఇది మానవ నాగరికతకు సిగ్గుచేటు. కాని... ప్రతి 22 గంటలకూ కనీసం 22 రోజులకు ఒక బాలికను పాఠశాలలో చేర్పించగలిగితే, ఒక మహిళకు ఉపాధి అవకాశాన్ని అందించగలిగితే ఈ దేశంలోనే సమానత్వం సిద్ధిస్తుంది.
- జూపాక సుభద్ర, రచయిత్రి
రెండు దినోత్సవాలెందుకు?
‘మగవాళ్లు’ అనగానే పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్న వేమన గుర్తుకొస్తాడు నాకు. నిజంగానే పురుషులు అనేకరకాలు. నా మటుకు నాకు కొందరిని చూస్తే గౌరవం, కొందరిని తలుచుకుంటేనే అసహ్యం, కొందరిని చూస్తే జాలి, ఇంకా కొందరంటే ఇష్టం. ఏమైనా... ఈ రోజుల్లో పురుషులు కొంత అయోమయంలో ఉన్నారనిపిస్తుంది. వాళ్లకు పాత తరాలవారి కంటే తాము ఉన్నతం (వారి భాషలో ఆదర్శప్రాయం) గా ఉండాలని ఉంటుంది. కానీ తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన పురుషత్వం ఆ ఉదాత్తతను నీరుగార్చేస్తుంటుంది. ఈ రెండింటి మధ్య ఇరుక్కుని నేటి పురుషులు (20 -50 మధ్య వయస్కులు) తికమకపడిపోతున్నారు. తను స్త్రీలను గౌరవంగా, తనతో సమానంగా చూస్తే గౌరవించబడతాడో లేక చులకనకు గురౌతాడో సగటు పురుషుడికి అర్థం కావడం లేదు. మొత్తానికి ఈనాటి స్త్రీలకు తమ వ్యక్తిత్వాల పట్ల, జీవనవిధానం పట్ల, పురుషులతో సంబంధాల పట్ల ఉన్నంత స్పష్టత ఇంకా ఈనాటి పురుషులకు రాలేదు. అంతేనా, పురుషులు అబలలు. (వ్యాకరణం మాట చిన్నయసూరి ఎరుగు) - ఎందుకంటే స్త్రీల కంటే ఎక్కువగా వాళ్లు సమాజానికి భయపడతారు. సంప్రదాయానికి వెరుస్తారు. స్త్రీ పురుష సంబంధాల్లో తెగింపు అన్నది ఎప్పుడైనా మనకు కనిపిస్తే అది స్త్రీ చొరవ తీసుకున్నప్పుడే, స్త్రీ సమాజాన్ని లెక్కచేయనపుడే సాధ్యం. మగవాళ్లకు సంబంధించి ప్రచారంలో ఉన్న సామెత ‘ఏడ్చే మగవాడిని నమ్మకు’ అన్నదాన్ని నేను నమ్మను. మగవాళ్లకు కూడా ఏడ్చే హక్కు ఉంది. దొంగ ఏడుపు అంటారా? అది ఆడవాళ్లు కూడా ఏడవగలరు కనక, కన్నీళ్లలోని నిజాయితీని గుర్తించాలి తప్ప, ఏడ్చింది పురుషుడా, స్త్రీనా అన్నది కాదు.
పురుషుల దినోత్సవం సందర్భంగా తోటి పురుషులకు చిన్న సూచన: స్త్రీలను మీతో సరిసమానంగా చూడడం వల్ల మీ ఔన్నత్యం పెరుగుతుందే తప్ప, తరగదు. స్త్రీపురుషుల మధ్య అధికార సంబంధాల వల్ల స్త్రీలు మాత్రమే కాదు నష్టపోయేది, పురుషులు కూడ ఎంతో జీవితానందాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే అసమ సంబంధాల్లో ఇరుపక్షాలూ బాధే తప్ప ఆనందాన్ని పొందలేవు. ఆ స్పష్టత స్త్రీపురుషులిద్దరిలోనూ వస్తే, ఇక స్త్రీల దినోత్సవాలూ, పురుష దినోత్సవాలూ అని రెండూ వేర్వేరుగా జరుపుకోవలసిన అవసరం ఉండదు.
