అందచందాలను కాపాడుకోవడంలో పురుషులు ఏమీ తీసిపోవడం లేదు. సౌందర్య సాధనాల ఖర్చులోను, సౌందర్య పరిరక్షణ సేవల కోసం చేసే ఖర్చులోను మహిళలతో పోటీ పడుతున్నారు. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్‌ను ముంచెత్తుతున్న కొత్త కొత్త సౌందర్య సాధనాలను కొనుగోలు చేయడంలో పురుషులు ముందంజలో ఉంటున్నారు. అలాగే, అందానికి తగిన అలంకరణ చేసుకోవడంలోను, ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే ఫ్యాషన్ దుస్తులను ధరించడంలోనూ ‘తగ్గేదే లే’ అంటున్నారు. పురుషుల సౌందర్య పోషణాభిలాష, ఫ్యాషన్ స్పృహ మార్కెట్‌లో సిరులు కురిపిస్తున్నాయి.
అందచందాలను కాపాడుకోవడంలో మహిళలకు కొంత ఎక్కువ శ్రద్ధ ఉండే సంగతి వాస్తవమే అయినా, ఇటీవలి కాలంలో ఈ విషయంలో పురుషులు తామేమీ తీసిపోవడం లేదంటూ నిరూపిస్తున్నారు. నఖ శిఖ పర్యంతం అందంగా కనిపించడానికి తాపత్రయపడుతున్నారు. కేశ సంరక్షణ ఉత్పత్తులకు, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు, ఫ్యాషన్ దుస్తులకు భారీగా ఖర్చుపెడుతున్నారు. పురుషుల్లో సౌందర్య స్పృహ పెరగడం గమనించిన సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థలు కొత్త కొత్త ఉత్పత్తులతో ముందుకొస్తున్నాయి. పురుషుల అలంకరణ వస్తువుల తయారీ సంస్థలు, ఫ్యాషన్ దుస్తుల తయారీ సంస్థలు కూడా పురుషుల అందచందాలను ఇనుమడింపజేయడానికి ఇతోధికంగా పాటుపడుతున్నాయి. ఇటీవలి కాలంలో పురుషుల్లో పెరిగిన సౌందర్య స్పృహకు మార్కెట్ గణాంకాలే అద్దం పడుతున్నాయి.
అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2023లో పురుషులు అలంకరణ వస్తువుల కోసం 53.46 బిలియన్ డాలర్లు (రూ.4.50 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 85.53 బిలియన్ డాలర్లకు (రూ.7.20 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. చర్మ సంరక్షణ వస్తువుల కోసం 13.56 బిలియన్ డాలర్లు (రూ.1.14 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 29.61 బిలియన్ డాలర్లకు (రూ.2.49 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. కేశసంరక్షణ వస్తువుల కోసం 32.90 బిలియన్ డాలర్లు (రూ.2.77 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 67.20 బిలియన్ డాలర్లకు (5.65 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్‌లో అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ చాలాకాలంగా ముందంజలో ఉంటున్నాయి. ఈ దేశాల్లో మార్కెట్ నిలకడగా వృద్ధి చెందుతోంది. ఇటీవలి కాలంలో ఆసియా–పసిఫిక్ దేశాల్లో పురుషుల సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నాయి.
మన దేశంలో పురుషుల అలంకరణ, కేశసంరక్షణ, చర్మసంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు 2023లో రూ.17,696 కోట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు 2032 నాటికి రూ.34,550 కోట్లకు చేరుకోగలవని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్‌లో ఏటా సగటున 7.2 శాతం వృద్ధి నమోదవుతోంది. ఈ వృద్ధి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ వార్షిక సగటు వృద్ధి 6.8 శాతం వరకు నమోదవుతోంది. రానున్న కాలంలో మన దేశంలో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ వృద్ధి మరింత వేగాన్ని పుంజుకుని, 12.1 శాతానికి చేరుకోగలదని నిపుణులు చెబుతున్నారు.