- ప్రొఫెసర్ మృణాళిని,
కేంద్రసాహిత్య అకాడెమీ జనరల్ కౌన్సెల్ సభ్యురాలు
అర్థం చేసుకొనేలా ఎదగాలి
అంతర్జాతీయ పురుష దినోత్సవం సందర్భంగా వారిలో మానవ త్వం మేలుకోవాల ని కోరుకుంటున్నా ను. మగవాళ్లకు తరతరాలుగా సమాజం ఇచ్చిన అనవసరమైన, అన్యాయమైన అహంకారాన్ని పెంచే అవకాశాలను వాళ్లు ఐచ్ఛికంగా వదులుకుని సమానత్వం వైపుగా అడుగులు వేయడం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.
తమలో పేరుకుపోయిన వివక్షాపూరితమై న ఆలోచనలను, హింసాత్మక ఆచరణను అమానుష వైఖరిని కడిగి వేసుకుని స్త్రీల స్వేచ్ఛా కాంక్షను అర్థం చేసుకునేలా ఎదగాలని కాంక్షిస్తున్నాను. యుద్ధాన్ని వదిలి శాంతిని, ద్వేషాన్ని వదిలి స్నేహాన్ని మనసులో నింపుకుని ప్రపంచాన్ని... శాంతి, సమానత్వం దిశగా అభివృద్ధి చేయడంలో స్త్రీలతోపాటు భాగస్వామ్యం పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే ఈ పనులు చేస్తున్న సంస్కారవంతులైన కొందరు పురుషులకు నా అభినందనలు.
- ఓల్గా, స్త్రీవాద రచయిత్రి
Olga
ఆధిపత్యం అడగడం లేదు
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులకు కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను. స్త్రీపురుష వివక్ష మొదట్నించీ ఉన్నది కాదు. ఆదిమ వ్యవస్థలో ఆహారాన్ని కనిపెట్టింది స్త్రీ. కానీ సమాజం పురోగమనంలో మాతృస్వామిక వ్యవస్థ దాటి పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. అప్పటినుంచి స్త్రీ అణచివేత ప్రారంభమైంది. తర్వాత నాగరిక సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఒక హక్కుగా రాజ్యాంగం ఇచ్చింది. ఈనాటికీ ఆ సమానత్వాన్ని గుర్తించలేకపోవడం బాధాకరం. స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆధిపత్యం కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. కాని స్త్రీకి కావాల్సింది పురుషులపై ఆధిపత్యం కాదు, కేవలం సమానత్వం మాత్రమే. సమాజంలో పురుషాధిపత్య భావజాలం భారంగా మారితే పురుషులు కూడా బాధితులవుతారు.
చాలామంది ఒంటరిస్త్రీలు, వితంతువులు... భర్త తోడు లేకుండా కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు. ఎవరి అండా లేకుండానే పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేస్తున్నారు. పురుషులు ఆ పని చేయలేకపోతున్నారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. స్త్రీ తోడు లేకుండా బతకగలిగే పురుషులెందరు? కనీసం ఈ వాస్తవాైన్నైనా ఎందుకు గుర్తించరు? సమాజంలో హింసలేని జీవితాన్ని మనుషులందరూ కోరుకుంటున్నారు. అది మానవహక్కు కూడా. కాని స్త్రీలు, పిల్లలు హింసలేని జీవితాన్ని తమ హక్కుగా గుర్తించలేకపోతున్నారు. సమాజంలో శాంతియుత కుటుంబాలు కావాలి. అది ఆధిపత్య సంబంధాలు రద్దయినపుడే సాధ్యమవుతాయి. ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఆధిపత్యం కోరుకోకూడదు. బాధ్యతాయుతమైన మానవ సంబంధాలు మాత్రమే ఉండాలి. మానవజాతి మనుగడ కోసం త్యాగాలు చేసిన పురుషులు, స్త్రీలు ఉన్నారు. పురుష వ్యతిరేకత కాకుండా పురుషాధిపత్య భావజాలాన్ని తొలగించినపుడు మిగిలేది స్త్రీ, పురుషులు. ఎక్కువ తక్కువలు కాదు.
- సంధ్య,
ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు
Sandhya
రెండుముఖాలు వద్దు
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మనదేశంలోని పురుషులందరికీ నా అభినందనలు. ఈరోజైనా పురుషులందరూ ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘మీరూ మేము సగం సగం... మీరూ మేము సమం సమం’ అనే మహిళల మాటతో పురుషులందరూ గొంతు కలపాలని ఊరుకుంటే సరిపోదు, ఆచరించాలి. మన సమాజంలో రెండుముఖాలున్న మగవారి సంఖ్య బాగా ఎక్కువ. కొందరు మగవాళ్లు బయటికి స్త్రీవాద కబుర్లు చెప్పి ఇంటికెళ్లి భార్యల్ని హింసిస్తారు. మనసా వాచా మహిళల్ని గౌరవించే మగవారి సంఖ్య చాలా తక్కువ. దీనికి అనాదిగా వస్తున్న పురుష ప్రాధాన్య కట్టుబాట్లే కారణం కాదు, మహిళ తమని మించిపోతోందన్న అభద్రతా భావం కూడా. చదువుల్లో, ఉద్యోగాల్లో, తెలివితేటల్లో మహిళలు రోజురోజుకీ మెరుగవుతున్నారు. కాని మగవారి ఆలోచనలు మాత్రం ఏ కాలంలోనో ఆగిపోయాయి. మహిళల్లో వస్తున్న మార్పుకు తగ్గట్టు మగవారి ఆలోచనతీరు మెరుగవడం లేదు. కొందరిలో మైండ్‌సెట్ మారుతోంది కాని మనసు మారడం లేదు. బిడ్డగా స్త్రీ ఎదుగుదలను కోరుకుంటున్న మగవాళ్లే, భార్యగా ఎదిగితే మాత్రం అడ్డుపడుతున్నారు. మగవారి హృదయం మారడం లేదనడానికి ఇలాంటి ధోరణులే ఉదాహరణలు. వారి అభద్రతాభావం ఏస్థాయికి చేరిందంటే.. స్త్రీల కోసం కొత్త చట్టాలు వచ్చినప్పుడల్లా వాటిని పురుష వ్యతిరేక చట్టంగా భావిస్తున్నారు. అవి కేవలం స్త్రీలను రక్షించడానికి వచ్చిన చట్టాలు కాని పురుషుల్ని వ్యతిరేకించేవి కావు. ఆ మధ్య ఢిల్లీలో నిర్భయ ఘటన సందర్భంగా చాలామంది మగవాళ్లు ‘తాము మగవాళ్లుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాంటి సందర్భాల్లో పురుషుల నుంచి స్త్రీలు ఆశించేది సానుభూతి కాదు, తిరుగుబాటు. పురుషుడిగా తోటి పురుషులలో మార్పు తేవాలి. దాని కోసం ఎంతటి పోరాటాలైనా చేయాలి. లేదంటే స్త్రీల రక్షణకోసం పోరాడుతున్నవారికి సాయంగానైనా ఉండాలి. దాన్నే సమానత్వం అంటారు. స్త్రీలకు అన్యాయం జరిగితే తోటి స్త్రీలు స్పందించడం, పురుషులకు అన్యాయం జరిగితే పురుషులు స్పందించడం సమానత్వంలోకి రాదు. దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా లింగభేదం లేకుండా అంతా అండగా నిలబడాలి. అప్పుడే ఆడ, మగ అనే భేదం పోయి అందరం ఒక్కటేనన్న భావం వస్తుంది.
- కొండవీటి సత్యవతి,
కోఆర్డినేటర్ ‘భూమిక’ హెల్ప్‌లైన్
Kondaveeti Satyavati