నవతరం కొత్తపోకడలు
తర తరానికీ పురుషుల సౌందర్య సాధనాల వినియోగంలోను, ఫ్యాషన్లలోను మార్పులు సర్వసాధారణం. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే, ఇప్పటి నవతరం యువకులు సౌందర్య సాధనాలు, ఫ్యాషన్లలోను మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలకు పోటీగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెడుతున్నారు. ప్రస్తుత కాలంలో మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న నవతరాన్ని ‘జెన్ ఆల్ఫా’గా పిలుచుకుంటున్నారు. ఈ శతాబ్ది తొలినాళ్లలో పుట్టిన ఈ యువతరం ‘టిక్‌టాక్’ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ‘లుక్ మ్యాక్స్’ ట్రెండ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలంకరణలు, వస్త్రాలంకరణలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ‘టిక్‌టాక్’లోనే ‘గెట్ రెడీ విత్ మీ’ అనే ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇందులో భాగంగా నవతరం యువకులు చక్కగా ముస్తాబైన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, తమకు దీటుగా తయారవగలరా? తమ ఫాలోవర్లకు చాలెంజ్ విసురుతున్నారు.
ఇదివరకటి కాలంలో పురుషులు వాడే సౌందర్య సాధనాలు చాలా పరిమితంగా ఉండేవి. సబ్బు, పౌడర్, షేవింగ్ రేజర్, షేవింగ్ క్రీమ్ ఉంటే చాలనుకునేవారు. ఆఫ్టర్‌షేవ్ లోషన్లు వాడేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇటీవలి యువకులు రకరకాల హెయిర్ స్టైల్స్ మారుస్తున్నారు. గడ్డం పెంచేవాళ్లు గడ్డాన్ని ఎప్పటికప్పుడు తీరుగా ట్రిమ్ చేయించుకోవడం, గడ్డానికి పోషణ అందించడానికి బీయర్డ్ వ్యాక్స్ పట్టించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇదివరకు జుట్టు నెరిసినవాళ్లు మాత్రమే జుట్టుకు రంగు వేసుకునేవాళ్లు. ఇటీవలికాలంలో జుట్టు నెరవకపోయినా, జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటున్నారు.
శరీరమంతా నిగనిగలాడుతూ మెరిసిపోయేలా చూసుకునేందుకు పెడిక్యూర్, మ్యానిక్యూర్, వ్యాక్సింగ్, బ్లీచింగ్ వంటి సౌందర్యసేవలను పొందడానికి వెనుకాడటం లేదు. పురుషుల సౌందర్య సాధనాల జాబితాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులు వచ్చి చేరుతున్నాయి. హెయిర్ జెల్, సన్‌స్క్రీన్ లోషన్, ఫేస్‌వాష్ క్రీమ్, డియాడరెంట్స్, ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి పురుషుల సౌందర్య సాధనాలలో తప్పనిసరి వస్తువులుగా మారుతున్నాయి. ఈ వస్తువులను కూడా ఎంపిక చేసుకోవడంలో ఇప్పటి యువకులు అమిత శ్రద్ధ తీసుకుంటున్నారు. అల్యూమినియం ఫ్రీ డియాడరెంట్, ఆర్గానిక్ ఫేస్‌వాష్ క్రీమ్, నేచురల్ హెయిర్ కలర్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. వీటి ఖరీదు ఎక్కువైనా ఖర్చుకు వెనుకాడటం లేదు.
ఫ్యాషన్లపై పెరుగుతున్న శ్రద్ధ
శరీరాన్ని నిగనిగలాడేలా చూసుకోవడమే కాదు, శరీరానికి తగిన దుస్తులు ధరించడంలోను, వాటికి తగినట్లుగా ఇతర అలంకరణలను ధరించడంలోను ఈ తరం పురుషులు అమిత శ్రద్ధ చూపుతున్నారు. సమయానికి, సందర్భానికి, కాలానికి తగిన ఫ్యాషన్లతో ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో 537.31 బిలియన్ డాలర్లు (రూ.45.31 లక్షల కోట్లు) నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి 988.24 బిలియన్ డాలర్లకు (రూ.83.33 లక్షల కోట్లు) చేరుకోగల అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో రూ.2.24 లక్షల కోట్లుగా నమోదైంది.
ఈ వ్యాపారం 2028 నాటికి రూ.3.30 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ నిపుణుల అంచనా. దుస్తులు, బెల్టులు, షూస్ వంటివి కొనాలంటే దుకాణాలకు వెళ్లేవారు. ఆన్‌లైన్ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు సాగిస్తున్నారు. మన దేశంలో ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్‌లైన్ కొనుగోళ్లలో మహిళల కంటే పురుషులే దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలతో పోల్చుకుంటే పురుషులు ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోళ్ల కోసం 36 శాతం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం–ఏ) గత ఏడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది.
ఈ కొనుగోళ్ల కోసం పురుషులు సగటున రూ. 2.484 మేరకు ఖర్చు చేస్తే, మహిళలు సగటున రూ.1,830 మేరకు ఖర్చు చేసినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. మరో విశేషం ఏమిటంటే, ఈ కొనుగోళ్లలో మెట్రో నగరాల్లో కంటే, రెండో తరగతి, మూడో తరగతి, నాలుగో తరగతి చిన్న నగరాల్లోని పురుషులే ముందంజలో ఉంటున్నారు. మెట్రో నగరాల్లోని పురుషులు ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం గత ఏడాది సగటున రూ.1,119 ఖర్చు చేస్తే, రెండో తరగతి నగరాల్లో రూ.1,870, మూడో తరగతి నగరాల్లో రూ.1,448, నాలుగో తరగతి నగరాల్లో 2,034 మేరకు ఖర్చు చేసినట్లుగా ఐఐఎం–ఏ అధ్యయనంలో వెల్లడైంది.
పురుషుల సౌందర్య చరిత్ర
పురుషుల సౌందర్య చరిత్ర ఆధునిక యుగం నుంచి ప్రారంభమైందనుకుంటే పొరపాటే! పురాతన నాగరికతల కాలంలోనే పురుషులు తమ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించేవారు. ముఖంపైన, శరీరంపైన రోమాలను తొలగించుకోవడానికి, గోళ్లను కత్తిరించుకోవడానికి కంచు వంటి లోహాలతో తయారు చేసిన రేజర్లు, ట్వీజర్లు, కత్తెరలు, సన్నని చురకత్తులు వంటి పరికరాలను ఉపయోగించేవారు. శిరోజాలంకరణ కోసం రకరకాల సుగంధ తైలాలను, లేపనాలను ఉపయోగించేవారు. ముఖానికి, శరీరానికి చందనం వంటి చెట్ల బెరళ్లతో తయారు చేసిన చూర్ణాలను పూసుకునేవారు. ప్రాచీన ఈజిప్షియన్, రోమన్, గ్రీకు నాగరికతల ప్రజలు అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు.
పురుషులు కూడా కళ్లకు రకరకాల వర్ణ లేపనాలను ఉపయోగించేవారు. కొందరు మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని, వాటిని తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునేవారు. మధ్యయుగాల కాలంలో కూడా పురుషులు మీసాలు, గడ్డాలు తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునే పద్ధతి ఉన్నా, మీసాలు, గడ్డాలు నున్నగా గొరిగించుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా సైన్యంలో పనిచేసే యోధులు, రక్షణ విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా మీసాలు, గడ్డాలను పూర్తిగా తొలగించుకునేవారు. అయితే, కళాకారులు, తత్త్వవేత్తలు, మేధావులు వంటి వర్గాల వారు మాత్రం మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని కనిపించేవారు. బారెడు గడ్డం పెంచుకోవడాన్ని మేధావితనానికి చిహ్నంగా భావించేవారు.
గడ్డానికి, మేధావితనానికి ఎలాంటి సంబంధం లేదనే సంగతి ఇప్పటి జనాలకు బాగా తెలిసినా, గడ్డాలు పెంచుకోవడం, వాటి పోషణకు నానా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పటికీ ఫ్యాషన్ రంగాన్ని ప్రభావితం చేస్తుండటం విశేషం. గడ్డాల విషయానికొస్తే, విక్టోరియన్ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. విక్టోరియన్ కాలంలో ఇంగ్లండ్‌లో పురుషులకు గడ్డాల పోటీలు జరిగేవి. అందమైన గడ్డాన్ని పెంచుకునేవాళ్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేవారు. గడ్డాలు, మీసాలు పెంచుకోవడం, శరీరానికి రకరకాల లేపనాలు పూసుకోవడం వంటివాటితో పాటు పురుషులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో దుస్తులు ధరించేవారు. రకరకాల టోపీలు, తలపాగాలు ధరించేవారు. నాగరికతల తొలినాళ్ల నుంచి మధ్యయుగాల చివరికాలం వరకు శరీర అలంకరణల్లోను, దుస్తుల ఫ్యాషన్లలోను మహిళలకు ఏమీ తీసిపోకుండా ఉండేవారు. అయితే, ఇరవయ్యో శతాబ్దం నుంచి ఈ ధోరణి మారింది.
ఈ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఫలితంగా పురుషుల సౌందర్య సాధనాలు కనీస స్థాయికి చేరుకున్నాయి. సమాజంలోని ఉన్నతవర్గాల పురుషులు తప్ప సామాన్యులు ఫ్యాషన్లలో మార్పులను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్ధం అంతా ఇలాగే గడిచింది. సినిమాలు పెరిగి, యుద్ధాలు సద్దుమణిగిన తర్వాత అగ్రరాజ్యాల్లోని ఫ్యాషన్ ప్రపంచంలో నెమ్మదిగా మార్పులు మొదలయ్యాయి. పురుషుల దుస్తుల ఫ్యాషన్లలో ఈ మార్పులు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. ఈ శతాబ్ది తొలినాళ్ల నుంచి పురుషుల సౌందర్య పోషణ, ఫ్యాషన్ రంగాలు బాగా వేగాన్ని పుంజుకున్నాయి.
స్పాలు.. సెలూన్లకు పెరుగుతున్న గిరాకీ
మహిళలకు ప్రత్యేకంగా బ్యూటీపార్లర్లు చాలాకాలంగా ఉన్నాయి గాని, పురుషుల కోసం హెయిర్ సెలూన్లు తప్ప వేరేవేమీ ఉండేవి కాదు. ఇటీవలి కాలంలో పురుషుల కోసం ప్రత్యేకంగా స్పాలు, బ్యూటీ సెలూన్లు పెరుగుతున్నాయి. పెద్దపెద్ద నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాల్లోనూ వీటికి ఆదరణ పెరుగుతోంది. ‘కోవిడ్’ మహమ్మారి తర్వాత పురుషుల స్పా సేవలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ‘స్పాబ్రేక్స్’ సర్వే ప్రకారం 2019–23 మధ్య కాలంలో పురుషుల స్పా సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 346 శాతం మేరకు గిరాకీ పెరిగింది.
పురుషుల సౌందర్య ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం చేయడం, సెలబ్రిటీలే స్వయంగా సొంత బ్రాండ్స్ ప్రారంభించడం వంటి పరిణామాలు కూడా ఈ వ్యాపారంలో అనూహ్యమైన వృద్ధికి కారణమవుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పురుషుల బ్యూటీ సెలూన్లు, స్పాల వ్యాపారం 2023లో రూ.88,800 కోట్ల మేరకు నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి రూ1.86 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల స్పా, సెలూన్ల వ్యాపారం కనీసం 7.85 శాతం వార్షిక వృద్ధి సాధించగలదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment